పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు
వాణి నా రాణి అని సగర్వంగా చెప్పుకొనే కవి మనకొకడున్నాడని మనం చెప్పుకోవచ్చు. అతడే పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు.
ఇలా చెప్పుకోవడానికి కారణం వీరభద్రుడు. రాత్రికి రాత్రే ఒక మహాకావ్యాన్ని వ్రాసాడని, నిజంగా సరస్వతీదేవే వ్రాసిందని ఆనాటి ప్రజల మాట. అందుకు సాక్ష్యంగా ఒక చాటుపద్యం కూడా తెల్పుతున్నది.
“పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని కిల్లాలాట వాణి...”
అయితే వీరభద్రుని కృతులలోని కృత్యాదులలో పై విధంగా లేదని ఆరుద్ర తెల్పారు. ఆ కృత్యాదులలో వీరభద్రుడు సరస్వతిని పాలించే ఏలికసాని గానే పూజించినట్లున్నది. ఇతనికి సమీపకవి కొరవి గోపరాజు వీరభద్రునికి ‘మహామతి’ అనే విశేషణ వాడాడు అని ఆరుద్ర తెల్పారు. పిల్లలమఱ్ఱి వంశమే శారదాపీఠం.
తెలంగాణా లోని నల్గొండ దగ్గర పిల్లలమఱ్ఱి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్న పిల్లలమఱ్ఱి కుటుంబం ఎప్పుడు పాకనాడుకు తరలిపోయిందో తెలియదు అని ఆరుద్ర చెప్పి, శ్రీనాథుని కాలానికి వీరు నెల్లూరులో ప్రధానులుగా ఉండేవారు అని తెల్పారు ఆరుద్ర.
శ్రీనాథుని బాల్యసఖుడు అవచి తిప్పయ్య శెట్టికి అక్షరాభ్యాసం చేసి, అటుపై గురువైన వాడు పిల్లలమఱ్ఱి పెద్దన అని శ్రీనాథుని పద్యం వల్ల తెలుస్తున్నది. పెద్దన క్రీ.శ.1360 ప్రాంతం వాడు. ఈయన కుటుంబంలోనే బహుశా మరి రెండు తరాలకు గాదిరాజు అనే ఆయన జన్మించాడు. అతడు ‘విద్యాభారతీజాని' అనే విశేషణానికి తగినంత పండితుడు. ఈయన భార్య పీరు నాగమాంబ. వీళ్ళకు చాలాకాలం దాకా పిల్లలు లేరు. నోములునోచి, వ్రతాలు చేసి చివరకు శ్రీశైల ప్రాంతంలో ఉండే భారతీతీర్థులనే మహనీయుణ్జి సేవించారు. ఆయన దీవన ఫలించి ఈ దంపతులకు ఒకరికిద్దరు బిడ్డలు పుట్టారు. ఆ కవలపిల్లలకు పెదవీరభద్రుడు, పినవీరభద్రుడు అని పేర్లు పెట్టారు. శారీరక శాస్త్రరీత్యా ఏ ప్రత్యేక పరిస్థితులవల్లనో పుడుతున్నప్పుడే పినవీరయ్య జుట్టు జడలు కట్టినట్టుందట. అందుచేత ఇతడు నిజంగా పినవీరభద్రుని అవతారమే అని లోకులు భావించారు.
పినవీరభద్రుడు సకలశాస్త్ర కోవిదుడు. అతనికి ఏడెనిమిది తరాల తర్వాత నున్న (పిల్లలమఱ్ఱి సంతతి వారు) పెనుమళ్ళ సోమయ్య 'సీమంతినీపరిణయం' అనే కావ్యం వ్రాశాడు. అందులో పినవీరభద్రుని తల్లితండ్రులను గూర్చి తెల్పి తర్వాత ఈ క్రింది పద్యం వ్రాశాడు. అని ఆరుద్ర ఆ పద్యాన్ని ఉటంకించాడు.
మహనీయపిల్లలమర్రి వంశభుడు గాదిరాజునుతుండు ఘనయశుండు
వీరేశ్వరుని యవతారమే యతడంచు జను లెన్నదగిన సౌజన్యశాలి
పినవీరభద్రుడు పిన్న ప్రాయమునందు నఖిలశాస్త్రంబులు నభ్యసించె
గాళిదాసాదిసత్కవులకు హెచ్చు గా బహుకావ్యవిరచిన ప్రొఢి గాంచె
వాణి యిల్లాలుగా గవిశ్రేణి కెల్ల
బృధుత రాశ్చర్యకరమైన బిరుదు పూనె
దుహినగిరిరాజరామసీతువుల నడుమ
నితని కెవమైన కవివరుం డెందు గలడు? (1-45, R. 513)
ఆ సీతు శీతనగపర్యంతం ఇటువంటి కవి ఇంకొకడు లేడని చెప్పడానికి సోమయ్య “వాణి నారాణి' అన్న కథ తెల్పాడని ఆరుద్ర అన్నారు. ఇటువంటి పృథుతరాశ్చర్యకరమైన విరుదు పొందటానికి తగిన నైదుష్యం పినవీరయ్యకు ఉండేది. నన్నయ్యగారి ప్రబంధప్రౌఢవాసనాసంపత్తి, సొంపు, తిక్కనగారి వాక్కులు ఫక్కి ఆమోదం, నాచన సోముని వాచామహత్యం సౌరభం, శ్రీనాథుని భాషానిగుంభాల పరిమళాలు ఇతని కవిత్వంలో ఉండేవని సమకాలికులు భావించేవారు అని అన్నారు ఆరుద్ర.
వీరభద్రుడు పుట్టి పెరిగింది నెల్లూరు అయినా అతను బిట్రగుంట, సోమరాజుపల్లి ప్రాంతంలో ఉంటుండేవాడు. ఇతడు చిన్నప్పుడే చాలా గ్రంథాలు వ్రాశాడు.
విష్ణుమూర్తి పది అవతారాలను వర్ణిస్తూ ‘అవతార దర్పణం’ అనే గ్రంథాన్ని ‘రమణీయవాగ్రీతి’ లో రచించాడు. నారదీయ పురాణాన్ని తెలుగులో వ్రాసాడు. మంజుల విధానంలో తన శేముషీవిశేషం వ్యక్తమయ్యేటట్లు మాఘ మహత్యం రచించాడు. డు. సముల్లసితమైన శయ్యతో ఘనమైన తన బుద్ధి కుశలత కనపడేటట్లు మానసోల్లాసం వ్రాశాడు. అయితే ఇవియేవీ ఇప్పుడు దొరకలేదు. కానీ వీటి పేర్లు వీరభద్రయ్య తన గ్రంథంలో తెల్పాడు అన్నారు ఆరుద్ర.
పినవీరభద్రయ్య ఈ కావ్యాలు రచించినప్పుడు, సోమరాజు పల్లెలో చిల్లర వెన్నమంత్రి వైభవోపేతంగా ఉండేవాడు. ఇతని పూర్వీకులు పంటరెడ్ల వద్ద మంత్రులుగా ఉండేవారు. సోమరాజు పల్లె ఆనాడు అరవైనాలుగు కళలకు పుట్టిల్లు. దానిని పాలించే చిల్లర వెంకన్న మంత్రి పినవీరభద్రయ్య ను పిలిచి గౌరవించి భారతం లోని శకుంతలోపాఖ్యాన్ని మిశ్రమ బంధంగా చేసి రచించి తనకు అంకితం ఇవ్వమన్నాడు. అయితే కాళిదాసుని నాటకాన్ని ఎవ్వరూ అనువదించలేదు కాబట్టి దాన్ని శ్రవ్య నాటకంగా అనువదిస్తానని వీరభద్రయ్య చెప్పాడు.
భారత ప్రోక్తకథ మూలకారణముగా - కాళిదాసుని నాటకక్రమము కొంత
తావకోక్తిని నభినవశ్రీ వహింప - గూర్మి గృతిసీయు నాక శాకుంతలమ్ము (శృంగారశాకుంతలము, 1-27)
శ్రీనాథుడు శృంగారనైషదము అని నైషదీయాన్ని అనువదించినట్లు పినవీరభద్రయ్య కాళిదాసు శాకుంతలాన్ని (నాటకం) శృంగార శాకుంతలము అని అనువదించి వ్రాశాడు.
కావ్యావతరణం
అష్ట రసాలలో ప్రధానమైనది శృంగారం కాబట్టి
“శృంగారము ముఖ్యంబగు నంగియు నంగములు దలప నష్టరసములన్
సాంగమగు నేని డంకము బంగారముతోడ యొక ప్రబంధము నొందున్” (శృంగారశాకుంతలం, 1-21)
దీనిని గూర్చి చెప్తూ ఎర్రన కూడా తన నృసింహ పురాణంలో నవరసాలు గాక అష్టరసాలనే తెల్పాడు అని దానిని తెల్పారు ఆరుద్ర. ఇక్కడ కొంత రససంఖ్యలో ఉన్న చర్చను ఆరుద్ర ప్రస్తావించారు.
నృసింహపురాణంలో వైకుంఠవర్ణన చేస్తూ ఎర్రయ్యగారిలా చెప్పారు.
ఆడుదు రెల్ల ప్రొద్దు లలితాభినయంబుల దేవకామినుల్
పాడుదు రింపు వీనులకు బండుగ సేయక వేడ్క గిన్నరుల్
గూడి సమ గ్రసత్వరసగోష్టి సుఖింతురు యోగిబృందముల్
క్రీడయొనర్తు రష్టరసకీర్తితభంగి బ్రపన్ను లయ్యెడన్ (నృ.పు. 1-61)
‘ఈ పద్యాన్ని ఎర్రయ్య అష్టరసవాది యనుట, అతని తల్లి గొడ్రాలు అనుట’ అని వేటూరి శివరామ శాస్త్రి గారు అష్టరస అనే పాదాన్ని సాధువుగా గుర్తించారు.
రూపకాలలోనే అష్టరసాలనీ కావ్యములలో తొమ్మిది అని వివరించారు. దండి కాలం దాకా ప్రాచీనాలంకారికులు ఎనిమిది రసాలనే గుర్తించారు. ముమ్మటుడు, ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు మొదలైన వారు శాంత రసాన్ని కూడా కలుపుకొని తొమ్మిది రసాలుగా చెప్పారు. ఆదిలో కాళిదాసు మాత్రం అష్టరసవాదే అని చెబుతూ “మునినా భరతేనయః ప్రయోగో భవతీష్యష్ట రసా శ్రేయో వియుక్తః” అన్న కాళిదాసుని విక్రమోర్వశీయం లోని II. 18 శ్లోకాన్ని ఆరుద్ర తెల్పారు.
కథ:
మహాభారతం లోని మూల కథలో పాత్రల ఔచిత్యం దెబ్బతిన్నదని కాళిదాసు మార్పులు చేశాడు. ఆ మార్పులు –
- కన్నె అయిన శకుంతల తన తల్లి వృత్తాంతాన్ని చెప్పడం సరికాదని, కాళిదాసు చెలికత్తెల చేత చెప్పించాడు.
- అడవి ఏనుగు ను ప్రవేశపెట్టడం, ఆకాశవాణి చెప్పేదాకా శకుంతల దుష్యంతునికి గుర్తు రాదు భారతంలో. కాళిదాసు ఉంగరం చూడగానే గుర్తుకు వచ్చినట్లు మార్చాడు. ఇలాంటి మార్పుల వలన కాళిదాసు రచన రసమయమైనది.
పినవీరభద్రయ్య ఇందులో కొన్ని స్వీకరించాడు.
పినవీరభద్రయ్య ప్రబంధంలో శృంగార రసం ఉండాలి కాబట్టి మేనక విశ్వామిత్రుల ప్రణయకథ కణ్వమహర్షి శిష్యుల చేత చెప్పించాడు. (కాళిదాసు చెలికత్తెల చేత చెప్పించాడు)
మూల కథను అనుసరిస్తున్నప్పుడు నన్నయ పై గౌరవంతో ఆయనను అనుసరించాడు అంటూ ఆరుద్ర నన్నయ ఆదిపర్వంలో వ్రాసిన కణ్వాశ్రమ వర్ణన గల పద్యాన్ని తెల్పి దానిని తర్వాత కవులు ఎలా అనుసరించారో తెల్పారు.
శ్రవణసుఖంబుగా సామగానంబులు చదివెడు శుకముల చదువు దగిలి
కదలక వినుచుండు కరులను గరికరశీతలచ్చాయ దచ్చీకరాంబు
కణముల చల్లని గాడ్సాసపడి వాని చెంది సుఖంబన్న సింహములును
భూసుర ప్రవరులు భూతబలుల్ దెచ్చిపెట్టు నీవారాన్న పిండతతులు
గడగి భక్షింప నొక్కట గలసి యాడు
చున్న యెలుకలు బిల్లులు రనొండు సహజ
వైరివర్గంబులయ్యు సహవాస మపుడు
సూచి మునిశక్తి కెంతయు జోద్యమంది. (భారతం, ఆది : 4-23)
నన్నయ గారి వర్ణనను గూర్చి ఆరుద్ర గారి మాటలు:
“బుష్యాశ్రమ వర్ణనలో ఏనుగులు నీడ సింహాలను, ఏ ముహూర్తాన నన్నయ్యగారు తెలుగు సాహిత్యంలో పడుకోబెట్టారోగానీ ఇటువంటి అపూర్వ సర్కసు ఫీట్లు ఆ తరువాత ప్రతి తెలుగుకవీ విధిగా వర్ణించసాగాడు. ఉత్తరహరివంశంలో నాచన సోముడు కోతులను, పువ్వులను, దున్నపోతులను కాసారాలకు కాపలా పెట్టాడు” అని చెప్పి పినవీరభద్రుడు తన రచనలో చేసిన ఫీట్లు మూడురింగుల సర్కస్ మించిపోతాయి అంటూ ఆ ఫీట్ల గురించిన పద్యాన్ని అందించాడు ఆరుద్ర.
వృద్ధసింహమునకు విహరింప దొండంబు కైదండ గా నిచ్చు గంధగజము
పులి కొత్త యీనిన పొదరింటిలోనికి బురిటాలిత గవు గొంపోవు హరిణి
శరభంబు కొనగోళ్ళ శిరము దువ్వగ జొక్కి కనుమోడ్చు సుఖనిద్ర గండకంబు
సింహకిశోరంబు చేరవచ్చిన వింత లేక చన్నిచ్చు బాలింత కరణి
యెలుకతోడుత జెరలాడు నెనసిపిల్లి
సెమ్మిబురి లిచ్చి నిలిచి ఫించమ్ము నీడ
భుజగకన్య క నాడింపు బూరి నమిలి
యనఘ కణ్య్బమునీంద్ర పుణ్యాశ్రమమం. (శకుంతలాపరిణయం, 2-45)
పిన వీరభద్రుడు ఆనాటి కొన్ని ఆచారాలను కన్నులకు కట్టినట్లు వర్ణించడంలో ఎంతో నేర్పు చూపాడు. శకుంతల పిల్లవానిని కన్న తర్వాత కథలో వీరభద్రయ్య ఎంత హడావిడి చేశాడో చదివితే తెలుస్తుంది అంటూ ఆరుద్ర ఇలా అన్నారు.
ఆనాడు పురుడు పోసుకొన్న వాళ్ళింటికి పెరంట్రాండ్రు ‘పులిటాలి తగవు’ తీసుకొని పోయేవారని ఒక పద్యం వల్ల తెలుస్తున్నది అని,
పులి పురుడు పోసుకుంటేనే వీళ్ళ చేత పండుగ చేయించిన వీరభద్రయ్య ఇక శకుంతల బిడ్డను కంటే ఊరుకొంటాడా అని దానికి సంబంధమైన పద్యాన్ని ఆరుద్ర తెల్పారు.
తలలంటి రతి పుణ్యతాపసాంగనలు నెంతయు వేడ్క నింగుదీతైలమునకు
నుటజాంగణమున గావుని పేరి తవుటితో వెల్లుల్లి పొగ యిచ్చి నీతిహోత్రు
జాగించి రంచితోత్సవము మప్పురుటాలి వైభవంబు తృతీయ వాసరమున
నారవ దివసంబునం దాచరించిరి బహుయోగినీగణ ప్రార్థనములు
కొలను గుడిపిరి దినములకొలది యెరిగి యఖిలముని ధర్మపత్నుల నామతించి
మిన్నబోకుండ గ్రియలెల్ల విస్తరిల్ల దగనొనర్చిరి పురుటాలి తగవులెల్ల (శకుంతలాపరిణయం, 4-62)