అసలు కారణం
ఏకత్వం లో కలిగిన చంచలత్వమే
అనేకత్వానికి కారణం.
తనలో తనపై తనకు కలిగిన చపలత్వమే
బహుత్వానికి ప్రేరణం.
పోరాటానికి, ఆరాటానికి, చెలగాటానికి, చెర్లాటానికి
జతకలిసిన తరుణమే ఈ జననం.
ఓటమికి అలుపుకి, నిరాశకు నిర్లిప్తతకు
లొంగిన సమయమే మరణం.
జననానికి, మరణానికి, కోరికకి, కన్నీటి చారికకి
కలిగిన బంధమే ఈ జీవితం.
ఇదంతా కర్మల వాలం, ఆశల జాలం.
సంకల్పాల హాలాహలం,
సందేహాల కోలాహలం.
అవినీతి సంపర్క బలం,
అజ్ఞానపు సంబంధ మలం.
అరిషడ్ వర్గాల విశృంఖలత్వం,
అధమసంస్కారాల ఆధిపత్యం.
ఆంతర్యంలో చెంచలత్వం,
అడుగడుగునా పూతన తత్త్వం,
ఫలితమే ఈ జనన మరణాల ఝరి,
అందుకే ఈ ఊహల ఉరి.