తప్పు - ఒప్పు
ఒక ఆదివారం సాయంత్రం పెరట్లో కూర్చుని చిక్కుడుకాయలు వలుస్తోంది ప్రసూనాంబ. అక్కడే ఆడుకుంటున్న కృష్ణానందకు ఒక చిలుక అరుపు వినపడింది. చిలుక కోసం చుట్టూ చూశాడు కృష్ణానంద. ఆ చిలుక తమ పెరట్లోని జామచెట్టు కొమ్మ మీద కూర్చుని కనపడింది కృష్ణానందకు! చూడటానికి ఎంతో ముద్దుగా, అందంగా ఉన్న ఆ చిలుకను చూసి, "బామ్మా! అదిగో! ఆ చిలుకను చూడు!! ఎంత బాగుందో!", అన్నాడు కృష్ణానంద.
"అవునురా! నిజమే. ఈ మధ్య మన జామచెట్టు మీద చిలుకలు బాగానే వాలుతున్నాయి!", అంది ప్రసూనాంబ.
"బామ్మా! బామ్మా! నాకు ఆ చిలుకను పెంచుకోవాలని ఉంది. ఈ సారి అది చెట్టు మీద వాలినప్పుడు దాన్ని వలతో పట్టుకుందాం!", అన్నాడు కృష్ణానంద.
"తప్పురా! అలా చెయ్యకూడదు. మనం చిలుకను పట్టుకుంటే అప్పుడది భయంతో చచ్చిపోతుంది! పైగా దానిని హింసించినందుకు మనకు పాపం చుట్టుకుంటుంది!", చెప్పింది ప్రసూనాంబ.
ఆ సమాధానం విన్న కృష్ణానంద చిన్నబుచ్చుకుని, "ఏం కాదు బామ్మా! నేను ఆ చిలుకను బాగా చూసుకుంటా. దానికి మూడుపూట్లా ఆహారం పెడతా. ప్రతిరోజూ దానితో బోలెడు కబుర్లు చెప్పి ఆడుకుంటా!", అన్నాడు.
అప్పుడు ప్రసూనాంబ కృష్ణానందను దగ్గరకు తీసుకుని,"అదికాదురా నాన్నా! చిలుకలు ప్రకృతిలో స్వేచ్ఛగా తిరుగుతూ జీవించే పక్షులు. వాటిని పట్టి తెచ్చి చిన్న పంజరంలో బంధించి ఉంచడం చాలా తప్పు! నువ్వు వాటిని ఎంత బాగా చూసుకున్నా అవి పంజరంలో సంతోషంగా ఉండలేవు. పంజరంలోని పక్షులు ఎటు కావాలంటే అటు ఎగిరిపోలేవు కాబట్టి ఆ బాధతో అవి త్వరగా చచ్చిపోయే అవకాశం కూడా ఉంది! ప్రకృతిలో ఉండే పక్షులనూ, జంతువులనూ చూసి ఆనందించాలే కానీ సొంతం చేసుకోవాలని అనుకోకూడదు. చూస్తూ ఉండు! మరో రెండు వారాల్లో కొన్ని చిలుకలు మన జామచెట్టు పైన గూడు కట్టుకుని గుడ్లు పెడతాయి. అప్పుడు ఆ గుడ్లనుంచీ బుల్లి చిలుకలు పుట్టి, అవి పెద్దవై మన జామచెట్టు కొమ్మల మధ్యన అటూ ఇటూ ఎగురుతూ ఉంటే నువ్వు వాటిని చూస్తూ ఎంతసేపైనా ఆనందంగా గడపచ్చు!", అంది.
ప్రసూనాంబ చెప్పినది కృష్ణానందకు నిజమేనని అనిపించింది.
"సరే బామ్మా!", అని వేరే ఆటలో పడిపోయాడు కృష్ణానంద.
కొద్దిరోజులు గడిచాయి. మళ్ళీ ఆదివారం వచ్చింది. కృష్ణానంద పెరట్లో ఆడుకుంటున్న సమయంలో అక్కడవున్న ఒక మొక్క మొదట్లో ఒక చిలుక పడిపోయింది. ఆ చిలుక ఎంతకీ కదలకపోవడంతో వెంటనే పరుగు పరుగున ప్రసూనాంబ వద్దకు వెళ్లి చిలుక విషయం ఆమెకు చెప్పాడు కృష్ణానంద. ప్రసూనాంబ చేతిలో ఉన్న పనిని వదిలిపెట్టి పెరట్లోకి వచ్చి చిలుకను పరీక్షగా చూసింది. ఆ చిలుక కొనప్రాణంతో ఉంది. ప్రసూనాంబ ఒక పాత గుడ్డను పట్టుకొచ్చి చిలుకను అందులో జాగ్రత్తగా చుట్టి తమ ఇంట్లోకి తీసుకుని వెళ్లి, ఆ చిలుకను తడి బట్టతో తుడిచి, దానికి కొన్ని నీళ్లు తాగించి దాని శరీరమంతా చేతి వేళ్ళతో నెమ్మదిగా నిమిరింది. కాసేపటికి చిలుక తేరుకుంది. చిలుక మెల్లిగా లేచి నిలబడి ఎగిరే ప్రయత్నం చేసింది కానీ ఎగరడం దానివల్ల కాలేదు. ప్రసూనాంబ చిలుకను ఒక చిల్లుల బుట్టలో పెట్టి, కొన్ని పళ్ళను ముక్కలుగా కోసి వాటిని ఆ చిలుక పక్కన ఉంచి, ఆ బుట్టకు మూత పెట్టి దానిని గదిలో ఒక పక్కగా ఉంచింది. కృష్ణానంద చిలుక వంకా ప్రసూనాంబ వంకా మార్చి మార్చి చూస్తున్నాడు.
అది గమనించిన ప్రసూనాంబ, "ఏమిట్రా ఆనందూ? ఏదో సందేహమొచ్చినట్లుంది నీకూ?? అడుగుమరీ!", అంది నవ్వుతూ.
"బామ్మా! నీకు పాపం వస్తుంది!", అన్నాడు కృష్ణానంద చిరు కోపంతో.
"ఎందుకురా?", కంగారుగా అడిగింది ప్రసూనాంబ.
"ఎందుకంటే నువ్వు చిలుకను బుట్టలో పెట్టి బంధించావు కదా? అందుకు!", చెప్పాడు కృష్ణానంద అన్నీ తెలిసినవాడిలా.
"లేదులేరా కృష్ణా! వస్తే పుణ్యం వస్తుందేమో కానీ పాపం రాదులే!", ధీమాగా చెప్పింది ప్రసూనాంబ.
"అదెట్లా? ఆ రోజు నేను చిలుకను పెంచుకుంటానంటే ఇలా బంధించడం తప్పనీ మనకు పాపం వస్తుందనీ చెప్పావు కదా?", అయోమయంలో పడ్డట్టుగా అడిగాడు కృష్ణానంద.
"ఓ! అదా నీ సందేహం. చూడు కృష్ణా! సందర్భాన్ని బట్టి, మామూలుగా తప్పైన పని ఒక్కొక్కప్పుడు ఒప్పుగా మారచ్చు! నువ్వు బయట స్వేచ్ఛగా ఎగురుతున్న చిలుకను తెచ్చి బంధిస్తే అది తప్పు. కానీ ఇప్పుడు ఈ చిలుకకు దెబ్బ తగిలి ఎగరలేని స్థితిలో ఉంది. మరి ఈ చిలుకను బయట వదిలేస్తే ఆకలితోనో లేక ఏ పిల్లో తినేయడం వల్లనో అది చచ్చిపోతుంది! ఈ ప్రకృతి అంతా పరమాత్ముడే. ప్రకృతిలో ఉండే అన్ని జీవుల ప్రాణమూ విలువైనదే. సాటి ప్రాణి కష్టంలో ఉందని తెలిసినప్పుడు దానికి మనకు చేతనైన సహాయం చేసి దాని ప్రాణాలు కాపాడే ప్రయత్నం మనం చెయ్యాలి. ఈ భూమి మీద జీవిస్తున్నందుకు అన్ని ప్రాణుల సుఖం కోరడం మన ధర్మం!", వివరంగా చెప్పింది ప్రసూనాంబ.
"బామ్మా! చూడు! ఆ చిలుక నువ్వు ఇచ్చిన పళ్ళ ముక్కలను తింటోంది!", ఆనందంతో చప్పట్లు చరుస్తూ చెప్పాడు కృష్ణానంద.
"ఊఁ! అంటే ఆ చిలుక బాధనుండీ తేరుకుంటోందన్నమాట!", అంది ప్రసూనాంబ.
మర్నాడు తెల్లవారుఝామున ప్రసూనాంబ కృష్ణానందను పిలిచి చిలుక ఉన్న బుట్టను పెరట్లోకి తీసుకెళ్లి ఆ బుట్ట మూతను తెరిచింది. చిలుక రివ్వున గాల్లోకి ఎగిరి జామచెట్టు మీద వాలింది.
అది చూసి కృష్ణానంద,"ఆయ్! భలే భలే! చిలుకకు నొప్పి తగ్గిపోయింది!", అంటూ గెంతులు వేశాడు.
చిలుక 'కీ!కీ!", అని అరిచి అక్కడే గాల్లో రెండు చక్కర్లు కొట్టి ఎగురుతూ ఎటో వెళ్ళిపోయింది.
"ఆ చిలుక నీకు కృతజ్ఞతలు చెప్పినట్లుంది బామ్మా! నువ్వన్నది నిజమే. ఆ చిలుకను బయటే వదిలేసి ఉంటే దాని ప్రాణాలు దక్కేవి కాదేమో! దాని విషయంలో మనం చేసింది తప్పు కాదు ఒప్పే!", అంటూ బడికి తయారవ్వడానికి హుషారుగా ఇంట్లోకి పరిగెత్తాడు కృష్ణానంద.