Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం-125 వ సమావేశం
-- వరూధిని --
vikshanam-125 photo

వీక్షణం-125 వ సమావేశం జనవరి 7, 2023 న ఆన్ లైనులో జూమ్ సమావేశంగా అట్టహాసంగా జరిగింది. ఈ వీక్షణం శతరజతోత్సవ సమావేశం, ఆస్ట్రేలియా అతిథుల ప్రత్యేక సమావేశం గా జరిగింది. ఇందులో ఆస్ట్రేలియాతో బాటూ అమెరికా, భారతదేశం నుంచి కూడా అతిథులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా వీక్షణం సంస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి మాట్లాడుతూ 2012 సెప్టెంబరులో మొదలుపెట్టిన వీక్షణం 125 సమావేశాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని, ఇన్ని నెలల పాటు సభ్యులందరి తోడ్పాటు వల్లనే వీక్షణం కొనసాగుతూ ఉందని అంటూ, అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసారు.

సభాధ్యక్షులు శ్రీ మధు ప్రఖ్యా గారు ప్రారంభోపన్యాసం చేసి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య ప్రముఖులు, “తెలుగుమల్లి.కాం” అంతర్జాల తెలుగు పత్రిక సంపాదకులు శ్రీ మల్లికేశ్వర్రావు కొంచాడ గారిని వేదిక మీదికి ఆహ్వానించారు. మల్లికేశ్వర్రావు గారు ఆస్ట్రేలియా తెలుగు వికాస చరిత్రని, కొనసాగుతున్న సాహిత్య, సాంస్కృతిక ప్రగతిని వివరించారు. ముఖ్యంగా సాహిత్య, కళా రంగాల్లో ఆక్కడి తెలుగువారి విశేష కృషిని సభకు పరిచయం చేసారు.

ఆ తరువాత "పద్యం-విశిష్టత" అనే అంశం మీద ఆస్ట్రేలియా నించి శ్రీ తూములూరి శాస్త్రి గారు ప్రధాన ప్రసంగం చేసారు. ముందుగా 'విశిష్టత' అనే పదం నించి మొదలుకుని అర్థవివరణ చేసారు. పద్య లక్షణాలతో పాటూ సోదాహరణంగా చక్కని ఛలోక్తులతో ఆద్యంతం అందరినీ అలరిస్తూ పద్య విశిష్టతని వివరించారు శాస్త్రి గారు.

ఆ తరువాత జరిగిన 'సాహితీ కదంబం' కార్యక్రమంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నించి శ్రీమతి విజయమాధవి గొల్లపూడి గారు గల్పికా పఠనం చేసారు. హాస్యస్ఫోరకమైన "పేరులో తికమకలు" అనే ఈ గల్పిక అందరినీ అలరించింది. శ్రీ శ్రీకృష్ణ రావిపాటి (ఆస్ట్రేలియా) తెలుగు సామెతలతో అల్లిన చక్కని కథని వినిపించి సభని అలరించారు.

తరువాత జరిగిన కవిసమ్మేళనంలో, చర్చా కార్యక్రమంలో శ్రీమతి ఉషా శ్రీదేవి శ్రీధర (ఆస్ట్రేలియా), శ్రీ వేణు రాజుపాలెం (ఆస్ట్రేలియా), శ్రీ తూములూరి శాస్త్రి (ఆస్ట్రేలియా), శ్రీ మృత్యుంజయుడు తాటిపామల (యుఎస్ఏ), శ్రీ రావు తల్లాప్రగడ (యుఎస్ఏ), శ్రీమతి అపర్ణ గునుపూడి (యుఎస్ఏ), డా.కె.గీత (యుఎస్ఏ), శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా (యుఎస్ఏ), శ్రీ రామ్ నేతి (యుఎస్ఏ), శ్రీ నాథ్ ఖండవల్లి (ఆస్ట్రేలియా), శ్రీమతి రాధిక (యుఎస్ఏ), డా. డి.లక్ష్మీ నరసమ్మ (యుఎస్ఏ), శ్రీ ప్రసాదరావు రామాయణం (ఇండియా), శ్రీ రాజేంద్ర ప్రసాద్ (ఇండియా), శ్రీమతి సూర్యకుమారి మానుకొండ (ఇండియా), శ్రీ బి.వెంకటేశ్వర్లు (ఇండియా), శ్రీ రాంబాబు (ఆస్ట్రేలియా), డా. వేణుగోపాల్ (ఆస్ట్రేలియా) తదితరులు పాల్గొన్నారు.

చివరిగా గీతామాధవి ధనుర్మాసం సందర్భంగా దేవులపల్లి వారు అనువదించిన తిరుప్పావై గీతాన్ని పాడి సభని విజయవంతంగా ముగించారు. ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

Posted in February 2022, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!