పెంకుపై పెంకు పేర్చి, ఏడు పెంకులను కూర్చి
బంతితో కూల్చి, మరల గోపురముగా అమర్చి
గెలిచిన పెంకులాట జ్ఞాపకాలు శిధిలమవ్వక
నేటికీ ఏనాటికీ నా తలపెంకు లోపల పదిలమే!
అచ్చనగాయలు ఆడపిల్లకనుచు గుచ్చి గుచ్చి
చెప్పి, మగపిల్లలాడకూడదనుచు ఆక్షేపించి
పట్టుపట్టినవారికి ఆటని ఆటగా చూచుట నేర్పించి
ఆడామగ దూరం సమసేలా నేనాడిన క్రీడాదురం!
మండుటెండలను పిల్ల తెమ్మరలుగ తలచి
చిననాటి నేస్తములందరినీ ఒక్క దగ్గర చేర్చి
ఆరు కట్టెలును, తట్టుటకో బల్లను సమకూర్చి
ఆడిన గల్లీ క్రికెట్టును నేనెలా మరచెదను!
బజారు బంతాటలో వీపు విమానం మోతలు
గిర్రు బొంగరాలాటలు చెట్టుకొమ్మలూగగ కోతులు
గురి ఎరిగి గోలీకాయలు విరివిగ దాగుడుమూతలు
పిల్లకాలువలో ఈతలు విసురుగా ఈలకూతలు!
పరమపదసోపానపటములు గుడుగుడుగుంచములు
ఇసుకలో చుక్కుడుపుల్లలు మట్టిలో త్రొక్కుడుబిల్లలు
దొంగాపోలీసాటలో ఎక్కడి దొంగలక్కడ గప్ చిప్ లు
తొండి ఆటలాడగా ఉడుకు అలకలు, చిఱ్ఱుబుఱ్ఱులు!
కాలచక్రానికి తలొగ్గి అడ్డు తప్పుకుంది నా బాల్యము
అలసిసొలసి అచటనే ఆగిపోయె ఆ ఆటల ప్రాయము
మనస్సాక్షిగా ఆ ప్రాయం నేటికీ నాకు ప్రియమైన గతం
కాలం సాక్షిగా మరల ఆ ఆటలాడాలన్నది నా అభిమతం!