1962 - భారత్ - చైనా యుద్ధం
భారత్ 1962 లో చైనాతో చేసిన యుద్ధం భారత్ కి గొప్ప నష్టాన్ని తెచ్చిపెట్టింది. మిత్రదేశం అనుకున్న చైనా కాలక్రమంలో శత్రువుగా మారి, భారత్ తనకు అందించిన స్నేహ హస్తాన్ని విషసర్పమై ఘోరంగా కాటేసింది.
1949లో ఇండియా చైనాలమధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇరుదేశాల మధ్య చక్కని స్నేహ బంధం ఉందని నమ్మినది ఒక్క భారత ప్రధాని యైన నెహ్రు మాత్రమే కాదు, భారత్ ప్రజలు కూడా. “హిందూ - చీనీ, భాయీ - భాయీ” అంటూ, ఇరుదేశాల ప్రముఖులూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన రోజులు కూడా కొన్ని ఉన్నాయి. ఇండియా చైనాల మధ్య యుద్ధం వస్తుందని ఎవరూ ఎప్పుడూ, కలలో కూడా అనుకోలేదు. కానీ వచ్చింది.
1959లో టిబెట్ ని చైనా ఆక్రమించుకుంది. అది మంచి పని కాదని మిత్రుడైన చైనా ప్రీమియర్ చౌ ఎన్ లై కి నెహ్రు హితం చెప్పాడు. అంతేకాదు, టిబెట్ నుండి పారిపోయి వచ్చిన దలైలామాను, అతని అనుయాయులను భారత ప్రభుత్వం సగౌరవంగా ఆహ్వానించి, వారికి ఆశ్రయమిచ్చింది. అది చైనా ప్రభుత్వానికి ఎంతమాత్రం నచ్చలేదు. చౌ ఎన్ లై లోలోన అక్కసు పెంచుకోడం మొదలుపెట్టాడు.
తమను కాదన్నవాడిని ఇండియా చేరదీయడం తనని అవమానించడమే అన్న నిశ్చయానికి వచ్చాడు చైనా కమ్యూనిష్టు లీడర్ మావో జడాంగ్. టిబెట్ రాజధాని లాసాలో జరిగిన చైనాపై తిరుగుబాటు కూడా భారత్ ప్రేరణవల్ల జరిగిందని భావించాడు మావో! భారత్ పైన పగతో చైనా లోలోన రగులుతూ, పైకి మాత్రం కొన్నాళ్లపాటు స్నేహం నటించింది.
పైకి, “హిందూ - చీనీ భాయీ - భాయీ” అని అంటూనే, చైనా అధ్యక్షుడైన “చౌ ఎన్ లై” భారత్ పైన దొంగదెబ్బ తీశాడు. చైనా ప్రభుత్వం విడుదల చేసిన మేప్ లో, చైనా సరిహద్దుల్లో ఉన్న భారత్ భూభాగమైన 1,20,000 చ.కి. మీ. భూమిని, చైనాతో కలిపేసి ఉంది. వెంటనే దానికి భారత్ అభ్యంతరం చెప్పింది. మాటవరసకు భారత్ కి “సారీ” అని చెప్పి, ఊరుకున్నారు చైనా వాళ్ళు. క్రియాత్మకంగా మార్పు మాత్రం ఏమీ చేయలేదు. చైనా మేప్ ని మార్చలేదు.
1960 లో భారత్, చైనా సరిహద్దులు కాపలాకాసే సైనికుల మధ్య చిట్టి - పొట్టి తగాదాలుగా మొదలైన ఘర్షణలు. “చినుకు చినికి గాలివాన అయ్యిం”దన్నట్లుగా, అవి పెరిగి పెరిగి 1962 నాటికి ఒక యుద్ధంగా రూపు దిద్దుకున్నాయి. భారత భూభాగాలైన “అక్సాయిచిన్" తో పాటు నేటి అరుణాచల్ ప్రదేశ్, (NEFA) కూడా ఆక్రమించే యత్నంలో ఉన్నాడు చైనా వాడు. రెండు చోటుల్లోనూ యుద్ధం ఒకేసారి మొదలయ్యింది. 20 అక్టోబర్ 1962న మొదలైన ఆ యుద్ధం 21 నవంబర్ 1962న ముగిసింది. ఆ యుద్ధంలో, ఏమాత్రం యుధ్ధ సన్నద్ధత లేని భారతదేశం ఘోరంగా ఓడిపోయింది, తనదైన కొంత భూమిని కోల్పోయింది.
ఈ యుద్ధంలో చైనా తరఫున 80,000 మంది సైనికులు పోరాడితే, ఇండియా వైపున కేవలం 22,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. వారికి కూడా హిమాలయాల్లోని చలిని ఆపగల దుస్తులుగాని, తగిన యుద్ధసామగ్రి గానీ లేవు. వారికి అక్కడ సరైన భోజన వసతులు కూడా లేవు. అయినా వారు యుద్ధ సన్నద్ధులై, తమపైకి ఎత్తివచ్చిన చైనా సేనతో హోరాహోరీ పోరుకు తలపడ్డారు. చైనా, కొన్ని రోజులకు ముందే అనుకుని, సర్వసన్నద్ధంగా యుద్ధానికి వస్తే, చైనాని నమ్మిన భారత్ మాత్రం ఉన్నపళంగా లేచి యుద్ధానికి బయలుదేరవలసి వచ్చింది అన్నది వాస్తవం.
దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత విద్య, వైద్యం, వ్యవసాయం, వాణిజ్యం లాంటి వాటి మీద దృష్టి పెట్టిందిగాని, భారత ప్రభుత్వం సరిహద్దుల రక్షణ విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. మన దేశం రక్షణ రంగాన్ని చైనాతో పోలిస్తే, అప్పట్లో చాలా బలహీనంగా ఉండేది. కానీ యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చెయ్యక తప్పలేదు. డిఫెన్సు రంగాన్ని బలోపేతం చెయ్యని తన తప్పుని కప్పిపుచ్చుకోడానికి భారత్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ J. F. కెనెడీని సహాయమడిగితే, అతడు మొండి చెయ్యి చూపించాడు (నిరాకరించాడు). మిత్రులనుకున్న వాళ్ళు ఇద్దరూ తనను తలోరకంగాను వ్యతిరేకించడంతో, ఖిన్నుడయ్యాడు భారత్ PM నెహ్రు. ఆయనకు యుద్ధంలో నెగ్గడం అసంభవమని అర్థమయ్యింది.
ఈ “సినో - ఇండియన్ వార్“లో భారత సేనలో 1,383 మంది చనిపోగా, 1,047 మంది గాయపడ్డారు. 400 మంది యుద్ధఖైదీలు (POW) గా చైనా వాళ్లకు పట్టుబడ్డారు. గెలుపుమీద ఆశ నశించిపోగా ఇక చేసేదేమీ లేక “ఆ అతిదారుణ హిమసీమలోని, ఒక్క చెట్టైనా మొలవని ఆ బోసినేల మనకు ఉంటే ఎంత, పోతే ఎంత” అన్న మెట్టవేదాంతాన్ని చెప్పి, తనను తాను సమర్ధించుకున్నాడు నాటి భారత్ PM నెహ్రు. ఓటమి నంగీకరించి, ఆ ప్రదేశాన్ని వదలి, వెనక్కి వచ్చెయ్యమని భారత్ సైనికులకు ఆర్డర్ ఇచ్చాడు ఆయన. ఆ యుద్ధంలో భారత్ చాలా నష్టపోయింది. భారత్ కొంత భూభాగాన్ని కూడా కోల్పోయింది.
భారత సైన్యం, ఎక్కడివక్కడ వదలి, వెనక్కు మళ్లింది. భారత్ ఆ యుద్ధంలో పూర్తిగా ఓడిపోయింది. 38,000 చ.కి.మీ. విస్తీర్ణంగల భారత్ భూభాగమైన “అక్సాయిచిన్” చైనాకు వశమయ్యింది. ఇరు పక్షాలవారు యుద్ధ విరమణ ప్రకటించారు. హిమాలయ పర్వతాలలో 13,000 అడుగుల ఎత్తున లద్ధాఖ్ కొండలలో ఉన్న ఒక సువిశాలమైన పీఠభూమి, ఒకప్పటి భారత భూభాగమైన, “అక్సాయిచిన్” ఇప్పుడు చైనాలోని దయ్యింది!
***
NEFA లో యుద్ధం
భారత్ తాలూకు ఈశాన్య భూభాగమైన, “నార్తు ఈస్టు ఫ్రాంటియర్ ఏజన్సీ” (NEFA) ని కూడా, పనిలో పనిగా ఆక్రమించాలని చూశారు చైనావారు.
భారత్ కి ఈశాన్యంలో చైనాతో ఉన్న సరిహద్దు ప్రాంతమది. అక్కడ ఉన్న పర్వతాలన్నింటిలోకీ ఎత్తైన పర్వత శిఖరం 23,000 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ ప్రదేశమంతా దట్టమైన అడవులతో ఉన్న కొండలు, లోయలుగా ఉండి, రాళ్లు రప్పలుతో నిండి ఎగుడు దిగుడుగా ఉన్న నేలతో, దుర్గమమైనదిగా ఉంటుంది.
NEFA లో యుద్ధం చేస్తున్న భారత జవానులందరూ భారత్ యుద్ధ విరమణ ప్రకటించిన వెంటనే ఎక్కడి వక్కడ వదిలేసి, వెనక్కి వెళ్ళిపోయారు. కానీ, ముగ్గురు సిపాయి మిత్రులు మాత్రం శత్రువులకు వెన్ను చూపి, వెళ్లిపోవడానికి ఇష్టపడలేదు. వారిలో ఒకడు, రైఫిల్మాన్ - జస్వంతసింగ్ రావత్; మరొకడు, లాన్సునాయక్ - త్రిలోక్ సింగ్ నేగీ; మూడవ వాడు, రైఫిల్ మాన్ - గోపాల్ సింగ్ గోసాయీ. శత్రువులను మాతృభూమిపై అడుగు పెట్టనీయకుండా, కడదాకా వీరోచితంగా పోరాడాలని ఈ ముగ్గురూ కలిసి గట్టిగా నిర్ణయించుకుని యుద్ధభూమిలో ఉండిపోయారు. “విజయమో, వీరస్వర్గమో!” అంతకు తప్పించి అన్యమేదీ మాకు వద్దు” - అనుకున్నారు ముగ్గురూ ఏకగ్రీవంగా.
తక్కిన సైనికులు వదలి వెళ్లిన తుపాకులను అక్కడ ఉన్న కొండరాళ్ళపై రకరకాల భంగిమలలో ఉంచి, అటూ ఇటూ పరుగులు పెడుతూ వాటిని వివిధ కోణాలలో పేల్చి, అక్కడ ఎందరో భారత సైనికులు ఉన్నారని చైనా సేనలను భ్రమింపజేసి, వాళ్ళని ముందుకు కదలనీకుండా చేశారు. అలా మూడురోజులు గడిచాయి. వాళ్ల దగ్గర ఉన్న ఎమ్యూనిషన్ అయిపోవచ్చింది.
ఎదుటివైపు నుండి చైనా సైనికులు మిషన్ గన్ (MMG) తో గుళ్ళ వర్షం కురిపిస్తున్నారు. ఎలాగైనా ఆ MMG ని ఆపాలనుకున్నారు ఈ ముగ్గురు వీరులు. అసమాన ధైర్యంతో, ఆ MMG నుండి దూసుకు వస్తున్న గుళ్ళమధ్యనుండి వేగంగా ముందుకు వెళ్లి, ఆ మిషన్ గన్ దగ్గర ఉన్న ఐదుగురు చైనా సైనికులను గ్రనేడ్లు విసిరి మట్టుపెట్టి, గన్ ని స్వాధీనం చేసుకుని, తమవైపుకు తీసుకు వస్తున్న వేళలో, శత్రుసేన పేల్చిన గుళ్లకు మిత్రులిద్దరూ బలికాగా, ఒంటరిగా మిగిలిన జస్వంత సింగు రావత్, బాగా గాయపడి కూడా ఆ గన్ ని భారత్ వైపుకి తీసుకు వచ్చాడు. ఆ తరువాత యుద్ధం చేస్తూ అతడు గాయాలు విషమించగా అక్కడికక్కడే అమరుడయ్యాడు.
ఆ సమయంలో అక్కడ జరిగిన యుద్ధంలో, కదన రంగంలో అతని ఇద్దరు సైనిక మిత్రులను కోల్పోయింది భారత్. కానీ, అతడు (జస్వంత సింగ్ రావత్) మాత్రం యుద్ధరంగంలో ఐన గాయాలతో చనిపోయాడు గాని యుద్ధంలో కాదు. ఈ ముగ్గురి వల్ల శత్రు సేనలో 300 మంది మరణించారు. చైనా వాళ్ళ మిషన్ గన్ ఒకటి భారత్ కి స్వాధీనమయ్యింది. అంతేకాదు, ఆ ప్రదేశం మొత్తం పరులపాలు కాకుండా కాపాడబడింది.
ఆ విధంగా ఆ ముగ్గురు మిత్రులు మూడు రోజులపాటు యుద్ధం చేసి, చైనా ఆర్మీని నిలువరించి ఉండకపోతే, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా (PLA) ముందుకు వచ్చి, భారత్ భూభాగంలో చాలాదూరం చొచ్చుకు వచ్చి NEFA లో మరింత ఎక్కువ భాగం ఆక్రమించుకుని ఉండేది. చైనా వాహినికి అడ్డుకట్టవేసి కడదాకా అరికట్టిన మహావీరుడు జస్వంత సింగ్ రావత్! ఆ తర్వాత ఇరుపక్షాలు వారు యుద్ధ విరమణ చేశారు.
ఇరు పక్షాల తాలూకు ఎయిర్ ఫోర్సు గాని, నేవీ గాని ఈ యుద్ధంలో పాల్గొనక ముందే, భారత్ పరాజయాన్ని అంగీకరించి వెనక్కి వెళ్లిపోవడంతో, చైనా కూడా యుద్ధవిరమణ ప్రకటించింది. ఆ యుద్ధం అంతటితో ముగిసిపోయింది. అక్కడి భారత్ భూభాగంలో కూడా కొంతమేర చైనాకు తేలికగా వశమయిపోయింది. ఆ ముగ్గురు వీరులు చైనా సేనను నిలువరించి ఉండకపోతే, అరుణాచల్ ప్రదేశ్ మనకు ఉండేది కాదు.
ఈ యుద్ధ సమయానికి రైఫిల్మాన్, జస్వంత సింగ్ రావత్ 21 సంవత్సరాల యువకుడు. అతడు 19-08-1941న పుట్టాడు. పందొమ్మిది ఏళ్ళ వయసులో ఆర్మీలో చేరి, “4 ఘార్వాల్ రైఫిల్సు”లో ఒక సోల్జర్ గా పనిచేశాడు. భారత ప్రభుత్వం, ఈ యుద్ధంలో అతను చూపిన దేశ భక్తిని, శౌర్యాన్ని, మనోధైర్యాన్ని, ఆత్మత్యాగాన్ని గౌరవించి (మరణానంతరం) అతనికి, అత్యంత ప్రతిష్టాత్మకమైన గేలంటరీ అవార్డులలో రెండవ స్థానంలో ఉన్న “మహావీర చక్ర (MVC) అవార్డు” నిచ్చి సత్కరించింది. అంతేకాదు, అతనికి మరణానంతరం పదవోన్నతిని కూడా ఇచ్చి, అతనిని “కెప్టెన్” ని చేసి ఘనంగా గౌరవించింది. అతడు పనిచేసిన “4 ఘార్వాల్ రైఫిల్స్” దళాన్ని కూడా, “బేటిల్ ఆనర్ ఆఫ్ నూరానాంగ్” అవార్డుతో సన్మానించింది.
తరువాతి కాలంలో NEFA (అరుణాచల్ ప్రదేశ్) లోని తవాంగ్ ప్రాంతంలో నిర్మించిన వార్ మెమోరియల్ కు “జస్వంత్ ఘర్” అన్న పేరు పెట్టి అక్కడ అతని ప్రతిమ (బస్టు) ని ప్రతిష్టించారు. అక్కడి ప్రజలు ఆ వీరుడిని దైవంగా భావించి “జస్వంత్ బాబా” అని వ్యవహరిస్తూ, చైనా పాలబడకుండగా తమను కాపాడిన అతనిపై తమకున్న ప్రేమాభిమానాలను ప్రకటిస్తూ ఉంటారు.
ఆ ప్రాంతానికి వెళ్లిన సైనికులు జస్వంత్ ఘర్లో ప్రతిష్ఠించబడి ఉన్న జస్వంత సింగ్ రావత్ (బస్టు)కు సైనిక వందనం చేసి మరీ ముందుకు సాగుతారు. యుద్ధవీరులకు కెప్టెన్ జస్వంత్ సింగ్ రావత్ ఒక గొప్ప “రోల్ మోడల్!” అతడు చైనా సైనికులతో పోరిన నూరానాంగ్ ప్రదేశాన్ని జనం జస్వంత్ గఢ్ - అంటారు. అక్కడకు సమీపంలో “సెరా సూ” అనే ఒక చెరువు ఉంది. దానికి దగ్గరలో “సెరా లా” అనే ఒక కొండదారి వుంది. నూరానాంగ్ దగ్గర ఉన్న సైనిక స్థావరాన్ని “నూరా పోస్టు” అంటారు. వాటికి దగ్గర లోనే ఉంది “జస్వంత్ గఢ్ వార్ మెమోరియల్”.
***
1962 యుద్ధాన్ని గురించి ఇంతవరకు చెప్పుకున్నదంతా చరిత్ర.
(అక్కడి జనం చెప్పుకునే మరో వేరే కథ (romantic story) ఒకటి ఉంది. అది కల్పిత కథో, యధార్థ గాధో చదువరులే, తమకు తామై నిర్ణయించుకోవాలి.)
కథ మొదలు ....
భారత్ ప్రధాని యుద్ధ విరమణను ఆదేశించిన తరువాత కూడా ముగ్గురు జవాన్లు యుద్ధవిరమణ చెయ్యడానికి ఇష్టపడలేదు. వారి పేర్లు జస్వంత సింగ్ రావత్, గోపాల్ సింగ్ గోసాయి, త్రిలోక్ సింగ్ నేగి. యుద్ధ విరమణచేసి వెళ్ళిపోయిన భారతసేన వదలివేసిన తుపాకులను ఆ ప్రదేశంలో ఉన్న కొండ రాళ్లపై శత్రు సేనల వైపుకు గురిపెట్టి ఉంచి, తాము ముగ్గురు, ఇటూ, అటూ పరుగులుపెడుతూ, వివిధ కోణాల్లో వేరువేరు చోటులనుండి తుపాకులను పేలుస్తూ, శత్రు సేనలకు కొండపై వందలాది భారత సైన్యం ఉన్నారన్న భ్రాంతిని కలిగించగలిగారు. అక్క చెల్లెళ్లయిన సెరా, నూరా అనే ఇద్దరు కొండ జాతి అమ్మాయిలు ఆ వీరులకు, ఎమ్యూనిషన్ అందించి, భోజనం, నీరు తెచ్చి ఇచ్చి; వెంటవుండి సాయం చేశారు. యుద్ధం చేస్తూ తక్కిన ఇద్దరు సైనిక మిత్రులు చనిపోగా జస్వంత్ ఒక్కడయ్యాడు. కానీ అతడు, ఆ అక్కా చెల్లెళ్ల సాయంతో, మరింత వేగంగా పరుగులు పెట్టి, తుపాకులు పేల్చి, విడవకుండా శత్రువుల్ని భయభ్రాంతుల్ని చేస్తూనే వున్నాడు. అలా మూడు రోజులు గడిచాయి.
దురదృష్టవశాత్తు, ఆ కొండలపై తన గొర్రెలను మేపుతున్న పసువులకాపరి ఒకడు చైనా సైనికులకు దొరికిపోయాడు. అతడిని హింసించి వాళ్ళు మొత్తం గుట్టును రాబట్టారు.
జస్వంత సింగ్ దగ్గరున్న ఎమ్యూనిషన్ అయిపోవచ్చింది. ఇక ఒక్క గుండు మాత్రమే మిగిలి ఉంది. సెరా, నూరాలను ఇళ్లకు వెళ్లిపొమ్మని చెప్పి, ఆ గుండును తన తలకు గురిపెట్టి , తనను తానే పేల్చుకుని, అమరుడయ్యాడు 21 ఏళ్ళ యువకుడు, వీరాధి వీరుడు జస్వంత సింగ్ రావత్!
సరిగా అదే సమయంలో చైనా సైన్యం వాళ్ళను చుట్టుముట్టింది. శత్రువుల రాకను పసిగట్టి సెరా కొండపైనుండి లోయలోకి దూకి మరణించింది. నూరా మాత్రం వాళ్లకు బందీ అయ్యింది.
ఎందరో సైనికులు ఉన్నట్లు తమకు భ్రమ కల్పించినందుకు కసితో తుపాకులు పేల్చి, అప్పటికే అమరుడైయున్న జస్వంత్ సింగ్ రావత్ మృతదేహాన్ని బుల్లెట్లతో తూట్లు పొడిచారు చైనా సైనికులు. ఇంకా కసి తీరకపోవడంతో వాళ్ళు అతని శిరస్సును ఖండించి తమ వెంట తీసుకుపోయారు.
జస్వంత సింగ్ చేసిన యుద్ధం వల్ల, NEFA లో చైనా సైన్యం మరింత ముందుకు చొచ్చుకు రాలేకపోయింది. ఈ లోగా భారత్, చైనాలు యుద్ధ విరమణను ప్రకటించడం జరిగింది. చైనా, భారత్ ప్రభుత్వాలు రాజీకి వచ్చాయి. యుద్ధం ముగిసింది. NEFA లో కొద్దిభాగం చైనాదయ్యింది.
తరువాతి రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్ లో తవాంగ్ జిల్లాలోని చైనాకు వెళ్ళే దారికి “సెరా పాస్” అనీ, అక్కడకు దగ్గరలోవున్న చెరువుకు “సెరా లేక్” అనీ, వాటికి సమీపంలోనున్న ఆర్మీ పోస్టుకి “నూరా పోస్టు” అనీ పేర్లు పెట్టి, భారత్ ఆర్మీ ఆ కొండజాతి అమ్మాయిలకు, భారత్ ఆర్మీకి సాయపడిన దానికి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు - అని చెప్పుకుంటారు అక్కడి వాళ్లు.
జస్వంత్ సింగ్ రావత్ అమరుడైనా, అందరి మనస్సుల్లోనూ అతడు సజీవుడే! భారత ప్రభుత్వం అమరుడైన అతనికి పదవోన్నతి నిచ్చి గౌరవిస్తే; ప్రజలు, అతడు సజీవుడై ఉన్నట్లుగా భావించి, జస్వంత్ గఢ్ లో అతనికి వసతి ఏర్పరచి, ప్రతి రోజూ అతని పక్క దులిపి వేసీ, బూట్లు పోలిష్ చేసీ, అతడు జీవించి ఉన్నట్లుగానే భావిస్తూ, తమ ప్రేమనీ, అతని ఎడల తమకున్న గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పటికీ అతడు అక్కడ ఉండి భారత సరిహద్దుని సమర్ధవంతంగా కాపాడుతూ ఉన్నాడని వాళ్ళు నమ్ముతారు.