స్పందన
కులం పేరు చెప్పుకుని, మతం పేరు చెప్పుకుని, డబ్బు కోసం, పదవి కోసం, తమ స్వార్ధం కోసం ప్రజలని మోసం చేసే రాజకీయ నాయకుల మాటలు విన్నాక, చేతలు చూశాక వాళ్ళు చేసే పని తప్పే అయినా, వాళ్ళని ఆలోచనా రహితంగా గుడ్డిగా నమ్మే జనాలది ఇంకా ఎంతో పెద్ద తప్పు అని స్పష్టంగా అనిపించింది. అప్పుడు వ్రాసిందే ఈ పట్టాభిషేకం కథ. కాకపోతే బాధాకరమైన విషయం ఏమిటంటే, దాదాపు యాభై ఏళ్ళ క్రితం ఈ కథ వ్రాసినప్పటి పరిస్థితి అసలు మెరుగుపడకుండా, ఆరోజుల్లో కన్నా కూడా ఇప్పుడే ఎక్కువగా ఉండటం. ఇతర రాష్ట్రాల్లోకూడా పరిస్థితి ఇలాగే ఉన్నా, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటం ఆవేదన కలిగించే విషయమే కాక, మన ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదస్థితిలో ఉన్నదో కూడా చూపిస్తుంది. ఇది చాల చిన్న కథే అయినా ఆ రోజుల్లో పలువురి ప్రశంసలు అందుకున్న కథ.
(ఈ కథ ‘ఆంధ్ర సచిత్రవారపత్రిక’ ఏప్రిల్ 19, 1974 సంచికలో ప్రచురింపబడింది.)
“మీరు మీరే… మేము మేమే! మనందరం ఒకటే ఎలా అవుతాం?” అన్నాడాయన.
“అంతే… అంతే! ఒకటే ఎలా అవుతాం?” ఏకకంఠంతో అంగీకరించారు అందరూ, ఆయన వెనకాలే చేతులు కట్టుకుని నుంచుని.
౦ ౦ ౦
చదరంగంలో ఎత్తులు మారాయి.
“మీరూ మేమూ ఒకటే. కాదనేదెవరు?” అన్నాడు అదే ఆయన, అదే కంఠంతో, అదే ప్రజలతో.
“అంతే… అంతే. కాదన్నదెవరు?” తలలు ఊపారు అందరూ. ఏకకంఠంతో అంగీకరించారు అందరూ ఆయన వెనకాలే చేతులు కట్టుకుని నుంచుని.
౦ ౦ ౦
ఈసారి ఎవరో చదరంగం బోర్డే ఎత్తుకుపోయారు. ఇక ఎత్తులతో పనేముంది.
“ఆఁ! భలే వాళ్లే! మీరు మీరే… మేము మేమే! మనందరం ఒకటే ఎలా అవుతాం?” మళ్ళీ అన్నాడు అదే ఆయన, అదే కంఠంతో, అదే ప్రజలతో.
“అంతే… అంతే! ఒకటే ఎలా అవుతాం?” మళ్ళీ ఏకకంఠంతో అంగీకరించారు అందరూ, ఆయన వెనకాలే చేతులు కట్టుకుని నుంచుని.
౦ ౦ ౦
అనగా అనగా ఒక ఊళ్ళో ఒక విమానాశ్రయం ఉంది. అది మామూలు విమనాశ్రయం కాదు. మిలటరీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు హఠాత్తుగా దిగటానికి కట్టుకున్న చిన్న విమానాశ్రయం.
ఒకసారి నిజంగానే అత్యవసర పరిస్థితి వచ్చింది. ఎయిర్ మార్షల్‍గారు ఒక చిన్న స్పెషల్ విమానంలో, ఆ ఊళ్ళో దిగటానికి హఠాత్తుగా వస్తున్నారు. క్రింద ఉన్న గ్రౌండ్ ఆఫీసరుగారు (ఆయన రాంక్ నాకూ తెలియదు), ఎయిర్ మార్షల్‍గారికి స్వాగతం చెప్పటానికి వైర్‍లెస్ సందేశం అందగానే పరుగెత్తుకుంటూ వచ్చాడు.
విమానాశ్రయాన్ని చూసి, ఒక్కసారి గుండె ఆగినంత పనయి, తన గుండె బదులు ఆయనే ఆగిపోయాడు. కారణం మరేమీ లేదు. విమానాశ్రయంలోని రన్‍వే నిండా కొన్ని వందల గొర్రెలు అడ్డంగా ఉన్నాయి. అక్కడ ఎంతో మందంగా పెరిగిన గడ్డిని మేస్తున్నాయి. ఆ విమానాశ్రయం ఎప్పుడోగానీ వాడరు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. ఎప్పుడైనా అవసరం వచ్చినా, ముందే కబురు చేస్తారు కనుక శుభ్రం చేయటానికి సమయం దొరికేది. ఇప్పుడు మరి అత్యవసర పరిస్థితి! మరెలా? రన్‍వే మీదా, పక్కనా దుబ్బుగా పెరిగిన గడ్దిని తాపీగా మేస్తున్నాయి కొన్ని గొర్రెలు. ఆ గొర్రెలు వంద పైనే ఉన్నట్టున్నాయి, వాటితో రన్‍వే సరిగ్గా కనపడటం లేదు కూడాను.
గ్రౌండ్ ఆఫీసరుగారు తల మీద టోపీ తీసి, పీక్కుందామంటే తల మీద జుట్టు లేదు కనుక గుండు గోక్కున్నాడు. ప్రక్కనే చెట్టు మీద ఉన్న ఆడ కాకితో మగ కాకి, “ఆ తమాషా చూడు” అంది.
ఆడ కాకి భయం భయంగా, “హుష్, కాకీ! తెలుగులో పెద్దగా అలా మాట్లాడకు. మన మాటలు విని, మనమేదో ఆందోళనకారులం అనుకుంటారు” అన్నది.
మగ కాకి “పోనీ, క భాషలో మాట్లాడుకుందామా?” అన్నది.
ఆడకాకి మళ్ళీ భయం భయంగా చూస్తూ అంది. “వాళ్ళకి కా భాషా తెలుసు, కి భాషా తెలుసు. ముందు నువ్వు నోరు మూసుకో” అంది. రెండు తెలుగు కాకులూ నోళ్ళు మూసుకుని తమాషా చూస్తున్నాయి.
గ్రొండ్ ఆఫీసరుగారి ఆజ్ఞ ప్రకారం ఇరవై మంది సిపాయిలు ఆ గొర్రెలని బయటకు తోలే పని ప్రారంభించారు. అవి ఇటూ, అటూ పరుగెత్తుతున్నాయిగానీ, రన్‍వే మాత్రం దాటి బయటకు రావటం లేదు.
పది నిమిషాల్లో ఆ ఇరవైమందికీ చెమటలు పట్టాయి. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. శోష వచ్చింది. కానీ గొర్రెలు మాత్రం రన్‍వే దాటి బయటకు రావటం లేదు. మేయటానికి గడ్డి అక్కడే ఎక్కువగా ఉంది మరి!
మగ కాకి “భలే! భలే!” అంది పెద్దగా.
ఆడ కాకి “తెలుగులో అరవ్వద్దని చెప్పానా” కసిరింది.
తెలుగు కాకులకు కూడా తెలుగులో అరవటానికి భయం, నామర్దా, సిగ్గూ. ఈసారి నాలుగు ఫైరింజన్లు తెప్పించి గొర్రెల మీద బాగా నీళ్ళు కొట్టించాడు గ్రౌండ్ ఆఫీసర్.
గొర్రెల బొచ్చు తడిసిందిగానీ, అవి మాత్రం కదలలేదు, మెదలలేదు సరికదా, ఏమీ పట్టనట్టు గడ్డి మేస్తూ వాటి పని అవి ఒకళ్ళతో ఇంకొకళ్ళు కబుర్లలో పడ్డాయి.
ఈలోపల ఎయిర్ మార్షల్‍గారి విమానం వచ్చేసింది. క్రిందకు దిగటానికి చోటులేక, పైనే అటూ ఇటూ తిరుగుతున్నది.
గ్రౌండ్ ఆఫీసర్‍గారు గొర్రెల చుట్టూతా, వాటి పైన ఆకాశంలోకి తుపాకులు పేల్పించాడు. ఆ హడావిడికి అటూ ఇటూ చెల్లాచెదరై, మళ్ళీ దగ్గరవుతున్నాయిగానీ అక్కడే ఉన్నాయి. ఆ కాల్పులకు కొన్ని మరీ చిన్నవీ, చితకవీ ప్రాణాలు కూడా కోల్పోయాయి.
ఎయిర్‍మార్షల్‍గారు వైర్‍లెస్‍లో, క్రింద ఆఫీసర్‍ని నానా చివాట్లూ పెట్టాడు. ప్రమోషన్ లిస్టులో ఉన్న నువ్వే ఇలా చేస్తే ఎలా? అన్నాడు. నీకు పదవులు (అదే ప్రమోషన్లు) అఖ్కర్లేదా అన్నాడు. వెంటనే ఈ సమన్యని పరిష్కరిస్తేనే నీకు పట్టాభిషేకం అన్నాడు. మంచి కోపంలో ఉన్నాడు.
గ్రౌండ్ ఆఫీసర్ ముఖం ఎర్రబడింది. ఆ ఎర్రదనంలోనే చక్కటి ఆలోచన కూడా వచ్చింది. చమటకు తడిసిన చొక్కాను సర్దుకున్నాడు. జీపులోనించి దిగాడు. గొర్రెలను తరుముతూ విఫల ప్రయత్నం చేస్తున్న ఐదారు జీపులని వెనక్కి పిలిపించాడు.
ఒక్కడే గొర్రెలమంద వేపు నడిచాడు.
అందరూ ఏం జరుగుతుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఆడ కాకి మెడ మీద జుట్టు నిఠారుగా నిలబడడటం చూసి, దాని భయం తీర్చటం కోసం మగ కాకి ఆడ కాకిని దగ్గరకు తీసుకున్నది.
ఆయన అలానే నడుస్తూ గొర్రెల మంద మధ్యకు వెళ్ళాడు.
“ఊపిరి పీల్చటం ఎందుకు మానేస్తావు. నేనున్నానుగా, నీకేం భయం” మగ కాకి అంటున్నది.
ఆయన చేతిలోకి కొంచెం పచ్చగడ్ది తీసుకున్నాడు. కొంచెం ఎత్తుగా, బలంగా ఉన్న ఒక పెద్ద గొర్రె ముందు కూర్చుని కొంచెం గడ్డి నోట్లో పెట్టాడు. నెమ్మదిగా దాన్ని దువ్వాడు. దాన్ని నడిపించుకుంటూ, తన చేతిలోని గడ్డి దానికి కొంచెం కొంచెం తినిపిస్తూ, దానికి కొంచెం ముందుగా హుందాగా నడవటం మొదలుపెట్టాడు.
ఆయన వెనుకనే ఆ పెద్ద గొర్రె, దాని వెనుకనే కొన్ని గొర్రెలు బయల్దేరాయి. వాటి వెంట మరికొన్ని. తర్వాత మరి కొన్ని. వాటి వెనుక ఇంకా కొన్ని గొర్రెలు ఆ మందలో కలిశాయి. ముందు ఆయన ఆ పెద్ద గొర్రెతో నడుస్తున్నాడు. ఆ పెద్ద గొర్రె వెనకాలే మిగతా గొర్రెలన్నీ వస్తున్నాయి.
అలా అలా నడుచుకుంట్ ఆయన విమానాశ్రయం బయటిదాకా వెళ్ళాడు. ఆ గొర్రెలు కూడా అన్నీ బయటకు వెళ్ళాయి.
విమానం భూమి మీదకు దిగింది. ఎయిర్‍మార్షల్ విమానం దిగి చిరునవ్వు నవ్వాడు.
“భలే... భలే” అన్నది మగ కాకి చప్పట్లు కొడుతూ.
“అరె… మళ్లీ తెలుగులో...“ కోప్పడింది ఆడ కాకి.
“సారీ” అన్నది మగ కాకి, ఈసారి ఇంగ్లీషులో.
“మరి ఆ గ్రౌండ్ ఆఫీసర్‍కి పట్టాభిషేకం ఎప్పుడో…” తెలుగులో అనబోయి, మగ కాకి తిడుతుందేమోనని నాలిక కరుచుకున్నది ఆడకాకి.
కళ్ళు మూసుకుని పెద్ద గొర్రె వెంటే బయటికి వెళ్ళిన గొర్రెల మందనే నోరు తెరుచుకుని చూస్తున్నది మగకాకి.
౦ ౦ ౦
ఈ మధ్య ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మ నిర్మూలన వ్యాఖ్యలు విని ‘నిజం! నిజం!!’ అన్న కాకులు ఎన్నో! హిందూ సమాజం అప్పటికీ, ఇప్పటికీ మీ కథలో లాగానే ఉన్నది. మనల్ని తిట్టినా కనీసం కోపం కూడా రాదు మనకి. అక్షరాలా మీ కథ మాత్రం ‘నిజం’!
అవునండి, ఈ రాజకీయ నాయకులు ప్రతి దాంట్లోనూ ఎందుకు వేలు పెడతారో అర్ధం కాదు. త్రాగటానికి నీళ్ళు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ మొదలైనవేవీ ఇవ్వటం చేతకాక, ఇలా అనవసరమైన అన్ని రంగాలని కెలికి, జనాన్ని విభజించి పాలిస్తున్నారు. మన గొర్రెలు వాళ్ళను గుడ్డిగా అనుసరిస్తున్నారు. ఇదెప్పటికి మారుతుందో!
మంచి కథ సత్యం గారు! కథ పాతదే అయినా ఇప్పటికీ అదే దౌర్భాగ్యం.
ధన్యవాదాలు శ్రీగారు.
బాగుంది సత్యం గారు. కథ ఆనాటిదయినా, ఇప్పటికీ ఇలానే వున్నాయి పరిస్థితులు.
ధన్యవాదాలు శ్రీనిగారు. ఈ కథ మీకు నచ్చినందుకు సంతోషంగానూ, ఈనాటికీ పరిస్థితులు మారక పోవటంతో బాధగానూ ఉంది. సమయం చేసుకుని మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞుడిని.