Menu Close
Radhika-Nori
రాధికారుచిరం
రాధిక నోరి

మొదటి ముద్ర

కొంతమందిని చూసిన మొదటి క్షణంలోనే వారంటే మంచి అభిప్రాయం కలుగుతుంది. వారితో ఇంకా ఇంకా మాట్లాడాలని, గాఢమైన స్నేహం పెంచుకోవాలని అనిపిస్తుంది. ఎందుకో వారు మనకి బాగా నచ్చుతారు. సినిమా భాషలో చెప్పాలంటే వారు మన మనసులను దోచుకుంటారు. దీనినే 1st impression లేదా ‘మొదటి ముద్ర’ అని అంటారు. అంటే మొదటి  సమావేశంలోనే వారు మన మీద మంచి ముద్రను వేసారన్నమాట. మన మనసులలో స్నేహభావాన్ని రేకెత్తించారన్నమాట. అందుకని ఎవరినన్నా కానీ, లేక ఏదైనా వస్తువుని కానీ మొట్టమొదటిసారి చూసినపుడు మన మనసులలో మనం ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకొంటే దానిని మన మీద వారి మొదటి ముద్ర అని అంటాము.

అయితే దీనికి ప్రత్యేకించి ఒక కారణమంటూ వుండదు. ఎందుకంటే అసలు ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. ఏదన్నా గాఢంగా పరిశీలించే సమయం అసలు వుండనే వుండదు. మరి అంత తక్కువ సెకన్ల సమయంలో కేవలం తమ మౌనంతోనే అంత గాఢమైన ముద్రను ఎవరైనా వేయగలిగారు అంటే దానిలో వారి బాహ్యరూపం, శారీరక భంగిమలు, అంటే postures అన్నమాట, వస్త్రధారణ, పెదవులపై చక్కని చిరునవ్వు, ఎదుటివారి కళ్ళల్లోకి ధైర్యంగా చూస్తూ మాట్లాడటం, శారీరక హావభావాలు, అంటే body language అన్నమాట, వీటన్నిటి పాత్ర మాత్రమే వున్నదని అనుకోవచ్చును. ఎందుకంటే ఇక్కడ సమయం చాలా క్షణికమైనది, కేవలం సంకేతాలు తప్ప ఎటువంటి మాటలకు సమయమన్నదే వుండదు. అవునా?

ఇంతవరకు ఆకర్షణపై జరిగిన అనేక పరిశోధనలు, అభిప్రాయ సేకరణలలో, అంటే survey లలో అనేకమంది మానసిక శాస్త్రవేత్తలు తేల్చినదేమిటంటే ఎవరిపైనన్నా మొదటి ముద్ర మంచిగా, సకారాత్మకంగా వేయటంలో చిరునవ్వు పాత్ర చాలా వుంటుంది అని. ఎంతటి బాధలనైనా చిటికెలో మరిపించగల మాయో, మత్తో, మరి చిరునవ్వులోనేగా వుంటుంది! ఒక్క బాధే కాదు, కోపాన్ని, తాపాన్ని, ఆఖరికి ఆకలిని కూడా ఒక చిన్న చిరునవ్వు ఇట్టే మరపించేస్తుంది. అలాగే నోరు విప్పకుండానే అనేక భావాలు అందజేయగల శక్తి కళ్ళకి కూడా వుంది. పద్మాల్లాంటి కళ్ళు, కలువల్లాంటి కళ్ళు అంటూ మన కవులెప్పుడూ పొగిడే ఆ కళ్ళు ఎదుటివారి మీద మంచి మొదటి ముద్రను వేయటానికి చాలా బాగా వుపయోగపడతాయి. చిరునవ్వులాగానే కళ్ళు కూడా పెదవులు తెరవకుండానే అనేక మనోభావాలను మౌనంగా, అతి గుప్తంగా వెల్లడిచేస్తాయి. అందుకనే మధురమైన చిరునవ్వును, అందమైన కళ్ళని తమ స్నేహశీలతను, ఆప్యాయతను మోసే పల్లకీలుగా, మరువలేని మొదటిముద్రను వేయగల శక్తివంతమైన వాహనాలుగా మనం పరిగణించవచ్చు.

మన పురాణకథలను, ప్రబంధాలను పరిశీలిస్తే మొదటి పరిచయంలో నాయకీనాయకులు ఒకరినొకరు చూసుకోవటం, మౌనంగా కళ్ళతోనే సంభాషించుకోవటం, కొంచెం బిడియంగా, ఇంకొంచెం మధురంగా చిరునవ్వులొలికించుకోవటం, ఒకరిమీద ఒకరు ప్రేమగా గాఢమైన మొదటి ముద్రను వేసుకోవటం మనం బాగానే గమనిస్తాం. అలాగే ఈ మొదటిముద్రను వేయటంలో మానసిక శాస్త్రవేత్తలు జుట్టుకి, జడకి కూడా చాలా ప్రాముఖ్యతని ఇచ్చారు. మన కవులు నాగుపాములాంటి వాలుజడ, ప్రియుడిని వలపు బంధాలలో బంధించే వల అని జడను పొగిడారు. అలాగే దట్టమైన నీలిమబ్బులలాంటి కురులు అని, నీలాలవంటి కుంతలాలు అని, నల్లని, ఒత్తైన, మెత్తని పట్టులాంటి నిగనిగలాడే కురులు అని, ఉంగరాల జుట్టు అని జుట్టుని పొగిడారు. అందుకని చిరునవ్వు, కళ్ళతోపాటు జుట్టు, జడలు కూడా ప్రభావవంతమైన మొదటిముద్రను వేయటంలో చాలా పెద్ద పాత్రను వహిస్తాయి.

ఈ మొదటి ముద్ర వేయడంలో పెద్ద పాత్రని వహించటానికి వీటితోపాటు ఇంకో విషయం కూడా వుంది. అదే వస్త్రధారణ. ఆడ అయినా, మగ అయినా, ఒక మనిషి వేసుకున్న దుస్తులు ఆ మనిషి గురించి చాలా విషయాలు చెప్పకనే చెప్తాయి. సమయం, సందర్భానికి తగ్గట్లుగా, దేశకాలవాతావరణ పరిస్థితులను అనుసరిస్తూ సరైన దుస్తులు ధరిస్తే గౌరవనీయకంగా బాగుంటుంది కానీ దానికి వ్యతిరేకమైన బట్టలను వేసుకుంటే నలుగురిలో నగుబాటు తప్ప ఇంకేమి మిగలదు. ముఖ్యంగా ఆడవారు దుస్తుల విషయంలో సభ్యతను పాటించకపోతే ముఖం ముందు బయటికి వారిని పొగిడేవారే వారి వెనక వారి గురించి చాలా అసభ్యంగా, అమర్యాదగా, చాలా నీచంగా మాట్లాడతారు. అలాంటివారిని గురించి వేరే వివరాలేమీ తెలియని పరిస్థితిలో అలాంటి వస్త్రధారణ చూసి మరి ఎవరైనా అలా కాకుండా ఇంక ఎలా అనుకుంటారు? ఎవరి సంగతో ఎందుకు? నామటుకు నాకు వస్త్రధారణ విషయంలో ఎవరైనా నలుగురిలో సభ్యతను, మర్యాదను పాటించకపోతే వారి మీద చాలా చికాకుగా వుంటుంది. అలాగే గుడికి వెళ్ళేటప్పుడు పాశ్చాత్య దుస్తులు, పనులు చేసుకునేటప్పుడు కాళ్ళకు, చేతులకు అడ్డం వచ్చేలాంటి దుస్తులు వేసుకుంటే బాగుండదు కదా! సరే, వీటన్నిటితోపాటు ఒక మనిషి ప్రవర్తన సమగ్రంగా, అంటే overall గా ఎలా వుంది అన్న విషయం కూడా వారు ఇతరుల మీద వేయబోయే మొదటిముద్రలో చోటు చేసుకుంటుంది అన్న విషయం అందరికీ తెలిసినదే!

సరే, ఇవన్నీ అశబ్దిక సమాచార మార్పిడి, అంటే non-verbal communication గురించిన సంకేతాలు. మరి ఇప్పుడు శబ్ద సమాచార మార్పిడి, అంటే verbal communication గురించి ఆలోచిస్తే ఎవరినైనా మొట్టమొదటి పరిచయంలో మురిపించేది మనం మాట్లాడే తీరు, వాడే భాష, వుపయోగించే పదాల కూర్పు. తేలికైన, చక్కటి భాషను వాడుతూ తడుముకోకుండా అనర్గళంగా మాట్లాడేవారిని ఎవరైనా సరే, మొదటి పరిచయంలోనే ఇష్టపడతారు. ఈమధ్య మా ఆఫీసులో ఒక ప్రాజెక్టులో చాలామంది తెలుగువారు చేరారు. మొదటిరోజు పరిచయం రోజున వారందరూ నా తెలుగుని బాగా మెచ్చుకోవటం మొదలెట్టారు. నేను తెలుగుని హైస్కూలు తర్వాత మళ్ళీ చదువులో వాడలేదని తెలిసి వాళ్ళ ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. 'కాలేజ్ లో, యూనివర్సిటీలో లేకపోతేనేం? ఇంట్లో తెలుగేగా మాట్లాడుకుంటాం!' అని నేను అంటే 'అయ్యబాబోయ్, మీరు ఇంట్లో కూడా ఇంత మంచి తెలుగు మాట్లాడుకుంటారా?' అంటూ తెగ విస్తుపోయారు. ఇంతకీ చెప్పేది ఏమిటంటే మనం వాడే భాష కూడా మన గురించి ఎదుటివారిలో మంచి మొదటిముద్రని వేస్తుంది. ఆ భాషలో కూడా మొరటు పదాలు లేకుండా, వినడానికి ఇంపైన మంచి, తియ్యటి పదాలను వాడితే ఇంకా బాగుంటుంది. ఇంకో విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సినది ఏమిటంటే మాట్లాడుతున్నప్పుడు గట్టిగా అరవకుండా గొంతుని కాస్త తగ్గు స్థాయిలో వుంచుకుని మాట్లాడటం. అలాగే పరిగెత్తుతున్నట్లుగా కాకుండా వినేవారికి తేలికగా అర్ధం అయ్యేలాగా, నెమ్మదిగా మాట్లాడితే ఇంకా బాగుంటుంది. అందుకే మొట్టమొదటి ముద్ర రూపురేఖల బట్టి వుంటే అన్నిటికంటే వుత్తమమైన ముద్ర మాటల వలన వుంటుంది అని విక్రమ్ వర్మ అనే ఇండియాకు చెందిన ఒక నవలా రచయిత అన్నారు.

ప్రతివారికి అందరి మీద తాము మంచి మొదటి ముద్రని వేయాలని, తమ గురించి అందరూ మంచే అనుకోవాలని వుంటుంది. కానీ ఎంతమందికి అది సాధ్యం అవుతుంది? అలా సాధ్యం అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఇంతదాకా మనం చెప్పుకున్న విషయాలే కాక ఇంకా చాలా విషయాలున్నాయి మనం గుర్తు పెట్టుకోవటానికి. మన హావభావాలు సరిగ్గా వుంచుకోవటం, చేతులు తిప్పటం కొంచెం తగ్గించుకోవటం, ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినటం, మధ్యలో అడ్డుపుల్లలు వేయకుండా అసలు వారిని పూర్తిగా చెప్పనీయటం మొదలైనవాటినన్నిటిని పాటిస్తే కూడా మనం అందరిలో మంచి మొదటిముద్రని వేయగలం. ఒకొక్కసారి మన మాటలు చెప్పనివి మన శరీర భాష చెపుతుంది. అందుకే మన శరీరాన్ని నియంత్రణలో పెట్టుకుని, మన హావభావాలను సందర్భానికి తగినట్లుగా వుంచుకుంటే బాగుంటుంది. అప్పుడే మనం ఎలాంటి మొదటిముద్రను అందరిలో వేయాలని అనుకుంటామో, ఆ కోరిక తీరటానికి అవకాశం వుంటుంది. శరీరాన్ని వంగకుండా, తిన్నగా, అంటే straight గా వుంచుకుంటే మనం భయపడటంలేదని, ఆత్మవిశ్వాసంతో వున్నామని చూసినవారు అనుకుంటారు. లేకపోతే మనల్ని చూసిన వెంటనే మనల్ని పిరికివారుగా భావించే భయం వుంది. కొంతమంది కూర్చున్నపుడు కాళ్ళని వూపుతూ వుంటారు. ఈ అలవాటు ఎదుటివారిని ఎంత చికాకు పరుస్తుందో చెప్పలేను. నాకైతే నాముందు ఎవరైనా అలా కాళ్ళు వూపుతూవుంటే ఆ కాళ్ళని చేత్తో పట్టుకుని ఆపాలని చాలా గాఢంగా అనిపిస్తుంది సుమా! ఒకవేళ కొత్తవాళ్ళని కలుస్తున్నామన్న ఆదుర్దా ఏమన్నా మన మనసులో వుంటే దాన్ని చిరునవ్వు ముసుగు వెనుక చక్కగా కప్పేసేయచ్చు. అలాగే పరుగులు పెడుతున్నట్లు గబగబా మాట్లాడితే కూడా మనం నెర్వస్ గా వున్నామని తెలిసిపోతుంది. చక్కగా, నెమ్మదిగా, తగ్గుస్థాయి కంఠధ్వనిలో మెల్లిగా మాట్లాడితే వినేవాళ్ళకి వినసొంపుగా వుంటుంది. అసలు మనం ఏం చెప్పదలచుకున్నామో వాళ్ళకి విపులంగా అర్ధం అవుతుంది కూడా. ఇక్కడ ఇంకొక్క అదనపు విషయం చెప్తాను. స్టేజి మీద నలుగురి ముందు ప్రదర్శనలు ఇచ్చేటపుడు ఈ వస్త్రధారణ విషయంలో చాలా అదనపు జాగ్రత్తని వహించాలి. మనం ఎటువంటి దుస్తులు కట్టుకున్నా ప్రేక్షకులలో గౌరవ మర్యాదలని రేకెత్తించేవిగా వుండాలి కానీ చవకబారుగా, వెగటు కలిగించేవిలాగా వుండకూడదు. ఈ విషయాలన్నీ మాట్లాడుతుంటే నాకు S.P. Sailaja గారు గుర్తొస్తున్నారు. సల్వారు, చుడిదార్, చీర, పట్టు, కాటను ఏది కట్టుకున్నా స్టేజి మీద డిగ్నిటీ కి మారురూపం లాగా వుంటారు ఆవిడ. అలాగే ఏవన్నా సెమినార్ లలో కూడా ప్రసంగకర్త సరైన వస్త్రధారణ లేకుండా అస్తమాను దుస్తులను సవరించుకుంటూవుంటే ఇంక అక్కడ వున్నవారి ప్రతిస్పందన, అంటే reaction ఎలా వుంటుంది? ఆమె చెప్పే విషయంపై వారికి ఏకాగ్రత ఎలా కుదురుతుంది?

ఇంకొక విషయం. స్టేజి మీద ప్రదర్శనలు కావచ్చు, లేక తరగతిలో విద్యాబోధన కావచ్చు, లేక మామూలు సంభాషణ కావచ్చు. ఎదుటివారి మీద మన మొదటిముద్ర సరిగ్గా, సకారాత్మకంగా వుండాలంటే మనం వారికి తగిన గౌరవాన్ని ఇవ్వాలి, అలా ఇస్తున్నట్లు వారికి తెలియాలి. వారిమీద ఆసక్తిని చూపించాలి, అలా చూపిస్తున్నట్లు వారికి తెలియాలి. అంటే వారి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడటం, వారిని వారి పేరుతో వీలైనంతవరకు సంబోధించడం, వారు చెప్పేది శ్రద్ధగా వినటం, వారు చెప్పేది శ్రద్ధగా వింటున్నామని ఋజువు చేస్తున్నట్లుగా మధ్యమధ్యలో వారిని ప్రశ్నలు అడగటం, ఇవన్నీ చేయడమన్నమాట. అప్పుడు ఎదుటివారు తప్పకుండా మన గురించి సకారాత్మకంగా అనుకుంటారు. నేను స్టేజి మీద పాడుతున్నప్పుడు కానీ, లేక ఏదన్నా ప్రసంగం ఇస్తున్నప్పుడు కానీ ప్రేక్షకులని తప్పకుండా involve చేస్తాను. దానివలన నేను వారిని మర్చిపోలేదని, వారి అభిప్రాయాలకి చాలా విలువనిస్తానని ఋజువవుతుంది. అవునా? ఏదో కేవలం ఋజువుల కోసం మాత్రమే కాదు. నిజంగా నా అభిమతం కూడా అదే! మన మనసులోని నిజాయితీ మన ముఖంలో ప్రస్ఫుటమవుతుంది. ఎదుటివారి మీద మంచి మొదటిముద్రని వేయటానికి అది బాగా తోడ్పడుతుంది. దీనికి తోడుగా మనం బాగా అభ్యాసం చేసి మన ప్రదర్శనకి, అంటే performance కి లేక ప్రసంగానికి లేక విద్యాబోధనకి లేక ప్రస్తుతీకరణకి, అంటే presentation కి పూర్తిగా సిద్ధంగా కూడా వుండాలి. అప్పుడే మన అభ్యాసం మన నైపుణ్యంగా మారి, మన నైపుణ్యత మన ఆత్మవిశ్వాసంగా మారి మన ముఖాలలో ప్రతిఫలిస్తూ చూసేవారి మీద మంచి ముద్రను వేసి వారి మనసులను ఇట్టే ఆకట్టుకొంటుంది. అందుకే ఏ పరిస్ధితికైనా సరే, సరైన అభ్యాసం చేయకుండా సిద్ధంగా లేకపోవడం అన్నది ఒక పెద్ద లోపం అని James Taylor అనే Purdue University కి చెందిన ఒక మానసికశాస్త్రవేత్త, ప్రొఫెసరు అన్నారు.

సరే, మనం మంచి మొదటిముద్ర వేయటానికి, ఎదుటివారి మనసుని గెలవటానికి ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో కూడా చర్చించుకున్నాం. మరి నిజంగా ఆ మొదటిముద్ర మనం కోరుకున్నట్లుగా వేయగలిగామో లేదో ఎలా తెలుస్తుంది? మంచి అనుమానమే కదూ! కానీ సమాధానం మాత్రం మరీ అంత క్లిష్టమైనదేమో కాదు. ఎందుకంటే మనం ఎదుటివారికి నచ్చామో లేదో మన మనసే మనకి చెప్పేస్తుంది. దానిని వారి ప్రవర్తన బలపరుస్తుంది. ఉదాహరణకి ఒక అమ్మాయి, అబ్బాయి, పూర్తిగా అపరిచితులు, మొదటిసారి కలుసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాము అని అబ్బాయి అడిగితే అతని మీద ఆ అమ్మాయి మొదటిముద్ర సకారాత్మకంగానే వుంది అని తెలిసిపోతోంది కదా! సరే, ఒకవేళ ఆ అమ్మాయి ఆ ఆహ్వానాన్ని నిరాకరించిందనుకోండి, అప్పుడు ఆ అమ్మాయి మీద ఆ అబ్బాయి మొదటిముద్ర అంత శక్తివంతంగా లేదు అని కూడా తెలిసిపోతోంది. అవునా? వారి హావభావాలు, శరీరభాష, ఇవన్నీ కూడా అనేక సంకేతాలు ఇస్తాయి. అసలు ఈ సంకేతాలు, ఊహలు వదిలేసి కొన్నిసార్లు ఎదుటివారు వాళ్ళ మనసులో ఏముందో స్పష్టంగా చెప్పేస్తారు. అప్పుడసలు మన మొదటిముద్ర ప్రభావం గురించి తెలుసుకోవటానికి ఏ తంటా వుండదు. ఉదాహరణకి మా అబ్బాయి Master’s Program లో చేరటానికి పెద్ద పెద్ద యూనివర్సిటీలలో ఇంటర్వ్యూలు ఇస్తున్నపుడు వాళ్ళు ఇంటర్వ్యూ పూర్తి అయ్యేలోపే నీకు admission ఇస్తున్నామని చెప్పేసేవారు. అంటే వారి మీద వాడు వేసిన మొదటిముద్ర చాలా బాగా ఉన్నదన్నమాట. అంతేకదా!

అయినా అసలు ఈ మొదటిముద్రతో అందరినీ మన వశం చేసుకోవాలని అంత ఆరాటం ఎందుకు మనకి? ఈ మొదటిముద్ర అంత ముఖ్యమైనదా? అది మనం ఆశించినంత గొప్పగా లేకపోతే అసలు ఏమవుతుంది? ఆ సంగతి చెప్పేముందు ఎవరికైనా సరే, అసలు మొదటిముద్ర బాగా వుంటే ఏమవుతుందో చెప్పుకుందాం. అప్పుడు అది బాగా లేకపోతే  ఏమవుతుందో మనకి తేలికగానే అర్ధం అయిపోతుంది. అతి తక్కువ సమయంలో ఏర్పడినా సరే, ఒక మనిషి మీద పడిన మొదటి ముద్ర ఒక పట్టాన వదలదు. కలకాలం నిలిచివుంటుంది. వారి మీద మనకి ఒక గాఢమైన మంచి అభిప్రాయాన్ని కలగజేస్తుంది. వారితో మన స్నేహబాంధవ్యాలకి, ఆప్యాయత, అనురాగాలకి, పునాదిని వేస్తుంది. అందుకే ఈ ప్రపంచంలో రెండే విషయాలు ఒకసారి చేజారితే మళ్ళీ తిరిగి పొందలేమని, అవి కాలం మరియు మనం ఎదుటివారి మీద వేసే మొదటిముద్ర అని అంటూ మొదటిముద్రలకి కాలంతో సమానమైన వున్నత స్థానాన్ని ఇచ్చారు Cynthia Ozick అనే అమెరికాకు చెందిన ఒక రచయిత్రి.  మనమీద మంచి మొదటిముద్ర వేసినవారి మీద మనకి ఎంత నమ్మకం ఏర్పడుతుంది అంటే, ఎవరైనా వారి గురించి ఏమన్నా అప్రియమైన మాటలు చెప్తే కూడా ఆ చెప్పేవారి మీద అనుమానం వస్తుంది కానీ ఆ మాటలని నమ్మబుద్ధి కాదు. అంతేకాదు, ఎవరైనా మనమీద సకారాత్మకమైన మొదటిముద్ర వేస్తే, వెంటనే మనం వారికి లేని వేరే ఇతర మంచి గుణాలని కూడా ఆపాదించేస్తాము. మనకి మొదటి చూపులోనే వారు నచ్చారు కాబట్టి మన దృష్టిలో ఇంక వారు సకలగుణాభిరాములు, ఒప్పులకుప్పలూను. దీన్నే Halo effect అంటారు. 1920 లో అమెరికాకు చెందిన Edward Thorndike అనే ఒక మానసిక శాస్త్రవేత్త ఈ theory ని కనిపెట్టారు. అందుకే ఒక మంచి మొదటిముద్ర ఎన్నో అద్భుతాలు చేయగలదు అని England కు చెందిన మరియు అత్యంత జనాదరణను పొందిన Harry Potter series ని రాసిన J K Rowling అనే ఒక ప్రముఖ రచయిత్రి అన్నారు.

ఇంకో విషయం. ప్రాధమిక ప్రభావం, అంటే Primary effect అని ఇంకో theory వుంది. దీని ప్రకారం మొట్టమొదటగా మనకి తెలిసిన విషయమే మన మనసు, మస్తిష్కాలలో బలంగా నాటుకుపోతుంది. ఈ ప్రభావం ఎంత గాఢంగా వుంటుందంటే ఆతర్వాత మనకి వాటికి పూర్తి వ్యతిరేకమైన వార్తలు తెలిసినా కూడా మన మనసు వాటిని ఒప్పుకోనని మొరాయిస్తుంది. సంజీవ్ కుమార్ అనే ఒక హిందీ నటుని తల్లి హేమమాలిని అనే ఇంకో హిందీ నటిని తన కోడలిగా చేసుకోవాలని చాలా కోరుకున్నారట. కానీ ధర్మేంద్ర అనే ఇంకో హిందీ నటునికి, హేమమాలినికి మధ్య ప్రేమ బంధం అప్పటికే వుంది అని ఎవరు చెప్పినా, ఆఖరికి వారి ఫోటోలు చూపించినా కూడా ఆవిడ ఒక పట్టాన నమ్మలేదట. అంటే ఆవిడ మీద హేమమాలిని మొదటిముద్ర అంత సకారాత్మకంగా, గాఢంగా, బలంగా వున్నదన్నమాట. మరి ఇది Primary effect ప్రభావం వల్లనే కదా!

అందుకే ఈ మొదటి ముద్రల విషయంలో మనం చాలా జాగ్రత్తగా వుండాలి. మంచి అయితే ఫరవాలేదు కానీ చెడు ముద్ర కనక వేసామంటే దానిని పోగొట్టుకోడానికి చాలా తంటాలు పడాల్సివస్తుంది. అంత కష్టపడినా కూడా అవి పోతాయన్న గేరంటీ కూడా ఏమీ లేదు సుమా! అందుకే 1st impression ని best impression అని కూడా కొందరు అన్నారు. సరే, ఒకవేళ ఖర్మ కాలి తెలిసో తెలియకో, మన మాటల వలనో, చేతల వలనో మొదటిముద్రలు మనం చేదు, చెడుముద్రలే వేసామనుకోండి. మరి అప్పుడేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? నిజాయితీగా క్షమాపణలు చెప్పేయాలి. మన మాటలు లేక చేతల వలన ఎవరినన్నా మనం మనసు నొచ్చుకునేట్లు చేస్తే అది నిజంగా మన అభిమతం కాదని, కేవలం పొరపాటు వలన అలా జరిగిందని, మన  అసలు ఉద్దేశాన్ని వివరించి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పేస్తే పరిస్థితి కొంచెం మెరుగుపడే అవకాశం వుంది. వీలైతే ఇంకోసారి మళ్ళీ కలుసుకుందామని సలహా కూడా ఇవ్వచ్చును. ఎందుకంటే వారికి నిజంగా అసలు మీరేమిటో తెలియజెప్పే అవకాశాన్ని మీ అంతట మీరే కల్పించుకోవాలి మరి. అవునా?

దేశకాలసాంప్రదాయాలను బట్టి కూడా ఈ మొదటిముద్రల కారణాలు మారుతూవుంటాయి కాబోలు. చైనీయుల సమాజంలో శారీరక శక్తి కాకుండా తెలివితేటలు, సామర్థ్యతను బట్టి మొదటిముద్రలు వుంటాయట. అయినా ఒక్క విషయం మాత్రం నిజం. ఏ దేశమైనా, ఏ సంప్రదాయమైనా అందంగా, ఆకర్షణీయంగా వున్నవాళ్ళు మంచి మొదటిముద్రలు తేలికగా వేయగలరు అని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. తర్వాత అవి నిజం కాదు అని తెలియవచ్చు. అది కూడా సంభవమే! అలాగే ముఖంలో పసితనం వుట్టిపడేవారు స్వభావంలో కూడా చిన్నపిల్లల్లాగానే వుంటారని అంటారు కొందరు. కానీ ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే అని కూడా ఋజువు కావచ్చు. ఇవే కాదు, ఇలాంటివి ఎన్నో! అంటే మొదటిముద్రలు ఎల్లప్పుడూ నిజం అవ్వాలని రూలేమీ లేదు మరి. అవునా? అందుకే 1st impressions ఎప్పుడు కూడా అవిశ్వసనీయమైనవి లేదా నమ్మశక్యమైనవి కావు అని Franz Kafka అనే ఒక Jewish Czech రచయిత అన్నారు.

అయినా సరే, మొదటిముద్రలు తదుపరి బంధాలకి మెట్లు. భవిష్యత్తులోని సంబంధబాంధవ్యాలను గట్టిపరచే బలమైన పునాదులు. మనుషులు ఒకరినొకరిని ఎలా పరిగణిస్తారో, ఎలా గౌరవించుకుంటారో, పరస్పరం ఎలా ప్రవర్తిస్తారో, ఇవన్నీ మనకు తెలీకుండానే మనం ఎదుటివారి మీద లేదా మన మీద ఎదుటివారు వేసే మొదటిముద్రల మీద ఆధారపడివుంటాయి. అందుకే ఈ మొదటిముద్రలు చాలా ముఖ్యమైనవి. అయితే మొదటిముద్ర కేవలం మొదటి ముద్రే! రెండోది, మూడోది కాదు. అందుకే మంచి మొదటిముద్రను వేయటానికి ఎవరికైనా సరే, కేవలం ఒకే ఒక్క అవకాశం దొరుకుతుంది అని Stephanie Perkins అనే అమెరికాకు చెందిన ఒక ప్రముఖ bestselling నవలారచయిత్రి అన్నారు. ఇదే భావాన్ని Will Rogers అనే ఒక అమెరికన్ రచయిత ఇంకో విధంగా అన్నారు. ఎవరికైనా సరే, మొదటి ముద్రను వేయటానికి రెండో అవకాశం అంటూ ఏదీ దొరకదు అని ఆయన అన్నారు. ఈ రెండింటి భావం ఒకటే!

అయినా సరే, మనం మన వివేకాన్ని మరువకూడదు. కేవలం సరైన ఆధారాలేవీ లేని ఈ క్షణిక మొదటిముద్రలకి అంత అధికమైన ప్రాముఖ్యతని ఇచ్చి అంతకంటే ముఖ్యమైన ఇతర వివరాలని అశ్రద్ధ చేయడం తెలివైన పని కాదు. అవునా?

అందుకే మనందరం ఈ మొదటిముద్రలకి కేవలం అవసరమైనంత వరకే విలువని ఇద్దాం. ఒక మనిషిని కానీ, ఒక పరిస్థితిని కానీ స్థూలంగా అన్ని వైపుల నుండి కూలంకషంగా పరిశీలించిన తర్వాతే మన నిర్ణయాలని తీసుకుందాం, క్షణికమైన మొదటిముద్రల ఆధారంగా కాదు. అలాగే మనం కూడా మన మొదటిముద్రలు బాగా వుండాలని, మంచి ప్రభావభరితంగా వుండాలని తాపత్రయపడటం మానేసి వాటి బదులు శాశ్వతమైన మంచి ముద్రలు వేయాలని కృషి చేద్దాం. ఎందుకంటే Sonya Parker అనే ఒక యోగా అధ్యాపకురాలు అన్నట్లుగా మంచి మొదటిముద్ర చాలామందే వేయగలరేమో కానీ శాశ్వతంగా నిలిచిపోయే మంచి ముద్రని మాత్రం కేవలం కొంతమందే వేయగలరు. మనందరం ఆ కొంతమందిలో చేరడానికి కృషి చేద్దాం.  అన్నిటికంటే ముందు మన మనసులను నిష్కల్మషంగా వుంచుకుని నిస్స్వార్ధంగా పరోపకారం చేస్తూవుంటే మన మొదటి ముద్ర ఒక్కటే కాదు, రెండో ముద్ర, మూడో ముద్ర, ఆఖరికి చివరి ముద్ర కూడా బ్రహ్మాండంగా వుంటుంది. అవునా?

నిజం చెప్పాలంటే ప్రతి నెలా రాసే ఈ వ్యాసాలతో నాకు కూడా మీ అందరి మీద శాశ్వతమైన మంచి ముద్రని వేయాలని కోరికగా వుంది సుమా!

సరే, ఇంక ఈసారికి మరి ఇంతటితో ఆపనా? మళ్ళీ వచ్చే నెల ఇంకో మంచి విషయాన్ని వెంటపెట్టుకొని మీ ముందుకు వస్తాను. అంతదాకా సెలవు.

**********

Posted in October 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *