Menu Close
SirikonaKavithalu_pagetitle

ఊరంతా నాదే
ఊరే ఏమిటి? ఈ దేశమే నాది!
అయినా ఈ గేహమే నా గుర్తింపు
ఇదొక్కటే నాది, ఇది లేకుంటే లేదే వర్తింపు
ఇల్లంటూ ఒకటి లేకుంటే
ఎవడి బ్రతుకైనా వీధి పాలే!
ఇంటితో ఇల్లాలు, ఇల్లాలితో పిల్లలు, పిల్లలతో భద్రతలు, ఆస్తులు,
బ్రతుకులకు అర్థాలు, అస్తిత్వాలు!
అంతటితో ఆగుతుందా? వంశాలు, వంశ ప్రతిష్టలు
తరాలకు తగ్గ సిరులు, సిరులకు తగ్గ పేరుపెంపులు
ఆక్రమణలు, దేనికో ఎందుకో తెలియని పరాక్రమణలు
పుడమి పట్టని కడుపు బాధలు, చరిత్ర గాథలు

ఈ లోకమంతా నాదే!
'భూ'లోకమేమిటి? విశ్వమంతా నాదే!

అయినా ఈ దేహమే నాకు గుర్తింపు
దీని వల్ల నేను, నా వల్ల ఇది!
ఒకరి కొకరం ఆధారాధేయాలం
అస్తిత్వ సార్థక్యాలం
దేహం వదిలిన వేళ, నేను దేవుణ్ణి కావచ్చు దయ్యమూ కావచ్చు
ప్రకృతి కావచ్చు, వికృతి కావచ్చు
కృతిని బట్టి ఆకృతి, ఆకృతి బట్టి సకల వ్యాపృతి, లోక వ్యవహారాల గతి
లోకానికంతా ఆకృతేగా కేంద్ర వృత్తి
ఉన్న ఆకృతిని మరచిపొమ్మనే వెర్రి వేదాంతీ
ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోతున్న ఉప్పెనలో
తలక్రిందులుగా వేళ్లాడుతున్న చరిత్ర ఘట్టంలో
వందల ఏళ్ల చెట్టు చిటారుకొమ్మన వేలాడుతోంది
గుడ్డపీలికల మధ్యన ఓ దేహం
ఎక్కడనుండి కొట్టుకు వచ్చిందో
ఎవరికైనా లెక్కుందా? ఏ లెక్కలోకైనా ఎక్కుతుందా?
ఎక్కి ఆరా తీయడానికి ఏ భేతాళుడి కైనా వీలు చిక్కుతుందా?
కనీసం శవ పంచాయితీకైనా ఊరూ పేరూ దిక్కుందా?

అదే ఓ గేహపు చిరునామా ఉంటే జనాభా లెక్కల్లోకి ఎక్కి ఉంటాడు
దేశం ఓటరుగా హక్కు పొంది ఉంటాడు.
ఆ ఒక్క హక్కు చాలు
దేహానికి ఓ విలువ దక్కేటందుకు
ఈ దేశంలో మనిషిగా లెక్కించేటందుకు
బ్రతికినా, పోయినా లెక్క కట్టేటందుకు
బ్రతుక్కో చావుకో అపరాధపు సొమ్ము చిక్కేటందుకు
వారసులకు కాస్త ఊరడింపునిచ్చేటందుకు
కాదంటే ఏ అధికారగణాన్నో తృప్తి పరచేటందుకు...

దేహం ప్రకృతి
గేహం సంస్కృతి
గేహమున్న దేహం విలువ వేరు
దేహాలబట్టి గేహాల విలువా మారు
దేహానిదేముంది? ఒట్టి మ్యాటర్
గేహముంటే దేశానికే ఓటర్
దేహాలు మట్టి పాలు
గేహాలు దేశాల నేలు
దేహం తత్త్వాలిక కట్టిపెట్టి, గేహం కథలు మొదలుపెట్టు, దేశాన్ని నీఇంటగట్టు!!

కన్ను తెరిచేసరికి కన్న తల్లి కావాలి
చన్ను పాలు చిన్ని నోటితో గ్రోలాలి!

ఏమిటో ఈ ఆశలు
ఏమిటో ఈ ఊసులు

అమ్మ కొన్న బొమ్మలతో ఆడుకోవాలి
అలసి సొలసి ఆదమరచి నిదుర పోవాలి

ఏమిటో ఈ ఆశలు
ఏమిటో ఈ ఊసులు

బుడి బుడి నడకల తో
బడి కెళ్ళి చదువుకోవాలి
బండెడు పుస్తకాలను
వీపు మీద మోసుకెళ్లాలి

ఏమిటో ఈ ఆశలు
ఏమిటో ఈ ఊసులు

నాన్న పెట్టే షరతులు పూర్తి చేయాలి
పెద్ద పెద్ద చదువులకు
పై ఊళ్ళు వెళ్లి తీరాలి

ఏమిటో ఈ ఆసలు
ఏమిటో ఈ ఊసులు

అరమరికలు లేని అమెరికాకి ఎగిరి పోవాలి
అమ్మా నాన్నలను
వృద్దాశ్రమాల్లో వదిలి వేయాలి

ఏమిటో ఈ ఆశలు
ఏమిటో ఈ ఊసులు

అనురాగానికే నీళ్లు వదిలేయాలి
భర్త తెచ్చే 20K కె హార తివ్వాలి

ఏమిటో ఈ ఆశలు
ఏమిటో ఈ ఊసులు

కన కుండా కొనేయాలి
పిల్లల్ని పీచుల్ని
పగలు రాత్రి తాగుతూ ఊగుతూ సాగిపోవాలి

ఏమిటో ఈ ఆశలు
ఏమిటో ఈ ఊసులు

తెలుసు కోండిరా మానవ విలువలు
వేసుకొండిరా
ఒంటినిండా వలువలు

ఏమిటో ఈ ఆశలు
ఏమిటో ఈ ఉసులు

గతమంతా గుబాళించె‌గాయాల ముళ్ళ వనమై
మిగిలా
మనసంతా ప్రవహించేటి వలపుల వాగు స్వరమై మిగిలా

మహస్సునే కోరని అహమై లోకమెంతో అలసిందిగా
ఏలె కాలాన ఎవరెరుగని మధుర ప్రేమ తనమై
మిగిలా

తీపినే కోరేటి నీచ కీటకాల ఘాటు మాట లెన్నొ
కొలుపు కాలేని కొలువు లేని కొలిచే సుమ సరమై మిగిలా

అందమై అందని ఆకాశాన అంతులేని అంధమెంతొ
ఇల కొలువకున్న నింగి
హరివిల్లిడు ఘనా ఘనమై మిగిలా

కన్నీటి తళ్ళ కదలాడేటి
భావఝరులెన్నో మల్లీ
బురదలొ విరిసి మెరిసే కలువ కనుల త్విషా తపమై మిగిలా

నా నుండి నేను విడివడి..
నిశ్శబ్దం లోకి వెళ్తున్నట్టుంది..
ఏ ఆలోచనలూ లేని కన్ను చూడగలిగే
చుక్కల ప్రపంచం పై పై కి.. ఆ పైకి..
బంధాలు లేని మరో లోకంలోకి..

చిందిన చినుకు చిట్లి చీలికై చిత్తైనట్టు
వెతల కధలన్నీ విసిరి వెదజల్లబడ్డట్టు
చివికి చితికి చితికెళ్తున్న శబ్దం లేని ప్రపంచం లోకి..
వెళ్తున్నట్టుంది.

నిలుపగరాని స్వప్నాన్ని ఉత్తి కలలా చూడలేక
తలపగలేని ఊహల ఉత్తుత్తి ఊయలలో
కారుకమ్మిన పొగ మబ్బుల్లో తేలి తేలి
నా నుండి నేను విడివడి...
నిశ్శబ్దం లోకెళ్తున్నట్టుంది...
పైపైకి.. ఆ పైకి... ..

Posted in September 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!