గతసంచిక తరువాయి »
(జరిగిన కధ – వీర్రాజు అనే రాజకీయనాయకుడీ ఊర్లో పంతుల్ని మంచి చేసుకుని ‘గృధ్యాభీష్టాదేవి’ వ్రతం ఆచరించి పురాణంలో హిరణ్యకశిపుడిలాగా కోరిక కోరుకున్నాడు చావులేకుండా. ఒకసారి తాచుపాము కరిచినా, కారు ఏక్సిడెంట్ అయినా బతికి బయటపడ్డాడు. ఆ తర్వాత తాను కోరిన కోరిక వల్లో మరోదాని సహాయంతోనో ఒక్కో మెట్టూ ఎక్కుతూ దేశానికి డిఫెన్స్ మినిస్టర్ అయ్యాడు. అప్పుడు కరోనా వచ్చిన కాలం లో జాగ్రత్తగా ఉంటూండగా ఫ్రాన్స్ దేశస్థులనుండి ఆయుధాలు కొన్నాక వచ్చిన వాళ్ళతో ఒక మీటింగ్ లో పాల్గొన్నాడు. ఇక చదవండి).
ఫ్రాన్స్ దేశస్థులు వెనక్కి వెళ్ళిపోయాక వీర్రాజు ఆంధ్రాలో స్వంత ఊరికి బయల్దేరాడు రెస్ట్ తీసుకోవడానికి. పచ్చని చేల మధ్య కట్టించిన ఎసి బంగ్లాలో పిల్లా జెల్లాతో రెండురోజులు కాలక్షేపం చేసాక ఓ రోజు నలతగా అనిపించింది. ఏవో టాబ్లెట్లు వేసుకుని పడుకున్నాడు. రెండో రోజూ మూడోరోజూ జ్వరం తగ్గకపోయేసరికి డాక్టర్ కి కబురుపెట్టారు. ఆయనొచ్చి ఏదో మందిచ్చి చెప్పేడు, “ఎందుకైనా మంచిది ఓ సారి కరోనా పరీక్ష చేయించుకోండి.”
ఒకసారి అని డాక్టర్ అన్నాడు కానీ వీర్రాజు మూడు సార్లు చేయించేడు కరోనా పరీక్ష. అసలే ఫ్రెంచ్ వారితో కలిసి మాట్లాడాడు ఈ మధ్య. వాళ్ల దగ్గిరనుంచి ఈ కరోనా అంటుకుని ఉండవచ్చు. చేసిన మూడు సార్లూ పాజిటివ్ వచ్చేసరికి హాస్పిటల్లో జేర్పించారు. అరవై దాటినవాళ్లకి కరోనా మంచిది కాదు. అన్నింటికన్నా దరిద్రం ఈ కరోనాకి మందే లేదు. హాస్పిటల్లో వెంటిలేటర్ మీద పెట్టేకంటే వెంటిలేటర్ అదీ ఇంటి దగ్గిరే పెట్టుకోవచ్చు బంగ్లాలో. డాక్టర్ నర్సమ్మ అందరూ అక్కడికే వస్తారు. మంత్రిగారా మజాకా? అలా డిఫెన్స్ మినిస్టర్ వీర్రాజు స్వంత బంగ్లాలో పచ్చటి పొలాల మధ్య డాక్టర్, నర్స్ ల పర్యవేక్షణలో ఉన్నప్పుడు తెల్సిన విషయం వీర్రాజు కి దగ్గు కూడా మొదలైంది. వెంఠనే మరోసారి హాస్పిటల్ కి తరలించారు. అది తగ్గాక మళ్ళీ బంగ్లాలోకి.
ఈ లోపుల వీర్రాజు తో కలిసి ఉన్న అందరికీ కుటుంబంతో సహా కరోనా టెస్ట్ లు నిర్వహించబడ్డాయి. ఒకరిద్దరికి పాజిటివ్ వచ్చింది కానీ రెండోవారానికి అందరికీ ఆరోగ్యం బాగై ఇంటికొచ్చేసారు. ఇప్పుడు బంగ్లాలో వీర్రాజు ఒక్కడే, డాక్టర్ నర్సమ్మలతోపాటు. కాస్త నీరసంగా ఉన్నా నడవడంలేదు. కావాలిస్తే బయటకి గాలి పీల్చడానికి చక్రాల కుర్చీలో నర్సమ్మ తీసుకెళ్తుంది. ఆరుబయట మంచం వేసారు కావాలిస్తే కాసేపు పడుకోవడానికి.
వీర్రాజు కి అరవై దాటాయి కనక ఆరోగ్యం కుదుటపడ్డానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది మిగతావారికంటే. అందువల్ల ప్రతీరోజూ డాక్టర్ వచ్చి చూస్తాడు. సాయంత్రం నర్సమ్మ వాతావరణం బాగుంటే చక్రాల కుర్చీలో బయటకి తీసుకెళ్తుంది. అలిసిపోతే అక్కడే మంచం మీద కాస్త విశ్రాంతి. తర్వాత మళ్ళీ నాలుగ్గోడల మధ్యకీ తీసుకురావడం. కరోనా తగ్గేవరకూ తప్పదు కదా? వీర్రాజు నిశ్చింతగా ఉన్నాడు, తనకేం కాదనే ధీమా మనసులో. అసలే తాను వ్రతం చేసాడు. అదీగాక ఇంతకుముందు తాచుపాము కరిచినా కార్ ఏక్సిడెంట్ అయినా బతికి బయటపడ్డాడు. వ్రతం చేయించిన పంతులు పోయాడు కాలం చెల్లి. తన జీవితానికి మాత్రం ఏమీ ఢోకా లేదు.
ఓ రోజు సాయంత్రం చక్రాల కుర్చీలో అలా బయటకి వెళ్ళినప్పుడు నీరసంగా అనిపించి ఆరుబయట మంచంమీద నడుం వాల్చాడు. సామాజిక దూరం పాటిస్తూ నర్సమ్మ దూరంగా నుంచుని ఏదైనా కావాలిస్తే ఇవ్వడానికి అక్కడే ఉంది. దూరంగా బంగ్లా చుట్టూ డిఫెన్స్ మినిస్టర్ గారికి ఉండే సెక్యూరిటీ సరేసరి. బంధుమిత్ర సపరివారం ఎవరూ దగ్గిర ఉండడానికి లేదు, కరోనా ఎవరికి అంటుకుంటుందో తెలియదు కదా?
పావుగంట గడిచిందో లేదో ఒక్కసారి వీర్రాజు గుండెలమీద చెయ్యేసుకుని ‘అమ్మా’ అంటూ అరిచాడు. నర్సమ్మ వెంఠనే డాక్టర్ కి కబురుపెట్టి ఏదో సహాయం చేయబోయింది. వీర్రాజు కొట్టుకుంటూనే ఉన్నాడు కానీ డాక్టర్ వచ్చి నాడి చూసేసరికి ప్రాణం పోయింది.
**** **** **** ****
తర్వాత జరగవల్సిన విషయాలు అతి మామూలుగా జరిగేయి. పోస్ట్ మార్టంలో వీర్రాజు చావుకి కారణం గుండెపోటు అని తేల్చారు. ఇది వేరే రోగం, ఎన్నాళ్లనుంచి ఉందో వీర్రాజుకి అని అందరూ అనుకునేలోపు ఓ అమెరికా డాక్టర్ బాంబ్ పేల్చాడు. కరోనా వంట్లోకి వచ్చాక ఎ సి ఇ – 2 అనే ఎంజైమ్ ని పట్టుకుని వదలకుండా ఉంటుందిట. ఈ ఎంజైమ్ గుండెల్లో, కిడ్నీలలో ఉంటుంది కనక వీర్రాజు చావడానిక్కారణం కరోనా వైరస్ గుండెల్లోకి దూరి గుండె పోటు కల్పించడం మాత్రమే, ఎందుకంటే వీర్రాజు కొంచెం అందరికన్నా లావు అయినా ఇంతకు ముందెప్పుడూ గుండెకి సంబంధించిన హెల్త్ ప్రోబ్లెం లేదు గాక లేదు.
శరీరం చూడ్డానిక్కానీ, దహనం చేయడానిక్కానీ బంధుమిత్రుల్లో ఎవరినీ రానివ్వలేదు రూల్స్ ప్రకారం. వస్తే వాళ్ళందరికీ కరోనా అంటుకోదూ? శరీరానికి దహనం దూరంగా అద్దాల వెననుండి ఎవరో చేయాల్సి వచ్చింది. అదయ్యాక ఎ.సి బంగ్లాని వైరస్ లేకుండా చేయడానికో స్పెషల్ టీం శుభ్రం చేసారు. అలా వీర్రాజు అనేకానేక బంధు మిత్ర వర్గం అతి దగ్గిరల్లో ఉండికూడా దిక్కులేకుండా ఎవర్నీ చూడకుండా, స్వంత కొడుకు చేత తల మీద తల కొరివి పెట్టించుకోలేకుండా, మందులేని వ్యాధితో, కుక్క చావు చచ్చాడు.
పది రోజులు వేరే చోట కర్మకాండ అదీ అయ్యాక వీర్రాజు కొడుకు ఇనప్పెట్టి తెరిచి అన్ని అరలూ వెదుకుతుంటే ఓ పసుపు రాసిన కవర్ కనిపించింది. అది విప్పి చూస్తే వీర్రాజు చేసిన వ్రతం, ఆయన కోరికా కనిపించాయి. రాజకీయ నాయకుల్లో అరవై ఐదు అంటే చిన్నవాళ్లకిందే లెక్క కదా? పంతులు వ్రతం సరిగ్గా చేయిస్తే మరణం ఎలా వచ్చింది? కోపం ఉవ్వెత్తున రాగానే వెంఠనే పంతులు ఇంటికి కబురుపెట్టాడు వచ్చి మాట్లాడమని.
ఇన్నేళ్లలో వ్రతం చేయించిన పంతులు పోయి కొడుకు చూస్తున్నాడు పౌరోహిత్యం అవీను. కొడుకు వచ్చి చూసాడు ఈ కధా కమామీషు. వీర్రాజు కొడుకు గదమాయిస్తూ అడిగాడు పంతుల గారబ్బాయిని “వ్రతం చేయించి డబ్బు గుంజారు కానీ పని జరిగినట్టులేదు. మా నాన్నగారు పోవడానిక్కారం మీ వ్రతం బెడిసికొట్టడమే.”
“ఓ సారి ఆ కోరిక రాసిన కాయితం చూడవచ్చా?” పంతులి కొడుకు అడిగాడు.
వీర్రాజు కొడుకు ఇచ్చిన కాయితం విప్పి చదివాడు పైకి, “ఇంట్లోగానీ హాస్పిటల్లో గానీ, గాలిలోకానీ, నీట్లో కానీ, భూమి మీద కానీ ఆకాశంలో గానీ, కత్తిపోట్లతో, తుపాకులతో, దేవ దానవ గంధర్వులతో మానవులతో, పాములతో, మిగతా జంతువులవల్లా, పక్షులవల్లా, బాంబు దాడిలో, విమానంలో, రైళ్ళలో, కారుమీద, నడుస్తూ, ఆఖరికి సైకిల్ మీద వెళ్తున్నప్పుడు గానీ ఎటువంటి ఆయుధంవల్లా కూడా చావు రాకూడదు.”
తండ్రి నేర్పిన లౌక్యం బాగా వంటబట్టించుకున్న పంతులి కొడుకు చెప్పాడు, “మీ నాన్నగారు అడిగిన కోరిక విచిత్రమైనది కానీ ఎలా కోరుకున్నారో అలాగే దేహం చాలించారు. కావాలిస్తే చూసుకోండి. ఆయన పోయినది ఇంట్లోకాదు, హాస్పిటల్లో కాదు – ఆరుబయట. నేల మీద కాదు, ఆకాశంలో కాదు - మంచంమీద. మరణం వచ్చినది ఏ ఆయుధం వల్లా కాదు. మీ నాయన గారు ఒకసారి తాచుపాము నుంచీ కారు ఏక్సిడెంట్ నుంచీ బయటపడ్డారు. అందువల్ల పాములవల్లా, ప్రయాణాలవల్లా మరణం రాలేదు. ఆయన కోరుకున్నట్టే గాలిలో, నీట్లో, భూమి మీద, కత్తిపోట్లతో, తుపాకులతో, దేవ దానవ గంధర్వులతో మానవులతో, పాములతో, మిగతా జంతువులవల్లా, పక్షులవల్లా, బాంబు దాడిలో, విమానంలో, రైళ్ళలో, కారుమీద, నడుస్తూ, ఆఖరికి సైకిల్ మీద వెళ్తున్నప్పుడు గానీ ఎటువంటి ఆయుధంవల్లా కూడా చావు రాలేదు. ఆయన పోయినది కేవలం ఆయన వంట్లో చేరిన అతి చిన్న సూక్ష్మజీవి వల్ల. ఇప్పుడు చెప్పండి వ్రతం ఎలా చెడింది?”
అవాక్కైన వీర్రాజు కొడుకు కళ్ళు తేలవేస్తూండడం చూసి పంతులి కొడుకు చెప్పాడు ఇంకా, “అయ్యా, భగవంతుడు ప్రతీ జీవికీ ఇంత ఆయుర్దాయం అని రాసిపెడతాడు. దాన్ని మించి బతకాలని చూస్తే ఇటువంటివే జరుగుతాయి. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుణ్ణి తనకి కావాల్సింది కోరుకునే ముందు అసలు ఇటువంటి నరశింహావతారం అనేదొకటి ఉంటుందని ఊహించి ఉండడు. బుధ్ధిః కర్మానుసారిణీ అని మన కర్మ ప్రకారం మన బుధ్ధి నడిపిస్తూ ఉంటుంది. గమనించారా, మీ నాయన గారు కోరుకున్నది చావు ఎలా రాకూడదో అనేది కాదు, తాను ఎలామరణించాలో అనేది మాత్రమే. దానిప్రకారమే ఆయనకి వ్రతం ఫలితం సిధ్ధించింది. దీని గురించి ఎవరిదగ్గిరా అనకండి, నవ్వులపాలు అవగలరు. ఇంక నేను వెళ్తా.”
పంతులి కొడుకు బయటకొచ్చి తన స్కూటర్ స్టార్ట్ చేస్తూంటే వీర్రాజు ఎప్పుడో ఈ వ్రతం తన తండ్రితో చేయించినప్పుడు తాను “గృధ్యాభీష్టాదేవి” అంటే ఏమిటని అడగడం, తన తండ్రి లౌక్యంగా దాని అర్ధం చెప్పడం గుర్తొచ్చింది. మొహంలో చిరునవ్వు ఈ చెవినుంచి ఆ చెవికి విస్తరిస్తూంటే, ఏక్సిలెరేటర్ మీద కాలు నొక్కుతూ బండి ముందుకి ఉరికించాడు.