Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

రాఘవ, జీవన్ తిరిగి ఆసుపత్రికి వచ్చేసరికి పెద్దాయనకు అవసరమైన వైద్యమంతా జరిపించి, గాయానికి కట్టుకట్టి, తీసుకువచ్చి ICU లో “అబ్జర్వేషన్” లో ఉంచారు. ఆయనకింకా తెలివిరాలేదు. జీవన్ రాక చూసి, ముసలాయన ఒంటి మీదున్న వాచీ, మనీపర్సు, ఉంగరం వగైరా సామగ్రి యావత్తూ అతని చేతికి ఇచ్చారు. ఆయన “వేలెట్” లో దొరికిన అడ్రస్ ని చూసి, ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు రాఘవ, ఆయన కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పడం కోసం.

కాని, తొందరగానే తిరిగివచ్చాడు రాఘవ. అడ్రస్ ప్రకారం వెడితే ఆయన ఇల్లు దగ్గరలోనే దొరికింది. కాని ఇంటికి తాళం వేసి ఉంది. చుట్టు పక్కల వారిని అడిగితే, ఆ ఇంట్లో చాలా రోజులనుండీ పెద్దాయన ఒక్కరే ఉంటున్నారనీ, ఎవరూ చుట్టాలు పక్కాలూ వచ్చిన జాడకూడా కనిపించ లేదనీ, అంతకన్నా ఎక్కువ వివరాలేమీ తమకు తెలియవనీ చెప్పారు. ఇంక ఏం చెయ్యడానికీ తోచక రాఘవ తిరిగి వచ్చేశాడు. ఆ విషయం జీవన్ కి చెప్పేసి తన పనిమీద తాను వెళ్ళిపోయాడు రాఘవ.

“హతోస్మి! ఐతే ఈయన “చూడ చుట్టమూ, మ్రొక్క దైవమూ” లేని ఏకాకి - అన్నమాట! ఐతే ఆ అడ్రస్ లో ఉన్న జగన్నాధం - అన్న పేరు ఈయనదే కాబోలు! ఈయనకు తెలివి వచ్చాక అన్నీ కనుక్కోవాలి” అనుకున్న జీవన్, ఆయనకు తెలివిరావడం కోసం అక్కడే కనిపెట్టుకుని ఉన్నాడు. గంట ఎదురుచూసిన తరువాత కబురు వచ్చింది, “ముసలాయనకు తెలివి వచ్చిందని. జీవన్ గమ్మున లేచి ఆయన దగ్గరకు వెళ్ళాడు.

బెడ్ మీద నిస్త్రాణగా పడుకుని ఉన్నాడు ఆసుపత్రి దుస్తుల్లో ఉన్న ఆ పెద్దాయన. “డ్రిప్” పెట్టబడి ఉంది. తలకి బేoడేజ్ కట్టి ఉంది. ఎడమచెయ్యి విరిగింది కాబోలు, ప్లాస్టర్ వేసి ఉంది. ఒంటిమీద చాలాచోట్ల బేండు ఎయిడ్ అతికించబడింది. ఎనభైకి పైనే ఉండి వుంటుంది ఆయన వయసు – అనిపించింది జీవన్ కి.

ఒళ్లంతా కట్లతో, బలహీనంగా మంచాన్ని అంటిపెట్టుకుని బక్కగా, నీరసంగా దయనీయంగా ఉన్న ఆ పెద్దాయనవైపు చూస్తూ, ఎలావుంది తాతయ్యా" అని అడిగాడు జీవన్ ప్రేమగా.

పెద్దాయన జీవన్ ని ఎగాదిగా చూసి, “ఎవరు బాబూ నువ్వు? నాతో ఏం పని నీకు” అని అడిగాడు నీరసంతో ఒణుకుతున్న కంఠంతో.

అక్కడే ఉన్న నర్సు ఆయన మాటలు విని తెల్లబోయి జీవన్ వైపు చూసి, సూటిగా అడిగేసింది, “ఇదేమిటి? మీ తాతయ్యన్నావుగా?”

జీవన్ చిన్నగా నవ్వి అన్నాడు, “కాకపోవడమేమిటి! ఈయన నాకు తాతయ్య. ఇదివరకు ఏమోగాని, ఇది మొదలు ఆయన నాకు నిజంగా తాతయ్యే! ఆయనను నేనింక వదలను. వెంటవుండి ఏ లోటూ రానీకుండా చూసుకుంటాను. ఇది నీకు తెలుసా? “వుయ్ ఆర్ ది శైలర్స్ ఆఫ్ ది సేం బోట్!” ఇద్దరం అవసరంలో ఉన్నవాళ్ళమే! కాని చిన్నతేడా ఉంది, ఆయనకు కావలసింది మనుమడైతే నాకు కావలసింది తాతయ్య! నాకు అమ్మతప్ప మరెవరూ లేరు. మరి తాతయ్యకు ...” మాట పూర్తి చెయ్యకుండా పెద్దాయనవైపు చూశాడు జీవన్. ఆ నర్సుకి ఏమీ అర్ధమవ్వలేదు. జీవన్ వైపు వింతగా ఒక్క చూపుచూసి, తనపనిమీద వెళ్ళిపోయింది.

తెలివిగానే ఉండడంతో తాతయ్య వెంటనే జవాబు చెప్పారు, “నాకు ఎవరూలేరని చెప్పే వీలుకూడా లేదు బాబూ నాకు” అంటూ నిట్టూర్చి చెప్పసాగారు ఆయన. “నాకొక కొడుకు ఉన్నాడు - ఏకైక పుత్రుడు! వాడు నన్ను పున్నామ నరకం నుండి తప్పించడం మాట దేవుడెరుగు, ఇప్పుడుమాత్రం నన్నీ వృద్ధాప్యపు నరకంలో పడేసి, తనేమో ఉద్యోగపు టూరిలో హాయిగా ఉన్నాడు. నేనిక్కడ ఒంటరిగా ఉండి, రోజు గడవక ఎంత బాధ పడుతున్నానో వాడికి అస్సలు పట్టదు. ముద్దులు మూటగట్టే మనుమలు ఇద్దరున్నారు నాకు, కాని ఏం లాభం! వాళ్ళ ముద్దు ముచ్చట్లు చూసి ఆనందించే భాగ్యం నాకు లేదు.” ఉసూరుమని గాఢంగా నిట్టూర్చారు ముసలాయన.

ఆయన మంచానికి దగ్గరగా వచ్చి అన్నాడు జీవన్, “తాతయ్యా! ఇప్పుడు నువ్వు అవన్నీ తల్చుకోకూడదు. నీ కిప్పుడు విశ్రాంతి కావాలి.”

“కొత్తగా తల్చుకునేదేమిటి బాబూ! అసలు మర్చిపోతే కదా! పిల్లలతో “తాతయ్యా” అని పిలిపించుకోవాలనీ, వాళ్ళతో కబుర్లు చెప్పి మురిసిపోవాలనీ ఉంటుంది. ఏడాదికి ఒకసారి రావడానికి కూడా వాళ్లకు కుదరదుకదా! కోడలు కూడా ఉద్యోగం చేస్తోoదేమో, ఎప్పుడు ఫోన్ చేసినా ఆఫీసు పనులతో బిజీగా ఉన్నాము - అనే చెపుతారు. వాడిని కన్న తల్లి, వాడిని చూడాలని కలవరిస్తూనే ప్రాణాలు విడిచింది. ఆ వార్త తెలిసి, డ్యూటీ చెయ్యడానికి తప్పనిసరిగా అప్పుడు వచ్చాడు. సెలవు దొరక్క కోడలూ పిల్లలూ రానేలేదు. ముక్తసరిగా కర్మలు జరిపించి, బందువులతోపాటుగా తనూ వెళ్ళిపోయాడు. నేనిలా ఏకాకిగా ఉండిపోయాను. అంతా నా కర్మ బాబూ, అంతా నా ప్రారబ్ధకర్మ!” కడుపులో రగులుతున్న బాధంతా వెళ్ళగక్కి నీరసంతో మూలగసాగాడు పెద్దాయన.

జీవన్ ఆప్యాయంగా ఆయన చెయ్యి పట్టుకుని, “బాధపడకండి తాతయ్యా! మీరసలే చాలా నీరసంగా ఉన్నారు” అన్నాడు.

“ఒంటరితనం బాబూ, ఒంటరితనం! ఇది ఒద్దంటే ఆగే బాధ కాదు. మూడేళ్ళ క్రిందట నిర్దయగా నా భార్య కూడా నన్నొదిలిపెట్టి యిట్టే చక్కాపోయింది. ఇది న్యాయమా బాబూ! అది పోయాక నేను అనాధనయ్యాను. కొన్నాళ్లవరకూ నా బాధ్యత వంటమనిషి చూసుకునేది. ఇప్పుడు ఆమె కూడా కూతురు సాయం కావాలందని వేరే ఊరు వెళ్ళిపోయింది కూతురు దగ్గరకి. మూడు నెలలనుండి స్వయం పాకం! ఒకరోజు తినీ, ఒకరోజు తినకా బ్రతుకు వెళ్ళమారుస్తున్నాను.”

ఇంతలో మందులున్న ట్రేలతో ఉన్న ట్రాలీని తోసుకుంటూ ఒక నర్సు వచ్చింది అక్కడికి. ముసలాయనకి ఇంజక్షన్ చేసి, జీవన్ తో, “పెద్దాయనను రేపు డిశ్చార్జి చేస్తారు. తొమ్మిది కాకముందు మీరు ఇక్కడ ఉండాలి” అని చెప్పి వెళ్ళిపోయింది.

పెద్దాయన గతుక్కుమన్నారు. “ఇంటికా! ఇప్పుడప్పుడే వద్దు. అక్కడ నాకు సేవ చేసేదెవరు? నాకు ఇప్పుడు ఒక చెయ్యి కూడా లేదు, ఎలా బ్రతకాలి నేను? డబ్బు కూడెట్టదు కదా! ఈ వయసులో ఆత్మీయుల ఆదరణ కావాలి. ఇంటికి వెళ్ళాలన్న తొందరెందుకు? అక్కడ నన్ను చూసుకోడానికి ఎవరున్నారని! వెళ్లి డాక్టర్తో మాటాడు బాబూ! ఏమంటాడో ఏమో… ” ఆయన గొంతు గద్గద మయ్యింది.

ఆయన ఆశైతే బాగానే ఉంది గాని, కుదరొద్దూ!

తాతయ్య ఆరాటం చూస్తూoటే జీవన్ కి వల్లమాలిన జాలి పుట్టుకొచ్చింది. వెంటనే, “నేనున్నాను తాతయ్యా! నేను నిన్ను చూసుకుంటా. దిగులు పడకు. ఆసుపత్రులు రోగులకోసం. తగ్గాక కూడా అక్కడే ఉండిపోతామంటే ఎలాగ!" అన్నాడు. "ముందు ఈ విషయం అమ్మతో మాట్లాడాలి …”  అని తనలో అనుకున్నాడు జీవన్.

ఇంటికి వెడుతూ జీవన్ డాక్టర్ ని కలుసుకున్నాడు. ఆయన - పెద్దాయనకి తగిలిన దెబ్బలేవీ ప్రమాదకరమైనవి కావనీ, విపరీతమైన నీరసం వల్లనే ఆయన కి స్పృహ తప్పిందనీ చెప్పి, ఇక ఆయనకు ఏ భయమూ లేదనీ; నీరసం, కొద్దిపాటి BP తప్ప మరే వ్యాధీ లేదు కనుక, బలానికి మందులు రాసిస్తాననీ, మంచి భోజనం, ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఆయన ఇంకా చాలా కాలం బ్రతుకుతారనీ చెప్పాడు. తలమీది దెబ్బకు డ్రెస్సింగ్ కోసం ఇంటినుండి వచ్చిపోతూ ఉండొచ్చనీ, ఇచ్చిన డేటు ప్రకారం వచ్చి చేతికి వేసిన ప్లాష్టర్ తీయించుకోవలసి ఉంటుందనీ చెప్పాడు.

ఇదే సమయమని, “డాక్టర్! మా తాతయ్య ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటానంటున్నాడు” అన్నాడు జీవన్.

ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్ జీవన్ వైపు. “కుదరదు. మామూలు రోజుల్లో ఐతే ఏమోగాని, ఇప్పుడు రోగాల సీజన్. అడిగారనిచెప్పి ఆయనకి ఒక బెడ్ కేటాయిస్తే, ఒక రోగికి అన్యాయం చేసినట్లవుతుంది, బెడ్ ఖాళీ లేదని చెప్పి పంపెయ్యవలసి వస్తుంది.”

“సారీ డాక్టర్ !”  సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు జీవన్.

*      *     *

ఆ మరునాడు తొమ్మిదయ్యేసరికల్లా హాస్పిటల్కి వచ్చేశాడు జీవన్. అతడు వచ్చేసరికి తాతయ్య మంచంమీద కూర్చుని ఉన్నాడు. కోపంతో జేగురించిన మొహంతో ఆయన జీవన్ వైపు చూశాడు.

“నా కర్మానికి నువ్వేం చేస్తావులే! ముక్కూ మొహం తెలియని ముసలాడికి ఇంతవరకూ నువ్వు చేసిందే చాలా ఎక్కువ! ఏ జన్మ రుణమో ఉండి ఉంటుంది. సర్లే! మరి నాల్గు రోజులు ఆసుపత్రిలో ఉండి సుఖపడొచ్చు - అనుకున్నా. అయినా రెండు రోజులు సుఖపడితే సరిపోతుందా ఏమిటి! నిత్యం ఉండేవేకదా ఈ పొట్టతిప్పలు!”

తాతయ్య మాటల్లో ధ్వనించిన నిష్టూరానికి జీవన్ నవ్వుకున్నాడు. “తాతయ్యా! మిమ్మల్ని ఇలా అసహాయస్థితిలో వదిలేసి నేను వెళ్ళిపోతాననుకుంటున్నారా ఏమిటి? మీకన్నీ సౌకర్యంగా ఉండేలా చూశాకే నేను వెడతాను మిమ్మల్ని వదలి. మీరేమీ కంగారు పడకండి, అన్నీ నేను చూసుకుంటా. ముందు మనం బిల్లుల విషయం చూడాలి” అన్నాడు. ముసలాయనకి జీవన్ మాటలమీద నమ్మకం కుదిరింది కాబోలు, ఆయన శాంతించాడు.

“నా జేబులో చెక్కు బుక్కు ఉండాలి, నా కోసం ఎంత ఖర్చుపెట్టావో చెప్పు, చెక్కురాసి ఇస్తా” అంటూ ఆయన జేబుకోసం వెతకసాగారు. వెంటనే జీవన్ ఒక సంచి ఆయనకి అందించి, “ఇవి మీవి. యాక్సిడెంట్ ఐనప్పుడు మీ ఒంటినున్నవి! వైద్యం మొదలెట్టే ముందు వీటిని తీసి నా చేతికి ఇచ్చారు ఆసుపత్రి వాళ్ళు. ఈవేళ డిశ్చార్జి చేస్తారని తెలుసు కనుక అన్నీ తీసుకువచ్చా. మీ బట్టలు కూడా ఉతికించా. ముందు బట్టలు మార్చుకోండి, ఆ తరవాత చెక్కు మీద సంతకం చెయ్యవచ్చు, తొందరేం లేదు” అన్నాడు.

ఆరోజు ఫార్మాలిటీలన్నీ పూర్తిచేసి, బిల్లులు చెల్లించే సరికి పదకొండు దాటింది. పెద్దాయనకు హాస్పిటల్ కేంటీన్ లోనే భోజనం పెట్టించి, టాక్సీ పై ఆయనను ఇంటికి తీసుకొచ్చాడు జీవన్. ఆయనను విశ్రాంతిగా మంచంపై పడుకోబెట్టి, నిద్రపొమ్మని చెప్పి ఇంటికి వెళ్ళాడు.

*       *       *

స్నానంచేసి వచ్చిన కొడుక్కి అన్నం వడ్డిస్తూ కుశలప్రశ్నలు అడిగింది మీనాక్షి. పెద్దాయన్ని క్షేమంగా ఇంటికి చేర్చిన సంగతి చెప్పాడు జీవన్. తాను ఖర్చుపెట్టిన దానికి ఆ పెద్దాయన చెక్కురాసి ఇచ్చిన సంగతి కూడా చెప్పాడు. అంతేకాదు, జీవన్ ముసలాయనకు ముప్పొద్దులా వండిపెట్టే పనిని తల్లికి అప్పగించాడు.

“ఊరివాళ్ళ సొమ్ము ఒక ముక్కూ మొహం తెలియని మనిషికోసం ఖర్చుచేశావని, వెనక చేసిన అప్పులే తీరలేదు కదా, మళ్ళీ ఈ అప్పు తీరడం ఎలాగరా బాబూ - అన్న భయంతో నిన్ను కోప్పడ్డాను, అంతేకాని నువ్వు చేసినది మంచిపని కాదని కాదు. ఇది మనకు ఇంత ఉపకారం చేస్తుందని అప్పుడు నేను అనుకోలేకపోయారా” అంది మీనాక్షి కొడుకుతో అపాలజటిక్ గా.

“అమ్మా! అంతా సవ్యంగానే జరిగింది కదా! ఇక ఆ విషయం మర్చిపో. నేను ఆసుపత్రిలో కట్టిన డబ్బుకి చెక్కు రాసిచ్చారు తాతయ్య. అణా పైసలతో బాకీ చెల్లైపోయింది. రేపే చెక్కుమార్చి ముందుగా సుజాతక్క బాకీ తీర్చేస్తా. కాసేపు నడుమువాల్చి విశ్రాంతి తీసుకో, మనం తాతయ్యగారి ఇంటికి వెడదాం”. ఈ రోజే నువ్వు పనిలో చేరిపోదువుగాని" అన్నాడు జీవన్.

నాలుగవ్వగానే తల్లీ కొడుకులిద్దరూ బయలుదేరారు జగన్నాధంగారి ఇంటికి. తాళం తీసిన చప్పుడుకి కళ్ళు తెరిచాడు ఆ పెద్దాయన. ఒళ్లంతా కట్లతో, విరిగిన చేతికి ప్లాష్టర్ తో బలహీనంగా, మంచం మధ్యలో ముడుచుకు పడుకుని ఉన్న ఆయన, ఉండేలు దెబ్బతిన్న పావురంలా, దయనీయంగా కనిపించాడు మీనాక్షికి.

వాళ్ళను చూసి ఆయన లేవడానికి ప్రయత్నిస్తూంటే చూసిన జీవన్ గమ్మున చెయ్యాసరా ఇచ్చి లేవదీసి మంచం మీద కూర్చోబెట్టాడు. ఆపై మీనాక్షిని తన తల్లిగా ఆయనకు పరిచయం చేశాడు. తమని గురించి టూకీగా చెప్పి, యాజులుగారి కుటుంబం తిరిగి వచ్చేవరకు తన తల్లి ఖాళీగానే ఉంటుంది కనక, అంతవరకూ ఆమె ఆయన యోగక్షేమాలు చూసుకుంటుందనీ, ఈ లోగా ఒక మంచి మనిషిని ఆయనకు సేవ చెయ్యడానికి కుదురుస్తాననీ చెప్పాడు జీవన్. పెద్దాయన సమ్మతితో, ముందుచూపుతో జీవన్ కొని వెంట తెచ్చిన నిత్యావసర వస్తువులున్న బేగ్ తీసుకుని కాఫీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్ళింది మీనాక్షి.

మీనాక్షి ఇచ్చిన కాఫీ తాగుతూ జగన్నాధంగారు అన్నారు, “ఇలాంటి కాఫీ తాగి ఏనాడయ్యిందో! అమ్మా, మీనాక్షీ! ఇకనుండీ ఇది నీ ఇల్లే అనుకో! నువ్వూ, బాబూ ఇక్కడికే వచ్చెయ్యండి. ఒంటరితనంతో విసికిపోయా, ఈ ముసలి బాబాయ్ మీద దయ చూపించు తల్లీ!”

తల్లీ కొడుకులు మొహమొహాలు చూసుకున్నారు. జీవన్ ముఖ కవళికలనుబట్టి, అతనికి కూడా ఆ ఏర్పాటు ఇష్టం లేదని గ్రహించింది మీనాక్షి. కష్టజీవులై, స్వయం కృషితో బ్రతికేవారికున్న స్వేచ్ఛ స్వతంత్రo ఇతరులని ఆశ్రయించి బ్రతికే వారికి ఉoడవు - అన్నది వాళ్ళకి తెలుసు. ఎంతలో ఉండవలసినవారు అంతలో ఉండడమే గౌరవం! ముసలాయన మాటల్లోని దైన్యం మీనాక్షిని కొంచెం ఇబ్బందిపెట్టినా, మొత్తమ్మీద తన మనసులోని మాట చెప్పేసింది.

“బాబాయిగారూ! మన్నించాలి. ఈ ఊరు వచ్చింది లగాయతూ మేము ఆ ఇంట్లోనే ఉంటున్నాము. అది మాకు అచ్చొచ్చిన ఇల్లు. అద్దెకూడా చాలా తక్కువ. స్వంత ఇల్లులా అలవాటైపోయింది, దానిని వదులుకుని రాలేము. అయినా వీడు ఉండడానికి ఒక ఇల్లు కావాలికదా" అంది.

జగన్నాధంగారు మరేమీ మాటాడలేకపోయారు. కాసేపు ఊరుకుని మళ్ళీ అన్నారు, “నా కోసం నువ్వు ఇంత ఆలోచించావు, నన్ను నీ తాతయ్యగా భావించి సేవలు చేశావు, నీ కోసం నేనేమీ ఆలోచించ కూడదా? మీ అమ్మ వంటచేసి నాకు పెట్టి తనూ తింటుంది. ఇక మిగిలింది నువ్వు ఒక్కడివి! నువ్వేమో నాతో సహపంక్తిని కూచుని తినడం కంటే “చెయ్యికాల్చుకోడమే” మేలనుకుంటున్నావా ఏమిటి? అది సబబే నంటావా?”

“నాకోసం ఆలోచనెందుకు తాతయ్యా? నేను ప్రాజ్ఞుడిని, చెయ్యి కాల్చుకోకుండా వండడం నాకు చేతనవును” అన్నాడు జీవన్, పెద్దాయన్ని ఎలాగైనా ఒప్పించాలని చూశాడు.

పెద్దాయన జీవన్ వైపు ఒక్కక్షణం కన్నార్పకుండా చూసి, “బాబూ! నువ్వు నామాట కాదనవని ఆశపడ్డా. ఇంతవరకూ నేను అడక్కుండానే నువ్వు నాకు ఎంతో మేలు చేశావు. అలాగని ఇంకా ఇంకా అడగడం తప్పేనేమో! ఐనవాళ్ళతో కలిసి డైనింగ్ టేబులు దగ్గర కూర్చుని, కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యాలని ఎంతో కోరికగా ఉంటుంది నాకు. కాని, ఎట్టి పరిస్థితిలోనూ అది కుదరదు కదా! మీ అమ్మ నాకోసం వండిన ప్రతివస్తువు నాతోపాటుగా నువ్వూ తిన్న నాడే నాకు పూర్తి సంతోషం కలుగుతుంది, కాని నీకేమో అది నచ్చదు” అని చెప్పేసి, మరి మాటాడకుండా, ముసలాయన మూతి ముడుచుకుని కూర్చుండిపోయారు. మందిచ్చే వేళ కావడంతో జీవన్ ఆయనకు టాబ్లెట్ ఇస్తే ఆయన దానిని తీసుకోలేదు.

“జీవన్ బాబూ! ఒంటరి తనంతో విసికిపోయాను నేను. నువ్వు నాకు అనుకోకుండా పరిచయమై ఎంతో సాయం చేశావు. ఈ ఒక్క సాయం కూడా చేస్తివా నేను ఆనందంగా ఉంటాను. ఐనవాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని పిచ్చా- పాటీ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యాలని ఉంటుంది నాకు.  నీకు భోజనం పెడితే నా భాగ్యమేమీ తరిగిపోదు. నాకు బోలెడు డబ్బుంది, కాని ఏo లాభం! సుఖసంతోషాలు మాత్రం శూన్యం!” అలా అంటూంటే ఆయన కంఠం ఒణికింది, ముఖం ఎర్రగా కందిపోయింది.

పెద్దాయనకి BP ప్రకోపించిందేమోనని భయపడిన మీనాక్షి కొడుకువైపు భయం భయంగా చూసింది. చివరకు ఆయన అలకకి జీవన్ లొంగక తప్పలేదు.

వెంటనే “ఓ.కే. తాతయ్యా! అంతా మీ ఇష్టం” అనేశాడు జీవన్. అప్పటికప్పుడు ఒక ప్లాను తయారయ్యింది ...

మీనాక్షి ఇల్లు ఖాళీ చెయ్యకుండా అందులోనే ఉంటూ, ఉదయం ఏడయ్యే సరికల్లా జగన్నాధం గారి ఇంటికివచ్చి ఆయనకు టిఫిన్, కాఫీ చేసి ఇచ్చి, కొడుక్కి కూడా పెట్టి, తను తిని, ఆపై ముగ్గురికీ వంట చేసేటట్లూ; టిఫిన్లు అయ్యాక జీవన్ తన పనిమీద వెళ్ళినా, పన్నెండయ్యే సరికల్లా తిరిగివచ్చి తాతయ్యకు డైనింగ్ టేబుల్ దగ్గర కంపెనీ ఇచ్చేటట్లూ, భోజనం అయ్యాక అతడు తిరిగి తన పనిమీద వెళ్ళిపోయినా, మీనాక్షి పెద్దాయనను కనిపెట్టుకుని ఉండేటట్లూ, మధ్యాహ్నం కొంతసేపు విశ్రాంతి తీసుకుని, ఆపై నాలుగయ్యీసరికి పెద్దాయనకు చిరుతిండీ, కాఫీ ఇచ్చాక రాత్రికి వంట చేసి, కేసరోల్సులో సద్ది టేబుల్ మీద పెట్టి, తన రాత్రిభోజనం వెంట తీసుకుని, జీవన్ రాగానే ఆమె ఇంటికి వెళ్ళిపోతే;  జీవన్ అక్కడే ఉండి, పెద్దాయనకు భోజనం వడ్డించి, తను తిని, రాత్రికి ఆయనకి తోడుగా అక్కడే పడుకుని, ఆ మరుసటి రోజు ఉదయమే ఆయనకు సాయపడి, కాఫీ కలిపి ఇచ్చి, స్నానంచేయించి, మంచిబట్టలు కట్టించి, తల్లి వచ్చాక ఆయనతోపాటుగా తనూ కాఫీ టిఫిన్లు తీసుకుని మరీ తన పనిమీద వెళ్ళేలా ప్లాను ఖాయమయ్యింది. ముగ్గురూ సంప్రదించుకుని చేసుకున్న నిర్ణయమది. అది ముగ్గురికీ మేలైన దినచర్య ఔతుoదని ఏకగ్రీవంగా ముగ్గురూ ఒప్పుకున్నారు. ఈ టైమ్ టేబుల్ ని “శుభస్య శీఘ్రం” అని, అప్పటికప్పుడే అమలులో పెట్టేశారు.

*     *     *

గోరువెచ్చటి నీటితో తలారా స్నానం చేయించి, శుభ్రంగా తలా, ఒళ్ళూతుడిచి, పౌడరద్ది, అగరుతో నుదుట చుక్కబొట్టు, బుగ్గను దిష్టిచుక్క పెట్టి, కూతుర్ని ఉయ్యాలాతొట్టెలో పడుకోబెట్టింది సుజాత. వెంటనే నిద్రపోయింది ఆ పాప. కొoచెం సేపలా ముగ్దమోహనంగా నిదరపోతున్న కూతుర్నే చూసుకుంటూ తొట్టి దగ్గరే నిలబడిపోయింది ఆమె.  అంతలో “సుజాతక్కా” అన్న పిలుపు వినిపిoచడంతో వెనక్కి తిరిగి చూసిన సుజాతకి గుమ్మంలో జీవన్ కనిపించాడు. వెంటనే అతనిని లోనికి ఆహ్వానించింది సుజాత.

“రా, రా! ఊరకనే రారు మహాత్ములు - అన్నది నానుడి! నీ రాకకు కారణం బెయ్యది సోదరా” అంటూ దగ్గరగావచ్చి పలకరించింది సుజాత.

బ్యాంకులో చెక్కుమార్చి తెచ్చిన డబ్బు తీసి సుజాత చేతికి అందించాడు జీవన్. “అక్కా! కృతజ్ఞుణ్ణి. సమయానికి నువ్వు డబ్బిచ్చి నన్ను ఆదుకున్నావు. లేకపోతే నేను అప్రదిష్ట పాలై ఉండేవాడిని. సమయానికి సాయపడి నన్ను నువ్వు రక్షిoచావు” అన్నాడు.

“పోరా బడుద్ధాయ్! నువ్వు నన్నేం పొగడ్తలతో ముంచెత్తనక్కర లేదు. ఏమాత్రం తెలియని వ్యక్తికి నువ్వు చేసిన సాయంకంటే ఎక్కువా ఏమిటి, నేను నా తమ్ముడికి చేసిన సాయం? ఆ డబ్బు తిరిగి వస్తుందో, లేదో తెలియకపోయినా రిస్కు తీసుకుని, హెల్పులైన్ తాలూకు డబ్బు ఆ పెద్దాయనకోసం నువ్వు ఖర్చు పెట్టేశావు. అసలు విషయం చెప్పు, ఇంత తొందరగా తెచ్చేశావంటే ఈ డబ్బు నీకు ఎక్కడిది? నాకేం తొందరలేదు. నువ్వేం ఇబ్బంది పడకు. కొన్నాళ్ళు పోయాక ఇవ్వవచ్చులే” అంటూ ఆ డబ్బు జీవన్కి తిరిగి ఇచ్చేయబోయిoది సుజాత.

ఆ డబ్బుని అందుకోలేదు జీవన్. నెమ్మదిగా ఉయ్యాలా దగ్గరకి వెళ్ళాడు. “పెద్దాయనకి డబ్బుకి లోటులేదు అక్కా! ఇంటికి రాగానే నేను హాస్పటల్లో కట్టిన డబ్బు, నయాపైసలతోసహా నాకు ఇచ్చేశారు. అంతేకాదు అమ్మకి కూడా పనిదొరికిoది. ఇప్పుడు అమ్మా నేనూ చూస్తున్నాము ఆయన సంరక్షణ. ఆయన తహసీల్దారుగా పనిచేసి రిటైర్ అయ్యారుట! ప్రతినెలా పెద్ద మొత్తంలో పెన్షన్ డబ్బు వస్తుందిట! ఐతేనేం, పాపం! తాతయ్యను చూస్తే జాలేస్తోoది. కొడుకూ కోడలూ ఉద్యోగస్తులుట! ముసలాయన్ని గాలికి వదిలేశారు. ఎంత డబ్బుoడీ ఏమి లాభం చెప్పు, ఈ వయసులో ఆదరంగా చూసుకునే వాళ్ళు లేకపోయాక! ఒంటరితనంతో విసిగిపోయారుట పాపం, ఆయన. సరే, ఇక పాయింటుకి వద్దాం. ఇల్లు చేరగానే తనకైన మొత్తం ఖర్చు కంతటికీ చెక్కురాసి ఇచ్చారు. దానిని మార్చి, నీ బాకీ తీర్చడంకోసం బ్యాంకు నుండి నేరుగా ఇటు వచ్చా. అట్టేపెట్టుకో అక్కా! నాకేమీ ఇబ్బంది లేదు.”

“సరే” నంటూ వెంటనే సుజాత వెళ్ళి డబ్బు బీరువాలో దాచి వచ్చింది.

“అక్కా! నీకు ఎవరైనా మంచిగా వంట చేసిపెట్టే వాళ్ళు తెలిస్తే చెప్పు. ప్రస్తుతానికి ఖాళీగా ఉంది కనక అమ్మ జగన్నాధం తాతయ్యకు వండిపెడుతోంది. రేపు యాజులు తాతయ్యగారు వచ్చాక అది కుదరదు కదా! ఈ లోగా ఎవరైనా కాస్త కమ్మగా వండిపెట్టేవాళ్ళు దొరికితే బాగుండును” అన్నాడు జీవన్.

“భేష్! హెల్పులైన్ జిందాబాద్! “అంటూ జీవన్ వీపు తట్టింది సుజాత. “పెద్దాయనకి నువ్వు చేస్తున్న ఈ సహాయం మీ హెల్పులైన్ తాలూకు మణికిరీటానికి ఉన్న కలికితురాయి లాంటిది! ఇదే నా ఆశీర్వాదం – విజయోస్తు సోదరా! ఆ పెద్దాయన సేవలో నీకు పుణ్యం, పురుషార్ధం కూడా ముట్టాలని నాకోరిక, ముడుతుoదని నా ఆశీర్వాదము.” నవ్వుతూ కొంటెగా ఆశీర్వచనం ముద్రపట్టింది సుజాత.

“ఏమిటక్కా! నాకు తోకలు కడుతున్నావా? ఉండు, నీ పని చెప్తా - నీ బంగారుతల్లి బూరిబుగ్గలు పట్టుకు పిండేస్తా! జాగ్రత్త, ఏమిటనుకుంటున్నావో” అన్నాడు నవ్వుతూ జీవన్.

సుజాత కొంటెగా భయం నటించింది. “అమ్మో! శరణు, శరణు! నన్నేమైనా అను గాని, నా పాప జోలికి మాత్రం పోబోకు” అంది.

అంతలో పాప లేచింది. జీవన్ పాప నెత్తుకుని నవ్వుతూ, “అద్గదీమాట! అలా దారికిరావాలి నువ్వు. ఈ జీవన్ అంటే ఎవరనుకుoటున్నావు? ఎవరి నెలా దారికి తేవాలో నాకు తెలుసులే” అన్నాడు ప్రగల్భంగా. పాప చిరుబుగ్గ మీద అంటీ అంటకుండా చిన్న ముద్దుపెట్టి తల్లికి అందించాడు.

సుజాత నవ్విoది. “అయ్యో! నీ సంగతి నాకు తెలియకపోతే కదా! నువ్వు పాప బుగ్గలు గిల్లుతానన్నావుగా! ఏదీ గిల్లు, నీ బంగారు మేనకోడల్ని నువ్వు ఎలా గిల్లగలవో దగ్గరుండి మరీ చూస్తా! నీ విషయంలో నా కలాంటి భయమేమీ లేదు, ఊరికే నిన్ను ఆటపట్టించడానికి భయం నటించా. నీ మీద నాకు పూర్తి నమ్మకముంది, గుర్తుపెట్టుకో తమ్ముడూ!”

జీవన కూడా నవ్వుతూ, “ఓహో! అలాగా! ఐతే సరే! ఇక నేను వెడతా, అమ్మ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఉంటా సుజాతక్కా! నువ్వు ఒకటిమాత్రం గుర్తుంచుకో, నేను ఇంక ఎప్పుడూ నిన్ను చూడాలని ఇక్కడకి రాను. నీ జట్టు పచ్చి! నేను మళ్ళీ వచ్చేది, నాకు నా మేనకోడల్ని చూడాలనిపించి నప్పుడే” అంటూ నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.

****సశేషం****

Posted in October 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!