లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు "చందోలు రాఘవ నారాయణ శాస్త్రిగారు”
గుంటూరు ప్రాంతం నుండి కొంత మంది భక్తులు కంచి కామకోటి పీఠ పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర యతీంద్రుల దర్శనం కోసం వెళితే స్వామి వారు వారితో, "నా కోసం మీరు కంచికి ఇంత దూరం రావలసిన పని లేదు. చందోలులో లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారున్నారు కదా! ప్రతి గురువారం వారిని దర్శించండి” అని చెప్పారు అంటే శాస్త్రిగారి యోగ సిద్ధి మహిమ ఎంతటిదో మనకు అర్ధమవుతుంది.
బాలా త్రిపుర సుందరి అమ్మవారు అనగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు. రాఘవ నారాయణ శాస్త్రిగారు బాలా త్రిపుర సుందరీ మంత్ర మహాయోగి అని, నడయాడే దైవంగా ప్రసిద్ధికెక్కిన కంచి మహాస్వామివారు స్వయంగా వారి నోట పలికారు. ‘చందోలు దేవుఁడు’, ‘చందోలు శాస్త్రిగారు’ అనే పేర్లతో ప్రసిద్ధుఁడైన ఈయన సూర్యలోకానికి చెందిన సిద్ధపురుషుఁడు. కొద్ది క్షణాల పాటు మనసు చలించడం వల్ల మరలా భూలోకంలో మానవ శరీరం దాల్చవలసి వచ్చిందని అమ్మవారు తెలిపారు.
గుంటూరు జిల్లా చందవోలు గ్రామములో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, హనుమమ్మ దంపతులకు శాస్త్రి గారు1896 ఆగస్ట్ ఇరవై అయిదున జన్మించారు. నిష్టా గరిష్ట కుటుంబం వారిది. తాడికొండ వాసి కేదారలింగం గారు ‘’బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని” వీరికి ఇచ్చారు. పదహారో సంవత్సరం దాకా ఆ మంత్రోపాసన చేసినందు వల్ల అమ్మవారు వీరికి పిలిస్తే పలికేది. దెందుకూరి పానకాల శాస్త్రిగారి వద్ద తర్కం, పొదిలి సీతారామశాస్త్రిగారి వద్ద మంత్రం నేర్చారు. యవ్వనంలోనే సన్యసించాలనే కోరిక కలిగింది. శ్యామలాంబ అనే యోగిని వీరి తండ్రిగారితో శాస్త్రి గారు సూర్య మండలంతర్వర్తి అయిన మహా సిద్ధుడు ఈ రూపంలో జన్మించాడని చెప్పింది.
శాస్త్రిగారికి చిన్నతనంలో పినతల్లి చూపించిన ఒక దృశ్యం గోచరించింది, అందులో తాను ఒక సిద్ధుడు. శ్రీ చక్రేశ్వరి అయిన కామేశ్వరి దూరంగా ఉన్న యువతుల్ని తీసుకు రమ్మన్నది. ఒకరిని మోసుకొని ఇద్దర్నీ తీసుకొచ్చాడు. అమ్మవారి చిరునవ్వుతో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకంలో జన్మించమని తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది. 19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ, పాపయ్య శాస్త్రి దంపతుల కూతురు పార్వతితో వివాహమైంది. పిన్ని చూపించింది కూడా ఈమెనే. శాస్త్రిగారు ఆమె పేరును శ్రీదేవిగా మార్చారు.
శాస్త్రిగారు తండ్రిగారి వేద పాఠశాల నిర్వహణలో తోడ్పడుతూ ఉండేవారు. ఆయన పద్ధతి నచ్చిన చాలామంది అమెరికాకు రమ్మన్నారు, కాని వారికి ఇష్టం లేదు. పిన పాటి వీరభద్రయ్యతో నేత్రావధానం, ఎలేశ్వరపు పురుషోత్తమశాస్త్రితో కవిత్వ సాధన చేశారు. అప్పటికే అనేక సభలవారు శాస్త్రి గారికి 400 కు పైగా సర్టిఫికేట్స్ ఇచ్చారు. వ్యాకరణ గురువుగారు ముదిగొండ నాగ లింగశాస్త్రిగారితో అనేక అవధానాలు చేసి, ఆ డబ్బు అంతా గురువుగారికే సమర్పించారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామివారి సన్నిధిలో జరిగిన అష్టావధానానికి వారు మెచ్చి ఉభయ శ్లేషకు లక్ష్యంగా ఒక శ్లోకం చెప్ప మంటే అశువుగా అద్భుతంగా చెప్పి ఒప్పించారు .
దేశ సంచారం చేస్తూ ఒకసారి ఇంటికి వస్తే ఇల్లు ‘’అయ్యవారి నట్టిల్లు‘’లా ఉంది. ఇంటివద్దే ఉండి తండ్రికి తోడ్పడ్డారు. తిండికి గడవని పరిస్థితి. మూడు రోజులు అంతా ఉపవాసమే. మూడవ రోజు రాత్రి 27 సార్లు లలితా సహస్ర నామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే త్రాగి అంగవస్త్రం నేలమీద పరచి నిద్రపోయారు. 10 ఏళ్ళ బాలిక కలలో కన్పించి ‘’ఓయ్! ముష్టి పెడతాను, కొంగు పట్టు‘’ అన్నది దోసెడు బియ్యం కొంగులో పోసి ‘’బండి వస్తుంది, అందులో కావలసిన సామగ్రి అంతా వస్తుంది‘’ అన్నది. తెల్లారేసరికి ఖాజీపాలెం సీతారామరాజు గారి బండి వచ్చింది. అక్కడ రాజుగారు కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు దగ్గర రాజు గారు పోయించిన పుట్టెడు ధాన్యపు రాశి కన్పించింది. అప్పటినుంచి శాస్త్రి గారింట లక్ష్మీదేవి నిత్య సాక్షాత్కారమే. అనేక గ్రామాలలో భాగవతం, హరివంశం, పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరేవారు పరమ నిష్టాగరిష్టంగా జీవించేవారు. ప్రాణాయామం తపస్సు కొనసాగించారు. ఇంట్లో వేరు సెనగ నూనె, వేరు సెనగ వాడలేదు, దొండకాయ, టమేటా, బంగాళా దుంప, ముల్లంగి, క్యాబేజీ, నిశిద్ధం. కాశీకి తప్ప ఎప్పుడు రైలు ప్రయాణం చేయలేదు, శాస్త్రిగారికి మగ సంతానం లేదు.
శాస్త్రిగారికి అష్ట సిద్ధులూ వశమైనాయి. కాని వాటిని స్వంతానికి ఎప్పుడు వాడుకోలేదు, తాడికొండ వేద పాఠశాలలో దెయ్యాలు తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రిగారు మంత్రం పఠించి పారద్రోలారు. ఒకసారి ‘’వశ్యంకర ఔషధి”ని సేకరించాలని చంద్ర గ్రహణం రోజున కొండ ఎక్కి, దాన్ని గుర్తుపట్టి తీసుకొందామని దగ్గరకు వెళ్తే ఒక బాలుడు అడ్డుకొన్నాడు. బలవంతాన లాక్కోబోతే ‘’నీకు ఈ మొక్కతో పనిలేదు, నీ ముఖం చూస్తేనే అందరు వశులౌతారు‘’ అన్నాడు, ఇంతలో గ్రహణం వదిలింది, బాలుడు మాయమయ్యాడు, తనకు దాన్ని పొందే యోగం లేదని భావించారు. అది దత్తాత్రేయస్వామి అధిపతిగా ఉన్న ఓషధి, పూర్వజన్మ సఖుడైన ఒక యోగి కన్పించి సుఖ దుఃఖాలను సమానంగా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్ళకు కనిపిస్తానని చెప్పి వెళ్లాడు. సరిగ్గా యాభై ఏళ్ళ తరువాత శాస్త్రిగారు అమరావతి వెళ్లి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తల క్రిందులుగా పడిపోతుంటే తల నేలకు తగిలే సమయాన ఆ యోగి వచ్చి చేయి అడ్డం పెట్టి కాపాడాడు. శాస్త్రిగారు నమస్కరించగానే యోగి అదృశ్యుడైనాడు.
తండ్రి గారు మొదలు పెట్టిన. ‘’శ్రీ రామ కథామృతం‘’ ను వారి మరణానంతరం శాస్త్రిగారు పూర్తి చేస్తున్నారు. అయోధ్యా కాండలో గాయత్రీ మంత్రంలోని ‘’భకార’’ వర్ణంతో పద్యం రావటం లేదు. అమ్మను ఉపాసించి నిద్రపోయారు. కలలో ఒక బీబీ జగన్మోహిని నిద్రిస్తుండగా 30ఏళ్ళ గడ్డం వాడొకడు ఆమె చొక్కా పైకెత్తి పాలు తాగుతున్నాడు. శాస్త్రిగారు ఆ దృశ్యం చూస్తుంటే ‘’ఎందుకు నిలబడ్డావు?" అని అడిగింది "నాకూ పాలు ఇస్తావా?’’ అని అడిగారు, మెలకువ వచ్చి ‘’భర్మ మయ రమ్య హర్మ్యము‘’ అనే "భ" వర్ణంతో పద్యం తేలిగ్గా వచ్చింది. ఒకసారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉంటె సత్తెనపల్లి లో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి ఇరవైయేళ్ళ యువతి కనిపించి, నమస్కరించి లోపలికి వెళ్ళింది, ఆమె గ్రహ పీడితురాలు. అందర్ని కొడుతూ, తిడుతూ ఉండేది, అలాంటిది శాస్త్రిగారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించటం ఇంట్లో వారందరికీ ఆశ్చర్యం కలిగించింది, ఆమెను గ్రహ ప్రేరణ చేసి ‘’ఏం చేస్తే నువ్వు పోతావు’’ అని అడిగారు ’’సహస్ర గాయత్రీ జప ఫలం ధారపోస్తే పోతాను‘’ అంది, శాస్త్రిగారు సహస్ర గాయత్రి జపంచేసి ధార పోశారు, ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగి పడింది, దెయ్యం వదిలింది, వేరొకసారి నాగుల చవితి రోజు కాలవలో స్నానంచేసి వస్తుంటే నాగలి చాలులో పడుకొన్న నాగుపాము తోక పై ఆయన కాలు పడింది, అది బుసలు కొడుతూ పైకి లేచి కాటు వేయ బూనితే ‘’గరుడ మంత్రం‘’ జపించారు. సర్పం తల నేలకు వాల్చింది ’’స్వామీ! నీ జోలికి నేను రాలేదు, నా జోలికి నువ్వు రావద్దు, పొరపాటున నా కాలు తగిలింది, వెళ్ళిపొండి” అనగానే పాము వెళ్ళిపోయింది. ఆ రోజంతా గరుడ మంత్రం పఠిస్తూనే ఉన్నారు.
శాస్త్రిగారు 90 ఏళ్ళ జీవిత కాలం లో 80 ఏళ్ళు ‘’బాలా మంత్రానుష్టానం‘’ చేసిన మహనీయులు. ఒకసారి కాశీలో గంగా స్నానం చేస్తుంటే గంగాదేవి గలగలలాడే బంగారు గాజులున్న చెయ్యి చూపించి ‘’నాకేమి కానుక తెచ్చావు?’’ అని అడిగింది, శాస్త్రి గారికి ఏమీ పాలుపోక తన వ్రేలికున్న బంగారు దర్భ ఉంగరం తీసి ఆమె చేతిలో పెట్టారు, బసకు తిరిగి వచ్చి దేవతార్చన పెట్టె తెరిస్తే గంగకు అర్పించిన ఉంగరం అందులోనే ఉంది, తానేమైనా పొరపడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్నమయ్యారు .. గంగమ్మ కనిపించి ‘’కానుక ఇమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చావేరా?’’ అన్నది. ’’అది నీకు పితృ తర్పణం చెయ్యటానికి ఉపయోగపడుతుంది కాని నాకు ఆభరణం ఎలా అవుతుంది?’’ అని గద్దించింది. “అమ్మా నేనేమీ నీకోసం తేలేదు, ఆ సమయానికి అది స్ఫురించి ఇచ్చానంతే’’ అన్నారు. మళ్ళీ గంగమ్మ ‘’నీ భార్య దగ్గర నాకోసం తెచ్చిన నగ ఉంది అది తెచ్చివ్వు‘’ అన్నది గంగమ్మ. శాస్త్రిగారు భార్యను అడిగి నగను తీసుకొని పోయి ‘’గంగార్పణం ‘’చేశారు. ఆయన తన కార్యక్రమాలన్ని ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో, పేరు పెట్టమనో అడిగేవారు. కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్త నిర్ణయం చేసేవారు, అంతే ఆ కార్యక్రమం శుభప్రదంగా జరిగిపోయేది, దానికి తిరుగులేదు అదీ వారి మంత్ర సిద్ధి.
10-12-1990 ప్రమోదూత మార్గశిర బహుళ నవమి నాడు శాస్త్రిగారు బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఒడిలోకి శాశ్వతంగా చేరిపోయారు. వారి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు అమ్మ వారి ఆకారంగా చితి మంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతంగా వర్ణించారు, శాస్త్రిగారు కారణ జన్ములు, వారి పేరు వింటే చాలు సకల శుభాలు జరుగుతాయి.