Menu Close
లేఖిని – కథా లోగిలి
సేకరణ, కూర్పు – అత్తలూరి విజయలక్ష్మి
సాహసవీరుడు - లవంగలత
- గోవిందరాజు లలిత -

నిశిరాత్రి. ఆకాశంలో మిళ్ళుక్కు మిళ్ళుక్కుమంటున్న నక్షత్రకాంతి తప్ప ఇంకొక దీపపుకాంతి లేని అడవి ప్రాంతం.

అంతటి చిమ్మచీకటిలోనూ, ఆగకుండా, వెనుదిరగకుండా సాగిపోతున్న ఒక ఆకారం. వేషభూషణాలని బట్టి ఒక సైనికునిలాగ అనిపిస్తున్నా, ఆ నడకలో ఒక్కింత లావణ్యం గోచరిస్తోంది. బాగా అలవాటైన మార్గంలో ప్రయాణిస్తున్నట్లు, బెదురు లేకుండా చకచకా ముందుకు సాగిపోతున్న ఆ ఆకారం, దూరంగా ఆగి ఆగి వెలుగుతున్న దీపపు కాంతి వైపు కదిలింది. అటుగా ప్రయాణం చేస్తూ, ఒకచోట ఆగి, చీకటిలోనే తనకు అందించబడిన ఒక లేఖను తీసుకొని వెనుతిరిగి, మళ్ళీ తను వచ్చిన మార్గాన వడివడిగా కదిలింది. ఈసారి వెనక ఎవరో తరుముతున్నట్లు అతివేగంగా ముందుకి సాగి పోయింది.

అలా ఒక పదినిమిషాలు నడచి, ఆ కాలిబాట చివర ఉన్న ఒక పూరిపాక గుమ్మం ముందు నిలబడి, వింతైన శబ్దం చేసింది. ఒక్కింత ఆగి, తలుపు తోసుకొని లోపలికి వెళ్ళి, వినయంగా, అక్కడ ఉన్న ఒక స్త్రీకి నమస్కరించి, తను తెచ్చిన ఆ లేఖని ఆవిడ చేతిలో పెట్టి, మళ్ళీ వంగి నమస్కరించి, వెనుతిరిగి మళ్ళీ ఆ కాలిబాట వెంట కొంతదూరం నడచి చీకటిలో మాయమైపోయింది. నిజానికి ఆ వేషంలో ఉన్నది ఒక స్త్రీమూర్తి. ఆమెకు ఆ లేఖను ఇచ్చినది పొరుగుదేశ రాజకుమారుడు.

ఆ లేఖ అందుకున్న స్త్రీ, ఆ పాకకు రెండవవైపున ఉన్న తలుపుగుండా వెళ్ళి, ఒక సొరంగ మార్గం చేరింది. ఆవిడలో ఉట్టిపడుతున్న రాచఠీవీ, అలంకారం ఆమె ఒక రాచస్త్రీ అని చెప్పకనే చెబుతున్నాయి.

***

సూర్యకాంతిలో ఆ నగరం మెరిసిపోతున్నది. సుందర భవనాలు, వాటి చుట్టూ అందమైన వనాలు... ఎక్కడ చూసినా రాశులు పోసిన పట్టు పీతాంబరాలు, రత్నాలు, నగలూ, నాణాలు, ఉత్తమ జాతి అశ్వాలు. ఒకటేమిటి! ఆ వైభవం చూడటానికి వేయికళ్ళ ఇంద్రుడి తరం కూడా కాదు.

ఇన్ని ఉన్నా అక్కడ ప్రజల ముఖాలలో కళాకాంతీ లేదు. ఏదో దిగులు, భయం కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. ఇంకొక వింత ఏమిటంటే, అక్కడ మగవారు తప్ప ఆడవాళ్ళు కనబడటం లేదు.

"నాన్నా, అమ్మ ఏది? ఇంకా ఎప్పుడు వస్తుంది?" అడిగాడు పదేళ్ళ కాశీనాథ్.

"నేను నిన్న చూసానుగా!" కాశీ చెల్లెలు లావణ్య గట్టిగా చెప్పింది.

వీరేశం గబగబా వచ్చి ఆ పిల్ల నోరు నొక్కి ఇంట్లోకి తీసుకొని వెళ్ళబోతుండగా, ఒక సైనికుడు అతనిని అడ్డగించి, ఆ పిల్లని లాక్కొని వాళ్ళ సర్దార్ దగ్గరకి తీసుకొని వెళ్ళాడు. లావణ్య పెద్దపెట్టున ఏడుపు మొదలెట్టింది. అదేమీ పట్టనట్టే వారిద్దరూ కొంచెంసేపు ఏదో మాట్లాడుకున్నారు.

వీరేశం వారిని బతిమలాడుతున్నాడు, "బాబూ, అది చిన్నపిల్ల, ఏదో కల కని ఉంటుంది. దయచేసి దానిని వదిలి పెట్టండి."

ఆ సైనికుడు లావణ్యను వదిలి పెడుతూ, "ఇది నిజమైతే ఏం జరుగుతుందో తెలుసు కదా?" అని గద్దించాడు.

వీరేశం మళ్ళీ నమస్కారం పెట్టి, "తెలుసు బాబూ, చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడింది. మన్నించయ్యా," అని తమ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.

పొరుగూరినించి వచ్చిన శ్రీనివాసరాయనికి ఇది చాలా వింతగా అనిపించింది. ఎవరినైనా అడగాలంటే, బయట ఎవ్వరూ లేరు. అడపాదడపా అటుగా వెళ్తున్నవారు వంచిన తల ఎత్తకుండా, తమ పని చూసుకొని వెళ్ళిపోతున్నారు.

శ్రీనివాసరాయలు ఆ పూట అక్కడే ఉండి, ఈ వింత గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. ఊరి చివర ఉన్న పూటకూళ్ళమ్మ దగ్గరకి వెళ్ళాడు. అక్కడ భోజనం చేసి, కొంత విశ్రాంతి తీసుకొని, ఆ ముసలమ్మతో మాటలు కలిపాడు. ఆ కబురూ, ఈ కబురూ చెప్పి, మెల్లగా అడిగాడు, "అవునూ, మీ ఊళ్ళో మరీ చిన్నపిల్లలు, లేకపోతే నీలాగా వయసుమీరిన ఆడవాళ్ళు తప్ప మిగిలిన ఆడవాళ్ళంతా ఏమయ్యారు:"

ముసలమ్మ గబగబా బయటకి వెళ్ళి, అటూ ఇటూ చూసి, తలుపు వేసి, "నన్నడిగితే అడిగావు కానీ, ఇంకెవ్వరినీ అడగకు," అంది.

"మరైతే నువ్వే చెప్పు. ఏమిటి ఇదంతా? ఎందుకు అందరు ఇళ్ళల్లో తలుపులు వేసుకొని ఉంటున్నారు?" అన్నాడు.

"అదంతా ఒక పెద్ద కథ." అని నిట్టుర్చింది పూటకూళ్ళమ్మ.

***

మా రాజుగారి పేరు ప్రతాపసింహుడు. మా మహారాణి గారు అనఘారాణి. మా రాణి, పేరుకు తగ్గట్లే ఎంతో ఉత్తమురాలు. ఆవిడ అందం ముందు అప్సరసలు కూడా దిగదుడుపే. వాళ్ళకి తొమ్మండుగురు ఆడపిల్లలు పుట్టారు.

వాళ్ళు ఎంత అందగత్తెలో అంత సాహస పరాక్రమవంతులు కూడా. మా రాజుగారు వారికి అన్ని విద్యలూ నేర్పించారు. రాబోయే కాలానికి కాబోయే ఏలికలు మరి... తన తదనంతరం వారికే రాజ్యభారం ఇవ్వదలచి వారికి అస్త్రశస్త్ర విద్యలే కాక, రాజనీతి, అర్థ శాస్త్రం మొదలైన అన్ని శాస్త్రాలలో పారంగతులని చేసారు.

ఇక రాజ్యపాలన వారికి ఇచ్చి, తాము వానప్రస్థాశ్రమం స్వీకరించాలని తలచారు. మా రాణిగారి తమ్ముడైన లోభుడు, తనని రాజుని చెయ్యమని పట్టుబట్టి కూర్చున్నాడు. ప్రజలని, మంత్రులని, సైనికులని, రాజగురువులనీ, ఇలా ఒకరేమిటి అందరినీ అదిలించీ, బెదిరించీ చూసాడు. రాజగారన్నా, రాణిగారన్నా, వారి కుమార్తెలన్నా అపారమైన గౌరవం, ప్రేమ కలవారందరూ అతనిని తిరస్కరించారు. ఇక చేసేది లేక మా రాజ్యం వదిలి వెళ్ళి పోయాడు.

యువరాణులకి రాజ్యభారం అప్పగించి, రాజుగారు, రాణిగారు అడవిలో ఆశ్రమం నిర్మించుకొని ఉండసాగారు. నవరత్నాలలాంటి మా రాణుల పాలనలో, మేము ఎంతో ఆనందంగా, సర్వసమృద్ధిగా ఉండేవారం.

ఒకరోజు ఉన్నట్లుండి, వేటకని వెళ్ళిన మా రాణులు మాయమయ్యారు. అటు తర్వాత రోజుకొకరుగా, మా రాజ్యంలో పదిహేను నించి యాభై ఏళ్ళ వయస్సుగల ఆడవాళ్ళు, బయటకి వెళ్ళితే మాయమవటం మొదలైంది. ఎవరు తీసుకొని వెళ్తున్నారో కూడా తెలియదు. ఈ విషయం తెలిసి రాజుగారూ, రాణిగారూ ఆశ్రమం నించి తిరిగి వచ్చారు. కోటలో ఉన్నవారికి ఏ హానీ కలిగేది కాదు. అందువలన ఆడవాళ్ళు బయటకి రాకుండా కోటలో ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉండేలా ఏర్పాటు చేశారు.

మేము కాస్త ఊపిరి తీసుకునే లోపల, ఉన్నట్లుండి ఇక్కడకి ఎక్కడినించి వచ్చారో తెలియదు, ఈ సైనికులూ, వారి నాయకుడు. ఆడవారి జాడ చెప్పమని నానా బాధలు పెడుతున్నారు. పిల్లలూ పెద్దలూ అని చూడకుండా, అందరినీ హింసిస్తున్నారు. ఇళ్ళమీదికి రారు, అందుకే అందరూ తమ ఇళ్ళువదలి రావటం మానేసారు.

"మరి మీ సైనికులు, రాజు ఇందరుండగా వారిని తరిమి కొట్టలేక పోయారా?"

"ఆ ప్రయత్నమూ చేసారు. ఆ మర్నాడే, సురభి అనే పరిచారిక శవం ఊరిమధ్యలో ప్రత్యక్షమైంది. ఆమె నుదుటి మీద ‘మమ్మల్ని ఎదిరిస్తే మీ రాజకుమార్తెలతో సహా, మా దగ్గర బందీలుగా ఉన్న వారందరికీ ఇదే గతి పడుతుంది’ అని రాసి ఉంది. వాళ్ళు ఎందుకు వచ్చారో? ఎన్నాళ్ళు ఉంటారో? మా రాజకుమార్తెలు ఎక్కడ ఉన్నారో? ఇవన్నీ ప్రశ్నలుగా ఉండిపోయాయ్."

"మరి ఇళ్ళలోనే ఉన్నవారికి ఆహారం అవి ఎట్లా?" అడిగాడు శ్రీనివాసరాయలు.

"అది ఒక పెద్ద రహస్యం. నేను నీకు ఇంతకుమించి చెప్పేది లేదు." ఖరాఖండిగా చెప్పింది ముసలమ్మ.

***

శ్రీనివాసరాయలు అప్పటినించీ మారు వేషంలో తిరుగుతూ అందరినీ గమనించ సాగాడు. అప్పుడప్పుడూ ఆ సైనికులు ఒక గుహ ప్రాంతానికి వెళ్ళటం, మళ్ళీ కొంతసమయం తరవాత బయటకి రావటం చూసాడు. లోపలకి వెళ్ళి చూసాడు. అక్కడ ఆడవారి మూర్తులు తప్ప ఏమీ కనపడలేదు.

శ్రీనివాసరాయలు ఒక రాత్రి నిద్దర పట్టక, గదిలో అటూఇటూ పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఏదో అలికిడి అయితే బయటకి చూసాడు.

ముసలమ్మ, ఆవిడతో పాటు మరో నలుగురు అడవివైపుగా వెళ్ళటం చూసాడు. మెల్లగా వారి వెనక వెళ్ళాడు. వారందరూ ఒక గుహ దగ్గర ఆగారు. వారిలో ఒకరు చిన్న దీపం తీసి పట్టుకున్నారు. అందరూ ఆ గుహలోకి వెళ్ళి చూస్తే, ఎక్కడ చూసినా ఆడవారి మూర్తులు ఉన్నాయి. పరిశీలించి చూడగా, అవన్నీ ఆ ఊరిలో మాయమైన ఆడవారి మూర్తులు. కానీ వాటిలో రాజకుమార్తెల మూర్తులు కనిపించలేదు. ఇంతలో లోపల అలికిడి అవ్వటంతో దీపం ఆర్పి వారందరూ గుహనుంచి బయటకి వెళ్ళిపోయారు.

దూరంగా ఉండి ఇది గమనిస్తున్న శ్రీనివాసరాయలు, ఆ పూటకూళ్ళమ్మ వద్దకి మళ్ళీ వెళ్ళాడు.

తాను ఆ నవరాజకుమార్తెలలో ఒకరైన లవంగలతను ప్రేమించాననీ, తమ వివాహానికి రాజదంపతులు అంగీకారం తెలిపి, ఒక రాజముద్రికను తనకి బహుకరించారనీ, ఇంతలో ఈ విపత్తు వచ్చిపడి, తన ప్రేయసి ఏమైనదో కూడా తెలియక, రాజప్రాసాదంలోనికి ఎవరినీ రానీయక పోవటంతో తాను పరితపించిపోతున్నాననీ. అందుకే ఒక వ్యాపారిలాగా ఆ రాజ్యంలో ప్రవేశించి, అన్ని వివరాలూ తెలుసుకొని, తన ప్రాణమైన లవంగలతను కాపాడుకోవాలని వచ్చాననీ చెప్పాడు. నిజానికి తాను ఒక రాజకుమారుడినని తమ రాజ్య రాజముద్ర చూపించాడు. ముసలమ్మకి అతనిమీద నమ్మకం కుదిరింది. ఆ రాజముద్రికని తీసుకొని వెళ్ళి పోయింది.

మర్నాడు ఉదయం ఆ ముసలమ్మ అతనికి ఒక పత్రం ఇచింది. దానిలో చాలా వివరాలు ఉన్నాయి. ఆ గుహలో గల రహస్యాలు, అందులోకి వెళ్ళే మార్గాలు.

ఇవన్నీ తెలుసుకున్న శ్రీనివాసరాయలు ఆ గుహకి వెళ్ళి మూర్తుల వెనక దాగాడు. ఒక చిన్న దీపంతో లోభుడు, అతని వెనకే ఒక పొట్టి మనిషి, మాంత్రికుడు లోపలనించి వచ్చారు.

"నేను నిన్ను ఇప్పుడే చంపేస్తాను. కాదుకాదు, ఒక కోతిలా మారుస్తాను. నా శిష్యుడు నిన్ను ఊరూరా తిప్పి ఆడిస్తాడు" లోభుడితో అన్నాడు మాంత్రికుడు. మాంత్రికుడు, అతని నీడన ఉన్న పొట్టి మనిషి వికృతంగా నవ్వసాగారు.

"నేను అడిగింది మా అక్కాబావల మనస్సు మార్చి నన్ను రాజుని చేసేలా చెయ్యమని. నువ్వు ఊరిలోని ఎందరో ఆడవారిని, నా మేనకోడళ్ళతో సహా, మాయం చేసి ఇలా మూర్తులని చేసేసావు. పైగా మిగిలినవారినందరినీ తీసుకొని రమ్మంటున్నావు. నా మేనకోడళ్ళని ఎక్కడ దాచావో కూడా నాకు తెలియదు. నువ్వు ముందు వారిని నాకు చూపు. అయినా ఇంతమందిని తెచ్చినవాడివి, మిగిలినవారిని తీసుకొని రావటం నీకొక లెక్కా?" అన్నాడు లోభుడు.

"అవును గురో! అతనన్నది నిజమే. నేను కూడా మిమ్మల్ని ఈ విషయమే ఎప్పటినించో అడగాలని ఉన్నా, మీ కోపానికి భయపడి ఊరుకున్నాను. కాళీమాత గుడిని చదువుకున్న, సాహస వంతులైన, ఒకే దేశానికి చెందిన వనితామణులందరి మూర్తులతో అలంకరిస్తే, మీరు మహామాంత్రికులవటమే కాక, మృత్యువును కూడా జయించగలరని నాకు తెలుసు. ఇప్పటికే ఆ దేశానికి చెందిన సగం మందిని తీసుకొని రాగలిగిన మీరు, ఆ మిగిలినవారిని తీసుకొని రాలేకపోవటం ఆశ్చర్యంగా ఉన్నది," అన్నాడు ఆ పొట్టివాడు.

"అది కాళీమాత ఆజ్ఞరా. నేను ఎవ్వరి ఇళ్ళలోకీ వెళ్ళి తీసుకొని రాకూడదు. రెండువందల యాభై ఒక్క మందీ ఒకే దేశానికి చెందినవారై ఉండాలి. ఈ రాజ్యంలో తప్ప, ఇంకే రాజ్యంలో అంతమంది చదువుకున్న, సాహసవంతులైన వనితలు లేరు. మొదట ఈ లోభుని రకరకాల జంతువుల రూపంలోకి మార్చి వానిద్వారా వీరిని రప్పించుకో గలిగాను. ఇప్పుడు ఆ మిగిలిన వారి ఆచూకీ తెలియటం లేదు. వీరందరూ కోటలో ఉన్నట్లు తెలిసింది. కానీ ఎక్కడ ఉన్నదీ తెలియదు. వారు ఉన్నప్రదేశానికి ఎవ్వరికీ అనుమతి లేదు. కనీసం పురుగూపుట్రా కూడా జొరబడలేని ప్రదేశం ఆ రాజూ, రాణీ వారి తపశ్శక్తితో నిర్మించారు. ఇంకొక వందమందిని తేగలిగితే నా కోరిక నెరవేరినట్లే."

"అందుకేనా ఆ సైనికులని సృష్టించి అక్కడ ఉంచారు! ఎవరో ఒక్కరు ఆ ప్రదేశం కనుక్కొంటారనా?" ఇలా అంటుండగానే మాంత్రికుడు లోభుని ఒక పురుగుగా మార్చి, చిన్న సీసాలో పెట్టి బంధించాడు.

"ఇక వీడితో మనకి పనిలేదు కదా గురూ, వీడిని చంపేస్తే సరిపోతుంది కదా?"

"అది కూడా ఒక రహస్యం. నేను నా ప్రాణాలను వీడిలో దాచాను. ఆ మూర్తులన్నీ తయారైతే నేను మహామాంత్రికుడనైపోతానని, నన్ను జయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే నా కార్యం సాధించేవరకు వీడు మనకి ఇలా ఉపయోగ పడతాడు," అంటూ ఆ సీసాను ఒక పెట్టెలో పెట్టాడు. చూస్తుండగానే అది మాయమైపోయింది.

"కానీ ఎవరైనా ఈ గుహలోకి వచ్చి ఈ సీసాలోని పురుగుని చంపితే మీ ప్రాణాలకి ముప్పు కదా?"

"అది అంత సులభం కాదు. ఈ పని నలుగురు ఒక్కసారే చెయ్యాలి. ఒక వృద్ధురాలు, ఒక నడివయస్కుడు, ఒక నవయవ్వనుడు, వీరిలో ఒకరి రక్తసంబంధీకులు. అందరూ కలసి ఈ గుహలోకి రావాలి, ఒకేసారి కాళీమంత్రం చదవాలి, అప్పుడు లోపలి గుహ తెరుచుకుంటుంది. వీరిలో సాహసం కలవారు ఒకరు తమ ప్రాణం అర్పిస్తేనేగానీ ఈ పురుగులోని నా ప్రాణాలు బయటకి రావు, నాకు చావు రాదు. ఎవరైనా అంతటి సాహసం చేసే లోపల నేను ఆ మూర్తులని తెచ్చి అలంకరించాలి. పద! మనం ఆ కార్యసాధనపై దృష్టి నిలబెడదాము," అంటూ గుహ బయటకి దారితీసాడు.

***

చాటుగా ఉండి ఇదంతా విన్న శ్రీనివాసరాయలు, ఒక పథకం వేసుకున్నాడు. ఆ వివరాలే లేఖలో రాసి, ముసలమ్మ ద్వారా మహారాణికి అందించాడు.

అతనికి సహాయంగా ముసలమ్మ, వీరేశం, మహారాణిగారు తయారుగా ఉన్నారని శ్రీనివాసరాయలుకి కబురు పెట్టారు.

ఆ రోజు పున్నమి! ఆ పండు వెన్నెల కాంతిలో వారు అందరూ మారువేషంలో అడవి మార్గం గుండా గుహచేరారు. మాంత్రికుడు చెప్పిన ప్రకారం గుహ అంతర్భాగం చేరారు. అక్కడ లవంగలతతో పాటు మిగిలిన రాచకన్యల మూర్తులు ఉన్నాయి.

మిగిలినవారు ఆలోచించే లోపలే, శ్రీనివాసరాయలు కాళీవిగ్రహం ముందు నిలబడి, ఖడ్గంతో తనతల తెగ నరకుకున్నాడు. అంతటితో సీసా పగిలి, పురుగు నేలమీదపడి గిలగిలా కొట్టుకొని ప్రాణం విడిచి, వెంటనే లోభుడిగా మారిపోయింది. తక్షణమే అక్కడ మూర్తుల రూపంలో ఉన్న రాజకుమార్తెలూ, మిగిలిన ఆడవారూ యథారూపం పొందారు.

ఒక విచిత్రమైన కాంతి ఆ గుహ అంతా నిండిపోయింది. కాళికామాత ప్రత్యక్షమై, శ్రీనివాసరాయలుని తిరిగి సజీవుడిని చేసింది.

శ్రీనివాసరాయలు అమ్మను కీర్తించాడు. అందరూ కాళీమాతకు నమస్కరించి, ఆనందంగా తమ ఊరు చేరారు. శ్రీనివాసరాయలు అంగరంగ వైభవంగా లవంగలతికను పెళ్ళాడాడు.

*********

Posted in October 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *