Menu Close
ఆర్. శర్మ దంతుర్తి
తెలుగు పద్య రత్నాలు 63
ఆర్. శర్మ దంతుర్తి

భగవంతుణ్ణి కీర్తించడానికి కవులు అనేకానేక పద్యాలు, కవితలు రాసినా దేనికవే గొప్ప. చాటు పద్యాలుగా చెప్పబడే అనేకానేక పద్యాలలో మన తెలుగు గొప్పదనం కనిపిస్తుంది. ఈ నెల పద్యంలో భగవంతుణ్ణి ‘మామ’ గా వర్ణించారు. ఎనిమిది మామలు కనిపిస్తాయి పద్యం మొత్తంలో. మొదటి రెండు పదాలు చదవగానే ఈ పద్యం ఎవరి గురించో తెలిసిపోతుంది చూడండి.

ఉ.
మామను సంహరించి, యొక మామను గర్వమడంచి యన్నిశా
మామను రాజుజేసి, యొకమామ తనూజున కాత్మబంధువై
మామకు గన్నులిచ్చి, సుతుమన్మధునింతికి దానె మామయై
మామకు మామయైన పరమాత్ముడు మీకు బ్రసన్నుడయ్యెడున్

మామని సంహరించి అనగానే గుర్తొచ్చేది కృష్ణుడు కదా? అదే చెప్తున్నారు ఇక్కడ, కంసుడనే మేనమామను చంపి; రెండో మామ కి గర్వం అణిచాడుట. ఎవరా రెండో మామ? లంకానగరానికి దారి ఇవ్వమని సముద్రుణ్ణి అడిగితే ఆయన గర్వంతో సమాధానం చెప్పలేదు. అందువల్ల ఒక బాణం తీసి సముద్రాన్ని ఎండగట్టబోయేసరికి బయటకి వచ్చాడు గర్వం తగ్గించుకుని. అందువల్ల సముద్రుడి గర్వం అణిచిన మామ రాముడు (విష్ణువు). అయితే సముద్రుడు మామ ఎలా అయ్యాడు విష్ణువుకి? లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది కనక ఆవిడని భార్యగా చేసుకున్న విష్ణువుకి సముద్రుడు ‘పిల్లని ఇచ్చిన మామ’ ఇక్కడ.

తెలుగులో ఒక పదానికి అనేకానేక అర్ధాలు ఉన్నప్పుడు వాటిని నానార్ధాలు అనడం అలవాటు. అలా నానార్థాలలో ‘రాజు’ అంటే చంద్రుడు అని ఒక అర్థం ఉంది. ఈ విషయం మూడో మామలో చెప్తున్నాను (మామను రాజు చేసి). దీనికి అర్ధం ఏమిటంటే, చందమామను రాత్రి కి (నిశా) రాజుగా చేసాట్ట. వామనావతారం మొదలు పెట్టబోయేముందు శుకమహర్షి చెప్తాడు పరీక్షిత్ తో “మనువులూ, ఋషులూ, మనువుల కొడుకులూ, ఇంద్రులూ, దేవతలూ విష్ణుదేవుని ఆజ్ఞకు లోబడి ఉంటారు. యజ్ఞుడు మొదలైనవారు అందరూ విష్ణుదేవుని అంశముతో రూపు దాలుస్తారు. అతని సహయంవల్ల మనువులు లోకాలను ఏలుతారు (పోతన భాగవతం 8-433).” ఈ మనువులూ, ఋషులూ నవగ్రహాలూ ఒక దారిలో పెట్టి ఈ మన్వంతరం మీరు ఏలాలి అని చెప్తాడు. ఇదే చందమామని రాత్రికి రాజుగా చేయడం అంటే. నాలుగో మామ పాండురాజు. కుంతి కృష్ణుడికి అత్త అవుతుంది కనక పాండురాజు కృష్ణుడికి మామ వరస కదా. ఆ మామ కొడుకు అర్జునుడు. అతనికి ఆత్మ బంధువైన వాడు; కృష్ణుడు లేకుండా అర్జునుడు లేడు కనక ఆత్మ బంధువు కృష్ణుడే (యొకమామ తనూజున కాత్మబంధువై).

ఐదో మామ ధృతరాష్ట్రుడు. కురుక్షేత్ర సంగ్రామం మొదలవకముందు రాయబారిగా వచ్చాడు కృష్ణుడు కౌరవ సభకి. అక్కడ స్పష్టంగా చెప్పాడు ‘సారపు ధర్మమున్ విమల సత్యము…’ (తెలుగు పద్య రత్నాలు – 4) అంటూ. ఇంత చెప్పినా సర్వనాశనం తన్నుకు వస్తూ నెత్తి మీద కూర్చున్నప్పుడు దుర్యోధనుడు కృష్ణుణ్ణి బంధించడానికి సన్నాహాలు చేయడం సాత్యకి గమనించి చెప్తాడు. అప్పుడు సభలో అందరికీ తన నిజ స్వరూపం చూపిస్తాడు కృష్ణుడు నేను ఒక్కణ్ణే అనుకుంటున్నావు కాబోలు చూడు అంటూ అక్కడే కూర్చున్న ధృతరాష్ట్రుడికి కూడా కనిపించడానికి కాసేపు దృష్టి ప్రసాదించడం మహాభారతంలో చూడవచ్చు. అయినా వాళ్ళకి బుద్ధిరాదు కనక మిగిలినది సర్వనాశనం. ఇదే పద్యంలో చెప్పిన “ఒక మామకు కన్నులిచ్చి” అంటే – రాయబారం సమయంలో ధృతరాష్ట్రునికి తాత్కాలికంగా దృష్టి ఇవ్వడం.

ఆరో మామ – తన తపస్సుకి అడ్డం వచ్చిన మన్మధుణ్ణి పరమేశ్వరుడు మూడో కన్నుతో దగ్ధం చేసాక రతీదేవి అడుగుతుంది ‘మా ఆయన తప్పు లేదు ఇందులో, దేవతలు అడిగితే ఇలా చేసాడు’ అని. అయితే “కృష్ణుడికి కొడుకుగా పుడతాడు, నీకు మాత్రం మామూలుగా కనిపిస్తూనే ఉంటాడు” అని శివుడు వరం ఇచ్చాడు. అలా పుట్టినవాడే కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడి భార్య రతీదేవి (మాయవతి అని కొంతమంది అంటారు) కి కృష్ణుడు తానే మామగారు అయ్యాడు కదా. ఇదే ఆరోమామ గా చెప్పారు పద్యంలో – “సుతుమన్మధునింతికి దానె మామయై.” ఏడో మామ మరొకసారి సముద్రుడే. అయితే ఎనిమిదో మామ ఎవరంటే ముందు ఏడో మామ కి మామ అయినవాడు. దీని కధ కొంచెం విపులంగా చూద్దాం.

గంగ విష్ణుపాదాల దగ్గిర ఉద్భవించి బ్రహ్మ కలశంలో చేరుతుంది. అక్కడనుంచి కిందకి రావడానికి భగీరధుడు ప్రయత్నం చేసాడు (తెలుగు పద్య రత్నాలు – 38). బ్రహ్మ తన కలశంలో గంగని వదిలినా గంగ కోసం మరో తపస్సు. ఆవిడ కింద పడి భూమికి అపాయం చేయకుండా కాచుకోవడానికి శివుడు తన తలమీద ధరించాలి. దానికి మరో తపస్సు అయ్యాక గంగ భువికి దిగింది. అక్కడనుంచి సగరుల భస్మాలమీదుగా పారి సముద్రంలో కలుస్తుంది గంగ.  గంగానది విష్ణువుకి కూతురుకింద లెక్క తన పాదాల దగ్గిర పుట్టింది కనక. అలా తన కూతుర్ని సముద్రుడికి ఇచ్చాట్ట విష్ణువు. అందువల్ల సముద్రుడికి విష్ణువు మామ. అయితే ముందు చెప్పుకున్నట్టూ విష్ణువుకి తన కూతుర్ని (లక్ష్మీదేవి) ని ఇచ్చాడు కనక సముద్రుడు విష్ణువుకి మామ. అలా మామకు మామ అయ్యాడు.

ఇంతకీ పద్యం చెప్పేది ఏమిటంటే ఇటువంటి మామ అయిన పరమాత్ముడి అనుగ్రహం మీ మీద ఉండు గాక అని చెప్తున్నారు (పరమాత్ముడు మీకు బ్రసన్నుడయ్యెడున్).

********

Posted in October 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *