ముందు పటములో ఆకారమైతవు
తరువాత నుదుటిన బొట్టైతవు
అట్నుంచి ప్రతి రక్తపు బొట్టు నువ్వైతవు
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా..
దయగలిగితే కరుణా చూపుతో
కటాక్షిస్తవు
కోపమొస్తే కరోనా రూపై కాటేస్తవు
కరుణైనా...! కోపమైనా...!మాకు ఇచ్చేది మోక్షమేగా
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా..
ఇంటిలో దీపమైతావ్
ఒంటిలో దీపాన్ని చూపెడతావ్
ఏ దీపమైన కొండపైనున్న నన్ను చేరాల్సించిందేనని
కొండెక్కిస్తావ్
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా..
కట్టెలాడిన సరసానికి
మరో కట్టెను పుట్టిస్తావ్
ఆ కట్టెలోను మంటైమండి చాలదన్నట్లు
ఆ కట్టెనె మసిచేస్తావ్
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా..
గుళ్ళో లింగమైతవ్
తనువులో అంగమైతవ్
ఏ లింగమైన అంగ సంగమ చిహ్నమని పైకి చెబుతూ
అంతరంగాన్ని లోలోపల రంగరిస్తవ్
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా..
గుడిలోని హుండీలో చిల్లరైతవ్
గుడి మెట్లపై పళ్ళెంలో చిల్లరైతవ్
చిల్లరేసానని మురిసినంతకాలం నువ్వే చిల్లరగాడివని
చిరునవ్వుతో నిరూపిస్తవ్
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా..
కంచంలో ఆకలి తీర్చు అన్నమైతవ్
మంచంలో దేహ మోహ దాహాన్ని తీర్చు మైథునమైతవ్
నేను సుఖపడ్డానని భ్రమ పడ్డంతకాలం పగలబడి నవ్వి
నా బ్రతుకే భ్రమను చేస్తవ్
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా..
ఆహా ఎంత మంచి వాడివయ్యా
నమ్ముకున్నోడిని నట్టేటముంచుతావు...
ఎంత దయామయుడివయ్యా
నువ్వే దిక్కు అనుకున్నోడిని దిక్కులేనివాడిని చేస్తావు...
అంతేలే నీ కాటికాపరి బుద్ధి యాటికిపోతదయ్యా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
డబ్బు లోకాన్ని నడిపిస్తున్నది...
ధర్మం లోకాన్ని నడిపిస్తున్నది...
మోహం లోకాన్ని నడిపిస్తున్నది...
మరి లోకమో...
లోకులు కాకులని తెలిసి లోకేశ్వరుడి అడుగుజాడల్లో అడుగేస్తున్నది..
ఏదైనా చేయగల ఏకాంబరేశ్వరా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
పది తలలతో కొండనెత్తినవాడు నీ భక్తుడు...
నీ తలపైనే చెయ్యి పెడతానన్నోడు నీ భక్తుడు...
నీ శుక్రము నుంచి పుట్టిన వాడు నీ భక్తుడు...
నీకు మాంసం పెట్టినవాడు నీ భక్తుడు...
తిన్నగా పూజించే నాబోటి గాణ్ణి కాకుండా
తింగరివేశాలు వేసే భక్తులనే కరుణిస్తావన్న మాట...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా..