ఒకరు కాదన్న కవితను వేరొకరు ప్రచురించినప్పుడు,
ఒకరు చేదన్న మమతను మరొకరు ఆమోదించినప్పుడు
మొదటివారిని చూసి గర్వంతో నవ్వాలనిపిస్తుంది,
రెండవవారిని చూసి ఆనందంతో ఏడవాలనిపిస్తుంది.
ఒకరు పూజించిన పుష్పాన్ని వేరొకరు నలిపివేసినప్పుడు
ఒకరు ప్రేమించిన రూపాన్ని మరొకరు అంతం చేసినప్పుడు
మొదటివారికి భక్తితో నమస్కరించాలని అనిపిస్తుంది.
రెండవవారిని జాలితో సంస్కరించాలని అనిపిస్తుంది.
ఒకరు నవ్వించిన మనిషిని వేరొకరు ఏడిపించినప్పుడు
ఒకరు అందించిన సమతను వేరొకరు నిందించినప్పుడు
మొదటివారిని మానవత్వానికి మచ్చుతునకని అనాలనిపిస్తుంది
రెండవవారిని మోటుతనానికి ప్రతిరూపంగా వర్తించాలనిపిస్తుంది
ఒకరు స్పృశించిన వస్తువులను వేరొకరు వేరుగా చూసినప్పుడు
ఒకరు సృజించిన విషయాలను వేరొకరు వ్యర్ధం అన్నప్పుడు
మొదటివారి నేరమేమిటని ఎలుగెత్తి ప్రశ్నించాలని అనిపిస్తుంది
రెండవవారి జులుమేమిటని నిలదీసి నిందించాలని అనిపిస్తుంది.
ఒకరు కాదన్న ఆకలిని మరొకరు చేరపిలిచి తీర్చినప్పుడు
ఒకరు లేదన్న ప్రాప్తాన్ని వేరొకరు ప్రాప్తింపజేసినప్పుడు
మొదటివారి పాపానికి ప్రాయశ్చిత్తమే లేదనిపిస్తుంది.
రెండవవారి పుణ్యానికి అవధులే లేవని అనిపిస్తుంది.