Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

అదిగో పోర్చుగల్ లిస్బొవా

గత నెల మిత్రుడి కుమారుడి డెస్టినేషన్ వెడ్డింగ్ (ఇంటికి దూరంగా పెళ్ళి) ఆహ్వానం మేరకు పోర్చుగల్ రాజధాని లిస్బాన్ (లిస్బొవా), స్విట్జర్లాండ్ సందర్శించే అవకాశం కలిగింది. పెళ్ళి అంటే ముందుగా నాకు గుర్తు వచ్చేది "పెళ్లి పుస్తకం" చిత్రంలోని "శ్రీరస్తు శుభమస్తు" పాటలోని "కల్యాణం కమనీయం" చరణం. పెళ్లి పుస్తకం (1991) సినిమాలోని ఈ అందమైన పాటను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల ఆలపించగా కె.వి. మహదేవన్ సంగీతం అందించారు. తెలుగింట ఈ పాట వినిపించని పెళ్ళి మండపం ఉండదంటే అతిశయోక్తి కాదు. అంగరంగ వైభవంగా జరిగిన మిత్రుడి కుమారుడి పెళ్లి సందర్భంగా రెండు రోజులు తీరిక చేసుకొని నేను బయట తిరిగిన సమయంలో పోగుచేసుకున్న అనుభవాలు, జ్ఞాపకాలు మీతో పంచుకోవాలని అనిపించింది. ఇంకెందుకు ఆలస్యం సరాసరి లిస్బాన్ కు వెళ్దాం.

నాకు తొలిసారి కనిపించిన క్షణం నుంచే ఆకట్టుకుంది లిస్బాన్ నగరం. టాగస్ నది తీరంలో వెలుగు జలపాతంలా మెరిసే ఈ నగరం యూరప్‌లో పడమటి అంచు వద్ద నిలిచిన పోర్చుగల్ పురాతన రాజధాని ఇది. శతాబ్దాల చరిత్రను మోసుకుంటూ, దానితో పాటూ ఆధునిక జీవనశైలిని స్వాగతిస్తూ నిలిచే అద్భుతమైన నగరం ఇది. లిస్బాన్ నగరంలోని మొనాస్టరీ ఆఫ్ సావో విసెంటే డి ఫోరా భవనం పైభాగం నుండి, మరియు ఆ కొండ పరిసరాల వద్ద నిలబడి చూస్తే లిస్బాన్ చారిత్రాత్మక ప్రాంతాల యొక్క 360 డిగ్రీల అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. అక్కడి నుండి కనిపించే ప్రధాన ఆకర్షణలు ఇవే:

ది నేషనల్ పాంథియోన్ - ఈ మొనాస్టరీకి చాలా దగ్గరలోనే ఉండే ఈ చారిత్రాత్మక కట్టడం యొక్క భారీ తెల్లటి గుమ్మటం స్పష్టంగా కనిపిస్తుంది. లిస్బాన్ జాతీయ పాంథియోన్ భవన నిర్మాణానికి 284 ఏళ్లు పట్టిందట. 1682లో చర్చ్ ఆఫ్ శాంటా ఎంగ్రేసియా పేరుతో ఈ భవన నిర్మాణం ప్రారంభమైంది. 1712 లో ప్రధాన శిల్పి కాలం చేయడంతో పనులు ఆగిపోయాయి. అప్పటినుండి దాదాపు మూడు శతాబ్దాల పాటు ఈ భవనానికి పైకప్పు లేకుండానే ఉండిపోయింది. 1966 లో చివరకు ఈ ప్రాజెక్ట్ పూర్తయి, జాతీయ పాంథియోన్‌గా అధికారికంగా ప్రారంభించబడింది. నత్తనడకలా సుదీర్ఘ కాలం సాగిన ఈ నిర్మాణం కారణంగా పోర్చుగీస్ భాషలో ఒక ప్రసిద్ధ సామెత పుట్టింది. ఎప్పటికీ తెమలని, అనంతంగా సాగే పనులను అక్కడ "ఓబ్రాస్ డి శాంటా ఎంగ్రేసియా" (శాంటా ఎంగ్రేసియా పనులు) అని పిలుస్తారు. ఈ ఆలస్యానికి కారణంగా ఇంకో కథనం కూడా ప్రచారం ఉంది. దొంగతనం నేరంపై అన్యాయంగా ఉరిశిక్షకు గురైన ఒక అమాయకుడు, ఈ భవనం ఎప్పటికీ పూర్తికాకూడదని శపించాడంట. అయితే ఈ శాపాల నేపథ్యం మన పురాణాలలోనే కాదు పోర్చుగీసు వారికి కూడా ఉన్నదన్నమాట.

టాగస్ నది - లిస్బాన్ ను ఆనుకుని ప్రవహించే ఈ విశాలమైన నది, అందులో ప్రయాణించే క్రూయిజ్ షిప్‌లు, పడవలు మరియు నదికి అవతలి వైపు ఉన్న ప్రాంతాలు లిస్బాన్ నుండి చాలా అందంగా కనిపిస్తాయి. లిస్బాన్ నగరంలోనే అత్యంత పురాతనమైన ఈ అల్ఫామా ప్రాంతంలోని ఇరుకైన వీధులు, తెల్లటి గోడల ఇళ్లు, మరియు వాటిపై ఉండే నారింజ రంగు టెర్రకోట పెంకుటి ఇళ్ళ కప్పులు ఒక అందమైన దృశ్యంగా కనిపిస్తాయి. పక్కనే ఉన్న కొండపై గంభీరంగా దర్శనమిచ్చే చారిత్రాత్మక మూరిష్ కోట ఇక్కడి నుండి కనిపిస్తుంది. పోర్చుగల్‌లోని మూరిష్ కోట చరిత్ర క్లుప్తంగా చెప్పుకుందాం. ఈ కోటను 8వ లేదా 9వ శతాబ్దంలో ఇస్లామిక్ పాలన కాలంలో నిర్మించారు. కొండలపై పాములా మెలికలు తిరుగుతూ ఉండే రాతి గోడలు, పచ్చని ప్రకృతి మరియు అట్లాంటిక్ మహాసముద్రం కనిపించే అద్భుతమైన చిత్రం దీని నుండి కనిపిస్తుంది. 1108లో కింగ్ సిగుర్డ్ నాయకత్వంలోని నార్వేజియన్ వైకింగ్ క్రూసేడర్లు ఈ కోట పై దాడి చేసి కొద్దికాలం పాటు దీనిని స్వాధీనం చేసుకున్నారు. కానీ తరువాత మూర్‌లు దానిని తిరిగి చేజిక్కించుకున్నారు.  1147లో, పోర్చుగల్ మొదటి రాజు అయిన అఫోన్సో హెన్రిక్స్ మూర్‌ల నుండి కీలకమైన లిస్బాన్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. చివరిగా 1147లో జరిగిన విజయం ఈ కోటపై ఇస్లామిక్ పాలనకు శాశ్వతంగా ముగింపు పలికింది. లేకపోతే ఈ పాటికి లిస్బాన్ బహుశా కొంత పోర్చుగల్ ముస్లిం దేశంగా ఉండేది.

ఈ ప్రాంతాలన్నీ మేము అందంగా ప్లాస్టిక్ పూలతో అలంకరించిన ఒక పెద్ద ఆటో లో వెళ్ళాము. ఇది బ్యాటరీతో నిశ్శబ్దంగా నడిచే ఆటో. ఆటో రథ చోదకురాలి పేరు నికోల్ టావెరెస్ అనే ఒక వనిత. ఆమె ఒకప్పటి పోర్చుగల్ వలస దేశమైన బ్రెజిల్ నుండి ఇక్కడకు వచ్చి సైకాలజీ లో డిగ్రీ చేస్తున్నదట. అయితే ఆమె చెప్పినదాని ప్రకారం ఆమె ముత్తాతల దేశమైన పోర్చుగల్‌లో మాట్లాడే పోర్చుగీసు భాషకు, బ్రెజిలియన్ పోర్చుగీసుకు తేడా ఉందట. మొదట రెండు మూడు నెలలు తనకు లిస్బాన్ నగరంలో మాట్లాడే పోర్చుగీసు భాష తనకు అర్థం కాలేదని ఆమె చెప్పింది. పోర్చుగల్ లో ఉండేవారు మాట్లాడే పోర్చుగీసు భాషలో  కొన్ని అక్షరాలను కొంత బద్దకంతో పలకడం మానేశారట. పాపం ఈ గొడవ తెలియని అక్కడెక్కడో ఉన్న బ్రెజిల్ లో పోర్చుగీసు భాష మాట్లాడే వారు పాత భాషనే కొనసాగిస్తున్నారట. నేను బస చేసిన హోటల్ లో రూం తాళాలు అందించిన హోటల్ ఉద్యోగి కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు - బద్దకంతో పోర్చుగల్‌లో ఉండే వారు కొన్ని అక్షరాలను పలకడం లేదని. మన తెలుగు వారు సంభాషణలలో అక్షరాల సంగతి అటుంచి ఏకంగా పదాలనే లేపేస్తున్నారు, ఇంగ్లీషు భాష పై మోజుతో తెలుగు పదాల మధ్య అలవోకగా కొన్ని ఆంగ్ల పదాలను సర్దేస్తున్నారు. ఈ ఆంగ్ల పదాలకు మధ్య దాగున్న తెలుగు పదాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి కొన్ని పట్టణ ప్రాంతాలలో ఉంది. కొన్నాళ్ళకు తెలుగు భాష లో అచ్చ తెలుగును దుర్బిణి వేసి వెతికే పరిస్థితి వస్తుందేమో!

లిస్బాన్‌లో ఉన్న రువా ఆగస్టా విజయ తోరణం కట్టడం గురించి చెప్పుకుందాం. ఇది పోర్చుగల్ రాజధాని లిస్బాన్‌లోని 'కామెర్సియో స్క్వేర్' ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడం. చూడడానికి ముంబై నగరంలో ఉన్న ఇండియా గేట్ కట్టడంలా ఇది ఉంటుంది. దీనికొక నిర్మాణ నేపథ్యం ఉంది. 1755లో సంభవించిన తీవ్ర భూకంపం మరియు సునామీ వల్ల లిస్బాన్ నగరం పూర్తిగా ధ్వంసమైంది. ఆ విపత్తు తర్వాత నగరాన్ని తిరిగి పునర్నిర్మించినందుకు గుర్తుగా, మరియు పోర్చుగీస్ ప్రజల పునరుత్థానానికి ప్రతీకగా ఈ చారిత్రాత్మక తోరణాన్ని నిర్మించారు. దీని నిర్మాణం 1775లో ప్రారంభమైనప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆగిపోయి, చివరకు 1875లో పూర్తయింది. నత్తనడకను మరపించేలా ఆలస్యంగా పని చెయ్యడం బహుశా పోర్చుగీస్ వారి రక్తంలో ఉందేమో!

పేనా జాతీయ రాజప్రసాదం కోట - ఇది పోర్చుగల్ దేశంలోని సింట్రా అనే కొండ ప్రాంతంలో ఉన్న ఒక అద్భుతమైన కోట వంటి ప్యాలెస్. అయితే అందరూ సిట్రా అని పిలుస్తారు, అంటే బద్దకంతో మధ్యలో ఒక అక్షరాన్ని లేపేసారన్నమాట. ఈ కోట ప్రపంచంలోని అత్యంత అందమైన మరియు రంగులమయమైన ప్యాలెస్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ కోట సింట్రా కొండలపై చుట్టూ దట్టమైన అడవుల మధ్య చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. 19వ శతాబ్దంలో (1854లో) పోర్చుగల్ రాజు కింగ్ ఫెర్డినాండ్ ఈ ప్యాలెస్‌ను ఒక పురాతన మొనాస్టరీ శిథిలాలపై నిర్మించారు. కొండ ప్రాంతంలో మేఘాలను తాకుతూ ఉండే ఈ కోటను అప్పట్లో దీనిని రాయల్ ఫ్యామిలీ తమ వేసవి విడిదిగా ఉపయోగించేవారు. ఈ ప్యాలెస్ ప్రత్యేకత ఏమిటంటే, దీనికి వాడిన పసుపు, ఎరుపు మరియు నీలం రంగులు. ఇది రొమాంటిసిజం ప్రత్యేక శిల్పకళా శైలిలో నిర్మించబడింది. ఇందులో గోతిక్, ఇస్లామిక్ (మూరిష్), మరియు పునరుజ్జీవన శైలుల అద్భుతమైన కలయిక కనిపిస్తుంది. ఈ ప్యాలెస్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది మరియు దీనిని పోర్చుగల్ దేశపు "ఏడు వింతలలో" ఒకటిగా ఎంపిక చేశారు.

పోర్చుగల్ రాజధాని లిస్బాన్‌లోని అత్యంత ప్రసిద్ధ మరియు చారిత్రాత్మక ప్రాంతమైన బెలెమ్ గురించి పూర్తి సమాచారం తెలుగులో బెలెమ్ అనేది లిస్బాన్ నగరంలో టాగస్ నది ఒడ్డున ఉన్న ఒక అందమైన తీర ప్రాంతం. 15వ మరియు 16వ శతాబ్దాలలో పోర్చుగీస్ నావికులు ప్రపంచ యాత్రలకు ఇక్కడి నుంచే తమ ఓడల్లో బయలుదేరారు. అందుకే దీనిని "ఏజ్ ఆఫ్ డిస్కవరీ" కి పురిటిగడ్డగా పిలుస్తారు. టాగస్ నది ఒడ్డున ఉన్న ఈ అద్భుతమైన కోటను 16వ శతాబ్దంలో నిర్మించారు. ఇది శత్రువుల నుండి నగరాన్ని రక్షించడానికి మరియు భారతదేశం వంటి దేశాలకు వెళ్లే నావికులకు వీడ్కోలు పలకడానికి ఒక ద్వారంగా ఉపయోగపడేది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. సముద్రయానాలు చేసిన పోర్చుగీస్ నావికులు, రాజులు మరియు మ్యాప్‌లు తయారు చేసినవారి జ్ఞాపకార్థం నది ఒడ్డున నిర్మించిన ఒక భారీ స్మారక చిహ్నం ఇది. ఇది ఒక పెద్ద ఓడ ఆకారంలో ఉంటుంది. జెరోనిమోస్ మొనాస్టరీ ఈ సుందరమైన ఆశ్రమం పోర్చుగీస్ శిల్పకళా వైభవానికి నిదర్శనం. ప్రసిద్ధ ప్రపంచ యాత్రికుడు వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొని విజయవంతంగా తిరిగి వచ్చినందుకు గుర్తుగా దీనిని నిర్మించారు. ఇక్కడే ఆయన సమాధి కూడా ఉంది.

వాస్కోడిగామా మే 20, 1498 న భారతదేశాన్ని కనుగొన్నారు. ఐరోపా నుండి ఆఫ్రికా ఖండం చుట్టూ సముద్ర మార్గం ద్వారా ప్రయాణించి, భారతదేశంలోని కేరళ తీరంలో ఉన్న కలికట్ (ప్రస్తుత కోజికోడ్) సమీపంలోని కప్పాడ్ ప్రాంతానికి ఆయన చేరుకున్నారు. సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి చేరుకున్న మొదటి యూరోపియన్ ఆయనే. ఐరోపా దేశాలలో మిరియాలు, లవంగాలు, దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాలకు, పట్టు మరియు విలువైన రత్నాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ముస్లిం, ఒట్టోమన్ మరియు వెనిసియన్ వ్యాపారుల నియంత్రణలో ఉన్న ఖరీదైన భూమార్గాలను తప్పించి, సుగంధ ద్రవ్యాలు విరివిగా లభించే భారతదేశానికి నేరుగా సముద్ర మార్గాన్ని కనుగొనడం పోర్చుగల్ రాజు ప్రధాన లక్ష్యం. వారి వ్యాపారాలకు అనువైన కొత్త ప్రాంతాలను అన్వేషించడం మాత్రమే కాకుండా, క్రైస్తవ మతాన్ని విస్తరించడం మరియు తూర్పు దేశాలలో క్రైస్తవ మిత్రదేశాలను కనుగొనడం కూడా వారి ఉద్దేశం. వాస్కో డి గామా మొదటి భారత్ పర్యటనలో పోర్చుగల్‌కు తీసుకువెళ్లిన సుగంధ ద్రవ్యాల విలువ, ఆయన మొత్తం ప్రయాణానికి అయిన ఖర్చు కంటే 60 రెట్లు ఎక్కువగా వచ్చింది. ఈ భారీ లాభం పోర్చుగల్ రాజకుటుంబానికి అపారమైన సంపదను తెచ్చిపెట్టింది. భారత్‌కు వారు కనుగొన్న చవకైన ఓడ మార్గం కారణంగా ఐరోపా సుగంధ ద్రవ్యాల మార్కెట్‌లో పోర్చుగల్ ఏకఛత్రాధిపత్యాన్ని సాధించింది. ఆయన తన జీవితకాలంలో మొత్తం మూడు సార్లు భారతదేశాన్ని సందర్శించారు. వాస్కోడిగామా మూడు పర్యటనల వివరాలు తెలుసుకుందాం. మొదటి యాత్ర (1497–1499): ఈ చారిత్రాత్మక ప్రయాణంలోనే ఆయన భారతదేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. మే 1498 లో కలికట్ చేరుకుని, సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం పునాది వేశారు. రెండవ యాత్ర (1502–1503): ఈ సారి ఆయన కేవలం వ్యాపారిగా కాకుండా, భారీ సైనిక నౌకలతో వచ్చారు. హిందూ మహాసముద్రంలో పోర్చుగీస్ ఆధిపత్యాన్ని స్థాపించడానికి మరియు అరబ్ వర్తకులపై సాయుధపోరాటం చేసి వారిని అణచివేయడానికి ఈ యాత్ర చేశారు. ఇక మూడవ యాత్ర (1524): పోర్చుగల్ రాజు ఆయనను భారతదేశానికి వైస్రాయ్ గా నియమించి పంపారు. భారత్ లో ఉన్న పోర్చుగీస్ పరిపాలనలో ఉన్న కాలనీలలో అవినీతిని అంతం చేయడానికి ఆయన వచ్చారు. ఈ మూడవ యాత్రలో వాస్కోడిగామా డిసెంబర్ 24, 1524 న భారతదేశంలోని కొచ్చిన్ (ప్రస్తుత కొచ్చి, కేరళ) లో మరణించారు. తన మూడవ యాత్రలో భాగంగా భారతదేశానికి వచ్చిన కొన్ని నెలలకే ఆయన మలేరియా బారిన పడి కన్నుమూశారు. ఆయన్ను మొదట కొచ్చిలోని సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి లోనే ఖననం చేశారు. అయితే, 1539 లో ఆయన భౌతికకాయాన్ని తిరిగి పోర్చుగల్‌కు తరలించి, లిస్బాన్‌లోని ప్రసిద్ధ జెరోనిమోస్ మొనాస్టరీలో భద్రపరిచారు. మొదటి చారిత్రాత్మక యాత్ర ముగించుకుని సెప్టెంబర్ 1499 లో పోర్చుగల్ తిరిగి వచ్చినప్పుడు, వాస్కోడిగామాకు స్వదేశంలో ఒక గొప్ప వీరుడిలా అపూర్వ స్వాగతం లభించింది. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలనే పోర్చుగల్ దేశపు 80 ఏళ్ల నిరీక్షణను నిజం చేసినందుకు ఆ దేశమంతా అప్పుడు ఆయన్ను కొనియాడింది.

వ్యాధుల (స్కర్వీ) వల్ల ఆయన నౌకాదళంలోని సగానికి పైగా సిబ్బంది చనిపోయినప్పటికీ, ఆయన తెచ్చిన సుగంధ ద్రవ్యాల శాంపిల్స్ మరియు వ్యాపార మార్గం పోర్చుగల్ రాజకుటుంబానికి అపారమైన సంపదను, అంతర్జాతీయంగా గొప్ప శక్తిని తెచ్చిపెట్టాయి. పోర్చుగల్ రాజు మాన్యుయెల్ ఈ వాస్కోడిగామాపై బహుమతులు మరియు ఉన్నత బిరుదుల వర్షం కురిపించారు. ఆయనకు వంశపారంపర్యంగా వచ్చే "డామ్" (లార్డ్/ప్రభువు) అనే ప్రతిష్టాత్మక బిరుదును ఇచ్చారు. అలాగే "అడ్మిరల్ ఆఫ్ ది ఇండియన్ సీస్" (భారతీయ సముద్రాల అధిపతి) గా ప్రకటించారు. జీవితాంతం భారీ వార్షిక పెన్షన్‌తో పాటు, భారతదేశ వ్యాపారంపై వచ్చే లాభాల్లో పన్నులు వసూలు చేసుకునే హక్కును ఆయనకు కల్పించారు. ఆయన పుట్టిన ఊరైన సినెస్ తో పాటు రెండు ధనిక గ్రామాలపై శాశ్వత యాజమాన్య హక్కులను రాజు ఆయనకు బహుమతిగా ఇచ్చారు. భారతదేశంలో పోర్చుగీస్ వారు తమ వలసరాజ్యాలను మరియు వర్తక స్థావరాలను ప్రధానంగా పశ్చిమ తీరం పొడవునా స్థాపించారు. వారు ఆక్రమించిన గోవా, డయ్యు, డామన్ ప్రాంతాలను సామూహికంగా "ఎస్టాడో డా ఇండియా" పోర్చుగీస్ ఇండియా అని పిలిచేవారు. వ్యాపార విస్తరణలో భాగంగా వారు భారతదేశ తూర్పు తీరంలో కూడా శాంతోమ్ (ప్రస్తుత చెన్నై), నాగపట్నం, హుగ్లీ వంటి తీరాలలో కొన్ని వాణిజ్య స్థావరాలను స్థాపించారు. ఈ ప్రాంతాలలో పోర్చుగీస్ వారు నిర్మించిన కోటలు ఇప్పటికీ చారిత్రాత్మక గుర్తులుగా ఉన్నాయి.

లిస్బోవా - గోవా చర్చల మధ్యలో ఆటలో అరటిపండులా నా రెండు పుస్తకాల ఆవిష్కరణ కథను క్లుప్తంగా చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ పుస్తకాలలో రెండవ పుస్తకంలోని అంశాలన్నీ మన సిరిమల్లె పత్రికలో గత మూడేండ్ల నుండి 'మన వూరి రచ్చబండ' ధారావాహిక నుండి వచ్చినవే కాబట్టి. నేరుగా నా పుస్తకాల ఆవిష్కరణకు వేదికైన శాక్రమెంటో తెలుగు సాహిత్య సభ గూర్చి తెలుసుకుందాం.

కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో శివారు నగరమైన ఫాల్సమ్‌లో, శాక్రమెంటో తెలుగు సంఘం మరియు సువిధ ఇంటర్నేషనల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు సాహిత్య వేదిక కార్యక్రమం ఆదివారం, సెప్టెంబర్ 27, 2026 సాయంత్రం 5 గం.కు వేడుకగా జరిగింది. తెలుగు సాహిత్య అభిమానులు, రచయితలు, స్థానిక తెలుగు ప్రముఖులు, యువత, అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఒక సాహిత్యోత్సవంగా మార్చారు. తెలుగు సంప్రదాయం, సాహిత్యం మరియు భాషపై లోతైన ప్రేమను ప్రతిబింబించేలా ఈ వేదికలో జరిగిన కార్యక్రమాలు అందరి మనసులను హత్తుకున్నాయి. శాక్రమెంటో తెలుగు సాహిత్య వేదిక కార్యక్రమంలో నేను రచించిన “రచ్చబండ చర్చలు” మరియు “కలగూర గంప” పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. వ్యాస సంపుటిగా వెలువడ్డ ఈ రెండు పుస్తకాలు – సమాజం, జీవన విలువలు, సాంస్కృతిక అంశాలు, అనుభవాలపై రచయిత వెంకట్ నాగం ప్రత్యేక దృష్టిని ప్రతిబింబిస్తాయని ముఖ్య అతిథిగా పాల్గొన్న సిరిమల్లె పత్రిక సంపాదకులు శ్రీ మధు బుడమగుంట అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా 2001 నుండి పలు తెలుగు పత్రికలలో ప్రచురితమైన వ్యాసాలను సంపుటిగా పుస్తకరూపంలో ప్రచురించమని, పలు అంతర్జాతీయ తెలుగు సదస్సులలో పరిశోధనా పత్రాల సమర్పణకు విలువైన సూచనలు చేసి ప్రోత్సహించిన పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారికి, 2023 నుండి రచ్చబండ చర్చల వ్యాస ధారావాహికలను ప్రోత్సహించిన సిరిమల్లె సంపాదకులు ఉమా - మధు గార్లకు, ఈ రెండు వ్యాస సంపుటి పుస్తకాలను ప్రచురించిన వంగూరి ఫౌండేషన్ అధినేత శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారికి, తన 25 ఏండ్ల సాహిత్య ప్రయాణానికి సహకరించిన నా సహధర్మచారిణి వాణికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలిపాను.

మొత్తానికి “అదిగో పోర్చుగల్ లిస్బొవా” తో మొదలయిన చర్చ భారత్ వరకు వచ్చింది. లిస్బొవా వింతలు విశేషాల చర్చ ను గోవా, డయ్యు, డామన్ ప్రాంతాల విముక్తి కి 1961లో జరిగిన 'ఆపరేషన్ విజయ్' ప్రస్తావన తో ముగిస్తే బాగుంటుందనిపించింది. వర్తమాన చరిత్ర నుండి గత చరిత్రకు వెనక్కి వెళ్ళి ఆనాటి చారిత్రాత్మక సంఘటనను గుర్తు చేసుకోవడం ద్వారా పాఠకులు ఉత్తేజితులు కావడం తథ్యం. అయితే అందుకు వేచి ఉండాలి, కావున మిత్రులారా వచ్చే నెలలో 1961లో జరిగిన 'ఆపరేషన్ విజయ్' ఫ్లాష్ బ్యాక్ సంఘటనతో మనం మళ్లీ కలుసుకుందాం. చివరగా, పాఠకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ నెల రచ్చబండ అంశం "అదిగో పోర్చుగల్ లిస్బొవా" పై మీ అభిప్రాయాలను తప్పకుండా క్రింద ఉన్న కామెంట్ బాక్స్ లో పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, వచ్చే నెల   "గోవా విమోచనం - 1" ఆపరేషన్ విజయ్ చర్చతో మళ్లీ కలుద్దాం మిత్రులారా!

నమస్కారములతో,

-- మీ వెంకట్ నాగం.

*********

Posted in October 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *