
(సంస్థాన చరిత్ర మరియు ప్రాచీన అంశాలు)
పార్లమెంటరీ రాజకీయాలు :-
థి బంగారుపేట గాంధీ విగ్రహం, రేడియో మరియు లైబ్రరీ స్థాపన కమిటీ :-
వెంకటగిరిలోని బంగారుపేటలో "థి బంగారుపేట గాంధీ విగ్రహం, రేడియో మరియు లైబ్రరీ స్థాపన కమిటీ" నేతృత్వంలో 1950వ సంవత్సరంలో రెండు గాంధీ విగ్రహాలు స్థాపించడం జరిగింది. ఒకటి గ్రామ చావిడి దగ్గర నెలకొల్పగా రెండవ దాన్ని మెయిన్ రోడ్డుపై పెట్టడం జరిగింది. చావిడి దగ్గర ఉన్న విగ్రహాన్ని మహారాష్ట్రకు చెందిన వస్త్ర వ్యాపారి టోపన్ దాస్ గోపాల్ దాస్ బహుకరించగా అప్పటి కలెక్టర్ మలయప్పన్ గారు 30 మార్చ్ 1950న ఆవిష్కరించారు.
మెయిన్ రోడ్డుపై విగ్రహాన్ని అప్పటి మద్రాసు ఆర్థిక మంత్రి బెజవాడ గోపాలరెడ్డి గారు 21 ఆగస్టు 1950న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపాలరెడ్డి గారు మాట్లాడుతూ:- మంత్రి సన్నిధిలో ఉత్సాహం ప్రకటించినంత మాత్రాన దేశ జనకుని ప్రతిమ ప్రతిష్టించే కార్యం పూర్తి కాదని, ప్రజలందరూ గాంధీజీ ప్రభోదాన్ని సక్రమంగా ఆచరించి హరిజనోద్ధరణ, మద్యనిషేధ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. గాంధీజీ ప్రతిమ నెలకొల్పుట వంటి మహోన్నత కార్యం విషయంలో కూడా బంగారుపేట ప్రజలు వాద ప్రతివాదాలకు దిగి కోర్టు వరకు వెళ్ళడం తగదని చురకలు అంటిస్తూ మహాత్ముని పేరిట నైనా బంగారుపేట ప్రజలు విభేదాలు మరచి ఐకమత్యంతో మెలగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి పంచాయతీ బోర్డు తరపున అప్పటి బోర్డు ప్రెసిడెంట్ శ్రీ తిరుమలచార్యులు స్వాగత పత్రాన్ని చదివారు. బంగారుపేట ప్రజల తరపున మరొక స్వాగత పత్రాన్ని శాసనసభ్యుడు కమతం షణ్ముగం చదివారు. ఈ కార్యక్రమంలో ఇంకా అప్పటి నెల్లూరు కలెక్టర్ జోగప్ప గారు, గూడూరు సబ్ కలెక్టర్ కార్తికేయన్ గారు, వెంకటగిరి ఎస్టేట్ మేనేజర్ శ్రీ కుమారయ్య, పార్లమెంట్ సభ్యుడు శ్రీ వంగల్లు కోదండరామిరెడ్డి, నెల్లూరు జిల్లా బోర్డు వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బూదూరు వారి వీధిలో గాంధీ విగ్రహం :-
పాతకోటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రక్క సందులో ముందుకు వెళ్తే బూదూరు వారి వీధి వస్తుంది. కుడివైపున వెలమపాలెం ఉంటుంది. బూదూరు వారి వీధిలోని గాంధీ విగ్రహం దాటి ముందుకు వెళ్తే కుడి వైపుకు వెళ్ళే రోడ్డు కార్ ఖానా వీధికి దారితీస్తే ఎడమవైపుకు వెళ్తే మాసాపేట వస్తుంది. బూదూరు వారి వీధిలో గాంధీ విగ్రహాన్ని దత్తి వారి పల్లె వాస్తవ్యులు పెద్ది శెట్టి వెంకట్రామయ్య చెంగమ్మ దంపతులు ధర్మం చేయగా అప్పటి స్థానిక శాఖామాత్యులు శ్రీ చంద్రమౌళి గారిచే 2 అక్టోబర్ 1949న ఆవిష్కరించబడింది.
వెంకటగిరి సమితి ఎన్నికలు :-
1964వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో సమితి ఎన్నికలు జరిగాయి. వెంకటగిరిలో మహారాజ్ కుమార్ శ్రీ గోపాలకృష్ణ యాచేంద్ర అధ్యక్షులుగా, శ్రీ పెట్లూరు రాఘవరెడ్డి ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఆనాటి రాజకీయాల్లో ఇదొక విశేషం. ఈ విజయం పురస్కరించుకుని వెంకటగిరి టౌన్ లో జూన్ 19న మహోత్సవం జరిగింది. ఉత్సవం రాత్రి 7 గంటలకు కాశీ విశ్వనాధుని దేవస్థానం దగ్గర నుండి మొదలయ్యింది. ఉత్సవంలో కుమార్ రాజా, శాసనసభ్యుడు ఆనం వెంకటరెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంచలనాత్మక 1967 అసెంబ్లీ ఎన్నికలు :-
1967 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి రాజా గారు శ్రీ ఓరేపల్లి వెంకటసుబ్బయ్యకు మద్దతిచ్చారు. వెంకటసుబ్బయ్య జయాపజయాలు తమవిగా భావించి తమ సర్వశక్తులు ఒడ్డారు. ఈ ఎన్నికలు అల్లం కృష్ణయ్యకు, ఓరేపల్లి వెంకటసుబ్బయ్యకు మధ్య అన్నట్లుగా కాకుండా రాజాగారికి, పొదిలేటి వెంకటస్వామిరెడ్డి గారికి మధ్య అన్నట్లుగా సాగాయి. వెంకటగిరి రాజాగారు శ్రీ అల్లం కృష్ణయ్య తమను అవమానిస్తూ ప్రకటనలు జరీ చేశారని కినుక వహించారు. ఢిల్లీలో శ్రీ నీలం సంజీవరెడ్డి అడిగినపుడు అల్లం కృష్ణయ్యకు తాము చేయలేమని, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చేయడం తమ ఉద్దేశం కాదని, కృష్ణయ్యను బలపరచడం తప్ప ఇంకేమిచెప్పినా తాము చేయగలమని చెప్పారు. ఇందిరాగాంధీ చెప్పినా తాము కృష్ణయ్యకు చేయజాలమని వారు ఇతరులకు కూడా స్పష్టం చేశారు. జనవరి 18 మధ్యాహ్నం వెంకటగిరిలో కాంగ్రెస్ ఎన్నికల సభ జరిగింది. శ్రీ నీలం సంజీవరెడ్డితో పాటు విద్యా మంత్రిగా ఉన్న శ్రీ అద్దూరు బలరామిరెడ్డి గారు సభలో పాల్గొన్నారు. 150 కాడుల ఎద్దులతో పెద్ద ఉత్సవం జరిగింది. సభకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి ఆరేడు వేల మంది జనం వచ్చారు. సభలో శ్రీ నీలం సంజీవరెడ్డి ఉపన్యసిస్తూ కాంగ్రెస్ కొన్నేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండాలని తానెందుకు సూచించింది వివరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి, ఆ అధికారం కోసం వెంకటగిరి రాజాల వంటి అవకాశవాదులు చేరుతున్నారని, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటే ఇలాంటివారందరూ బయటకు వెళ్ళిపోయి, సంస్థ పట్ల భక్తి విశ్వాసాలున్న కాంగ్రెసువాదులు మాత్రమే నిలిచి బాగుపడగలదని; కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి పోవాలనడంలో తన ఉద్దేశం ఇదేనని అన్నారు. కొంత మంది అవకాశవాదుల వల్ల సంస్థలోని లక్షలాది కాంగ్రెసువాదులకు మచ్చ కలుగుతున్నదని అన్నారు. కానీ ఈనాడు దేశంలో ఏ పార్టీ కూడా అధికారం చేబట్టగల స్థితిలో లేదని, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థోమత కాంగ్రెస్ కు మాత్రమే ఉన్నదని, కావున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించవలసిందిగా, శాసనసభకు అభ్యర్థి అయిన శ్రీ అల్లం కృష్ణయ్యకు, పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ సి.దాస్ కు ఓటు చేసి విజయం చేకూర్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు. సభకు అధ్యక్షత వహించిన శ్రీ బలరామిరెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి రాజాలకు సవాల్ విసిరారు. తాను వెంకటగిరి ఎన్నికల్లో జోక్యం చేసుకుంటే, తాము కాళహస్తి వచ్చి తమను ఓడించగలమని వెంకటగిరి రాజాలు తమకు చెప్పి పంపారని, తాను రాజాలను ఆహ్వానించుటకే వెంకటగిరి వచ్చానని, రాజాగారు కాళహస్తికి తమ ధనాన్ని, మంది మార్బలాన్ని ఉపయోగించమని కోరుతున్నానని బలరామిరెడ్డి సవాల్ విసిరారు. నీలం సంజీవరెడ్డి గారు ఉపన్యసించేటపుడు కొందరు కొన్ని ప్రశ్నలను పంపారు. కొంత కలకలం కూడా రేగింది. ఈ సభ ఏర్పాటు చేసింది ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి కాదని కోపోద్రేకంతో శ్రీ సంజీవరెడ్డి అన్నారు.
ఈ ఎన్నికల్లో వెంకటగిరి నుండి స్వతంత్ర పార్టీ తరపున బండి చంద్రశేఖరం పోటీ చేశారు. ఎన్నికల్లో వెంకటసుబ్బయ్యకు 31198 ఓట్లు లభించగా అల్లం కృష్ణయ్యకు 24802 ఓట్లు లభించాయి. శ్రీ ఓరేపల్లి వెంకటసుబ్బయ్య 7996 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. వెంకటగిరి రాజాలు తమ ఆధిక్యతని రుజువు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెంకటగిరి యం.యల్.ఏ :-
1989 ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుండి శ్రీ నేదురుమల్లి జనార్దనరెడ్డి గారు 19,141 ఓట్ల ఆధిక్యంతో తన సమీప తెలుగుదేశం అభ్యర్థి నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి పై గెలుపొందారు. తొలుత శ్రీ మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్ లో వ్యవసాయమంత్రిగా పనిచేసిన జనార్ధనరెడ్డి గారు 17 డిసెంబర్ 1990న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజుల తరువాతే అంటే 21 జనవరి 1991న జనార్ధనరెడ్డి వెంకటగిరి విచ్చేశారు. 21వ తేదీన హెలికాప్టర్ లో వెంకటగిరికి వచ్చిన ముఖ్యమంత్రికి వేలసంఖ్యలో వెంకటగిరీయులు స్వాగతం పలికారు. పట్టణంలోని తెలుగుగంగ కార్యాలయంలో ఇష్టాగోష్టి సమావేశం తరువాత వెంకటగిరి రైల్వే స్టేషన్ వెనుక పెట్లూరు వద్ద నిమ్మ పరిశోధన కేంద్రానికి, తరువాత గొడ్డేరు ఆనకట్టకు శంఖుస్థాపన చేశారు. సాయింత్రం వెంకటగిరిలో బహిరంగసభ జరిగింది. ఆ సభలో జనార్ధనరెడ్డి చాలా భావోద్వేగంతో ప్రసంగించారు. వెంకటగిరిలోని ప్రతి పౌరుడూ నా దృష్టిలో ముఖ్యమంత్రితో సమానమే, నన్నాదరించిన ఈ నియోజకవర్గ ప్రజలకు నేనెప్పుడూ సేవకుడినే అన్నారు.
వెంకటగిరిలో క్రికెట్ క్రీడ:-
వెంకటగిరి రాజాలు క్రికెట్ ప్రేమికులు. వెంకటగిరి ఎంఎల్ఏ గా పని చేసిన వరదరాజ గోపాలకృష్ణ యాచేంద్ర క్రికెట్ క్రీడాకారుడు. వారి పెద్ద కుమారుడు రాంప్రసాద్ యాచేంద్ర వెంకటగిరిలో తారకరామ క్రీడా ప్రాంగణాన్ని నిర్మించారు. స్వాతంత్ర్యం వచ్చాక వెంకటగిరి జింఖానా క్లబ్ ఉన్న స్థలం వెంకటగిరి సంస్థానం గ్రౌండ్ గా ఉపయోగపడింది. వెంకటగిరి సంస్థానం గ్రౌండ్లో 8 జనవరి 1959న, 14 డిసెంబర్ 1982న ఆంధ్ర, కేరళ జట్ల మధ్య రంజీ మ్యాచ్ లు జరిగాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో వెంకటగిరి సంస్థానం క్రికెట్ క్లబ్, వెంకటగిరి క్రికెట్ క్లబ్ శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నాయి.
వెంకటగిరిలో పోలో ఆటలు :-
క్రీ. శ 1934వ సంవత్సరం అక్టోబర్ నెలలో వెంకటగిరి మహారాజా గోవింద కృష్ణ యాచేంద్ర గారి జన్మదినం సందర్భంగా వెంకటగిరి జింఖానాలో పోలో ఆటల పోటీలు జరిగాయి. బెంగళూరు, సికింద్రాబాద్, గోల్కొండ, వెంకటగిరి జింఖానా వారి ఏ, బి టీములు పోటీ చేశాయి. ఫైనల్స్ లో గోల్కొండ టీం గెలుపొందింది.
వెంకటగిరిలో ఆంధ్ర బ్యాంకు ఆరంభం :-
1963 చివరి నాటికి వెంకటగిరిలో కేవలం సహకార బ్యాంకు మటుకే ఉండేది. ఏ చిన్న బ్యాంకు పనికైనా వెంకటగిరీయులు గూడూరుకో, కాళహస్తికో వెళ్ళవలసి వచ్చేది. 17 డిసెంబర్ 1963న వెంకటగిరి రాజావీధిలో ఆంధ్ర బ్యాంకు శాఖ ఏర్పాటయింది. ప్రారంభోత్సవ సభకు ఆంధ్ర బ్యాంకు జనరల్ మేనేజర్ శ్రీ టి.ఆర్.భగవత్, వెంకటగిరి కుమార్ రాజా వెలుగోటి వెంకటశేష వరదరాజగోపాలకృష్ణ యాచేంద్ర గారు, రాజ్ కుమార్ గోపాలకృష్ణ యాచేంద్ర గారు హాజరయ్యారు. కుమార్ రాజా బ్రాంచ్ భవనంలోకి వెళ్లి బ్యాంకు సేఫ్ లో ప్రారంభ ధనాన్ని ఉంచి బ్యాంకింగ్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత ఆయన ఉపన్యసిస్తూ గత సంవత్సరం నుంచీ ఇక్కడ బ్రాంచ్ మొదలుపెట్టించాలని తాము చేసిన కృషి ఇన్నాళ్లకు ఫలించి, వెంకటగిరిలో ఆంధ్ర బ్యాంకు పెట్టడం జరిగిందని, వెంకటగిరిలో వ్యాపారులకు, రైతులకు, ఇతర ప్రజానీకానికి ఈ బ్రాంచ్ ఒక ఆశాకిరణంగా ఉండగలదని, భవిష్యత్తులో వెంకటగిరి సర్వతోముఖాభివృద్ధిలో ఆంధ్ర బ్యాంకు గురుతర బాధ్యత నిర్వహించవలసిన అవసరం ఉంటుందని అంటూ, ఇదే సమయంలో తమ తండ్రిగారు వేంకటగిరిలో చేనేత నూలు మిల్లు స్థాపింపజేయడానికి హైదరాబాద్ లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అది త్వరలోనే ప్రారంభింపబడుతుందని, బహుశా అప్పుడు ఈ బ్రాంచ్ ఇలాంటి చిన్న చిన్న పరిశ్రమలకు చేయూత నిచ్చి,ఆర్ధిక సదుపాయాలూ కలుగజేయవలసి ఉంటుందని సూచించారు.
కుమార్ రాజా ఆశించిన విధంగా వేంకటగిరిలో పారిశ్రామిక అభివృద్ధి పెద్దగా జరగలేదు గానీ, సరళీకరణ తరువాత సామాన్యుల ఆదాయాలు పెరిగాయి.కాల క్రమంలో స్టేట్ బ్యాంకు ,సిండికేట్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, హెచ్.డి.యఫ్.సి, ఐ.సి.ఐ.సి.ఐ, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వంటివి పట్టణంలో ఏర్పాటయ్యాయి. వ్యవసాయం,చేనేత పరిశ్రమ ఈ ప్రాంతంలో వర్ధిల్లుతున్నాయి.
వెంకటగిరికి టెలిఫోన్ మరియు విద్యుత్ సౌకర్యం :-
మార్చ్ 28 1957న వెంకటగిరిలో టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. అప్పటికి టవున్ లో కేవలం పబ్లిక్ కాల్ ఆఫీస్ మాత్రం ఉండేది. అదివరకు నెల్లూరు జిల్లాలో నెల్లూరు, కావలి, గూడూరులో మాత్రమే టెలిఫోన్ సౌకర్యం ఉండేది.
డిసెంబర్ 6 1955న ఉదయం తొమ్మిది గంటలకు ఆంధ్ర ఉపముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి వెంకటగిరి విచ్చేశారు. రాజమహల్ లో అల్పాహారం చేసి వెంకటగిరికి పన్నెండు మైళ్ళ దూరంలో కోటవాకిళ్ళ నీటి పారుదల ప్రాజెక్టుకు 10.30 గంటలకు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన సభలో సంజీవరెడ్డి గారు మాట్లాడుతూ కోటవాకిళ్ళ ప్రాజెక్టు శ్రీ పడిలేటి వెంకటస్వామిరెడ్డిగారి అవిరళ కృషి, అకుంఠిత దీక్షల ఫలితమేనని అన్నారు.
అదే సమయంలో వెంకటగిరి పట్టణానికి విద్యుత్ ప్రసారం కూడా మొదలయ్యింది. వెంకటగిరి పెదరాజా గారి అధ్యక్షతన విద్యుత్ ప్రసార ఉపక్రమనోత్సవ సభ జరిగింది. సంజీవరెడ్డి గారు స్విచ్ వేయడంతో వెంకటగిరి పట్టణంలోని ఇళ్లలో విద్యుత్ దీపాలు వెలిగాయి.
వెంకటగిరి విద్యుత్ ప్రసార ఉపక్రమనోత్సవ సభలో శ్రీ మల్లెమాల సుందరరామిరెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సంగతి గురించి, అప్పుడు జరిగిన సభ గురించి, తన ఆత్మకథ "ఇది నా కథ" లో రాశారు. ఈ సభలో తన ప్రసంగం ముగిస్తూ మల్లెమాల ఆశువుగా పద్యాలు చెప్పినారు. సంజీవరెడ్డి గారిని " పరమ దయా రసామృత వివర్ధిత చిత్తుడా గాంధిశిష్యుడా!" అని చిట్టచివరి పంక్తిలో పొగిడారు. ఆ పద్యాల్లో ఉన్న ఓ కంద పద్యాన్ని ఇక్కడ ఉటంకిస్తాను :-
విద్యుచ్ఛక్తిని పల్లెల
కాద్యంతము ప్రాకజేసి అతులిత రీతిన్
విద్యుచ్ఛక్తి సమంబగు
సదృశ్యమును గాంచుమయ్యా సాహసవర్యా !
వెంకటగిరి రైల్వే స్టేషన్ :-
వెంకటగిరి రైల్వే స్టేషన్ ను 1887వ సంవత్సరంలో కట్టారు. నెల్లూరు జిల్లాలో ఏర్పడిన మొదటి రైల్వే లైన్ కాట్పాడి గూడూరు లైన్. ఈ లైన్ లో 15 సెప్టెంబర్ 1887 నుండి సర్వీస్ మొదలయ్యింది.అదే లైన్ ను మీటర్ గ్వేజ్ లో గూడూరు నుండి నెల్లూరు వరకు పొడిగించి 1 నవంబర్ 1889న ఆపరేషన్ లోకి తీసుకు వచ్చారు. కాట్పాడి గూడూరు లైన్ వెంకటగిరి తాలూకా లోనికి ఎల్లకూరు వద్ద ప్రవేశించి తరువాత వెంకటగిరి స్టేషన్ చేరుకొని వెండోడు, కొండాగుంట మీదుగా గూడూరు చేరుకుంటుంది.