(ఈ విశ్వంలో గల చేతనాచేతన వస్తువులన్నీ భగవంతునికే చెంది, ఆయన చేతనే నియమించబడుతున్నాయి. కనుక మానవుడు తన కొరకే కేటాయించబడిన, తనకు కావలసిన వస్తువులు మాత్రమే తీసుకోవాలి. ఎవరూ ఇతరుల వస్తువులను, సంపదను స్వీకరించరాదు. అలాంటి త్యాగచింతనతో ఈ లోకాన్ని అనుభవించు.)
ఈ లోకము, దాని ఐశ్వర్యాలు, అవి అందించే సుఖ భోగాలు, వస్తువులు, అన్నీ మార్పులకు లోనయ్యేవే. అంటే శాశ్వతాలు కానివి. కనుక శాశ్వత ఆనందాన్ని, ప్రశాంతతను దేనిని ఈ లోకం నుంచి ఆశించలేం. కానీ శాశ్వత ఆనందాన్ని, ప్రశాంతతను ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వాటిని పొందడానికి మార్గం ఏమిటి అని ఆలోచిస్తే, సమస్తాన్ని భగవంతునితో నింపివేయాలి. అంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి, ప్రతి పదార్థము దేవునిదే అని భావించి, వాటిలో మనము భగవంతుని చూడాలి. సాటి మానవుల్లో సకల జీవరాశులలో భగవంతుని చూడాలి. అలా చూడగలిగినప్పుడు నీవు జగత్తులో ఉండే మాయ నుండి బయట పడతావు. మంచివాడిలోనూ, చెడ్డవాడిలోను, అందరిలోనూ, భగవంతుడే ఉన్నాడని గ్రహించి, అహాన్ని తగ్గించుకొని త్యాగభావనతో లోకాన్ని అనుభవించమని ఈ ఉపనిషత్తు చెబుతుంది.
ఇప్పుడు ఈ ఉపనిషత్తు లోని మొదటి మంత్రం:
ఈశావాస్యమిదగ్ం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనమ్
మానవుడు కర్తవ్యాలను విహిత కర్మలను నిర్వహిస్తూ మాత్రమే నూరు సంవత్సరాలు జీవించాలని ఆశించాలి. ఆ విధంగా కర్మలు చేస్తూనే వందల సంవత్సరాలు జీవించాలని ఆశించవచ్చు. లోకాన్ని అనుభవిస్తూ జీవితం గడపాలని అర్థం. నీలాంటి వారికి ఇది తప్ప మరో మార్గం లేదు. ఇలా జీవించడం వల్ల కర్మ బంధం ఏర్పడదని భావన. ఇతర జీవులు కూడా జనన మరణాలకు లోబడే ఉంటాయి. కానీ మానవజన్మ లభించినప్పుడు కర్మశాస్త్రం నుండి ముక్తులు కావడానికి అవకాశం ఉంటుంది. కర్మలు మూడు రకాలు కర్మ, అకర్మ, వికర్మ, స్వధర్మాన్ని పాటిస్తూ జీవితంలో చేసే పనులను కర్మలు అంటారు. మానవునికి జనన మరణ చక్రం నుండి విముక్తి చేకూర్చే పనులు అకర్మలు. మానవుడు తన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసే పనులు మానవుడిని అవినీతి జీవితంలో పడవేసే పనులు వికర్మలు. కనుక ఉత్తమ స్థితి పొందడానికి మానవులు సత్కర్మలు చేస్తూనే ఉండాలి.
మనం లోకంలో జీవించాలి. అందుకోసం పనిచేసే తీరాలి. కర్మలను నిర్వహించకుండా ఎవరు జీవించలేరు. ఏ పని చేసినా అందుకు ఫలితం ఉంటుంది. అది సత్ఫలితం కావచ్చు. దుష్ఫలితమైన కావచ్చు. రెండూ కలిసినవి కూడా కావచ్చు. కానీ పర్యవసానం తప్పక ఉంటుంది. ఆ పర్యవసానం ఏదైనప్పటికీ అది మనల్ని బంధిస్తుంది. మనసులో ఒక ముద్ర వేస్తుంది. ఒక సంస్కారాన్ని ఏర్పరుస్తుంది. ఆ ముద్ర మనలను పదేపదే ఆ పని చేసేలా ప్రేరేపిస్తుంది. మళ్ళీ మనం ఆ పని చేస్తాం. ఇలా పనులు కొనసాగుతాయి. ఇది జనన మరణ పరంపరకు దారి తీస్తుంది.
కానీ ఈ లోకం భగవంతునికి చెందినదిగా గ్రహించి ఆయన ఐశ్వర్యానికి, సుఖానికి, దుఃఖానికి బాధ్యత వహించిన వ్యక్తిగా జీవితం గడిపితే, ఆ రీతిలో పనిచేస్తే ఆ పని ద్వారా కలిగే ప్రతిఫలం మనలను తాకదు. ఫలితం మనలను తాకనందు వలన అలాంటి పని ఒక ఆత్మ సాధనగా పనిచేస్తుంది.