ప్రతిభావంతమైన నీ మనసులో పుట్టే ప్రతి భావాన్నీ
కమనీయమైన కవితగా మలచాలనుకోకు.
బయల్పడే ప్రతిభావం నీకు పరవశాన్నిచ్చే కవితగా మారలేదు.
నీతో పరిచయమున్న ప్రతి ఒక్కరి హృదయాలను
సమత, మమతలతో స్పందిచాలనుకోకు.
ఎందుకంటే, అందరి హృదయాలు
సమత, మమతలను ఆమోదించే స్థితి లో ఉండవు.
ద్వంతకాంత కౌగిలినుండి విడువడే ప్రతి ఉదయంనుండి
మరులు ఒసగే మోదాన్ని పొందాలనుకోకు.
ఎందుకంటే, అన్ని ఉదయాలు
నువ్వు ఆస్వాదించే స్థితి లో నీకు అగుపించవు.
ప్రతి క్షణం ఎదురయ్యే సంఘటనల నుండి
పాఠాలు నేర్చుకోవాలనుకోకు,
ఎందుకంటే, అన్ని సంఘటనలు
సంయమనంతో నీకు గుణ పాఠాలను నేర్పించలేవు.
గొప్పవాళ్ళ జీవితాలను చూసి
నీవు అలా మారిపోవాలనుకోకు,
ఎందుకంటే, ఆ క్షణంలో వారిజీవితాలు నీలో కలిగించే ఆవేశం
నీ జీవితాన్ని మార్చుకోవటానికి పనికిరాదు.
జీవితాన్ని నువ్వు శాసించినంత మాత్రాన
ఆశించిన మార్పు వస్తుందని ఆతృత పడకు.
ఆశయాన్ని నువ్వు అనుసరించినంత మాత్రాన
ఆనందం నీ జీవితాని శ్వాసిస్తుందని ఆశపడకు.
నీ ఆలోచనలు మారితే నీ మనసు మారుతుంది.
నీ మనసు మారితే నీ బుద్ధి మారుతుంది.
నీ బుద్ధి మారితే నీ సంకల్పాలు మారుతాయి
నీ సంకల్పాలు మారితేనే నీ జీవితం మారుతుంది.