ఆస్టిన్ ఎయిర్పోర్ట్. అప్పుడే సెక్యూరిటీ చెక్ ముగించుకుని, లగేజ్ తీసుకుని పక్కకు వచ్చి కూర్చుని సరిచూసుకుంటున్నాడు ఆ పెద్దాయన. సెక్యూరిటీ ట్రే లో నుంచి బెల్ట్ తీసుకొని పెట్టుకుని వాలెట్, కర్చీఫ్ తీసుకుని ప్యాంటు జేబుల్లో పెట్టుకున్నాడు. ట్రే లో ఉన్న రెండు మొబైల్ ఫోన్స్ వాటి కింద ఉన్న బోర్డింగ్ పాసులు తీసుకుని ఎవరి కోసమో అన్నట్లు పక్కకు తిరిగి చూసాడు. ఇదిగో ఇక్కడ ఉన్నా అన్నట్లు ఎవరి వైపో చేయి ఊపాడు. నాలుగయిదు అడుగుల దూరం నుంచి ఒకావిడ కళ్ళజోడు సరిచేసుకుంటూ ఆయన దగ్గరకు వచ్చింది.
ఆవిడ చీర పమిట భుజం మీదుగా తీసుకుంటూ ఆయనతో ఎదో అంటుంది. ఆ పెద్దాయన ఫుల్ హ్యాండ్ షర్ట్ టక్ చేసుకుని ఆవిడ చేతికి ఒక మొబైల్ ఇచ్చి షూస్ సరిచేసుకుంటూ తల ఊపుతున్నాడు సరే అన్నట్లు. తన హ్యాండ్ బాగ్ తగిలించుకుని, ఆవిడ హ్యాండ్ బాగ్ చేతికిచ్చి, ఆవిడ చెబుతున్నా వినకుండా లగేజ్ ట్రాలీని తీసుకున్నాడు.
రెండు అడుగులు ముందుకు వేసి అక్కడికి దగ్గరలోనే ఉన్న డిస్ప్లే బోర్డు చూస్తున్నాడు. ఆస్టిన్ నుంచి చికాగో ORD (O'Hare International) సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ పేపర్ బోర్డింగ్ పాస్ లో ఫ్లైట్ నెంబర్, గేట్ నెంబర్ డిస్ప్లే బోర్డు లో సరిచూసుకున్నాడు. ఫ్లైట్ ఆన్ టైం గేట్ నెంబర్ సరిగానే వుంది.
ఇద్దరూ గేట్ వైపు నడవడం మొదలుపెట్టారు. ఆవిడ హ్యాండ్ బాగ్ భుజానికి సరిచేసుకుంటూ లగేజ్ ట్రాలీ తనకివ్వమన్నట్లు తీసుకోబోయింది. ఆయన పరవాలేదన్నట్లు ట్రాలీ ని లాగుతూ, నువ్వు నడువు అన్నట్టు చేయి చూపించాడు. ఉదయం కావటం వలన ఎక్కువగా వెళ్లే వాళ్ళతో ఎయిర్పోర్ట్ కొంచెం రద్దీగా ఉంది. ఆవిడ అటు ఇటు ఉన్న షాపులను ఆసక్తిగా చూస్తూ అడుగులేస్తోంది. ఆయన ఆవిడ వెనకాల జాగ్రత్తగా గమనించుకుంటూ నడుస్తున్నాడు.
సెక్యూరిటీ చెక్ పాయింట్ నుంచి వాళ్లనే గమనిస్తూ అనుసరిస్తున్న నేను వాళ్ల వెంట నడుస్తున్నాననే అవగాహన ఉండకూడదని, కొంచెం దూరం పాటిస్తూ నెమ్మదిగా అడుగులు వేసాను. గేట్‌కి దారిలోని కాఫీ స్టాల్ దగ్గర ఆవిడ కాసేపు ఆగి బోర్డు చూసింది. ఆయన తలవంచి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే ఇద్దరూ మళ్లీ ముందుకు నడిచారు.
మధ్యలో రెస్ట్‌రూమ్స్ దగ్గరికి రాగానే ఆవిడ కాసేపు ఆగింది. ఆయన ఒక్క చూపుతోనే అర్థం చేసుకున్నాడు. “వెళ్ళి రా, నేను లగేజ్ దగ్గరే ఉంటా” అన్నట్లుగా ఆమె trolleyని తనవైపు లాగుకున్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళి పోయింది. ఆయన మాత్రం లగేజ్ దగ్గర ఆగి, ఒకసారి చుట్టూ జాగ్రత్తగా చూసుకున్నాడు.
కొద్దిసేపటికి ఆవిడ తిరిగి వచ్చేసరికి ఆయన చిన్నగా నవ్వుతూ, trolleyని ముందుకు నెట్టేశాడు.
ఆమె కాస్త శ్వాస సరిచేసుకుని, చీర పమిట మళ్లీ సరిచేసుకుంటూ, ఆయన వెంట నడవడం మొదలుపెట్టింది.
గేట్ వరకు వెళ్ళే దారిలో ఉన్న ప్రతి చిన్న విషయానికీ వాళ్ల మధ్య ఓ మౌన సంభాషణ సాగుతోంది —
ఆవిడ నడకతో ఆయన తన నడకను సరిచూసుకుంటూ ఆయన నడవటం గమనించాను.
వాళ్ల మధ్య ఆ మౌన మమకారం... ఆ స్నేహం... ఒక్కసారిగా హృదయాన్ని మెల్లగా తాకింది.
ఎవరైనా తొలిసారి గమనించినా వాళ్లు ఒక జంట అని, భార్యాభర్తలని స్పష్టంగా అనిపించేలా ఉంది. వారి మధ్య ఆత్మీయత, ఒకరిపై ఒకరికి ఉన్న శ్రద్ధ బోర్డింగ్ గేట్ వరకు నడుస్తూనే బయటపడుతోంది.
గేట్ నెంబర్‌కి చేరుకునే దారిలో పెద్ద కిటికీలతో ఉన్న లాంజ్ పక్కగా వచ్చారు వారిద్దరూ. ఆవిడ బయట పార్క్ చేసిన విమానాల్ని కాసేపు ఆగి ఆసక్తిగా చూసింది. ఆయన బోర్డింగ్ పాస్‌ని మడత పెట్టి షర్ట్ జేబులో వేసుకున్నాడు.
చిన్న చిన్న విషయాలకీ ఓపికగా ఒకరినొకరు చూసుకుంటూ, మాటలలో కంటే కన్నుల్లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నట్టున్నారు. గేట్ దగ్గర కూర్చోడానికి సీట్లు వెతుక్కుంటూ ఆ జంట ముందుకు నడిచారు.
ఆయన ముందుగా trolley luggage ని, తన హ్యాండ్ లగేజ్ ని పక్కన పెట్టి, ఒక సీట్ లో ఆవిడను కూర్చోమన్నట్లు సైగ చేసి మధ్యలో ఒక సీట్ వదిలేసి, ఆ పక్క సీట్ లో తాను కూర్చున్నాడు.
ఆవిడ కూర్చుని, చీర పమిట సరిచేసుకుంటూ చిన్నగా ఊపిరి పీల్చుకుంది.
నేను మాత్రం రెండు వరసలు వాళ్లకు ముందుగా కుర్చీ తీసుకుని, వాళ్లను చూస్తూ, “ఇంత సింపుల్‌గా, ఇంత మమకారంగా జీవించటం అంటే ఇలాగే ఉండాలి అనిపిస్తోంది” అనుకున్నాను.
ఆయన అలా కూర్చుని, ఆమెకి నీళ్ళ బాటిల్ అందించాడు. "కొంచెం తాగు" అన్నట్లుగా ఆయన చూపే చెప్పేసింది. ఆవిడ బాటిల్ తాగి తిరిగి ఇచ్చేసరికి, ఆయన దాన్ని సరిగ్గా మూత పెట్టి trolleyకి పెట్టాడు.
గేట్ డిస్ప్లే స్క్రీన్‌లో “బోర్డింగ్ టైం” మారుస్తుంటే ఆయన జాగ్రత్తగా బోర్డింగ్ పాస్ తీసి మళ్లీ ఒకసారి నెంబర్ చూసుకున్నాడు.
ఆవిడ ఆయన వైపు చూసి చిన్నగా నవ్వింది – “ఇంకా టైం వుంది, నువ్వే ఎప్పుడూ ఇలాగే వెరిఫై చేస్తుంటావు” అన్నట్లుగా.
నేను ఈ జంటని గమనిస్తూ, వారి ప్రతి చిన్న జాగ్రత్తలో ఒక జీవితాంతర సహచర్యం కనిపిస్తోందని అనిపించింది. ఇది ప్రయాణం కాదు, ఇది ఒకరికొకరిపై చూపే జీవనయాత్ర జాగ్రత్తలు అని మనసులో తేల్చుకున్నాను.
బయట విమానం కనిపిస్తోంది. లోపల ఈ జంటలో మాత్రం అంతరంగ విమానం ఎప్పుడూ ఒకే దిశలో ఎగురుతోంది — ఒకరి చూపుల్లో ఇంకొకరిని నిలబెట్టుకుంటూ.
ఈ తరం ప్రేమని ఎమోజీల్లో చూపుతుంది.
ఇవాళ వాళ్ళిద్దరి చూపుల్లో ఆ ప్రేమ ఒక మధురమైన గీతంలా వినిపిస్తోంది.
మాటలకంటే మౌనం ఎక్కువ సన్నిహితంగా ఉంటుంది అనిపించింది.
ఆవిడ తన handbag లోంచి నెమ్మదిగా కొన్ని ఆరంజ్ పళ్ళను బయటకు తీసి, ఆయనకు ఇవ్వబోయింది. ఆయన మొదట మొహమాటంగా చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఆవిడ మాత్రం మృదువైన తల అటకాయిస్తూ, “తీసుకో, తింటే మంచిదే” అన్నట్టుగా ఒత్తిడి చేసింది.
చివరికి ఆయన చిన్నగా నవ్వుకుంటూ, రెండు పళ్ళను ఆవిడ చేతులోంచి తీసుకున్నాడు.
ఆవిడ handbagలో ఒక చిన్న నాప్‌కిన్ కూడా ఉంచి ఆయనకి అందించింది. ఆయన తీసుకుని వాడి, చివర్లో ఆరంజ్ తొక్కలన్నీ ఆవిడ దగ్గర నుంచి తీసుకుని, లేచి పక్కనే ఉన్న ట్రాష్ బిన్‌లో వేసాడు.
తిరిగి వచ్చి కూర్చుని, ఒకసారి తన షర్ట్ సరిచేసుకుంటూ, ఆమె వైపు చిన్నగా చూశాడు. ఆ చూపులో సిగ్గు, కృతజ్ఞత, ఆప్యాయం అన్నీ కలిసివున్నాయి.
నేను మాత్రం కొద్దిదూరంలో కూర్చుని, ఆ సన్నివేశాన్ని గమనిస్తూ అనుకున్నాను —
“ప్రేమ అనేది పెద్ద మాటలలో కాదు, ఇలాంటి చిన్నచిన్న పనుల్లో దాగి ఉంటుంది.”
గేట్ వద్ద “బోర్డింగ్ ప్రారంభమైంది” అని అనౌన్స్‌మెంట్ రావడంతో అందరూ ఒక్కొక్కరుగా లైన్‌లో నిలబడ్డారు. నాది 'A' గ్రూప్ అయినా, వాళ్ళకంటే ముందుగా వెళ్లకూడదని ఆగి వాళ్ళ వెనకే బయలుదేరాను.
ఆ జంట కూడా నెమ్మదిగా లేచి, trolleyని ముందుకు తోసుకుంటూ లైన్ వైపు నడిచారు. గేట్ దగ్గర బోర్డింగ్ లైన్ క్రమంగా కదిలింది.
ఆవిడ ముందుకు అడుగేసరికి ఆయన trolleyని వెనక్కి లాగి, “నువ్వు ముందే వెళ్లు” అన్నట్లుగా దారిని విడిచాడు.
ఆమె boarding pass ను చేతిలో బిగుసుకుని, వెనక్కి తిరిగి ఆయన వైపు ఒక చూపు వేసింది. ఆయన మాత్రం చిన్నగా తల ఊపి, “నేను ఉన్నాను” అన్నట్టుగా కళ్ళతోనే భరోసా ఇచ్చాడు.
లైన్ క్రమంగా ముందుకు కదులుతోంది. ఆయన trolleyని పట్టుకుని, కొద్దిసేపు ఆవిడ shoulder bag ను కూడా తన చేతిలోకి తీసుకున్నాడు.
ఆమె కాస్త సిగ్గుగా, కానీ మనసు నిండా సంతోషంగా ఆయన వైపు చూసింది.
బోర్డింగ్ గేట్ వద్ద సిబ్బంది boarding pass స్కాన్ చేస్తున్నప్పుడు కూడా ఆయన పక్కనే నిలబడి, ఏదైనా సమస్య వస్తే పరిష్కరించటానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించాడు.
చివరగా విమానం లోపలకి వెళ్లే వంతు వచ్చినప్పుడు, ఆయన తన trolleyని బలంగా పట్టుకుని, ఆవిడ ముందుకు వెళ్ళేలా కాసేపు ఆగాడు. వాళ్ళ వెనకాలే నేను boarding pass చూపించి, విమానం లోపల అడుగుపెట్టాను. ఎందుకో ఈ జంట చాలా interest గా అనిపించింది. ఈ ప్రయాణమంతా వాళ్ళని గమనించాలని అనుకుంటూ, నెమ్మదిగా వాళ్ళ వెనకాలే నడుస్తూ ఎక్కడ కూర్చుంటారో చూస్తున్నాను.
Southwest విమానం కాబట్టి సీట్లు ఫిక్స్ కాకుండా open seating.
కొన్ని రోస్ ముందుకు వెళ్లగానే, ఆయన వైపు చూస్తూ ఆవిడ ఒక రో లో విండో సీట్ వైపు చూపించింది. విండో పక్క సీట్లో ఆవిడ కూర్చుంది. లగేజ్ని overhead binలో సర్దేసి ఆయన ఆలోచిస్తుంటే, ఇక్కడ కూర్చో అన్నట్లు ఆవిడ సైగ చేసింది. ఆయన మొహమాట పడుతూనే hand luggage తీసి మధ్య సీట్ కింద సర్దేసి ఆవిడ పక్కన మధ్య సీట్ లో కూర్చున్నాడు.
నేను వారిని చూసి కాసేపు ఆగాను. నేను కూర్చోకపోయినా ఎవరో ఒకరు కూర్చుంటారన్న ఉద్దేశంతో టక్కున వాళ్ళపక్కన మూడో సీట్లో కూర్చుని నా బ్యాక్ప్యాక్ ను కింద పెట్టేసాను. వాళ్లను గమనించడానికి దగ్గరగా, కానీ ఆ జంటకి అసౌకర్యం కలగకుండా నా పనిలో నేను ఉన్నట్లు చూసుకున్నాను.
ఆవిడ కిటికీ బయట చూస్తూ చిన్నగా నవ్వింది. ఆమె తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి shawl తీసుకుని కప్పుకుంటుంటే ఆయన హెల్ప్ చేసాడు. హ్యాండ్ బాగ్ కింద పెట్టేసి ఆవిడ సీట్ బెల్ట్ పెట్టుకోవటానికి కష్టపడుతుంటే, ఆయన ఇదిగో ఇలాగ అన్నట్లు చూపించాడు. ఆ క్షణం నాకు మళ్లీ స్పష్టమైంది — వీళ్ళిద్దరూ కేవలం ప్రయాణికులు కాదు, జీవితం అనే ప్రయాణంలో ఎప్పటికీ తోడుగా నడిచే భార్యాభర్తలు.
నేను మాత్రం belt కట్టుకుని, నా ఫోన్ silent చేసి, వారిని ఒక్కసారిగా మరోసారి చూసి, “ఇదే నిజమైన సహచర్యం” అని మనసులో అనుకున్నాను.
ఫ్లైట్ టేకాఫ్ అవుతున్నట్లు announcement ఇచ్చారు. ఆవిడ మాత్రం కాసేపు గట్టిగా కళ్ళు మూసుకుని కూర్చుంది. అయన ఏమి భయం లేదన్నట్లు ఆవిడతో ఏదో చెపుతున్నాడు. మరి కాసేపటికి ఆవిడ కళ్ళు తెరిచి విండో లో నుండి ఆకాశంలో మేఘాలను చూస్తూ ఆయనను కూడా చూడమన్నట్లు సైగ చేసింది. ఆయన కొంచెం ముందుకి వంగి అటు వైపు చూసాడు. నేను కూడా ఏమిటబ్బా అన్నట్లు కొంచెం అటొక కన్ను వేసాను. బయట మేఘాల్లో దూరంగా మరొక విమానం చిన్నగా కనబడి నాలోనే నవ్వుకున్నాను. ఆవిడ చిన్నపిల్లలా ఆసక్తిగా అటే చూస్తూ ఒక విమానంలో కూర్చుని మేఘాల్లో మరొక విమానము భలేగా ఉందే అన్నట్లుగా ఉంది. మేఘాలలో తేలిపోతున్నట్లుగా ఆవిడ ఈ విమాన ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా అనిపించింది.
మరి కాసేపటికి నేను అటు పక్కగా తల తిప్పాను. ఆవిడ విండో కి తల ఆనించి నిద్రపోతుంది. ఆయన మాత్రం చిన్న పేపర్ మీద ఏదో రాసుకుని షర్ట్ పాకెట్ లో పెట్టుకుని మొబైల్ చూడటంలో మునిగిపోయాడు. ఇంతలో ఎయిర్ హోస్టెస్ తలా ఒక కుకీ ప్యాకెట్ ఇస్తూ, ఎవరికీ ఏమి డ్రింక్స్ కావాలో అడిగి నోట్ చేసుకుంటుంది. నాకేమీ వద్దు అన్నట్లు 'నో థాంక్స్' చెప్పాను. ఆవిడ నిద్ర పోతూనే ఉంది. నా పక్కన కూర్చున్న ఆయన మాత్రం రెండు కుకీ పాకెట్స్ తీసుకుని ఇంతకుముందు షర్ట్ పాకెట్ లో పెట్టుకున్న కాగితం ముక్కను తీసి ఎయిర్ హోస్టెస్ వైపు చూపించి, రెండు అన్నట్లు రెండు వేళ్ళు చూపించాడు.
ఐ గాట్ ఇట్ అంటూ ముందుకు వెళ్ళింది ఎయిర్ హోస్టెస్. ఒక రెండు నిమిషాల తర్వాత రెండు కాఫీ తీసుకొచ్చి ఆయనకిచ్చి, టూ క్రీం అండ్ త్రి షుగర్ Be careful, it's hot అని చెప్పి వెళ్ళిపోయింది.
కొన్ని నిమిషాల్లో ఒక చిన్న turbulence వల్ల ఆవిడ కళ్లు తెరవడం తోటి, ఇదిగో ఈ బిస్కెట్లు తిని కాఫీ తాగు, అంతగా చల్లారి పోలేదు అని ఆవిడ ముందున్న ట్రే ని తెరిచి ఆవిడ ముందు పెట్టాడు. ఆవిడ నవ్వుతూ ఏదో అన్నట్లుంది, ఆయన కూడా చిన్నగా నవ్వాడు.
ఆ తర్వాత ఆ ట్రాష్ అంతా ఎయిర్ హోస్టెస్ వచ్చి కలెక్ట్ చేసుకున్న తర్వాత, ఆవిడ ఏదో ఆయనకు చెపుతున్నట్లు అనిపించింది. అంతలో ఆ పెద్దాయన నా వైపొక సారి చూసి బాత్రూంకు పోవాలన్నట్లు సైగ చేసాడు. నేను లేచి వాళ్లకి దారి వదిలాను.
ఆ తర్వాత కాసేపటికి ఇద్దరూ వచ్చి రిలాక్స్ గా కూర్చున్నారు. అలా ప్రతి చిన్న విషయానికి ఇద్దరు ఒకరి విషయంలో మరొకరు తీసుకునే శ్రద్ధకు చాలా ముచ్చటేసింది. ఇది కదా కావాల్సింది. ఇలాంటి సాహచర్యం ఉంటే జీవితంలో ఇంక కావాల్సింది ఏముంది. ఏ ఇగో లో లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది కదా అనిపించింది. వీళ్ళను చూసి ఈ కాలం జంటలు చాలా నేర్చుకోవాలి అనిపించింది నాకు. వీళ్ళిద్దరూ పెళ్లి అయిన అప్పటినుంచి ఇలానే వుండేవాళ్లా లేదా ఈ వయసులో అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత ఇలా ఉంటున్నారా? ఎందుకో ఆయనతో మాట్లాడాలనిపించింది, కానీ వాళ్ళిద్దరినీ అలానే వదిలేసి వాళ్ళను చూడటంలోనే ఎంతో బాగుందనిపించింది.
ఎవరు వాళ్ళు, నాకు తెలియదు. కానీ వారిద్దరి చూపులు నాకు చాలా ప్రశాంతంగా అనిపించాయి.
అలా ఒక్కసారి గుండె మెల్లగా చప్పున కొట్టింది — “ప్రేమ అంటే ఇదే అయి ఉండాలి.”
అలాగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ చిన్న కునుకు పట్టి లాండింగ్ announcement తో కళ్ళు తెరిచాను. వాళ్లిద్దరూ అలాగే విండో లోనుంచి ఫ్లైట్ లాండింగ్ ను ఆసక్తిగా చూస్తున్నారు. రెండుగంటలు గాల్లో ప్రయాణం తర్వాత నేల మీద దిగటం ఇద్దరూ ఒకర్నొకరు చూసుకొని అమ్మయ్య మన గమ్యస్థానం వచ్చామిక అన్నట్లుంది.
overhead bin నుంచి లగేజ్ తియ్యటానికి ఆ పెద్దాయన నన్నేమన్నా సహాయం అడుగుతాడేమో అనుకున్నాను, కానీ నా వైపు కూడా చూడకపోవటంతో నేను ముందుగా గేట్ బయటకు వచ్చేసాను.
నాలో ఇంకా ఉత్సుకత పెరిగింది. ఎవరు వీళ్ళు? ఇక్కడివరకేనా లేదా ఇంకా ఎక్కడికన్నా వెళతారా? ఏది ఏమైనా ఇంకొంచెం సేపు చూద్దామనుకుని అక్కడే కొంత దూరంలో వాళ్ళకోసం వేచి చూస్తున్నాను. అందరితో పాటు కొంచెం చివరలో వాళ్లిద్దరూ కనబడ్డారు. ఆస్టిన్ airport లో లాగానే పెద్దాయన ట్రాలీ బాగ్ నెట్టుకుంటూ ఒక హ్యాండ్ లగేజ్ తగిలించుకుని, ఆవిడ ఒక హ్యాండ్ బాగ్ తగిలుంచుకుని చిన్నగా రావటం గమనించి వాళ్ళకు ఒక పది అడుగుల దూరంలో అనుసరించసాగాను.
తొందర ఏమీ లేకుండా ఇద్దరూ చిన్నగా మాట్లాడుకుంటూ, అప్పుడప్పుడూ ఆవిడ మాత్రం అటు ఇటు గా ఉన్న షాపులన్నీ కొంచెం ఆసక్తిగా చూడసాగింది. ఇంతలో ఆవిడ ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడటం, ఆ తరవాత ఆయనకు ఆ ఫోన్ ఇవ్వడం ఆయన కాసేపు మాట్లాడి ఆవిడకి ఇచ్చేసాడు. బహుశా వాళ్ళ అబ్బాయో, అమ్మాయో, లేదా ఎవరన్నా బంధువులో అయ్యుంటారనిపించింది. వాళ్లిద్దరూ అలాగే నడుచుకుంటూ exit దారిలోనుంచి baggage claim వైపు దారి తీశారు.
వీళ్ళిద్దరూ ఇలా నడుస్తూ ఉంటే, నాకు ఒక్కసారిగా అనిపించింది. ఆ సమ్మోహనం, ఆ నిశ్శబ్ద బంధం ఎంత బాగుంది...
Baggage claim దగ్గరకు రాగానే ఎవరో ఒక అబ్బాయి చెయ్యి ఊపుకుంటూ వాళ్ళ దగ్గరికి రావటం, ఆ పెద్దాయన తన చేతిలో ఉన్న ట్రాలీ లగేజ్ ని అతనికిచ్చాడు. వాళ్ళ అబ్బాయి అనుకుంటా అని మనసులో అనుకున్నాను. కానీ ఇంతలో అతను ఆ పెద్దాయనకు నమస్కారం పెట్టడం ఆవిడ ఆయనకు రెండు చేతులు జోడించడం చూసి కాస్త ఆశ్చర్యం వేసింది.
ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత, ఆ అబ్బాయి, ఆవిడ లగేజ్ తీసుకుని బయటకు, ఈ పెద్దాయన మాత్రం హ్యాండ్ లగేజీ సరిచేసుకుంటూ వెనకకు రావటం ఒకేసారి జరిగాయి. నా ఉత్సుకత ఇంకా రెండితలయ్యింది. చిన్నపాటి పరుగుతో నా backpack సరిచేసుకుంటూ ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళాను.
సర్ నమస్తే, ఇందాక ఫ్లైట్లో మీపక్క సీట్ నాది. గుర్తు పట్టారా?
ఆలా ఉన్నట్లుండి ఆయన ముందు నేను ప్రత్యక్షమయ్యేసరి ఒకింత ఆశ్చర్యంతో కనుబొమలు ఎగరేస్తూ అయితే ఏంటంటా అన్నట్లు నా వైపు చూసారు.
ఇందాక ఫ్లైట్లో మీతోపాటు ఒకావిడ ఉండాలి.
ఏమిటీ ఏమైనా మర్చిపోయామా? అన్నాడా పెద్దాయన.
ఆహా అది కాదు సర్, ఏమీ మర్చిపోలేదు. ఆవిడెవరు మీ భార్య కాదా?
ఆయన కాసేపు బ్లాంక్ అయినట్లు నా వైపు చూసాడు.
అదే సర్, మీతో ఇప్పటిదాకా ట్రావెల్ చేశారు ఆవిడ. ఆవిడ మీ ఆవిడ కాదా?
నేను అదే పనిగా అడిగే ప్రశ్నలతో ఆయన కొంచెం తేరుకుని ...
బాబు, నువ్వేం మాట్లాడుతున్నావో నాకర్ధం కావటం లేదు. ఇందాక ఫ్లైట్లో నా పక్కన నువ్వేకదా! ఒహ్హ్ నువ్వు తెలుగబ్బాయివేనా!
అవును సర్ నేనే. మిమ్మల్ని నేను ఆస్టిన్ నుంచి చూస్తున్నాను. మీతోపాటు ఒకావిడ ఉంది కదా, ఆవిడెవరు? మీ మిసెస్ కాదా!
ఆ పెద్దాయన మరి కొంచెం తేరుకుని
బాబు, ఆవిడెవరో నాకు తెలియదు. ఆవిడ నా భార్య కాదు ... అని ఇంకా ఏదో చెప్పబోతుంటే నేను మద్యలోనే అడ్డుకుని
ఒక క్షణం నాకేమి అర్థం కాలేదు. నా ఊహలు నేలమీద పడ్డట్టయ్యాయి. నేను షాకయ్యను.
వ్వాట్? సర్, మన్నించండి. మీ ఇద్దర్నీ ఆస్టిన్ ఎయిర్పోర్ట్ నుంచి గమనిస్తున్నాను. మీ అన్యోన్యత చూసి నేను తప్పుగా అనుకున్నాను.
ఆ పెద్దాయన మాటలు విన్నాక నా మనసు ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. వారి అనుబంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నాలో ఏదో ఖాళీగా అనిపించింది. కానీ వెంటనే ఆలోచించాను — బంధం అన్నది లేబుల్‌కి కాదు, మనసుకి చెందినది కదా!
అప్పుడాయనకి అర్ధం అయినట్లుంది ...
ఫరవాలేదు బాబు, ఆవిడెవరో నాకు తెలియదు. ఆస్టిన్ ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ లగేజీ దగ్గర వాళ్ళమ్మాయి అనుకుంటా నాతో మాట్లాడి కాస్త చికాగో దాకా తోడుగా ఉండమన్నది. ఆవిడకు wheelchair లో వెళ్ళటం ఇష్టం లేదట.
అక్కడ కొంతమంది మనవాళ్లు ఉన్నారు. కానీ నన్నే ఎందుకడిగిందో నాకు తెలియదు. బహుశా ఇద్దరం దగ్గర దగ్గర ఒకే వయసు వుండటంవల్లనేమో. ఆవిడ కూడా చాలా కలుపుగోలుగా ఉంది.
కాని సర్, ఇంత తక్కువ టైం లో అంత క్లోజ్ గా.... మనసులో నన్ను నేనే తిట్టుకుంటు నసిగాను.
ఇందులో ఏముంది బాబు.. వాళ్ళ అమ్మాయి చెప్పింది నీ వయసున్నవాళ్ళను అడుగుతానంటే వద్దని, నన్ను అడగమని చెప్పిందట ఆవిడ. బహుశా మా ఆలోచనలు, మాటలు, ఇబ్బందులు మీకు నచ్చకపోవచ్చు అర్ధం కాక పోవచ్చు. అంతగా కలిసిపోక పోవచ్చు. అందుకేనేమో. ఇక్కడ వాళ్ళ అబ్బాయి వచ్చి ఆవిడను తీసుకువెళ్లాడు.
నన్ను నేనే మళ్ళీ ఒకసారి మనసులో తిట్టుకుని
సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలి?
నేను హైదరాబాద్ వెళ్ళాలి. నా ఫ్లైట్ సాయంత్రం. టెర్మినల్ మారి వెళ్ళాలి. ఇంకా చాలా టైం వుంది కాబట్టే నాకేం ఇబ్బంది లేదని నాకు కాలక్షేపంగా తోడుగా ఉంటుందని నేను కాదనలేకపోయాను.
నేనింకా షాక్ నుంచి బయటకు రాలేదు. సార్, మరి మీ ఫ్యామిలీ?
వేరే వాళ్లయితే ఏం అనుకునేవాళ్ళో తెలియదు కానీ, ఈ పెద్దాయన మాత్రం చాల ఓపికగా
నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి ఆస్టిన్ లో, చిన్నబ్బాయి హైదరాబాద్ లో. నేను నా భార్య అమెరికా వచ్చి రెండు నెలలయింది. నేను బ్యాంకులో మేనేజర్ని. ఎక్కువ సెలవలు లేకపోవటం వలన నేను ముందుగా వెళుతున్నాను.
ఇంకా ఏమన్నా కావాలా అన్నట్లు నా వైపు చూశాడాయన.
కొంచెం తేరుకుని అసలు విషయంనుంచి బయటికి రావటానికా అన్నట్లు
సర్, మీకేమైనా హెల్ప్ కావాలా టెర్మినల్ కి వెళ్ళటానికి అని అడిగాను.
వద్దు బాబు. నాకు తెలుసు. నేను రావటం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు నాలుగయిదు సార్లు వచ్చాను ఇక్కడకు.
అలాగే సార్, చాలా థాంక్స్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. వస్తాను.
సరే బాబు పరవాలేదులే.
నేను కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాను, నాలో నేనే సిగ్గుపడ్డాను, ఆత్మపరిశీలన చేసుకున్నాను.
ఆయనవైపు మళ్ళీ తిరిగిచూడకుండా వడి వడి గా బయటకు వచ్చాను టాక్సీ కోసం.
అన్యోనంగా ఒక ఆడా మగా కలిసి మాట్లాడుకుంటే ఉంటే వాళ్ళు భార్య భర్తలే బంధువులు, స్నేహితులు కానక్కరలేదు అపరిచితులైనా కావచ్చు కదా.
ఆ పెద్దాయన మాటలు విన్న తర్వాత నా లోపల ఏదో మౌనం అలుముకుంది.
ఇప్పటివరకు నేను చూసింది ప్రేమ అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది — అది మనసుల మధ్య ఏర్పడే నిశ్శబ్ద అనుబంధం —అది ప్రేమ కంటే లోతైన మానవత్వం.
ఎవరు ఎవరికీ బంధువులు కాకపోయినా, ఒక క్షణం కొద్దిగా శ్రద్ధ చూపితే మనసులు ఎలా దగ్గరవుతాయో, ఈ ఇద్దరూ నాకు చూపించారు.
నాలో ఏదో విచిత్రమైన ప్రశాంతత పుట్టింది.
ఆ జంటను చూశాక, ప్రేమకు ఒక పేరు ఉండాల్సిన అవసరం లేదని తెలిసింది.
కొందరికి అది భార్యాభర్తల అనుబంధం,
మరికొందరికి అది మానవత్వం, దయ, సహచర్యం.
ఆవిడకు ఆ విమాన ప్రయాణం ఆయన వల్ల మధురమైంది; ఆయనకు ఆ ప్రయాణం ఆమెతో మానవ సాన్నిధ్యమైంది.
వాళ్లిద్దరూ వెళ్లిపోయాక కూడా వారి మౌన బంధం నా మనసులో నిలిచిపోయింది.
ఎయిర్‌పోర్ట్ గేటు బయట నిలబడి ఉన్నప్పుడు కూడా, ఆ మమకారం ఇంకా నా హృదయంలో మారుమ్రోగింది. అది మనిషి మనసు లోనుండి వినిపించే ప్రేమ రాగం —
ఒక జంట జీవనరాగం.
వాళ్ళిద్దరూ ఒక్కసారి మాత్రమే కలిసివుండొచ్చు.
కానీ ఆ క్షణాల్లో పుట్టిన ఆ జీవనరాగం మాత్రం — నా మనసులో ఎప్పటికీ మోగుతూనే ఉంటుంది.