Menu Close
Satyam-Mandapati
‘అనగనగా ఆనాటి కథ’ 16
సత్యం మందపాటి

స్పందన

నూటాభై సంవత్సరాల క్రితం మన తెలుగు సమాజంలో ‘కన్యాశుల్కాలు’ ఉండేవి. అంటే మగవాళ్లు డబ్బులిచ్చి ఆడవారిని భార్యలుగా కొనుక్కునేవారు. వయసు మీరిన పెద్దవారు బాల్య వివాహాలు చేసుకునేవారు. అప్పుడు మగవారికన్నా కూడా సమాజంలో ఆడవారే ఎక్కువ బాధలు పడ్డారు. తర్వాత రోజుల్లో కన్యాశుల్కాలు పోయి, కట్నాలు వచ్చాయి. అంటే ఆడపిల్లలు డబ్బులిచ్చి మగవారిని భర్తలుగా కొనుక్కునేవాళ్ళు. విచిత్రం ఏమిటంటే అప్పుడు కూడా మగవారికన్నా సమాజంలో ఆడవారే ఎక్కువ బాధలు పడేవారు. అంటే ఇక్కడ డబ్బులు ఎటు నించీ ఎటు వెళ్ళినా, మూల కారణం మగ జాత్యహంకారం అనే చరిత్ర నిరూపిస్తున్నది. ఈ డిజిటల్ యుగంలో కట్నాలు కూడా పోయి, గిట్నాలు వచ్చాయి. అంటే కట్నాలు లేవుగానీ, ఆడపెళ్ళివారి ఖర్చుల మీదే (ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప) ముందుగా తాంబూలాల బదులు ఒక పెద్ద హాల్లో వందలమందిని పిలిచి పెళ్ళికన్నా గొప్పగా ‘ఎంగేజ్మెంట్’ ఫంక్షన్, తర్వాత ఒక ఈవెంట్ మేనేజర్ దర్శకత్వంలో, రోజుకొకటో రెండో చప్పున ఫొటో షూట్, విడియో షూట్, సంగీత్, మెహిందీ, పెళ్ళికూతుర్ని చేయటం, బరాత్, ఇంకా పెద్ద హాల్లో, గొప్ప కేటరింగులతో, డెకరేషన్లతో అసలు విడియో పెళ్ళి, సిసలు అసలు పెళ్ళి, పెద్ద రిసెప్షన్, సత్యనారాయణ వ్రతం, గృహప్రవేశం, హనీమూన్, కోండొకచో అమెరికాకి రెండు టిక్కెట్లు, ఇంకా ఇలాటివెన్నో చేయటం దాకా వచ్చింది. ఇక్కడా చాల పెళ్ళిళ్ళలో ఎక్కువ ఖర్చు ఆడపెళ్ళి వారిదే. కట్నాల పెళ్ళిళ్ళకన్నా ఖరీదైనవీ గిట్నాల పెళ్ళిళ్ళు. ఈ వరసలోని కట్నాల రోజుల్లో నేనీ కథ 1969లో వ్రాశాను. చిత్తగించండి.

‘ముసుగు’

(ఈ కథ ‘ఆంధ్రప్రభ’ వార పత్రిక అక్టోబర్ 15, 1969 సంచికలో ప్రచురింపబడింది.)

Musugu story image

“రైలింకా ఎంచేపట్లో కదులుతుంది?” అన్నాడు బాబు చిరాకు ప్రదర్శిస్తూ.

“బయల్దేరుతుంది” అన్నాడు సారథి ఆవలిస్తూ.

కడుపునిండా తిని రైలెక్కటం వల్ల బాగా నిద్ర వస్తున్నది. బయట ఎండ తీవ్రంగా ఉండటం వల్ల, మూర్తి ట్రెయినెక్కగానే పై బెర్త్ మీద నడుం వాల్చాడు. అసలు ఈసరికే మంచి నిద్రలో ఉండి ఉంటాడు.

“అదే, ఎప్పులు బయల్దేలుతుందీ అని” అన్నాడు బాబు మళ్ళీ. అమాయకంగా ఉన్న ఆ పసి ముఖం చూస్తే సరదా వేసింది సారథికి. సుతిమెత్తంగా బుగ్గ పిండి, చెక్కిలి మీద ముద్దు పెట్టుకున్నాడు.

“జాగ్రత్తరా నానీ, నువ్వు కిటికీ దగ్గర కూర్చోకు. కళ్ళల్లో నలుసులు పడతాయి” వీణ మీటినట్టు ఉన్నది ఆ కంఠస్వరం.

సారథి తల ఎత్తి ముందు సీటు కేసి చూశాడు. అంతే! వెంటనే తలవంచుకున్నాడు. చేతిలో ఉన్న పేపర్ని ముఖానికి అడ్డంగా పెట్టుకుని చదువుతున్నట్టు కూర్చున్నాడు.

సారథికి ఆమెను ఎక్కడో చూసినట్టుంది. మరుక్షణంలోనే ఆమె ఎవరో, ఎక్కడ చూశాడో గుర్తుకి వచ్చింది. ఏదో అపరాధం చేసినవాడిలా బాధపడిపోయాడు.

ఆమె… ఆమె పేరు సావిత్రి. అవును, సావిత్రే! ఆమె తనని గుర్తుపట్టినట్టు లేదు. ఆమె సారథిని గమనించలేదు. కూలీ, సామనులు తెచ్చి సీటు క్రింద పెట్టి, ఆమె ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు.

“అమ్మా, నేను కిటికీ దగ్గర కూర్చుంటానే” అంటున్నాడు నానీ.

“వద్దురా, చేతులు బయట పెడతావ్”. కొడుకుని మందలించి తను సారథికి ఎదురుగా కిటికీ దగ్గర కూర్చుని, పసిదాన్ని ఒళ్ళో కుదేసుకున్నది. నానీ ఆమె పక్కనే కూర్చుని బిక్కముఖంతో దిక్కులు చూస్తున్నాడు. కంపార్టుమెంట్ దాదాపుగా ఖాళీగా ఉంది.

ఆమెను మళ్ళీ ఒక్కసారి చూడాలనిపించింది సారథికి. చేతిలోని పేపరుని కొద్దిగా వంచి, ఒక పక్కనించీ చూశాడు. ఆమె ఒడిలోని పసిపిల్లకి పాలు ఇస్తున్నది. పమిటె నిండుగా కప్పుకున్నది. ఈ ఐదారేళ్ళలోనూ ఇంకా పెద్దదయిపోయినట్లు కనిపిస్తున్నది. మనిషి అదివరకటికన్నా రంగు వచ్చి, ఇంకా అందంగా ఉంది. చక్కటి ఆమె ముఖంలో నుదిటి మీద గుండ్రటి కుంకుమ బొట్టు ఎర్రగా మెరుస్తున్నది. మెడలోని నల్లపూసలు, మంగళసూత్రాలు ఆమెకు అదోరకమైన గాంభీర్యాన్నీ, గౌరవాన్నీ, వింత సోయగాన్నీ తెచ్చిపెడుతున్నాయి.

ఆమె సారథి వేపు హఠాత్తుగా చూసింది. సారథి చటాలున తప్పు చేసినవాడిలా పేపర్ ముఖానికి అడ్డం పెట్ట్టుకున్నాడు. అయినా దొరికిపోయాడు. ఆమె చూసిన చూపులో ఆరోజుకీ, ఈరోజుకీ చాల తేడా ఉంది.

ఆనాడు ఆమె చూసిన చూపులో చిలిపితనం ఉంది. సిగ్గు ఉంది. అందం ఉంది. ఆవేశం ఉంది. ఏదో అర్థం ఉంది. కానీ ఈనాడు ఏదో గాంభీర్యం ఉంది. ప్రౌఢత్వం ఉంది. మందలింపు ఉంది. మందహాసం ఉంది. చిన్న పిల్లవాడిని చూసే తల్లి చూపు ఉంది.

అయితే సావిత్రికి అప్పుడే ఇద్దరు పిల్లలన్నమాట! భర్తేం చేస్తున్నాడో? తనకన్నా ఎక్కువ చదువుకున్నాడా?

అందగాడా? ఆస్తిపరుడా?

“అరేయ్, సారధీ! ఇంకా బెజవాడ రాలేదా?” ఆవలిస్తూ అడుగుతున్నాడు మూర్తి, పై బెర్త్ మీదనించి.

“ఇంకా గుంటూరులో బయల్దేరలేదురా, నాగన్నా, అప్పుడే బెజవాడ ఎక్కడ వస్తుంది?” అన్నాడు సారథి.

మూర్తి ముడుచుకు పడుకున్నాడు.

“అబ్బా, ఎంచేపూ” అంటున్నాడు బాబు.

“అరే ఉండరా! క్రాసింగ్ ఉందేమో. నెమ్మదిగా అదే బయల్దేరుతుంది. తొందరేం?” అంటూ బాబు భుజం మీద చేయి వేసి, సుతారంగా నొక్కాడు సారథి. బాబు అంటే సారథికి తగని ముద్దు. ఈ గొడవలో ఆమె తనని తీక్షణంగా గమనిస్తున్నట్టు సారధి గమనించలేదు. ఆమెకీ సారథి పూర్వ పరిచయుడిగానే కనపడ్డాడు. ఒక్క క్షణంలో అతన్ని గుర్తుపట్టగలిగింది కూడాను. అవును, మరి! సారథిని అంత తొందరగా మరచిపోతుందా?

“మిమ్మల్నెక్కడో చూశాను!” అన్నదామె, పిల్లని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, పమిటె చెంగుని నిండా కప్పుకున్న తర్వాత.

సారథి ఉలిక్కిపడ్డాడు. ముందు తనని కాదేమో అనుకున్నాడు.

ఆమె మళ్ళీ అదే అన్నది.

సారథి ఆమెకేసి చూశాడు. చిరునవ్వు ఎర్రటి పెదాల మధ్య నొక్కిపట్టి అడుగుతున్నదామె.

“అవును. నేనూ ఇంతకుముందు మిమ్మల్ని చూశాను” అన్నాడు గొంతు పెగుల్చుకుని.

“ఎక్కడ చూశారో గుర్తున్నదా?” వెటకారం చేసినట్టుగా అన్నదామె.

“ఊఁ!” అంటూనే, పేపర్ తీసి ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు సారథి.

ఆమె ఏదో అనబోయి, ఒకసారి సారథిని చూసి ఊరుకున్నది.

ట్రైన్ మెల్లగా బయల్దేరింది. కంపార్టుమెంటులో ఒక పక్కన నిద్రకు తూగుతూ కూర్చున్న ముసలాయన తప్ప ఇంకెవరూ లేరు.

సారథికి ఏమిటోగా ఉంది. ఆమె తనని బాగా గుర్తుపట్టింది. తనని అంత తొందరగా మరచిపోతుందా? కొంపదీసి తనని అసహ్యించుకోవటం లేదుగదా! తన మీద తనకే అసహ్యం వేస్తున్నది.

ఆమెను మొదటిసారిగా పెళ్ళిచూపులకని వెళ్ళి, వాళ్ళ ఇంట్లోనే చూశాడు. ఆమె ముగ్దమోహన స్వరూపం, మృదుల మంజుల గానం తనని సమ్మోహితుణ్ణి చేశాయి. వెంటనే ఆమెని పెళ్ళాడటానికి ఒప్పుకున్నాడు. తండ్రి తన మేనమామతో వెళ్ళి, అన్ని మాటలూ మాట్లాడుకునే వచ్చాడు. ముహూర్తం త్వరలోనే పెట్టుకుందామనుకున్నారు.

ఎన్నో సంబంధాలు చూసీ, చూసీ, ఇటు జాతకాలు కుదరలేదనీ, అటు ఆస్తిపరులు కాదనీ చెబుతుంటే విసిగి వేసారిపోయిన తనకీ ఎంతో సంతోషమైంది. మరి పెద్దల మాటలు జవదాటలేని రోజులవి. కానీ ఇంతలోనే తన తండ్రి ముందు ఎవరో ఊదారు. వాళ్ళు చెప్పిన దానికన్నా ఎంతో తాహతు కలిగినవారేననీ, కట్నం ఇంకా ఎక్కువే ఇవ్వగల స్థోమత ఉన్నవారేననీ. దానితో తన తండ్రి, మేనమామా కట్నం ఇంకా ఎక్కువ కావాలని పట్టుబట్టారు. ముందుగా అడిగితే ఆలోచించేవాళ్ళం అనీ, అంతా ఒప్పుకుని ఇప్పుడు కాదనటం మర్యాదస్తుల లక్షణం కాదనీ వాళ్ళన్నారు. మాటా మాటా వచ్చింది. తన తండ్రి ఆ సంబంధం వదులుకున్నాడు.

తర్వాత తను ఎన్నో సంబంధాలు చూశాడు. కొందరు పిల్లలు నచ్చలేదు. నచ్చితే జాతకాలు కుదరలేదంటాడు తాత. జాతకాలు కుదిరితే కట్నం చాల్లేదంటాడు మేనమామ. వాళ్ళు చెప్పిన మాటలే వింటాడు తండ్రి. చిన్నప్పటినించీ ఒద్దికగా, ఒక క్రమశిక్షణలో పెరగటం వలన, తండ్రిని ఎదిరించే దైర్యమూ తనకి లేదు. తనూ విసిగి వేసారిపోయి, ఇక తనకీ జన్మకు పెళ్ళి కాదనుకున్నాడు.

“ఏం బాబూ, ఎక్కడికి వెడుతున్నారూ!” సావిత్రి బాబుని మురిపెంగా అడుగుతున్నది.

సారథి విననట్టుగా పేపర్ చదువుతూనే, తన చెవులు వాళ్ళకి అప్పగించాడు.

“బెజవాల” అన్నాడు బాబు తల వంచుకుని.

‘ఏమిటి, ఆమెను సూటిగా చూడటానికి వీడు కూడా సిగ్గుపడుతున్నాడు’ అనుకున్నాడు సారథి.

“మరి, అమ్మ రావటం లేదా?” అడిగింది సావిత్రి లాలింపుగా.

“అమ్మ దగ్గలకే వెలుతున్నాంగా” అమాయకంగా అన్నాడు బాబు.

సారథికి అదోలా అనిపించింది. ‘ఆరా తీస్తున్నది, గురూ! ఇక నా మీద పడబోతున్నది’ అనుకున్నాడు.

ఆ పాసెంజర్ ట్రైన్ ఏదో స్టేషన్లలో ఆగింది. బయల్దేరింది. సారథి ఆలోచనలు మాత్రం సాఫీగా అతన్ని ముసురుకుంటూనే ఉన్నాయి. ‘ఆ వాలకం చూస్తే ఆమె అతన్ని సూటిగా అడిగేలాగానే ఉంది. తనెలా సిద్ధపడాలి? తనని శుద్ధ సంస్కారం లేనివాడిగా చిత్రించుకుని ఉంటుంది. ఛ… ఏమిటిది? ఇంత ఇబ్బందిగా ఉంది వ్యవహారం’ అనుకున్నాడు.

“నీకెన్నేళ్ళు బాబూ?” అడిగింది సావిత్రి. ఆమె అలా ఆప్యాయంగా అడుగుతుంటే, బాబుకీ సరదాగానే ఉంది. అందమైన ఆమె పెదవులు మెరుపుతీగల్లా మెరుస్తున్నా, సారథి ఆమె ముఖంలోకి చూడలేకపోతున్నాడు.

“నాకా… మూడో ఏలు” అన్నాడు బాబు.

ఆమె సన్నగా నవ్వింది. ఏదో కవ్వింపు కనపడింది సారథికి ఆ నవ్వులో.

“మా నానిగాడికి అప్పుడే నాలుగో ఏడు” అన్నది సావిత్రి గర్వంగా.

ఆమె ఆ మాట ఎవర్ని ఉద్దేశించి అన్నదో బాబుకు తెలియదు. అందుకే వాడూ సరదాగా నవ్వాడు. సారథికి ఏమిటో కసిగా ఉంది. ఆమె కాసేపు మాట్లాడకుండా ఉంటే బాగుండుననుకున్నాడు. ఒకసారి భారంగా అటూ ఇటూ కదిలి, మళ్ళీ పేపర్లో ముఖం దూర్చాడు.

సావిత్రికి తెలుసు అతను పేపర్ చదవటం లేదనీ, తమ మాటలు వింటున్నాడనీ!

“మా బేబీకి ఇంకా సంవత్సరం కూడా దాటలేదు. మా బేబీ బాగుందా బాబూ?” అన్నది, సారథిని క్రీగంటితో చూస్తూ.

బాబు సిగ్గు పడ్డాడు. తల వంచుకుని, “బాంది” అన్నాడు.

సారథికి విసుగేసింది. ‘వేలెడు లేడు వెథవ. వీడికి సిగ్గేమిటి?’ అనుకున్నాడు.

ఇంతలో మంగళగిరి స్టేషన్ వచ్చింది. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. దిగేవాళ్ళు దిగుతున్నారు. ఈ కంపార్ట్మెంట్లో ఒక లావాటావిడ మాత్రం ఎక్కింది. ముసలతను ఇంకా గురకపెడుతూనే ఉన్నాడు.

“ఒరేయ, సారథీ. బెజవాడ వచ్చిందా?” అన్నాడు మూర్తి పై బెర్త్ మీదనించీ.

“లేదు. ఇంకా మంగళగిరే. నువ్వు పడుకో. బెజవాడ రాగానే లేపుతాలే” అన్నాడు సారథి.

“అమ్మా! బిస్కెట్లే” అంటున్నాడు నానీ.

‘ఇప్పుడు వద్దు” విసుక్కున్నది సావిత్రి.

“ఆఁ!... ఆఁ!... ఆ... ఇప్పులే కావాలే” ఏడుపు లంకించుకున్నాడు నానీ.

“సరే... ఏడవకు. కొనిస్తా” అంటూనే బిస్కెట్లు అమ్మే అతన్ని పిలిచింది సావిత్రి.

ఎప్పుడూ క్రిందపడి దొర్లి ఏడిస్తేనేగానీ కొనివ్వని అమ్మ, వెంటనే కొనివ్వటం నానీకి విచిత్రంగానే ఉంది. అయినా అమ్మ బిస్కెట్లు కొంటున్నది. వాడికదే చాలు.

సావిత్రి మనసు ఆమె స్వాధీనంలో లేదు. ఆమె ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే. సారథి తననీ, తన సంసారాన్నీ చూసి ఈర్ష్య పడాలి. తనని కాదన్నందుకు బాధ పడాలి. ‘ఎంత సుఖంగా, ముచ్చటగా కాపురం చేసుకుంటున్నది’ అని అసూయ చెందాలి. ప్రస్తుతానికి మాత్రం ఆమె ఆలోచనలు అంతే!

నానిగాడి ముందో నాలుగు బిస్కెట్లు పోసి, ఇంకో నాలుగు బిస్కెట్లు బాబు చేతికి అందించింది.

అది చూసి, సారథి చటుక్కున పర్సు తీసి, రూపాయ నోటు అందించాడు బిస్కెట్లు అమ్మే అతనికి.

సావిత్రి గుర్రుగా చూసింది సారథిని.

“ఏయ్, అబ్బీ! అది తీసుకోవద్దు. ఆయనకి తిరిగి ఇచ్చేయ్. ఇది తీసుకో” తనే డబ్బులు ఇచ్చింది సావిత్రి. బిస్కెట్లు అమ్మే అతను సారథి చేతిలో అతనిచ్చిన రూపాయి ఉంచి వెళ్ళిపోయాడు.

సావిత్రి ఏదో విజయగర్వంతో చూసింది సారథి వైపు. అతన్ని ఎందుకో దెప్పుతున్నట్టుగా ఉన్నదా చూపు. సారథి తనలో తనే సణుక్కున్నాడు. బాబు కేసి చూశాడు. వాడు ఆనందంగా బిస్కెట్లు తింటున్నాడు. సారథి ఇంకోసారి సణుక్కున్నాడు. ట్రైన్ నెమ్మదిగా బయల్దేరింది.

సావిత్రి ప్రక్కన ఉన్న లావాటావిడతో అన్నది “మావారు గుడివాడలో ఇంజనీరు. బాగా సంపాదిస్తున్నారు”

సావిత్రి మాటలు విని ఆవిడ సారథి వేపు ఆప్యాయంగా చూసింది.

సారథి ఉలిక్కిపడ్డాడు.

“మా ఆయన చాల బావుంటారు కూడాను. కావాలనే చేసుకున్నాను. ఇప్పుడు గుడివాడలోనే ఉన్నారు. నన్ను ఇంటికి తీసుకువెళ్ళటానికి స్టేషనుకి వస్తారు”

ఆమె క్రీగంటితో తనని కవ్విస్తున్నదని తెలుసు సారథికి. కానీ ఏమీ ఎరగనివాడిలా కిటికీలోనించీ బయటకు చూస్తున్నాడు.

లావాటావిడ విచిత్రంగా చూసింది. తరువాత నానిగాడితో కబుర్లలో పడింది.

కిటికీలోనించీ బయట చూస్తున్న సావిత్రిని పరిశీలనగా చూశాడు సారథి. ఆమెకు అతను చూస్తున్నాడని తెలిసినా, అతను తనని ఇంకా చూడాలనే కోరికగా ఉంది. చూసీ చూసీ తనకి దక్కలేదనే అసూయతో బాధపడాలనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే కదలక మెదలక కిటికీలోనించీ, వెనక్కి వెడుతున్న చెట్లని చూస్తూ కూర్చున్నది.

‘సావిత్రిని చేసుకున్న వాడెవడో అదృష్టవంతుడు’ అనుకున్నాడు సారథి. కానీ ఆ అదృష్టవంతుడి అదృష్టానికి ఈర్ష్య పడలేదు. చింతించలేదు. ఆమెను చూడగానే అలా అనుకున్నాడంతే.

స్త్రీకి పసితనంనించీ యౌవనం దాకా శారీరకంగానూ, మానసికంగానూ ఎంత త్వరితమైన మార్పు వస్తుందో, పెళ్ళి కాకముందునించీ పెళ్ళయి పిల్ల తల్లి అయిన తర్వాత శారీరకంగానూ, మానసికంగానూ అంతకన్నా ఎంతో ఎక్కువ మార్పే వస్తుంది. చూపుల్లో సిగ్గూ, నదురూ బెదురూ మాయమై, ఏదో హుందాతనం, ప్రేమ, ఆప్యాయత, బెదిరింపు, దైర్యంతో కూడిన గర్వం వస్తాయి. సావిత్రి చూపుల్లో అవి కొంచెం ఎక్కువగానే కనపడ్డాయి సారథికి.

ఉన్నట్టుండి సావిత్రి బాబుని అడిగింది, “నీ పేరేమిటి?” అని.

“బాబు” అన్నాడు వాడు గడుసుగా.

సావిత్రి గలగలా నవ్వి, “మరి మీ అమ్మ పేరేమిటి బాబూ” అన్నది.

బాబు కళ్ళెత్తి, “అమ్మ” అన్నాడు చేతిలోని బిస్కెట్ కొరుకుతూ.

ఆమెకి పేరు తెలుసుకోలేకపోయినందుకు చిన్నతనంగా ఉంది. ముఖం అదోలా పెట్టింది.

సారథి తనలో తనే నవ్వుకున్నాడు. ఆమె సారథి ముసిముసి నవ్వులు నవ్వటం గమనించింది.

“వాళ్ళమ్మ పేరు ఏమిటండీ?” అడిగింది సారథిని సూటిగా చూస్తూ.

“ఆఁ!... ఆఁ!... ఏమిటి?” గాభరాగా అన్నాడు సారథి. అతని కంగారు చూసి ఆమె పకపకా నవ్వింది. ఆ నవ్వు సారథి గుండెల్లో మంటలు రేపింది. మళ్ళీ అడిగిందామె.

“భారతి… అనుకుంటాను” అన్నాడు సారథి కంగారు పడుతూ.

ఆమె మళ్ళీ పెద్దగా నవ్వింది, ఇంకా ఏమనుకుంటారు అన్నట్టుగా.

సారిథికి చటుక్కున ఏదో స్పురించింది. ‘ఇవన్నీ ఆవిడకెందుకు. అసలావిడ ఉద్దేశ్యం ఏమిటి’ అనుకున్నాడు.

ఆమె అదోరకంగా ఇంకా తననే సూటిగా చూస్తున్నది. సరైన జవాబు కోసం ఎదురు చూస్తున్నదేమో!

అందులోనూ పక్కన పడుకున్న ముసలాయన గురకకి, పైన పడుకున్న మూర్తి గురక తోడయింది. కనీసం తను కూడా ఒక కునుకు తీస్తే బాగుండేది అనుకున్నాడు.

“ఆమె బాగుంటారా?” అడిగింది.

సారథికి కొంచెం కంగారు, కొంచెం విసుగూ ఉన్నా, వెంటనే ఏదో సరదా కూడా వేసింది. అంతే అదే మార్గం అనుకున్నాడు. లావాటావిడ కూడా ఆ ఎండకి సీటు వెనక్కి ఆనుకుని తూగుతున్నది.

“ఆఁ! చాలా బాగుంటుంది” అన్నాడు దైర్యం తెచ్చుకుని.

“చాలా అంటే?” మళ్ళీ కవ్వింపుగా నవ్వుతూ అన్నది.

“మీకన్నా కూడా...” సూటిగా సావిత్రి కళ్ళల్లోకి చూశాడీసారి.

“కట్నం ఎంత తీసుకున్నారు?” కసిగా అడిగింది సావిత్రి.

“చాలా” అన్నాడు సారథి, తనలోని నవ్వుని అదుపులోకి తెచ్చుకుని.

ఈసారి ఆమె, “చాలా అంటే?” అని అడగలేదు.

ఒడిలో పడుకున్న పసిపిల్ల వీపు మీద దబదబా చిచ్చికొడుతూ కిటికీలోనించీ బయటకు చూస్తున్నది.

సారథికి ఏమిటో వెర్రి ఆనందంగా ఉంది.

ఇంతలో బాబు బాత్రూముకి పోవాలన్నాడు.

సారథి సణుక్కున్నాడు. బాబు ముఖం చూస్తే, ఇంకొక్క క్షణం ఆలస్యం చేస్తే అక్కడే పూర్తి చేసేట్టున్నాడు. ఇబ్బందిగా లేచి, సారథి బాబుని తీసుకుని లేవటరీ వేపు దారి తీశాడు.

సారథి బాబు పని పూర్తయిన తర్వాత, సీటు దగ్గరకి వస్తుండేసరికే, ట్రైన్ బెజవాడ ప్లాట్‍ఫారం మీదకి రాబోతున్నది.

మూర్తి పై బెర్త్ మీదనించీ ఎప్పుడు దిగాడో కానీ పెట్టె తీసి, దాంట్లో దుప్పటి ఉంచి, పెట్టెకి తాళం వేసి సిధ్ధంగా ఉన్నాడు.

ట్రైన్ దిగుతుండగా మూర్తి అన్నాడు, “మీ ఎదురుగా కూర్చున్నావిడ ఎవరో తెలుసా? నా ఫ్రెండ్ భాస్కర్ అని చెప్పానే గుడివాడలో ఇంజనీర్ అని, అతని భార్య. ఆవిడేమనుకుంటున్నదో తెలుసా? బాబు నీ కొడుకనుకుంటున్నది. అదే విషయం నాతో అన్నది కూడాను”

బిత్తరపోయాడు సారథి.

“నువ్వేమన్నావ్?’ గాభరాగా అడిగాడు సారథి.

“ఏమంటాను? వీడు నా పుత్రుడు. అతని కొడుకు కాదు. అతను నా క్లోజ్ ఫ్రెండు. నాతో కలసి వస్తున్నాడు. వాడికి అసలు పెళ్ళే కాలేదు. ఇక ఈ జన్మలో కాదు కూడాను అని నిజం చెప్పేశాను”

నాలుగుపక్కలా బాంబులు పేలినట్టుగా అయింది సారథికి.

“అసలవన్నీ ఆవిడకి ఎందుకు చెప్పావ్?’ కోపంగా అడిగాడు సారథి.

“మీరిద్దరూ సీట్లో కనపడకపోతే, ఆవిడనే అడిగాను మీరెక్కడ అని. అప్పుడే జరిగింది ఈ సంభాషణ” అన్నాడు మూర్తి.

‘ఆమె దృష్టిలో ఎంత చులకనయైపోయాడు తను. ఛీ! ఆమె తనును చూసి ఏహ్యంగా నవ్వుతుందేమో’ అనుకున్నాడు.

అలా అనుకున్నవాడు ట్రైన్ దిగి వెడుతున్నప్పుడు ఆమె కేసి మరోసారి చూడకుండా ఉండలేకపోయాడు.

ఆమె తనని అదోలా చూస్తున్నది. ఆ చూపులో ఈసారి ఆ కవ్వింపూ, బెదిరింపూ లేవు. తనని జాలిగా చూస్తున్నది. సానుభూతి అందిస్తున్నదా? సారథి అక్కడ మరో క్షణం ఆగలేకపోయాడు. వేగంగా ముందుకు అడుగులు వేశాడు.

Posted in December 2023, కథలు

4 Comments

  1. Sreenivas

    సత్యం గారు, కథ బాగుంది. ఆ కాలంలో కట్నాలు చాలలేదని, పెద్దల మాట కాదనలేని పెళ్లికాని ప్రసాదులు. మరి ఈకాలంలొ యువత 30, 40 ఏళ్ల దాకా పెళ్లిళ్లే చేసుకోవటంలేదు.

    • సత్యం

      అవును, బాగా చెప్పారు శ్రీనివాస్ గారు. మరి దాన్ని ఏమందాం? వాతావరణంలో మార్పు అందామా! మీ స్పందనకు ధన్యవాదాలు.

  2. Akkaraju V Sarma

    A very time-line oriented write up! How true! When you read this, sometime do a look into M.N.Srinivas PhD (Late) work on Marriages in South India, where matrilateral cross cousin Marriages were the order of the day. A young girl coming into a new in-law family is given the character rubberstamp, “she is from that good village or family that has a great adaptable record”. That gave an approval for the marriage move forward. If a future write up of this article occurs, a line on this marriage concept may be great. Thanks for reading this note.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!