తే.గీ. తెలుగుసాహిత్యసౌరభదీధితులకు
నిలయమౌ సిరిమల్లెకు నిత్యసత్య
మైన నిలువెత్తు నీరాజనాని కిపుడు
తరుణ మాసన్నమయ్యెను సరియగు విధి
ఉ. ఊపిరి పోసికొన్నవి మహోత్తమప్రక్రియ లెన్నొ యిందు, నీ
పాపయె(1) వర్ధమానయయి పల్వురిమానసవీధులన్ గిసా
లోపమ(2)కోమలాంఘ్రుల ముహుర్ధ్వనితంబగు మువ్వసవ్వడుల్
స్థాపితమౌననన్ దిరిగి ధన్యత నొందఁగ నిత్తు దీవెనల్
(1)ఈ సిరిమల్లెబాలయే (2) చిగురులతో సమానమైన
తెలుగు భాష ఆదికవి నన్నయ కంటే ముందుగానే ప్రాచుర్యంలో ఉందని ఆరుద్ర వంటి మహావిశ్లేషకుడు, కవి ఋజువులతో సహా వివరించారు.
అంతటి ప్రాచీనమైన సాహిత్య విలువలతో నిండిన మన మాతృభాష, తెలుగు ప్రాశస్త్యము వర్ణించనలవి కానిది. జంటపదాల జలతారు, హ్రస్వదీర్ఘాల హంగామా, ద్విపద అక్షరాల పదధార, ఐదు వేల పైచిలుకు సామెతలు, పొడుపు కథలు, జనపదాల నుండి జాలువారిన జానపద జావళి, ఎన్నో రకాల ప్రాసలు, వ్యాకరణ అలంకరణలు, నీతికథలు, జీవనసూక్తులు.. ఇలా ఒకటేమిటి ఎన్నో విభిన్నమైన ప్రక్రియలు మన తెలుగు భాషకు మాత్రమే పరిమితం.
మరి, అంతటి ప్రాభవాన్ని కలిగి నేటికీ మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పరిమళిస్తున్న మన తెలుగు భాషను పరిరక్షించి భావితరాలకు అందజేయవలసిన బాధ్యత మనపై తప్పక ఉంటుంది. ఆ భావనతోనే ఒక భాషాప్రేమికుడిగా, విలువైన తెలుగు సాహిత్యరచనలకు ఒక వేదిక ఉండాలనే తపనతో నా శ్రీమతి ఉమాప్రియ మనఃపూర్వకమైన సహకారంతో, మా ఈ “సిరిమల్లె” అంతర్జాలమాసపత్రిక (మా మానస పుత్రిక) ఆగష్టు 2015 లో ఆవిర్భవించింది. నాటినుండి, 133 సంచికలతో నేటికీ అప్రతిహతంగా కొనసాగుతున్నది.
ఈ సాహితీపరమైన పూదోటలో విరులను సేకరించి మార్పులు, చేర్పులు, కూర్పులు చేయడం నా వంతు అయితే, వాటిని తన కార్యదీక్షతో కర్తవ్యనిబద్ధతతో విభిన్నమైన ఆకృతులతో ఎంతో హృద్యంగా అమర్చి పాఠకులకు అంతర్జాలంలో అందించడం ఉమాప్రియ చేస్తున్న మహత్తరమైన నిరంతరకృషి.
ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా మేము చేస్తున్న ఈ సాహిత్యసేవకు సంతృప్తులై, మా ఈ భాషాయజ్ఞానికి ఎంతోమంది రచనల ద్వారా తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కనుకనే సిరిమల్లె అందరిదీ. సాహిత్యాభిమాను లందరూ ఇందులో కుటుంబసభ్యులే అవుతారు.
ఇక ఇప్పుడు ఈ వ్యాసం యొక్క ముఖ్యోద్దేశం గురించి వ్రాస్తున్నాను.
మేము గత పాతిక సంవత్సరాలుగా నివసిస్తున్న శాక్రమెంటో పరిధిలోని తెలుగు సంఘం (TAGS) మరియు సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు మా ఈ సేవను గుర్తించి నాకు, నా శ్రీమతి ఉమకు ఒక అద్వితీయమైన సన్మానంతో చక్కటి గుర్తింపు నిచ్చారు. ఒక స్థానిక సాంస్కృతిక సంస్థ మా సేవలను గుర్తించడం అనేది నిజంగా ఒక గొప్ప అంశమే అవుతుంది.
మరొక్క ముఖ్యమైన అంశం ఈ కార్యక్రమంలో జరిగింది. అదే పుస్తకావిష్కరణ.
ఈ మొత్తం కార్యక్రమానికి సూత్రధారి ప్రధానపాత్రధారి అయిన శ్రీయుతులు వెంకట్ నాగం గారు మన సిరిమల్లె పాఠకులకు సుపరిచితులే. ఆయన అందిస్తున్న ‘రచ్చబండ’ శీర్షిక సిరిమల్లెలో గత మూడు సంవత్సరాలుగా వినూత్న ప్రస్తుత అంశాలతో పాఠకులను ఎంతో ఉన్నతంగా అలరిస్తున్నది. వెంకట్ నాగం గారు రచించిన “రచ్చబండ చర్చలు” మరియు “కలగూర గంప” పుస్తకాలను నేను ఆవిష్కరించడం నాకు నిజంగా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే పుష్కరకాలంగా వెంకట్ గారితో నాకు సాహిత్యానుబంధం ఉంది.
ఇక, ఆ కార్యక్రమ వివరాలు విశదీకరిస్తాను.
కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో శివారు నగరమైన ఫాల్సమ్‌లో, శాక్రమెంటో తెలుగు సంఘం మరియు సువిధ ఇంటర్నేషనల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు సాహిత్య వేదిక కార్యక్రమం ఆదివారం, సెప్టెంబర్ 27, 2026 సాయంత్రం 5 గం.కు వేడుకగా మొదలయింది. తెలుగు సాహిత్య అభిమానులు, రచయితలు, స్థానిక తెలుగు ప్రముఖులు, యువత, అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఒక సాహిత్యోత్సవంగా మార్చారు. తెలుగు సాంప్రదాయం, సాహిత్యం మరియు భాషపై లోతైన ప్రేమను ప్రతిబింబించేలా ఈ వేదికలో జరిగిన కార్యక్రమాలు అందరి మనసులను హత్తుకున్నాయి.
ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానించడమే కాకుండా సిరిమల్లె అంతర్జాలపత్రిక శతసంచికల మైలురాయిని దాటి నిరాఘాటంగా ముందుకు సాగుతున్న తరుణాన్ని పురస్కరించుకుని సంపాదకులమైన మా ఇరువురికి (ఉమా, మధు బుడమగుంట దంపతులకు) శాక్రమెంటో తెలుగు సంఘం, సువిధ ఇంటర్నేషనల్ సంస్థ నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. తెలుగు భాష, సాహిత్యం అభివృద్ధికి సిరిమల్లె పత్రిక మాధ్యమంగా గత 11 ఏళ్ళుగా మేము చేస్తున్న సేవలను శాక్రమెంటో తెలుగు సంఘం, సువిధ ఇంటర్నేషనల్ సంస్థ నాయకులు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలను బహూకరించడంతో పాటు శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా సిరిమల్లె పత్రిక శతమసంచిక పోస్టర్‌ను కూడా ఆవిష్కరించడం జరిగింది.
మరో ఆనందకరమైన విషయం మా ఇరువురిని ఆశ్చర్యపరించింది. మాకు చిరకాల మిత్రులుగా ఉన్న చాలామంది స్నేహితులు, ఆత్మీయులు స్వచ్ఛందంగా విచ్చేసి మమ్ములను అభినందనలతో, బహుమతులతో ఆశీర్వదించారు. ఇది మా ఇరువురి మనసులను మరింతగా సంతృప్తి పరిచింది.
అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ నేను కొంచెం సేపు మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిలో ఒక కవి దాగి ఉన్నాడు అని చెబుతూ కవి అంటే
‘కడు జాగ్రత్తగా సనాతన సాహిత్య ధర్మాలను స్థిరీకరిస్తూ, కాలానుగుణంగా వితరణతో ఆలోచనల భావజాలాలకు అక్షరరూపం కల్పించే ఒక శిల్పి. అని చెప్పి ఇదే మరో రకంగా చెప్పుకోవచ్చు’ అంటూ ‘కడు సునిశితంగా వీక్షించి, విశ్లేషించి తద్వారా తనలో ఉద్భవించిన ఆలోచనల ప్రవాహానికి అక్షరాల ద్వారా ఒక రూపం కల్పించి అందరికీ అందించేవాడు’ అని నిర్వచించి “మీలోని భావుకతని మీదైన శైలి లో పదిమందికి పంచుకునేందుకు మన సిరిమల్లె వేదికను ఉపయోగించుకోండి.” అని మరోసారి ఔత్సాహిక రచయితలకు మరియు భాషాప్రేమికులకు నేరుగా చెప్పే అవకాశం నాకు కలిగింది. అలాగే ఎక్కువమంది స్థానిక తెలుగు అభిమానులను నేరుగా కలిసే అవకాశం కూడా కలిగింది. అందుకు, సభకు విచ్చేసిన అందరికీ మరియు కార్య నిర్వాహక బృందానికి అందరికీ అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ఈ సాహిత్య వేదిక కార్యక్రమంలో తరువాతి అంశంగా వెంకట్ నాగం గారు రచించిన “రచ్చబండ చర్చలు” మరియు “కలగూర గంప” పుస్తకాల ఆవిష్కరణ నా పర్యవేక్షణలో జరగడం నాకు ఎంతో తృప్తి నిచ్చింది. వ్యాస సంపుటిగా వెలువడ్డ ఈ రెండు పుస్తకాలు - సమాజం, జీవన విలువలు, సాంస్కృతిక అంశాలు, అనుభవాలపై రచయిత వెంకట్ నాగం గారి ప్రత్యేక దృష్టిని ప్రతిబింబిస్తాయని నా అభిప్రాయము.
వెంకట్ గారి విషయ సమీకరణ, సంగ్రహణ, విశ్లేషణ సామర్ధ్యం అత్యంత అద్బుతం, మెచ్చుకోదగ్గది. రచ్చబండ అనే శీర్షిక ద్వారా విలువకట్టలేని సమాచారాన్ని ఓపికగా స్వదస్తూరితో సిరిమల్లె పాఠకులకు అందించి నిజమైన సాహితీసేవకులు అనిపించుకున్నారు. ఈ రచ్చబండ లోని అంశాలను పరికిస్తే బహుశా పాత్రికేయ వృత్తిలో ఉన్న వారు కూడా ఇంత విపులంగా వ్రాయలేరేమో అని అనిపిస్తుంది.
పుస్తక ఆవిష్కరణ గురించి నేను మాట్లాడిన తరువాత పుస్తక రచయిత వెంకట్ నాగం గారు మాట్లాడుతూ తన రచనలకు స్ఫూర్తిగా నిలిచిన ఎన్నో తెలుగు దినపత్రికల సంపాదకీయం పేజీలు, అవి తనను ఎందుకు ఆకర్షించాయి, వ్యాసరచనకు కావాల్సిన ముఖ్య అంశాల ఎంపిక, పాఠకులతో అనుసంధానానికి అనివార్యమైన చక్కని ఉపోద్ఘాతం, నేపథ్యం, ప్రధాన వాదోపవాదనలు, లోతైన విశ్లేషణలు, సందర్భానుసారంగా చారిత్రాత్మక ఉదాహరణల ప్రస్తావన, విస్తృత ఆలోచనలు, చివరిగా వ్యాసానికి అనివార్యమైన సమగ్రమైన ముగింపు వంటి అంశాలను వెంకట్ నాగం గారు సోదాహరణంగా వివరించారు. ఈ సందర్భంగా పలు అంతర్జాతీయ తెలుగు సదస్సులలో పరిశోధనాపత్రాల సమర్పణకు విలువైన సూచనలు చేసి ప్రోత్సహించిన పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారికి, 2023 నుండి రచ్చబండ చర్చల వ్యాస ధారావాహికలను ప్రోత్సహించిన సిరిమల్లె సంపాదకులకు, ఈ రెండు వ్యాస సంపుటి పుస్తకాలను ప్రచురించిన వంగూరి ఫౌండేషన్ అధినేత వంగూరి చిట్టెన్ రాజు గారికి, తన 25 ఏండ్ల సాహిత్య ప్రయాణానికి సహకరించిన సహధర్మచారిణి వాణి గారికి వెంకట్ నాగం గారు సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సాహిత్య వేదిక కార్యక్రమం, ప్రవాస తెలుగు ప్రజలకు భాషతో అనుబంధాన్ని మరింత బలపరచడమే కాక, కొత్త రచయితలకు ప్రోత్సాహాన్ని అందించే వేదికగా నిలిచిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తూ మరిన్ని ఇటువంటి వేదికలను ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. స్థానిక గోంగూర గ్రూపు నుండి దివాకర్ - శ్రీదేవి సోమంచి, కృష్ణ కిషోర్, అబ్దుల్ షేక్ కమ్మని తెలుగు గీతాలను ఆలపించారు. కృష్ణ కిషోర్, శాంకరి తమ వ్యాఖ్యానంతో సభ ఆసాంతం వీక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ సన్మాన మరియు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం దిగ్విజయం కావడానికి ముఖ్యకారకులై, కార్యనిర్వాహక సభ్యులైన శాక్రమెంటో తెలుగు సంఘం TAGS (Telugu Association of Greater Sacramento) చైర్మన్ నాగ్ దొండపాటి, అధ్యక్షుడు శ్యాం ఏలేటి, ఉప అధ్యక్షురాలు శాంకరి చీదెళ్ళ, జాయింట్ సెక్రటరీ శ్రీదేవి ఆళ్ళ మరియు ‘సువిధ ఇంటర్నేషనల్ సంస్థ’ తరపున అధ్యక్షుడు భాస్కర్ వెంపటి, సువిధ బోర్డు సభ్యులు బాలు, పద్మప్రియ, అవినాష్, ఇంకా పలువురు కార్యకర్తలు సహకరించారు. ఫాల్సమ్‌లోని స్థానిక రుచి రెస్టారెంట్ ఈ సాహిత్య సమావేశానికి ఆతిథ్యమిచ్చి - వడ్డించిన పసందైన విందు భోజనంతో నేటి కార్యక్రమం ముగిసింది. ఇది నిజంగా సిరిమల్లె పత్రికకు ఒక ప్రత్యేకమైన ఉనికిని, ఉన్నతస్థానాన్ని అందించిందని మా దంపతుల ఇరువురి భావన. తెలుగు సాహిత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ వేడుక ఒక మరపురాని సాహిత్యానుభూతిని అందించిందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సిరిమల్లె సాహితీ విలువల పరిరక్షకుడు అయ్యగారి సూర్యనారాయణమూర్తి గారు, మరికొంతమంది ఆత్మీయులు మాకు పంపిన అభినందనల మాటలతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
సిరిమల్లెకు సింహాసనం
మ.కో. ఎంత చక్కని వార్త దెల్పిరొ యెట్లు పల్కగ శక్యమౌ?
నంత యిర్వురిసాధనాఫల, మంద ఱెంతగ మెచ్చిరో!
స్వాంతముల్ గగనానఁ బర్విడు సంబరంబులఁ జూడఁగా
సుంత చాలవు రెండు కన్నులు, శోభకే యిది శోభయౌ
-- అయ్యగారి సూర్యనారాయణమూర్తి --
సిరిమల్లె అంటే కాదు ఒక పొత్తం
అది ఉల్లము లలరించే మధుర భావ సమ్మేళనం
ఉమా- మధుల విశేష వైభవం.
వంద ప్రతులు అన్న పదం ఒక సంఖ్యకు కాదు పరిమితం
అది అనంత సారస్వత ఝరి గమనం
కృతికర్తల మనో విరచిత కల్పనా వికాసం
పాఠకుల డెందము స్పర్శించే సుమధుర సాహితి సుగంధం.
ఎల్లలు దాటిన తేట తెలుగు ప్రభంజనం
సాగాలి ఈ పయనం ఓ యజ్ఞమయి అనవరతం
-- సౌందర్య కావటూరు --
ఉమ, మధుగార్లకు అభినందనలు!
మీకు సన్మానం జరగడం మాకొక పండుగ.
తోటలోని సిరిమల్లె చెట్టుకు ఉన్న పువ్వులన్నీ
ఒక్కసారి వికసించి సుగంధపరిమళాలు
వ్యాపింపజేస్తే కలిగే
ఆనందానుభూతి చెప్పలేనంత.
మీకు జరిగిన సన్మానం కూడా మాకు
అటువంటి అనుభూతి కలిగించింది.
ఇకపై ఇటువంటి సన్మానాలు ఎన్నో
మరెన్నో జరగాలి.
మీ సిరిమల్లె సంచికాస్రవంతి నిరంతరం కొనసాగాలి.
-- అయ్యగారి రాజేశ్వరి --
బుడమగుంట వారి ఇంట పండగంట ………..
అదివో అల్లదివో మన సిరిమల్లె వచ్చె
గుబాళించు గమ్మత్తైన సాహిత్య సువాసనలు తెచ్చె ॥
ఉమా మధుల అనుంగు పుత్రికకు
శత సంచికల వైభవము అప్పుడే వచ్చేనా అని అందరూ మెచ్చె ॥
వహ్‌వా …. బహు బాగు మీరిరువురికీ సన్మానము చేయుట…
ఈ శుభ సందర్భంగా …
మీ ముద్దుబిడ్డ మరిన్ని ఎన్నో వసంతములు జరుపు కొనవలెనని ఆశించుతూ…
అందుకోండి ఈ మా హృదయపూర్వక శుభాభినందనములు !!
-- రాజశ్రీ దేవర్సు --
ప్రియమైన మధు, ఉమా,
శత సంచికల మైలురాయిని అధిగమించి ముందుకు సాగుతున్న మీ ఇరువురికీ హృదయ పూర్వక అభినందనలు. మీ నిస్వార్థ సేవా భావం, కృషి వలన సిరిమల్లె పత్రిక దేదీప్యమానమైన ఉన్నత సాహిత్య విలువలతో స్థిరంగా ముందుకు సాగుతూ నేడు ఈ గుర్తింపును సాధించింది. ఈ మధురక్షణాలు మీకు నిత్య స్ఫూర్తిని కలిగిస్తూ సిరిమల్లె పత్రిక మరిన్ని వినూత్న రచనా ప్రక్రియలతో అలరించేందుకు ఒక ఉత్ప్రేరకం గా పనిచేస్తూ ఉండాలని కోరుకుంటూ, మీకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను.
-- మురళీకృష్ణ దేవర్సు --
హార్దిక శుభాభినందనలు ఉమాగారు, మధుగారు.