Menu Close
ఘాలి లలిత ప్రవల్లిక
కొలిమి (ధారావాహిక)
-- ఘాలి లలిత ప్రవల్లిక --

ఆ రోజు ప్రణవిని పెళ్లి కూతురుని చేసే రోజు. ఆమె స్నేహితురాళ్ళుకూడా వచ్చారు.

ముత్తైదువులు ఆమె నుదుటన బొట్టుపెట్టి, మాడున నూనెపెట్టి, నలుగు పిండి రాసి ,..అక్షంతలేసి హారతిచ్చారు. ప్రణవి ఫ్రెండ్స్ మిగిలిన నలుగు పిండి అంతా ఆమె మొహానికి పులిమి రకరకాల యాంగిల్స్ తో ఫోటోలు తీసుకున్నారు. పెద్దపెద్ద గుండిగలు, బిందెలతో నీళ్ళు పెట్టి నీళ్ళల్లోపసుపు గులాబీ రేకులు, బంతి పూల రెక్కలూ వేసి, వాటి మూతులను పూలమాలలతో అలంకరించారు. జల్లెడ ప్రణవి నెత్తిపై పట్టుకుని నెత్తిన నీళ్లు పోసారు. ఫ్రెండ్స్ చెప్పక్కరలేదు. వీడియో గ్రాఫర్ లు చెప్పినట్లుగా అందరూ కలిసి ఒకేసారి చెంబులతో నీళ్ళు మీదకు విసరడం, ఫోటోగ్రాఫర్ చెప్పినట్లుగా అందరూ ఒకేసారి చెంబులతో నీళ్లు నెత్తిన పోయటం, వీళ్ళ ఆలోచనలకు తగినట్లుగా వీరు రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు దిగారు. చాలా సందడిగా జరిగింది.

మేరీ రహస్యం గా ..."తను హిందువును ప్రేమించిందిట. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరు అని చెప్పకుండా వెళ్లి గుడిలో పెళ్లి చేసుకుందిట. వాళ్ళ నాన్నా, అన్నయ్యలు మంచివాళ్ళు కాదని ఫ్రెండ్స్ కి కూడా తన ప్రేమ‌ వ్యవహారం చెప్పలేదు. తను ప్రేమించింది మా అన్నయ్య ఫ్రెండునే కావడంతో నాకు విషయం తెలిసింది." అంటూ ప్రణవి చెవిలో చెప్పింది.

ప్రాణ స్నేహితురాలికి ప్రేమ వ్యవహారం తెలియనివ్వకుండా దాచింది అన్న బాధను క్షేమంగా ఉంది అన్న సమాచారం మింగేసింది. మైండ్ కొంచెం రిలాక్స్ అయింది ప్రణవికి.

ఉదయం హల్దీ ఫంక్షన్ అయిపోయింది. రాత్రి సంగీత్ అన్నారు పిల్లలంతా. వాళ్ళ ఆనందాన్ని కాదంటం ఎందుకని ఆంజనేయులు సరే అన్నారు.

మీ పిల్లల రికార్డ్ డాన్స్ లు మేం చూడం.... మేం రాము అని భీష్మించుకుని కూర్చున్నారు పెద్దలు. "మా పెళ్లి పాటల సందడి మాకు కావాలి. మీ పిచ్చి ఎగురుళ్ళు మేము చూడం" అన్నారు.

వాళ్ళు అలిగేసరికి యూత్ అంతా ఢీలా పడిపోయారు. "సంగీత్ ఉంటుందనుకొని మేమంతా ముందుగానే వచ్చాం. సరదాగా డాన్సులు వేసుకోవచ్చని. ఇప్పుడేంటి ఇలా" అంటూ మూతి ముడుచుకొని కూర్చొన్నారు.

పెద్దవాళ్లు కూడా "ఈ పెళ్ళిపాటలే మాకు సందడి. ఈ పాటలు మా తరంతో అంతరించి పోయేటట్లుగా ఉన్నాయి.

మాకూ వయసులు ఉడిగిబోయి....కాటికి కాళ్ళు జాపుకొని కూర్చొన్నాం. అనుకోకుండా పాటలు వచ్చిన వాళ్ళందరూ దీని పెళ్ళికొచ్చారు. మేం వాళ్ళ కన్నా ఏడాకులు ఎక్కువే చదివాం తగ్గేదే లేదు". అని తెగేసి చెప్పారు.

"మీరు పెళ్లి జరిగేటప్పుడు పాడుకోండి వీళ్లిప్పుడు పాడుకుంటారు." అంటూ ఆంజనేయులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

"అప్పుడు ఎవరు మా పాటలు వినరు పెళ్లి హడావిడిలో ఉంటారు." అంది తాయారు.

వాద ప్రతివాదాలు విన్నతరువాత మధ్యే మార్గంగా యూత్ కి ఒక గంట, అడల్ట్స్ కు ఒక గంట కేటాయించారు. అంతేకాదు ఒకళ్ళదానికి మరొకరు.. ప్రేక్షకులు, శ్రోతలు గా ఉండాలని కూడా కండిషన్ పెట్టారు ఆంజనేయులు. యూత్ రెచ్చిపోయి కొత్త కొత్త సినిమా పాటలు స్పీకర్ బాక్స్ కి కనెక్ట్ చేసి డాన్స్ లు అదరగొట్టేసారు. ప్రణీతను పెళ్లికూతురు లాగా పెళ్లి కొడుకు వేషంలో ఓ ఫ్రెండ్, ఇంకా అమ్మ నాన్న వేషాలలో అమ్మాయిలు పెళ్లి వేడుకలు చూపించేశారు. మనుషుల మనస్తత్వాలను బట్టి వాళ్ళ మీద పాటలు రికార్డు పెట్టి వాళ్ళను చూపిస్తూ డాన్స్ చేసారు. అందరూపడి పడి నవ్వారు. లేటెస్ట్ తెలుగు, హిందీ పాటలలో రిలేటెడ్ గా ఉన్నవి రికార్డు పెట్టుకొని సందడి చేసేసారు.

ఈడుకి వచ్చిన పిల్లలు ఈ ఎగురుడేంటో అని బుగ్గన వేలు వేసుకునే వాళ్ళు కొందరైతే, పిల్లలు ఉంటేనే పెళ్లికి కళవచ్చింది. వీళ్ళ సందడి తో మూడు కాళ్ళ ముసలికి కూడా ఉత్సాహం వస్తుంది, అనుకొనేవారు కొందరు.

ఇప్పుడు పెద్దవాళ్ల వంతు వచ్చింది. పెద్ద వాళ్ళు అయితే రెండు బ్యాచ్ల కింద విడిపోయారు. ఆడపెళ్ళి వారు ఒక బ్యాచ్, మగపెళ్లి వారు ఒక బ్యాచ్ ... ఒకళ్ళ మీద ఒకళ్ళు ఛలోక్తులు, విసుర్లు తో పాటలు పాడారు. ఆ పాటలు ఎంతో సరదాగా సాగాయి.

మగపెళ్లి వారట...దుమారం వారట
పెళ్లికి తరలివచ్చినారట...
చాల లోకులు నవ్వరా చెలి
చిమ్నీలు ఎరగరట, ట్యూబ్లైట్లెరగరట
కాగడాలు వీరికి ఘనమాయే....

అని ఒకళ్ళంటే

ఆడపెళ్ళి వారట అహంకారం వారట
మర్యాద లే వారికి తెలియవట
కాళ్లు కడుగు నీళ్ళు లేవు ....
కాంతినిచ్చే లైట్లు లేవు...
దోమల మేళం పంపినారు...
అయ్యో సిగ్గుచేటే ....నవ్విపోదురే..

అని మగపెళ్ళివారి బ్యాచ్.

అక్క చూడు బావ ఎంత అంద హీనుడో
ముక్కు వంకర ముదరి టింకరా
ముసలివాడుమీ...
కప్ప నోరు, కాళ్ళు పొడవు, కాకి నలుపుమీ...

అని మరదలంటే...

అన్న చూడు ఒదిన ఎంత అందగత్తో
చూపులేమో గుడ్లగూబ
గాత్రమేమో గార్దభాము
కొంగమెడ తెల్లకాకి అంటూ ఆడబడుచు

ఇక
భోజనాల దగ్గరైతే

ఎలాగు భోంచేతుమే ఈ విందు మే మెలాగు భోంచేతుమే
చాలా పెళ్ళిళ్ళాయే...ఇలాంటి విందు మేమెలాగూ భోంచేతుమే..
పీటాల పొంకమేమే వియ్యాల వారి మాటాల పంతమేమే.....
విస్తళ్ళవెడల్పేమే....హస్తంబు చాచితే
అమరాకు చోటు లేదు
"ఏలాగు"
నెయ్యీ ఎంతటి కంపే .....వియ్యాలవారి
పరువూ ఎంతటి సొంపే...
చెయ్యీ చురుక్కుమనే ...చెవిలో దారంతలేదు
" ఏలాగు"

అని ఒక బ్యాచ్ పాడితే

విందూ కొచ్చినారు వియ్యాలావారంతా
పొందూగానే వీరు భోంచేయా నేర్వారూ
"విందూ"
పీటల్ వేయబోతే అల్వాట్ లేదన్నారు
నీటు గానే కట్నం మూటే చాలన్నారు
"విందూ"
అప్పడాలు వీరు ఎప్పూడెరుగరాట
ఒంపు గానే వడియం వంటీకే పడదాటా
"విందూ"
బూందీ క్షీరాన్నం పుచ్చూకోమన్నారు
ఉల్లీగడ్డ వేసి చల్లే చాలన్నారు
"విందు"

అని ఇంకోబ్యాచ్ వారు పాడారు.

చేసి గెలిచి రమ్మ కార్యము వియ్యాలవారు
చూసి పాడిరమ్మ పక్వముల్
మారు అన్నమడిగితేను మాయలాడి పెద్ద వదిన
మారు అన్నములేదని మిరీమిరీ చూడసాగే
"చేసి"
అప్పడాలు అడిగితేను అందగత్తె చిన్న వదిన
అప్పుడములు లేవని ఎగిరి గంతులేయసాగే
"చేసి"
పాయసం బులడిగితేను పంకజాక్షిబుల్లి వదిన
పాయసంబు లేదని పరుగు పరుగు లెత్త సాగే
"చేసి"
వడియాలుఅడిగితే ను వగలాడి అత్త గారు
వడియాలు లేవని కడియాలు తిప్ప సాగే
"చేసి"
నేతి బొట్టు అడిగితే ను నేర్పుతో మామగారు
నేతి బొట్టు లేదని నవ్వుతూ వెడలిపోయె
"చేసి"
తమలపాకులడిగితే ను ఠళాటోళీ పెద్ద బావ
తమలపాకులు లేవని తరిమి తరిమి కొట్ట సాగే
"చేసి"
పోకచెక్కలు అడిగితే ను పొగరుబోతు చిన్న బావ
పోకచెక్కలు లేవని పో పో అని చెప్పసాగాడు
"చేసి"

ఇలా రెండు బ్యాచ్ల వాళ్లు చాలాసేపు పాటలు పాడుతూనే ఉన్నారు.

ఆ రోజు అలా సరదాగా గడిచిపోయింది. ఈ వయసులో కూడా వాళ్ళంతా సరదాగా ఉత్సాహంగా పాడుతుంటే.... వహ్వా వహ్వా అంటూ ప్రణవి ఫ్రెండ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేశారు.

మగపెళ్లి వారు వచ్చారు. ఊరి పొలిమేరల్లో నుంచే వాళ్ళను బ్యాండ్ మేళం తో తీసుకొచ్చారు. వీళ్ళు విడిది ఇంట్లో దించారు. వాళ్ళూ వీళ్ళతో ఏకమై సరదాగా జోకులు వేస్తూ సందడి చేసేసారు.

ఉదయం 10 గంటలకు ముహుర్తం.

జంబేష్ అన్నగారు రాజన్ వాళ్ళు ఉదయం మూడు గంటలకే లేచి ఆడ పెళ్ళి వాళ్ళ ఇంటికి వచ్చి కామ్ గా పెరట్లో పొయ్యిమీద నీళ్ళు పెట్టేసుకొని స్నానాలు చేసి రెడీ అయిపోతున్నారు.

ముందురోజు రాత్రి ఒంటి గంట వరకు పనులు చేసుకుని అలసిపోయి పడుకున్న వాళ్ళు ...శబ్దమైతే లేచి చూసిన ప్రణవి పిన్ని..

"అయ్యో అదేంటి... మీరు పెట్టుకోవడం? ఉదయం నాలుగింటికి మీకు వేడి నీళ్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. మేం కాచిస్తాం లేవండి." అంటూ నొచ్చుకొంటూ చెప్పింది.

"అయ్యో అదేం లేదండి సంబంధం కలుపుకున్నాక మీరు ఏమిటి? మేము ఏమిటి? మీరు అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ మనసులో పెట్టుకోకండి. మీలాగానే మేము కూడా.... మా కోసం మీరేం స్పెషల్గా చేయక్కర్లేదు. మనమందరం ఒకటే"అన్నారు. జంబేష్ అన్నగారు రాజన్.

"అన్నారు కదాని వదిలేయలేము కదా మా మర్యాద మేం కాపాడుకోవాలి. మా ప్రణవి అదృష్టవంతురాలు. మీలాంటి మంచి వ్యక్తులున్న ఇంటికి వెళుతోంది" అంది ప్రణవి పిన్ని.

అందరూ మగ పెళ్ళి వారిని తెగ మెచ్చుకున్నారు.

"ఎంత మంచి వాళ్ళో వాళ్ళు అన్ని సర్దుకుపోతున్నారు" అని అంటూ ఉంటే ప్రణవి మనస్సు ఆనందంతో తేలిపోయింది.

స్నాతకం, కాశీయాత్ర, ఎదుర్కోలు, పానకం బిందెలు, జిలకఱ్ఱ బెల్లం, తాళి కట్టడం, తలంబ్రాలు, స్థాలీపాకం, బొమ్మని అప్పగింత, వసంతాలు, అలకపాన్పులు, అప్పగింతలతో పెళ్ళి తంతు ముగిసింది.

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

ఘాలి లలిత ప్రవల్లిక పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in October 2023, కథలు

1 Comment

  1. విజయశ్రీముఖి

    సిరిమల్లెలో వస్తున్న ఘాలి లలితప్రవల్లిక గారి *కొలిమి* మరిచిపోతున్న పెళ్లి పాటల్ని బాగా గుర్తు చేసింది.
    అభినందనలు!

    బులుసు సరోజినీదేవి గారి కొత్త సీరియల్ *గాలి* మొదట్లోనే ఆసక్తికరంగా ఉంది అభినందనలు!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!