స్రవంతి
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
ఓంకారమహిమ శా. ఓంకారమ్మెగ సర్వమంత్రములకున్ హోమాదిసత్కార్యస త్సంకల్పంబులకెల్ల నాది యయి నిత్యశ్రీ నొసంగున్ నిరా టంకంబై కొనసాగ; విద్యల కభీష్టప్రాప్తికిన్ మూల; మా ఓంకారాకృతియౌ సమస్తగణనాథోపాసనన్ జేసెదన్ దేవీప్రపత్తి సీ. నట్టింట నడయాడు నాతల్లి లలితాంబ రక్షయౌ మాకుఁ బ్రతిక్షణంబు కాలిగజ్జెలమ్రోఁత కలిదోషములఁ ద్రోలి పలుకు శుభాలకు స్వాగతంబు చేతికంకణములు సేయు నిస్వనములు ముందుగా నాశీస్సు లందఁజేయు వాత్సల్య మొలికించు పరదేవతాపాంగ వీక్షణంబె నితాంతవిత్ప్రదంబు తే.గీ. జననమరణపునర్జన్మచక్రముక్తి గలుగఁజేసి తదంఘ్రిపంకజపదాన నిలిచి సేవించి యైక్యమౌ కలిమి నీయఁ ద్రికరణంబులఁ బ్రార్థింతు దేవి నెపుడు శ్లో. శ్రీశైలాగ్రనివాసినీం స్మితముఖీం రాకేన్దుబిమ్బాననాం లీలాలోకనచారణాఖిలజగత్సంక్షేమసన్ధాయినీమ్ దేవానీకకిరీటరత్నరుచిసన్దీప్తాఙ్ఘ్రిపద్మద్వయీం శ్రీమల్లేశ్వరవల్లభాం శ్రితజనత్రాణైకచిత్తాం భజే సీ. నాచేత నా చేతనాచేతనావస్థ వ్రాయింప వ్రాసితిఁ బద్యకవిత మాతలవ్రాఁతలు మా తలవ్రాఁతలు సరిదిద్ద నా వ్రాఁత సహకరింప నా కైత నాకై త నాకై తనర్పంగ(1) ఫలము మా తల్లి దీవనయె గాఁగ ఆలోచనాలోకనాలోక(2) మా రమా లోకనలోలుఁడే మా కొసంగ తే.గీ. సర్వదా సర్వథా తత్ప్రసాదిత(3)ప్ర సాధి త(4)సుదర్శన మొసంగి స్వాం తకుహర మహరహంబును దేజోమయంబు సేసి సన్నిధిగ సన్నిధిని నిల్చు శక్తిఁ గొల్తు (1) నా కవిత్వము నా కొఱకు తాను ఆకు (పత్రము) అయి అతిశయింపగా (2) ప్రకాశము (3) పూజింపఁబడినది (4) అలంకరింపఁబడినది