Menu Close
GSS-Kalyani
జ్ఞానానందమయం
శ్రీ శేష కళ్యాణి గుండమరాజు

తరగని పెన్నిధి

కృష్ణానందకు తన పాఠ్యపుస్తకాలన్నా, తనెంతో ఇష్టపడి కొనుక్కున్న చిన్నపిల్లల పుస్తకాలన్నా ఎంతో ప్రాణం. ఆ పుస్తకాలను పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తపడుతూ ఉండేవాడు కృష్ణానంద. పాఠ్య పుస్తకాలతో అవసరం తీరాక వాటిని పేద విద్యార్థులకు ఇస్తే అవి వారికి ఉపయోగపడతాయని కృష్ణానందకు చెప్తూ ఉండేవాడు సదాశివ. కానీ కృష్ణానంద అందుకు అస్సలు ఒప్పుకునేవాడు కాదు. కృష్ణానంద ఇంట్లో లేనప్పుడు సదాశివ అప్పుడొకటి అప్పుడొకటి చొప్పున పాత పుస్తకాలను తీసుకెళ్లి దానం చేస్తూ ఉండేవాడు.

ఒకరోజు ప్రసూనాంబ కృష్ణానందను పిలిచి, "ఒరేయ్ కృష్ణా! ఇది మీ తాత చిన్నప్పటి పెన్ను. దీనిని కొని చాలా ఏళ్ళే అయ్యింది. కానీ ఇంకా ఎంత బాగా రాస్తోందో చూడు!", అంటూ ఒక పెన్నును కృష్ణానందకు చూపించింది. కృష్ణానంద పెన్నును తీసుకుని దాన్ని ఆసక్తిగా పరిశీలించాడు.

"బామ్మా! నాక్కూడా ఒకసారి ఈ పెన్నుతో ఏదైనా రాసి చూడాలని ఉంది!", అన్నాడు కృష్ణానంద.

వెంటనే ప్రసూనాంబ కృష్ణానందకు ఒక కొత్త పుస్తకం ఇచ్చి, "నీకు ఎక్కాలు వచ్చు కదా! ఒకటో ఎక్కం నుండీ పదిహేనో ఎక్కం వరకూ ఈ పుస్తకంలో అందంగా రాయి", అంది.

ఎక్కాలు రాయడం కృష్ణానందకు భలే ఇష్టం. ప్రసూనాంబ ఇచ్చిన పెన్నుతో పదిహేను ఎక్కాలూ ఒక్క తప్పు కూడా లేకుండా రాసేశాడు కృష్ణానంద.

"శభాష్ రా ఆనందూ! నీకెప్పుడైనా ఎక్కాలూ చదువుకోవాలని అనిపిస్తే ఈ పుస్తకం చూడచ్చు!", అని ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా అలమరాలో దాచింది ప్రసూనాంబ.

"ఈ పుస్తకమెందుకు బామ్మా? నా దగ్గర మా బడికోసం కొన్న ఎక్కాల పుస్తకం ఉంది కదా!", అన్నాడు కృష్ణానంద.

"మన పనిమనిషి రంగమ్మ కొడుకు రాజు నీకన్నా చిన్నవాడు కదా! వాడు మొన్న ఎక్కాల పుస్తకం కొనుక్కోవడానికి రంగమ్మను డబ్బులు అడుగుతున్నప్పుడు మీ నాన్న విని ఆ పుస్తకం రాజుకి ఇచ్చాడు!", మెల్లిగా అసలు విషయం చెప్పింది ప్రసూనాంబ. కృష్ణానందకు ఎక్కడలేని కోపం వచ్చింది! "నా పుస్తకం నాకు కావాలి!", అంటూ ఏడవటం మొదలుపెట్టాడు కృష్ణానంద.

"ఒరేయ్ కృష్ణా! నీకు ఆ పుస్తకంలోని ఎక్కాలన్నీ వచ్చేశాయి కదా! అంటే ఆ పుస్తకంనుంచి నీకు రావాల్సిన జ్ఞానం వచ్చేసిందన్నమాట! ఇక ఆ పుస్తకం నీతో ఉన్నా లేకపోయినా నీకున్న జ్ఞానం ఎటూ పోదు. ఒక విషయం గురించి జ్ఞానం సంపాదించడం ఒక ఎత్తయితే, దానిని అందరితో పంచుకోవడం మరొక ఎత్తు! మనకు తెలిసిన విషయం నలుగురితో పంచుకోవడంవల్ల అది ఆ విన్నవారికి ఏదో ఒకవిధంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అలా చెయ్యడం వలన నీకు తెలిసిన విషయాల గురించి నువ్వు మరింత లోతుగా ఆలోచించే అవకాశం కూడా నీకు ఉంటుంది. దానివల్ల నీకున్న జ్ఞానం మరింత పెరగొచ్చు! జ్ఞానమనేది ఇతరులకి ఎంత పంచినా తరగని పెన్నిధిరా కృష్ణా!", అంది ప్రసూనాంబ.

అంతలో అక్కడికి రాజు వచ్చి, "అమ్మగారూ! మొన్న అయ్యగారు నాకు ఎక్కాల పుస్తకం ఇచ్చారు కదా! నాకు మా బడిలో పెట్టిన లెక్కల పరీక్షలో నూరు శాతం మార్కులు వచ్చాయి!", అని చెప్పాడు సంతోషంగా.

రాజు మొహంలో కృతజ్ఞతతోపాటూ అమితానందం కనపడింది కృష్ణానందకు. కృష్ణానంద, ప్రసూనాంబలు రాజుకి అభినందనలు చెప్పారు.

రాజు వెళ్ళిపోయాక, "నాన్న చేసిన పని సరైనదే బామ్మా! నాకు ఆ ఎక్కాల పుస్తకం ఇక ఎలాగో అక్కర్లేదు. నా పుస్తకంవల్ల రాజు అంత సంతోషిస్తాడని నేను అనుకోలేదు!", అన్నాడు కృష్ణానంద ప్రసూనాంబతో.

అప్పుడు ప్రసూనాంబ కృష్ణానందను దగ్గరకు తీసుకుని, "జ్ఞానవంతుడిని ఈ ప్రపంచం గౌరవిస్తుంది! జ్ఞానంవల్ల మనకు దుఃఖం తొలగి ఆనందం కలుగుతుంది. ఇహలోకానికి సంబంధించిన జ్ఞానం మనతో కడదాకా ఉంటే పరలోకానికి సంబంధించిన జ్ఞానం జన్మజన్మలకూ మన వెంటే ఉండి మనకు సద్గతులు కలిగేలా చేస్తుంది! నువ్వు ఎప్పుడూ ఇలాగే మంచి పనులు చేస్తూ, చక్కటి జ్ఞానాన్ని సంపాదిస్తూ, ప్రయోజకుడిగా ఎదగాలిరా!", అంది కృష్ణానంద బుగ్గపై ముద్దు పెడుతూ.

"అలాగే బామ్మా!", అంటూ ప్రసూనాంబను ప్రేమతో కౌగలించుకున్నాడు కృష్ణానంద!

జ్ఞానానందమయం ముగింపు: అదీ సంగతి పిల్లలూ! 'జ్ఞానానందమయం' కథలన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ శీర్షిక పై మీ అభిప్రాయాలను నాకు తప్పకుండా తెలియజేయండి. జీవితంలో తమకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మంచి మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటూ వెళ్లినవారు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. వారికి మంచి మనసున్నవారందరి దీవెనలతోపాటూ ఆ భగవంతుడి అనుగ్రహం కూడా ఎల్లవేళలా తోడుంటుంది. మరి మీరు కూడా ‘జ్ఞానానందమయం’లో కృష్ణానందలాగా ఎప్పటికప్పుడు తప్పులను సరిదిద్దుకుంటూ, మంచి విషయాలను నేర్చుకుంటూ, మీకున్న శక్తియుక్తులను మంచి పనులకు మాత్రమే వినియోగిస్తూ, ప్రపంచం మెచ్చుకోదగ్గ ఉత్తమ పౌరులై మీ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నాను. మన “సిరిమల్లె” పత్రికవల్ల ఈ 'జ్ఞానానందమయం' కథలన్నీ మిమ్మల్ని చేరాయి కాబట్టి ఈ పత్రిక నిర్వాహకులకు అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను!

-- శుభాకాంక్షలతో, శ్రీ శేష కళ్యాణి గుండమరాజు.

(గమనిక: ఈ శీర్షికలోని కథలను చదివి పిల్లలకు వినిపించిన పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు!)

Posted in December 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!