కెనడా శిలా పర్వత శ్రేణిలో మనోల్లాసాన్ని కలిగించే హిమానీనదాలు(glaciers)
చలనం లేకుండా అడవిలో పడిఉన్న బండరాయి శిల్పి చేతులలో మలచబడి కళాకృతిగా రూపొంది, గుడిలో దేవుడై అందరిచేతా పూజింపబడుతోంది. అదే బండరాయి శిల్పిచే హస్త చాతుర్యం తో మలచబడక ఎటువంటి సంస్కారం లేకుండా అచేతనంగా కొండలమధ్య ఉన్నచోటే ఉంటూ చిత్ర విచిత్రాకృతులలో పచ్చని చెట్ల మధ్య అవని ఉపరితల ఆకారరేఖలో భాగమై నిలిచి అందాల దృశ్యమై చిత్రకారుల మనో వీధిలో అందాలు పులుముకుని వారి కుంచతో ‘ఈజీల్’ పై తీరిచి దిద్దబడి రంగుల బొమ్మై అందిరికి కనువిందు చేసే మనోహర తైల వర్ణ చిత్రముగా మారి 'ఆర్ట్ గాలరీస్' లో గోడలపైనో, గుడి లోకప్పు అంతర్భాగంలోనో అందాల చిత్రం గా మారి హర్షించ బడుతోంది. వాటిని చూసి ముగ్ధులమై మన మనో ఫలకాలపైనో, మన 'ఫోటో ఆల్బం' లలోనే, ఇంకా వీలయితే మన 'డ్రాయింగ్ రూమ్' గోడలపై 'సీనరీ' గానో భద్రపరచుకుని ప్రతిదినం దాన్నే చూస్తూ ఆనందిస్తాము. చలనం లేని బండ రాయి అయినా అది మానవ హృదయంలో భక్తిని గాని, ఆహ్లాదాన్ని కానీ కలిగిస్తూ బ్రతుకుని సార్థకం చేసుకుంటోంది.
దాని అసలైన అనుభవం హిమాలయా పర్వత ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు గాని, అమెరికా కెనడా దేశాలలో 'రాకీస్' నడుమ సంచరిస్తున్నప్పుడు గాని, అమెరికా లోని తూర్పు కొండలలోని 'బ్లూ రిడ్జ్ మౌంటైన్స్'లో సాయం సంధ్యా సమయంలో సంచరిస్తున్నప్పుడు గాని ఆవృత్తమౌతుంది. అటువంటి అనుభవావేశం కోసమే కెనడాలోని బ్రిటిష్ కొలంబియా, అల్బెర్టా రాష్ట్రాలకు వెళ్ళాలన్నమా ఆకాంక్షను గుర్తించి. మా అమ్మాయి ప్రణాళికని రూపొందించినప్పుడు ఆ కోరిక తీరుతోందనే ఆనందం ఉరకలు వేసింది.
మేమంతా దక్షిణ 'కాలిఫోర్నియా'లోని 'శాండీయాగో' నుంచి కెనడాలోని 'బ్రిటిష్ కొలంబియా' రాష్ట్రంలో గల 'వాంకోవర్' నగరానికి విమానంలో చేరాము. ఆకాశయానంలో దారి పొడుగునా క్రింద ఎన్నో సుందర దృశ్యాలు మమ్ములనాశ్చర్య పరచాయి. వాటిలో కొన్ని మేఘ శకలాలతో క్రింద నేలంతా దూదిపింజలు అద్దినట్లు చూడముచ్చటగా ఉండిన పల్లెసీమలు, ఆ తరువాత కొన్ని అక్కడడక్కడ మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు మాకు కనువిందు చేశాయి. వాటిని ఆకాశవీధిలో నుండి చూస్తుంటే మమ్ములను ముచ్చటగొలిపిన దృశ్యాలు కొన్ని మా కెమెరాలో చిక్కినవి పైన చూసి మీరూ ఆనందించవచ్చు.
'వాంకోవర్' సుందర నగరం- దానిలోని ఒక విలక్షణ దృశ్యం ప్రక్కన చూడవచ్చు.
సాధారణంగా కురిసిన మంచు గడ్డకట్టడం మనం చూస్తూనే ఉంటాం. అదే మంచు పైన వరుసగా అనేక పర్యాయాలు మంచు పడితే కొత్తగాపడ్డ మంచు బరువుకి (నీటి కంటే మంచు బరువు ఎక్కువని భౌతిక శాస్త్రం చెబుతోంది) క్రింద ఉన్న పూర్వపు హిమపొరలు అణచబడి ఆ క్రమంలో అందులోనున్నప్రాణవాయువు, బొగ్గుపులుసువాయువులని కోల్పోయి, కాలక్రమేణా లేతనీలిరంగు గల స్పటిక రూపందాల్చి మనకి కనిపిస్తున్న ఘనీభవించిన హిమానీనదాలుగా రూపు దిద్దుకుంటాయి. అవి చల్లని ప్రదేశాలలో కరగకుండా హిమానీనదాలుగా (గ్లేషియర్స్) గా నిలిచి అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తాయి. చల్లని ప్రదేశమైన కెనడా లో చాలాభాగం అటువంటి గ్లేషియర్స్ తో సుందర ప్రదేశంగా మారి వాటిమధ్య వంపులుతిరిగుతూ పోయే మార్గం "సీనిక్ బైవే" గా పేరొంది ఎందరో పర్యాటకులని ఆకర్షిస్తూంది. 'కెనడా హైవే1' అటువంటి ఒక సుందర దృశ్య మార్గమై ఎందరో పర్యాటకులని బహు పర్యాయాలు ఆకర్షిస్తూ వారి సౌందర్యపిపాసని తృప్తి పరుస్తూంది.
'కెనడా'లో పర్యటనలో సామాన్యమైన ఉత్సాహం గలవారు, వయసు మీరిన వాళ్ళు కూడా చూసి ఆనందించగల సాహస యాత్రలు కొలంబియా మంచు క్షేత్రంపై నడక, 'బ్యాంఫ్' వద్ద రాగి పర్వతశిఖరానికి 'గణ్డోలా' లో యానాం, ఆపై పలక దారి పై శిఖరారోహణం, 'మిన్నవాన్క' మంచినీటి ప్రశాంత సరస్సులో పడవ ప్రయాణం. 'స్కైవాక్' లో అద్దము పై నడుస్తూ క్రింద నున్న లోయలు చూస్తూ, క్రింద దూరం గా ఉన్న జలపాతాలని చూస్తూ ఆ 'థ్రిల్' అనుభవించడం, కొండచెరియలలో వయ్యారాలుపోతూ మన వాహనాల్ని నడిపించే రహదారులు, మొదలైనవి. కెనడాలోని కొన్ని సుప్రసిద్ధ హిమానీనదాలలో 'అతభాస్క' హిమానీనదం ఒకటి. ఇది 'జాస్పర్' వద్ద 'రాకీ మౌంటెన్' కొండచెరియల లో ఘనీభవించిన ఉన్న హిమానీనదం. ఇది సదా కదులుతూండే (ప్రతిదినం కొద్ది అంగుళాలు కదులుతూన్నదని శాస్త్రవేత్తలచే నిరూపించడమైనది) హిమానీనదం`గా పేరుగాంచినది. ఇది సుమారు ఎనిమిది వందల అడుగుల లోతైన నదమని హిమానీనద శాస్త్రవేత్తల అంచనా. దీనినే 'కొలంబియా ఐస్ ఫీల్డ్' అని కూడా పిలుస్తారు. ప్రస్తుత వాతావరణ మార్పు దృష్ట్యా ఇది బహుశా ముప్పై ఏళ్ళతరువాత అదృశ్యమవవచ్చునని ‘హిమానీనద’ శాస్త్రజ్ఞుల అంచనా. చూడదలచినవారు ఈలోగానే చూసి ఆనందించాలి.
'వాంకోవర్' నుంచి 'బ్యాంఫ్' జాతీయ ఉద్యానవనానికి వెళ్లే మార్గంలో ప్రకృతి మనకి అనేక సుందర దృశ్యాలని ఆవిష్కరిస్తూ దర్శనమిస్తుంది. ముందుగా వచ్చేది 'అబ్బోర్ట్సఫోర్డ్'. అక్కడనుంచి కనిపించే 'గ్లేషియర్' ని పై ఫోటో లో చూడవచ్చు. తరువాత వచ్చేది 'బ్రైడల్ వీల్ ఫాల్స్'. అంతగా ఎత్తుగాలేని ఆకొండ పైనుంచి మృదు రవళితో నీటితో నూతన వధువు ముఖానికి కప్పుకుంటున్న తెరవలె జాలువారే జల పాతము చాలా బాగుంటుంది. జలపాతందగ్గరికి చేరుకోవడానికి కొంచెం శ్రమపడాల్సివచ్చినా అక్కడ మన ముందు ఆవిష్కరింప బడ్డ దృశ్యం ఆ శ్రమని మాయంచేసి మసనస్సును ఉత్తేజపరుస్తుంది.
కెనడా లోని ప్రసిద్ధ శిలా పర్వత శ్రేణులు పచ్చని వన సంపదతో అలంకరించబడి, కొన్ని ఎత్తైన శిఖరాలపై అక్కడక్కడ మంచుతో కప్పబడి పర్వరాజు శిరో భూషణాల వలె చూపరులను మెప్పిస్తూ, ఆకాశాన చెదురుమదురుగా నిలిచిన మేఘశకలాలు ఆ శిరోజాలని హిమ పుష్పాలతో అలంకరించినట్లు తోపిస్తూ చూపరుల నాకట్టుకుంటూ ఆ కొండల మధ్య మలుపులు తిరుగుతూ సాగే రహదారి ప్రయాణం అనుభావ్యమై, ఉత్సాహాన్ని రెట్టింపుచేస్తుంది.
దారి పొడుగునా అనేక వందల వివిధ ఆకారాలతో విలసిల్లే పర్వతశిఖరాల చివరలన కిరీటాల వలె భాసిస్తూనో, మధ్యన యున్న బీటలలో పేరుకుపోయో, మారుమూలాల ఇరుక్కుని తొంగి చూస్తూనో కవ్వించే వివిధ మందాలలో గల హిమానినదాలు చూసి ఆనందించ వలసినదే కానీ వాటిని వర్ణించ నలవికాదు. ఈవర్ణన చదువరులకు సహజమైన దర్శనం కలిగించలేదు. కొన్నిటిని పేర్లు తెలియకపోయినా యిచ్చట చూపడం జరిగింది..
కొలంబియా మంచు క్షేత్రం పైకి యాత్రీకులను అన్వేషణకై కొనిపోవు వాహనాన్ని క్రింద చూపడం జరిగింది; అటువంటి ప్రత్యేక వాహనాలు ప్రపంచంలో తిరుగాడుతున్నవి మొత్తం 26; వాటిలో ఒకటి అంటార్కిటాలో ఉపయోగపడుతుండగా తక్కినవన్నీ ఈ కొలంబియా మంచుక్షేత్రంలో యాత్రీకుల దర్శనార్ధం వాడబడుచున్నాయి. ఈ శక్తి వంతమైన ప్రతి వాహనమూ 56 మంది యాత్రికులని మంచు క్షేత్రానికి అతి నిటారైన (ప్రతిఅడుగు మందుకు వెళ్ళడానికి 26 అడుగులు ఎక్కుతూ గాని / దిగుతూ గాని మంచు మయమైన కొండ దారిలో ప్రయాణిస్తుంది) దాని టైర్లు ప్రత్యేకంగా తయారుచెయ్యబడి కరుగుతున్న జారుడు మంచు పైనకూడా పట్టుని వీడకుండా ప్రయాణించగలుగుతుంది. మంచు కరిగి పిల్లకాలవలై పారుతూంటే ఆ నీటిని తాకుతూ ఆ హిమానినదంపై వాహ్యాళి ఎంతో ఉత్సాహానుభావాన్ని కలిగించింది.
అడవి జంతువులు రహదారికి ఇరు వైపులావున్న అడవులలో తిరుగుతూ ప్రధాన రహదారుల పైకి రాకుండా అనుస్యూత (రెగ్యులర్) ప్రదేశాలలో రహదారుల పై అతివేగంగా ప్రయాణిస్తున్న వాహనాలకు అడ్డం పడకుండా సురక్షితంగా దాటేందుకు వీలుగా ప్రక్కన చూపిన విధాన కొనసాగే అడవిని తలపించే వంతెన వంటి నిర్మాణాలు ఒక నూతన ప్రయోగం.
భారత దేశంలోని హిమాలయ పర్వతశ్రేణి లోని హిమానదాలు కూడా సుందరమైనవే కానీ అక్కడి వృక్షసంపద భిన్నమైనదై అకారరేఖ విభిన్నాకృతి పొంది వేరే విధంగా సౌందర్యాన్ని ఆపాదించుకుంటూ ఉంటుంది.
క్రింది చిత్రాలు పెద్దవిగా చూడాలంటే, వాటి మీద క్లిక్ చేయండి.