తామరాకు పైబిందువు తళతళ మని
చిరము నిలువక జారుచు చేరు నీట
జీవితంబు గూడ నిచట తావి గాదు
రోగ దుఃఖమయంబు రా భోగ మేది
మనిషి మనుగ డంతయు మిథ్య మాయ గాదె
కాసులున్న నాడందరు నూసులాడు
ధనము లేకున్న నీవారు దరికి రారు
జబ్బు లేని నాడందరు చంద్రు డంద్రు
ముదుసలిగ రోగమొచ్చిన మురిసి రారు
నీకు నూపిరున్నప్పుడే నెనరు జూపు
శవమయిన నాడెవరు తోడు సాగి రారు
ఉసురు పోవగ నీవిక నూరి బయట
ఎంత వారికైనను తుద కేమి చెందు
ధనము ఘనమని మురిసిన తనకు సుఖము
నీయదు భయము పెంచును, రాయి వోలె
మనసు మారు,పుత్రులు మారు,ధనము గుణము
యిదియె సతము నివ్వదు నీదు మదికి హాయి
చిన్నతనము నాటలయందు చేరి మురియు
యవ్వనంబున మోహంబు నలరు చుండు
పెళ్లి పిదప సంసారంబు విసుగు నిచ్చు
ముసలివయిన రోగము లొచ్చి ముసురు తుండ
జీవితాన దేవునెపుడు చేయ గలవు
ఇచ్ఛ తోన పారాయణం స్వేచ్ఛ గలిగి
ఇంకెపుడు యోచన గలుగు నిహము వీడ
ముక్తి యేల గలుగును విరక్తి రాక