(భారతీయ ప్రసిద్ధ తత్వశాస్త్రం, భగవద్గీత గురించి మనలో ఎంతమందికి ఎంత తెలుసు?)
ఒక భారతీయునిగా ప్రపంచంలోనే ఒక అద్భుత గ్రంథంగా కొనియాడబడిన మన భగవద్గీత గురించి మనకు ఎంత మాత్రం తెలుసో ఒకసారి పరిశీలన చేద్దాం.
భారతీయ సంస్కృతిలో హిందూ వాంగ్మయంలో, ఇహ పరలోకాలు, భక్తి రక్తి, ముక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ ఆధ్యాత్మిక తత్త్వాన్ని పరిపూర్ణంగా, ఏ మత కుల ప్రసక్తి లేకుండా, సకల ప్రపంచ జనావళికి వర్తించేటట్లు, ఒక గురువు ఒక శిష్యునకు జీవితగమనం గురించి వివరించినట్లు, దేవుడు ఒక భక్తునికి జీవిత రహస్యాలను వివరించినట్లు, చెప్పబడిన భగవంతుని మాట (వేల్పు మాట) ఈ భగవద్గీత.
ప్రపంచ తాత్విక వాంగ్మయ చరిత్రలోనే భగద్గీతను పోలిన విశిష్టమైన గ్రంథం మరొకటి లేదు. దానికి అదే సాటి, అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది ఎందరికో నిత్య పారాయణ గ్రంథం. మార్గ నిర్దేశకం, సంశయ విచ్చేదకం, దుఃఖ నివారకం గ్రంథం అని చెప్పవచ్చు.
భగవద్గీతను కూడా ఒక ఉపనిషత్తుగానే పరిగణించవచ్చు. అన్ని ఉపనిషత్తుల సారం, సాంఖ్యయోగ వేదాంత దర్శనాల సారం, ధార్మిక, నైతిక, ఆధ్యాత్మిక చింతన, భక్తి మార్గము అన్నింటిని దర్శింప చేయగలిగిన గొప్ప గ్రంథం గీత.
ఉదాహరణకు గీత గురించి ఒక ప్రసిద్ధ శ్లోకానికి అర్థము ఒకసారి చూడండి.
సర్వోపనిషదోగావో
దోగ్ధా గోపాల నందనః
పార్థోవత్సః సుధీర్భోక్తా
దుగ్ధం గీతామృతం మహాత్ !!
**సర్వోపనిషత్తులు గోవులు, వాటి పాలు పితికేవాడు కృష్ణుడు, దూడ అర్జునుడు, పాలు త్రాగే వారు ధీమంతులైనవారు, పాలు మహత్తరమైన గీతామృతం**
భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలో ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయాలు అంటారు.
భగవద్గీత కేవలం హిందువులకే పరిమితం కాదు. ఆధ్యాత్మిక భావనల గల ప్రపంచ జనులందరికీ విశిష్టమైన గ్రంథము. గీత యందు వేద వేదాంత యోగ విశేషాలు, ముఖ్యంగా తర్కశాస్త్రం వేదాధ్యయనం, రాజనీతి, దండనీతి ఇమిడి ఉన్నాయి. గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, ఆ గమ్యసాధనా యోగములు వివరించబడినవి.
ఈ భగవద్గీత క్రీస్తుపూర్వం దాదాపు 2000 సంవత్సరాల క్రితమే వ్రాయబడినదని చెబుతుంటారు. ఈ గ్రంథం దాదాపు 75 ఇతర భాషలో అనువదించబడినది.
ప్రపంచంలో ఈ గ్రంథానికి ఉన్న అనువాదాలు, టీకా తాత్పర్యాలు, విమర్శలు, భాష్యాలు, వ్యాఖ్యానాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇలా మరే ఇతర గ్రంథానికి లేవు.
గీత ఒక అద్దం వంటిది. అద్దంలో నిన్ను నీవు చూసుకుంటే ఎలా కనిపిస్తావో, అలా ఈ గీతలో నీ జీవిత ప్రతిబింబం కనిపిస్తుంది. అంటే నీవు దుఃఖిస్తూ ఉంటే అద్దంలో నీ మోము దుఃఖంగానే ఉంటుంది. నవ్వుతూ ఉంటే నవ్వుదనంతో ఉంటుంది. నిశ్చలంగా ఉంటే నిచ్చలంగా, సంతోషంగా ఉంటే సంతోషంగా, నీవు ఎలా ఉంటే అలాగే అద్దంలో కనిపిస్తావు. అదేవిధంగా నీవు గీతను ఏ దృష్టితో చదివితే ఆ దృష్టితో నీకు సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనిషిగా నీవు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, నీవు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, నీ కర్మ అంటే ఏమిటి? నీవు పొందే ఫలితం ఏమిటి? తెలియజేస్తుంది. సృష్టిలో ఉన్న అన్ని విషయాలు ఈ గీతలో నిగూఢమై ఉన్నాయి. వాటిని వెతికి వెలికి తీసుకోవడమే మనుషులుగా మన పని. అంటే ఒక బంగారు గని కనుగొన్నప్పుడు, నీవు ఎంత తవ్వుకుoటావో, అంత బంగారం నీవు పొందుతావు. అలాగే గీత, ఒక ఆత్మ తత్వాన్ని, ఆనందామృత సాగరాన్ని, నీవు ఎంతగా ఆస్వాదిస్తావో, అంత ఆస్వాదించవచ్చు. అంటే గీతను నీవు ఏ దృక్పథంతో చూస్తావో, చదువుతావో, నీ భావనపై నీ ఫలితం ఆధారపడి ఉంటుంది. దేశభక్తుడు ఆయన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆయనకు గీతలో కర్మయోగం కనబడగా, మహాత్మా గాంధీకి అహింస ప్రబోధం. అరవిందుడికి భక్తి మార్గం. వివేకానందునికి వేద మార్గం కనిపించాయి. అయితే దీనికి నీకు దృఢ సంకల్పం, శ్రద్ధ, ఓర్పు కావాలి.
భగవద్గీత మహాభారతంలో భీష్మ పర్వంలో 25 వ అధ్యాయం మొదలు 42 అధ్యాయాల వరకు ఉన్నది. ఇది మొత్తము 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో(చందోబద్ధంగా) చెప్పబడినది. అయితే భగవద్గీతకు మరో 55 శ్లోకాలు కూడా ఉన్నాయని కొందరు పరిశోధకులు తెలియజేశారు. అన్ని మత గ్రంథాలలో ఉన్న ఉపదేశాలన్నీ, విషయాలన్నీ ఈ గీతలో ఉన్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ భగవద్గీత వలన అనేకమంది విదేశీ ప్రముఖులు, శాస్త్రజ్ఞులు, మహామహులు, దేశనాయకులు, ప్రముఖులు, శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు, సాహిత్య వేత్తలు ప్రభావితమైనారు. మన గాంధీ తన ఆత్మ కథలో తనకు ఏ సమస్య వచ్చినా తక్షణం తాను భగవద్గీత చదివేవాడినని, దాని ద్వారా వారి సమస్యకు, పరిష్కారం కనపడేదని చెప్పేవారు. అలాగే వివేకానంద, భగవద్గీత ఒక అంతులేని రహస్య సంపదని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేది అని తెలియజేశారు.
భగవద్గీత వివరణ
భగవద్గీతలో ఉన్న మొత్తం 18 అధ్యాయాలను మూడు భాగాలుగా విభజించవచ్చు.
1. మొదటి ఆరు అధ్యాయాలు.... *కర్మ* గురించి (ఆత్మ, జీవుని గురించి వివరణ)
2. తరువాత ఆరు అధ్యాయాలు... **భక్తి** గురించి (ఉపాస్యుడైన పరమాత్మ గురించి)
3. చివరి ఆరు అధ్యాయాలు.... *జ్ఞానo* గురించి (ఐక్యజ్ఞాన మోక్షం గురించి)
కనుక భగవద్గీత ఒక ఆధ్యాత్మిక త్రివేణి సంగమం.
ఇందులో జ్ఞానయోగం, కర్మయోగం మరియు భక్తియోగం మూడు ప్రతిపాదితాలై ఉంటాయి.
యోగం అంటే ఉపాయం, దైవాన్ని చేరుకునే మార్గము, పద్ధతి అని చెప్పవచ్చు.
కర్మ అనేది.... చెట్లకు పూచే పువ్వు వంటిది
భక్తి అనేది.... పువ్వు నుండి పుట్టే కాయ
జ్ఞానం అనేది.....పండిన పండు.
భగవద్గీత దేనికి సూచిక
భగవద్గీతలోని గీతోపదేశ సన్నివేశాన్ని మన సాధారణ జీవితానికి ప్రతీకగా తీసుకోవచ్చు. మానవుడి మనసు కురుక్షేత్రం. అర్జునుడు నరుడు. అంటే ప్రతి నరుడుకి అతని కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ, బాధ్యతను ఉపదేశించే నారాయణుడే ప్రతి నరునిలో అంతర్గతంగా ఉండే అంతరాత్మ. అర్జునుడికి కలిగిన అనుమానాన్ని నివృత్తి చేయడానికి, జీవాత్మకు పరమాత్మ తెలియజేసే కర్తవ్యం బోధన. అంటే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు? ఫలానా పని చేయవచ్చునా? చేయకూడదా? ఏది నైతికం! ఏది అనైతికం? ఏది కర్తవ్యం, ఏది అకర్తవ్యం అనే ధర్మసందేహాలు, ప్రతి మనిషికి అనేక సందర్భాలలో కలుగుతాయి. ఆ సందర్భాలలో, ఈనాటికి, ఏనాటికీ గీతలోని ఉపదేశాలు సూచికగా నిలబడతాయి. మార్గదర్శకం అవుతాయి. అయితే దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఈ ఉపదేశాన్ని అన్వయించుకోవాలి.
అంటే *ఆలోచన* కృష్ణుడు, *ఆచరణ* అర్జునుడు, అనగా ఆలోచనను ఆచరణలో పెట్టినప్పుడే, అది కార్యాచరణ జరిగి ఫలితం వస్తుంది. ఒట్టి ఆలోచన ఆచరించకుండా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అది నీ మనసులో ఒక భావనగానే మిగులుతుంది. ఆ ఆలోచన వలన ఎలాంటి ఫలితము ఉండదు. కనుక ఆలోచనను సరైన మార్గంలో ఆచరణలో పెట్టి, ఫలితాన్ని పొందడమే భగవద్గీత యొక్క సారాంశం.
మన దురదృష్టం కారణంగా, కొందరి అవివేకం కారణంగా, సరైన అవగాహన లేని కారణంగా, భగవద్గీతను చనిపోయినప్పుడు వినే చరమగీతoగా, శవం గీతంగా భావిస్తూ, మనిషి చనిపోయినప్పుడు, భగవద్గీత శ్లోకాలను వినిపిస్తున్నారు. నిజంగా ఇది చరమ గీతం కాదు, శరణ గీతం. ఇది శవం గీతం కాదు. ఇది శివం గీతo (మంగళకరమైన గీతo).
ఈ భగవద్గీత ముసలి తనములో, వయసు మళ్లిన తర్వాత చదవవలసిన రాత కాదు. ఇది భవిష్యత్తుని, వారి కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ చెప్పిన గీత, యువత తప్పక చదవాల్సిన గీత. గీత నిత్య సత్యాలను, ప్రపంచ జనావళిని ఉద్ధరించడానికి కావలసిన మనోధైర్యాన్ని, మానసిక వికాసాన్ని తెలియజేసే గ్రంథం. మనిషి మనిషిని ప్రేమిస్తే అది ప్రేమ, మనిషి భగవంతుని ప్రేమిస్తే అది భక్తి, రక్తి, ముక్తి. ఆ ప్రేమను, ఆ భక్తిని ఈ గీత వివరంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ‘దీనుణ్ణి, ధీరుడు’గా మార్చేది, ‘అజ్ఞానిని, జ్ఞానిగా’ మార్చేది, ‘భోగిని, యోగిగా’మార్చేది ప్రపంచంలో ఒకే ఒక రాత, దాత, భగవద్గీత మాత్రమే.
నిజంగా భగవద్గీత, ముఖ్యంగా ప్రతి హిందువు ఇంటిలో ఉండవలసిన పవిత్ర గ్రంథం. అలా ఎందుకు కాలేదో , మనం అందరం విచారించవలసినదే. ప్రతి ముస్లిం మతస్తులు తమ పిల్లలకు చిన్నప్పటినుండి ఖురాన్ నేర్పుతారు. ఆ గ్రంధాన్ని చదివిస్తారు. వారి మత విశ్వాసాలను నేర్పుతారు. రోజుకి ఎన్నిసార్లు దైవ ప్రార్థన (నమాజు) చేయాలని నేర్పుతారు. చూడండి వారికి వారి మతం పై ఉన్న ప్రేమాభిమానం. అలాగే ప్రతి క్రైస్తవులు తమ ఇంటిలో తప్పక వారి పవిత్ర గ్రంథం బైబిల్ ను పవిత్రంగా ఉంచుకుంటారు. ప్రతి ఆదివారం పిల్లలను, వారు చర్చికి తీసుకొని వెళ్తారు. బైబిల్లో వాక్యాలు నేర్పుతారు. చూడండి వారి పవిత్ర గ్రంథం పై ఉన్న వారి అభిమానం.
మరి మన హిందువులు ఏం చేస్తున్నారు!? తమ పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పుతున్నారా? మతాచారాలను, పవిత్ర గ్రంధాల గురించి, రామాయణం, భారతం, భాగవతం గురించి, కనీసం భగవద్గీతను గురించి అయినా చెబుతున్నారా. ఈ గ్రంథాలలో ఏ ఒక్క గ్రంథమైన హిందువుల ఇళ్లలో ఉంటుందా? ప్రతిరోజు లేదా వారానికి ఒకసారైనా తప్పనిసరిగా గుడికి వెళ్లాలని, పిల్లలను గుడికి తీసుకువెళ్లి, దైవ ప్రార్థన, భక్తి నేర్పుతున్నారా!? అందరం ఒకసారి ఆలోచించవలసిన విషయం. ప్రస్తుతం అనేక విదేశాలలో చాలామంది భగవద్గీతను నేర్చుకుంటున్నారు. కొన్ని విదేశీ విద్యాలయాలు భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా చేర్చుకున్నారు. కొన్ని దేశాలలో పార్లమెంటులో ప్రారంభ గీతంగా భగవద్గీతను పాడుతున్నారు. మరి భగవద్గీత పుట్టిన మనదేశంలో మనం ఏమి చేస్తున్నాము .ఇది మన మనస్సాక్షిని అందరూ ప్రశ్నించుకోవలసిన విషయం.
గీత ఉద్దేశం
కురుక్షేత్రంలో అటు కౌరవుల సైన్యం ,ఇటు పాండవుల సైన్యం యుద్దానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు, రెండు సైన్యాలను ఒకసారి పరిశీలనగా చూస్తాడు అర్జునుడు. అటు తనను పెంచిన తాత భీష్ముడు, తనకు విద్య నేర్పిన గురువు ద్రోణుడు, తన మేనమామలు, బావమరుదులు, పెదనాన్న కుమారులు, మిత్రులు, సహచరులు అందరినీ ఒకసారి చూస్తాడు .అప్పుడు అర్జునుడికి మనసులో ఒక విధమైన విషాదం చోటు చేసుకుంటుంది. తీవ్రంగా ఆలోచిస్తాడు. వీరందరినీ నేను ఎందుకు చంపాలి? చంపితే నాకు వచ్చేది ఏమిటి? కేవలం రాజ్యకాంక్షతో వీరందరినీ చంపి, నేను పావుకునేది ఏమిటి? అసలు వీరందరినీ చంపగలనా అనే భీతి, ఎందుకు చంపాలి అని ఒక విధమైన సంకోచిత భావం అతని హృదయములో ఏర్పడి, మనసు కల్లోలంగా ఉంటుంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఆవహించిన హృదయ దౌర్భాగ్యాన్ని పోగొట్టడానికి, యుద్దోన్ముఖుడిని చేయడానికి గీతోపదేశం చేస్తాడు. దీనుడైన అర్జునుడిని ధీరుడుగా, కార్యోన్ముఖునిగా తన బోధనలో తీర్చిదిద్దుతాడు. అదే భగవద్గీత ప్రయోజనం.
మనం భగవద్గీత ను ఎందుకు చదవాలి
కృష్ణం వందే జగద్గురుమ్
నీవు కష్టనష్టాలలో ఉన్నప్పుడు, సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు, ఆస్తికులైన, నాస్తికులైన, వారి భవభంధాలు, స్వర్గ నరకాలు, ధర్మాధర్మాలు తెలుసుకోవాలన్నా, చివరగా అసలు నీవెవరు? నీ జీవిత గమ్యం ఏమిటి? ప్రతిరోజు ఇదే చాకిరి, ఇదే తిండి, అదే నిద్ర, అలా లేవడం ఇవేనా! ఇంకేమైనా మానవ జన్మకు ఉన్నాయా? అవి తెలుసుకోవాలంటే, అసలు సృష్టి గురించి, నీ దృష్టి గురించి తెలుసుకోవాలంటే భగవద్గీతను చదువు. చదివితే కదా తెలిసేది దానిలో ఏముందో, తింటే కదా తిండి రుచి తెలిసేది, నే చెప్పేది నిజమా! అబద్దమా! ఒకసారి చదివి చూడండి. రోజూ, నీ తీరుబడిని బట్టి రెండు శ్లోకాలు, మూడు శ్లోకాలు, నాలుగు శ్లోకాలు అర్థాలతో సహా చదవండి. గీత మొత్తం పూర్తిగా చదివేసరికి మీ రాత మారుతుంది. అంటే రోజుకి కనీసం మీరు ఒక్క ఐదు నిమిషాలు జీవిత సత్యం తెలుసుకోవడానికి వెచ్చించలేరా!? ఆ ఐదు నిమిషాల్లో అయిదారు శ్లోకాలు (మంత్రాలను ) టీకాతాత్పరంతో తెలుసుకోవచ్చు. ప్రయత్నిస్తారు కదూ!?
గీత గురించి సూక్ష్మoలో స్థూలంగా చెప్పాలంటే
ఇది వ్యాసభగవానుని రాత
గీత శ్రీకృష్ణ భగవానుని దూత
ఇది వేదమంత్రాల మ్రోత
మన అహంకారాదులకు కోత
దివ్య బ్రహ్మ జ్ఞానానికి దాత
రాజస తామస గుణాలకు వాత
మన రాగద్వేషాలకు మూత
నీ మంచి భావాలకు గాత
నీ భవసాగరమునకు ఈత
భక్తి ముక్తి మార్గాలకు ఊత
ధార్మిక జీవితానికి చేయూత
ధర్మ జీవనానికి పాలపోత
గీతను ఆచరిస్తే నీవే విజేత
....... సర్వేజనా సుఖినోభవంతు
......... ఓం శాంతి శాంతి శాంతిః