Menu Close
Abhiram Adoni
భళా సదాశివా..
అభిరామ్ ఆదోని (సదాశివ)

మట్టిలో మహిమగా...
నీరులో చేతనముగా...
నిప్పులో శక్తిగా...
నింగిలో విశాలముగా
గాలిలో ప్రాణముగా
మనిషిలో మానవత్వముగా
ప్రకృతిలో పరవశముగా
పరిణతిలో ప్రతిబింబంగా
ప్రకాశించే పరమశివా....
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా....

బ్రహ్మాండం బాగున్నది
బ్రహ్మాండంలో పిండాండం బాగున్నది
పిండాండంలో అండము బాగున్నది
అండలో లింకారము బాగున్నది
లింకారములో నీ సాకారము బాగున్నది
బాగుండాలనే తపనతోనే సృష్టిని సాగుచేస్తున్న శంకరా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా....

మట్టిలో మట్టిలా
నీటిలో నీరులా
నింగిలో నింగిలా
నిప్పులో నిప్పులా
దేనిలో బడితే దానిలో ఇమిడిపోయే
లీలామయా
నాలోను ఇమిడిపోయావా...
ఈ ఇరుకు గుండెగుహలో గుణమై ప్రకాశించావా
ధన్యోస్మీ దయామయా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా....

డబ్బు ఓ మాయ
జబ్బు ఓ మాయ
మబ్బు ఓ మాయ
దుబ్బు ఓ మాయ
మాయా తెరపై అన్నింటిని మాయచేసే మహేశ్వరా....
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా....

నిను చూచుట నా భాగ్యం
నిను కొలుచుట నా పుణ్యం
నిను తలుచుట నా ధర్మం
నీవే నేనగుట నీ కరుణా కటాక్ష కర్మం
ఏది ఇచ్చినా నీ ఆట మర్మం....
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా....

అలసిన సందేహం
అలసిన దాహం
అలసిన దేహం
అంతా నీ ఆట.., లీలా విలాసం...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

మనసు మధనం
తనువు తపనం
ఆత్మ ఎదురుచూపు జాగారం
అంతా నీ ఆట.., లీలా విలాసం...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

కనిపించక నీవు
కనిపిస్తూ నేను
కనీ కనిపించకుండా జీవన ప్రయాణం
అంతా నీ ఆట.., లీలా విలాసం...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

కష్టం ఒక తాడు
నష్టం ఒక తాడు
సుఖం ఒక తాడు
దుఃఖం ఒక తాడు
నువ్వేగా అన్ని తాడ్లను తెంచే ఱేడు
అంతా నీ ఆట.., లీలా విలాసం...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నిన్ను చూడాలనే ఆశ
నిన్ను తాకాలనే ఆశ
నిన్ను కౌగిలించుకోవాలనే ఆశ
నిన్ను నాలో నింపుకోవాలనే ఆశ
ఆశ ఆయువు తీస్తున్నది సంసారబంధనపు నిరాశ...
అంతా నీ ఆట.., లీలా విలాసం...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

... సశేషం ....

Posted in December 2023, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!