వీక్షణం(కాలిఫోర్నియా) 14వ వార్షికోత్సవం 2026 సెప్టెంబరు 18,19 వ తారీఖుల్లో కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ లో ప్రత్యక్షంగాను, అంతర్జాలంలోనూ అత్యంత ఘనంగా జరిగింది.
పదునాలుగు వత్సరాలు, నూట అరవై ఎనిమిది నెలల పాటు నూట అరవై ఎనిమిది సాహితీ సమావేశాలలో అనేక ప్రసంగాలు, సాహితీ చర్చలు, కవి సమ్మేళనాలు, వందలాది కవులు, వారి కవితలు. ప్రపంచలోనే ఇది అత్యంత ఎన్నదగిన విషయం.
'తెలుగుభాష కనుమరుగౌతుందా?' అని ప్రపంచం భయపడుతున్న వేళ కాలిఫోర్నియాలో 2012లో డా.కె.గీతామాధవి గారిచే స్థాపించబడిన వీక్షణం సాహితీ గవాక్షం ఒక ఉద్యమంగా తెలుగుభాష, సాహిత్యాలపై ఎనలేని ప్రీతితో గత 14 ఏళ్లుగా నెలనెలా క్రమం తప్పకుండా సాహితీ సమావేశాలు జరుపుకుంటూ ఉంది.
సెప్టెంబరు19న కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ లో శ్రీమతి షంషాద్, శ్రీ అబ్దుల్లా గార్ల ఇంట ప్రత్యక్షంగా జరిగిన వీక్షణం(కాలిఫోర్నియా) 14వ వార్షికోత్సవ సమావేశం ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది.
ఈ సమావేశంలో ముందుగా వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి గారి ఆహ్వానం తరువాత శ్రీ కిరణ్ ప్రభ, శ్రీమతి కాంతి కిరణ్, డా.సురేందర్ రెడ్డి, శ్రీ సి. భాస్కరరావు, శ్రీమతి రమణ, శ్రీమతి శారద కాశీవఝల, శ్రీమతి షంషాద్ గార్ల ఆధ్వర్యంలో వీక్షణం ప్రత్యేక సాహితీ సంచిక, సమావేశాల సమీక్షల సంచికల ఆవిష్కరణ జరిగింది. తరువాత శ్రీ కిరణ్ ప్రభ గారి చేతుల మీదుగా శ్రీ వెంకట్ నాగం గారి వ్యాస సంపుటులు కలగూర గంప, రచ్చబండ చర్చలు పుస్తకాలు, డా.కె.గీతగారి కాలమ్స్ పుస్తకం, అనగనగా అమెరికా ఆవిష్కరణ జరిగింది. కిరణ్ ప్రభ గారు క్లుప్తంగా పుస్తకపరిచయాలు చేసి, రచయితలను అభినందించారు.
తరువాత వరుసగా సభ్యుల ఆత్మీయ పరిచయాలు, తేనీటి విందు, కిరణ్ ప్రభ గారి "జిడ్డు కృష్ణమూర్తి జీవనాదర్శం" ప్రసంగంతో సమావేశం సాయంత్రం వరకు కొనసాగి ఆసక్తికరంగా ముగిసింది.
సెప్టెంబరు 18/19లలో వీక్షణం అంతర్జాల సమావేశం గీతగారి తొలిపలుకులతో ప్రారంభమైంది. 'వీక్షణం' దాదాపు 30 మందితో ప్రారంభమై క్రమంగా కాలిఫోర్నియా దాటి ప్రపంచవ్యాప్తం ఎలా అయినదీ క్లుప్తంగా వివరించారు.
అనంతరం వీక్షణం భారతీయ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు ఈనాటి ముఖ్య అతిథులైన డా. నాగభైరవ ఆదినారాయణ గారినీ, శ్రీమతి తేళ్ల అరుణగారినీ వేదికపైకి ఆహ్వానించి సభకు పరిచయం చేశారు.
శ్రీ నాగభైరవ ఆదినారాయణగారు ప్రకాశం జిల్లాకు చెందిన వారు. ప్రఖ్యాత కవి నాగభైరవ కోటేశ్వరరావుగారికి సోదరులు. నాగభైరవ సాహిత్య పీఠం వ్యవస్థాపకులు. దాదాపు ఎనభై పైగా రచనలు చేశారు. అందులో 'మట్టి బండి' అనేక భాషల లోకి అనువదించబడ్డది. వీరికి 2002లో ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు వచ్చింది. గిడుగు వారి అవార్డు, ఆచార్య రంగా అవార్డు 2025 లో జీవన సాఫల్య పురస్కారం మొ. నవి అందుకున్నారు.
శ్రీ నాగభైరవ ఆదినారాయణగారు ప్రసంగిస్తూ 'కవిత్వం అనేది అందరికీ అర్ధం కావాలి. ఉపమాన ఉపమేయాల నడుమ భావం చెడరాదు' అన్నారు. వీక్షణం 14వ వార్షిక ప్రత్యేక సంచికను ఆవిష్కరించి, అందులో గీతగారు, ప్రసాదరావు రామాయణం, రాజేంద్రప్రసాద్, మౌనశ్రీ, విశ్వైక మొ.న వారి కవితలను సమీక్షించారు.తదుపరి బాలవ్యాకరణం ఆవశ్యకత గురించి విపులంగా ప్రసంగించారు.
శ్రీమతి తేళ్ల అరుణగారు వీక్షణం సాహితీ సమావేశాల సమీక్షలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. వీరు కూడా ప్రకాశం జిల్లాకు చెందిన వారే. 40 సం.రాలకు పైగా మహిళాభ్యుదయానికి, సామాజిక సేవకు పాటుబడుతున్నారు. న.ర.సం అనే సాహిత్య సంస్థను నడుపుతున్నారు. వర్ణాంతర వివాహాలను చేశారు. నంది అవార్డు సభ్యురాలు. వీక్షణం ప్రత్యేక సంచిక గురించి మాట్లాడుతూ సంచికలోని కవులందరినీ ప్రశంసించారు.
తదుపరి శ్రీ ప్రసాదరావు రామాయణం గారు ప్రత్యేక సంచికా పరిచయ ప్రసంగం చేసారు. ప్రత్యేక సంచికలో 103 కవితలున్నాయనీ ఆరు వ్యాసాలు, ఒక కథ ఉన్నాయనీ, అందు 38 కవయిత్రుల కవితలున్నాయనీ చెప్పారు. అందు సామాజిక రుగ్మతలపై, భగవద్భక్తి, దేశభక్తి, స్త్రీవాద, ప్రేమ కవితలున్నాయని చెప్పారు. గీతగారి తక్కెడ కవితనూ, ఆలపాటి అమ్మాయి స్త్రీవాద కవితనూ ఉషారాణి, రాధాకుసుమ గంటి జానకిగారి గజల్ ను, మౌనశ్రీ మల్లిక్ గారి కవితనూ, ఏనుగు నరసింహారెడ్డి గారి కవితనూ, విశ్వైక గారి కవితనూ, దీకొండ చంద్రకళ గారి కవితనూ, పరుచూరి నాగేంద్రమ్మ గారి కవితనూ,దేవులపల్లి పద్మజగారి కవితనూ ప్రత్యేకించి చిన్మయి గారి కవితనూ సమీక్షించడం జరిగింది.
ఆపై శ్రీ రాజేంద్ర ప్రసాద్, శ్రీమతి రాధాకుసుమగార్ల ద్వంద్వ సారథ్యంలో కవి సమ్మేళనం ప్రారంభమైంది. ఇందులో వసీరా, మౌనశ్రీ మల్లిక్ మొదలైన ఉద్దండులైన 40 మంది కవులు వారికవితలు వినిపించారు. వారిలో అధికులు కవయిత్రులు కావడం విశేషం. కవితలన్నీ వీనుల విందుగా వుండి అందరినీ అలరింప చేశాయి. చివరిగా డా.గీతామాధవి, రాజేంద్రప్రసాద్ గార్ల వందన సమర్పణతో సభ విజయవంతంగా సమాప్తం అయ్యింది.
ఈ రెండు సమావేశాల వీడియోల లింకులు, ఫోటోల లింకులు, వీక్షణం ప్రత్యేక సంచికల లింకులు కింద ఇవ్వబడ్డాయి.
- వీక్షణం అంతర్జాల & ప్రత్యక్ష సమావేశ ఫోటోలు
- అంతర్జాలంలో జరిగిన వీక్షణం సమావేశ వీడియో
- కాలిఫోర్నియాలో జరిగిన వీక్షణం ప్రత్యక్ష సమావేశ వీడియో