ఒకప్పుడు పచ్చదనాన్ని పరచుకున్న
నా పల్లె ఇప్పుడు బోసిపోయింది..
నీరుంటేనే పైరుకు పచ్చదనం..
నీరు లేక బీడయింది పొలం..
పంటలు లేక భారమైంది గ్రామ జీవనం..
జీవనం కోసం గ్రామాన్ని వదలె పల్లె జనం..
జనం లేని పల్లె జీవితం శూన్యం..
అందుకే.. బోసిపోయింది నా పల్లె అందం..
నీటి ఊట లేక అడుగంటే భూగర్భ జలం..
నీరు లేక ఎండిపోయె ఊరి తటాకం
తాగు నీరు కోసం దూరాలు నడిచె పల్లె జనం..
తాగేందుకు నీరు లేక తల్లడిల్లె పశుగణం..
పాడి సిరులు లేక చితికె రైతు జీవనం..
అందుకే.. బోసిపోయింది నా పల్లె అందం..
పంట కోసం అప్పు చేసె రైతు జనం..
పంట పండక తల్లడిల్లె రైతు హృదయం..
పంట దిగుబడి రాక చింతించె రైతు మానసం
పండిన పంటకు ధర లేక రోదించె రైతు గణం
పొట్ట కూటి కోసం పల్లె వీడె కర్షక జనం..
అందుకే..బోసిపోయింది నా పల్లె అందం..
ఒకప్పటి..
యక్ష గానాలు, కోలాటాలు అంతరించె
బుర్రకథలు, హరికథలు దూరమాయె
పగటి వేషాలు, పులి వేషాలు కరవాయె
నారు పాటలు, ఊడ్పు పాటలు తరిగిపోయె
కళాకారుల జీవితాలు కొడిగట్టిన దీపాలాయె
అందుకే..బోసిపోయింది నా పల్లె అందం..
నీటితో నిండిన మబ్బులు
నా పల్లె మీదే పచార్లు చేస్తున్నాయి
నీటి బొట్టు కోసం చెమ్మగిల్లిన
రైతన్నల కళ్లు ఆశతో నింగికేసి చూస్తున్నాయి..
మబ్బులేమో మేఘాల్లో తేలిపోయె..
చినుకులేమో నేలకు దిగిరావాయె..
రైతన్నల ఆశలేమో అడుగంటిపోయె..
బ్రతుకు కోసం ఊరు వదలి తరలిపోయె..
అందుకే.. బోసిపోయింది నా పల్లె అందం..
ఎందుకిలా ..?
అవును మరి..
పర్యావరణంలో సమతౌల్యం లోపించింది
వాతావరణం మార్పు చెందుతోంది
ఋతువుల గమనం గతి తప్పుతోంది..
ప్రకృతి కాలుష్యంలో చిక్కుకుంది..
అందుకు..మన కర్తవ్యం??
అందరం కలసి మన పల్లెల్ని బ్రతికిద్దాం..
చెట్లను పెంచుదాం..
చెరువులు తవ్వుకుందాం..
చెట్టు వుంటేనే కదా వానలు
వానలు కురిస్తేనే కదా
పుడమికి పులకరింతలు..
చెట్టూ చేమ ఉంటేనే కదా
పర్యావరణ సమతూకం
పర్యావరణ సమతుల్యమే
ప్రకృతికి పచ్చదనం….
👌👌super it is in simple words explained clearly about the village the present situation. 👏👏👏👏👍