సుమారు నూట యాభై, రెండు వందల సంవత్సరాల క్రితం నివసించిన తరిగొండ వెంగమాంబ అనే కవయిత్రి తన ఇలవేల్పు మీద రాసిన శతకంలో పద్యమే ఈ నెల పద్య రత్నం. ఈ శతకంలో ఉండే మకుటం “తరిగొండ నృసింహ, దయాపయోనిధీ” అనేది నాలుగో పాదంలో కనిపిస్తుంది. వెంగమాంబ కడప జిల్లాలో తరిగొండ అనే చోట నివసించారనీ అక్కడి నృశింహదేవుడి కృప పొందారనీ తెలుస్తోంది కానీ ఈవిడ తిరుపతి లో ఉన్నారుట చివరిలో. ఈవిడ శతకం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు. అది అంతర్జాలంలోంచి ఉచితంగా దింపుకోవచ్చు. ఈ పద్య శతకంలో ఆవిడ బ్రహ్మ విద్య లో నిష్ణాతులయ్యారని ఆవిడ చెప్పిన పద్యాలలో చూచాయగా చూడవచ్చు. “చూచాయగా” అని అనడం ఎందుకంటే ‘నేను బ్రహ్మాన్ని చూసాను,’ అని చెప్పినవారెవరూ చూడలేదని అర్ధం అంటారు రామకృష్ణులు. అదీగాక ఆత్మదర్శనం అయినవారు ఎవరికీ చెప్పి డబ్బా చాటుకోనవసరం లేదు. పుష్పం వికసించినపుడు తుమ్మెదలు వాటికవే వస్తాయి అంటారు శ్రీరామకృష్ణులు. శివానందులు కూడా ఇదే చెప్పారు అనేకసార్లు. ఈ పద్యంలో వెంగమాంబ ఏమంటున్నారో చూడండి, ఇవి మనలని ఉద్దేశించి చెప్పిన పద్యాలే అని తెలుస్తుంది.
చ.
మది నిను బాయనేరకను మాయను దానికి జిక్కియుంటి, నీ
పదములనేడు గంటి హరి పట్టుగనాకిటు బ్రహ్మవిద్యలో
గొదవలు సేయకియ్య తరిగొండ నృసింహ దయాపయోనిధీ (86)
సాధారణంగా మనకి తెల్సిన విషయం ఏమిటంటే, వివేకం కలిగిన ఒక మానవ జన్మ ఎత్తాక భగవంతుడి గురించి తెలియవచ్చు తెలియకపోవచ్చు. కొన్ని కష్టాలు అనుభవించాక, ఇంతే మన జీవితం, ఇందులో మనకున్న సంతోషం ఏమీ లేదు. అసలు నిజమైన ఎప్పటికీ తరగని సంతోషం కలగాలంటే మరో మార్గం ఏదో ఉంది అనిపించడం మొదలవగానే భగవంతుడి మీదకి మనసు మరల్తుంది. ఆ తర్వాత కొంచెం భక్తీ, ధ్యానం మొదలుపెట్టాక, జీవితం కడతేరిపోతే మరో జన్మ ఎత్తడం మళ్ళీ సాధన చేయడం అలా మరో కొన్ని జన్మలెత్తాక అసలు సిసలు భక్తి మొదలై భగవంతుడు కొంచెం కొంచెంగా తెలియడం మొదలౌతుంది. ఆ తర్వాత మరి పైకి, అలా పైపైకి వెళ్ళాక మరో కొన్ని (వందల, వేల, లక్షల లేదా కోట్ల) జన్మలకి అసలు భగవత్స్వరూపం అర్ధమై బ్రహ్మ జ్ఞానం కలగవచ్చు. అయితే ఈ జన్మ మృత్యు పరంపర అనే నిచ్చెన మెట్లలో మనం ప్రస్తుతం ఎన్నో మెట్టుమీద ఉన్నాం? అది మనకి తెలియదు. ఏ జన్మలో అసలు భక్తి మొదలైంది? ఉదాహరణకి ఈ జన్మలో మొదలైంది అనుకుంటే వచ్చే జన్మలో ఉంటుందా ఆ భక్తి? కిందటి జన్మా, పై జన్మా అవన్నీ ఎందుకు గానీ ఈ జన్మలో భక్తి ఏదో విధంగా కుదిరింది కదా అందువల్ల వెంగమాంబ అంటున్నారు చూడండి.
ఇంతకు ముందు ఎన్ని జన్మలెత్తానో (ఇదివరదాక దేహముల నెన్ని ధరించితి), ఎన్ని పోయాయో నువ్వు మనసు (మది) లోకి రాకుండానే (నెన్ని పోయెనో మది నిను బాయనేరకను) తెలియదు. మాయ అనేదానికి చిక్కి ఉన్నాను ఇన్ని జన్మలలోనూ (మాయను దానికి జిక్కియుంటి). అందువల్ల భక్తీ లేదు, నువ్వంటే తెలియనూ లేదు. అయితే అదృష్టం కొద్దీ ఈ జన్మలో చూసాను/తెల్సింది కదా హరి పాదాల గురించి? (నీ పదములనేడు గంటి హరి). అయినా సరే వచ్చే జన్మలో ఏమౌతుందో తెలియదు. అందువల్ల – అంటే ఈ జన్మలో కనీసం నీ మీద భక్తి కుదిరింది కనక, ఏ కొదువా చేయకుండా ఇప్పుడే బ్రహ్మవిద్య ఇచ్చేయి భగవంతుడా (బ్రహ్మవిద్యలో గొదవలు సేయకియ్య) అని అడుగుతున్నారు. అడగడం వరకూ బాగానే ఉంది కానీ భగవంతుడు ఎందుకివ్వాలిట బ్రహ్మ విద్య తేరగా, అదీ కొంచెం భక్తి తో అడగ్గానే? ఎందుకంటే ఆయన దయాపయోనిధి కనక; అదే మకుటం చెప్తోంది పద్యంలో – తరిగొండలో ఉన్న నృసింహ దేవా, నువ్వు సముద్రం అంత దయ ఉన్నవాడివి కనక (తరిగొండ నృసింహ దయాపయోనిధీ) ఆ ఇచ్చే బ్రహ్మ విద్య తర్వాత ఎప్పుడో కాదు కానీ ఇప్పుడే ఇచ్చేయి అని అడుగుతున్నారు.
ఇదే విషయం శ్రీ రామకృష్ణులు అంటారు. “అమ్మని నిలబెట్టి, డభాయించి అడుగు – నువ్వు నా తల్లివి. ఎందుకు బ్రహ్మవిద్య ఇవ్వవు? ఇస్తావా లేదా? ఇచ్చే వరకూ ఆవిడని వదలకుండా ఏడిపించి మరీ అడుగు. తల్లి కనకా, ఇవ్వక తప్పదు కనకా, మన ఏడుపు వినలేదు కనకా ఇచ్చి తీరుతుంది.” అయితే బ్రహ్మ విద్యకోసం అడిగేది ఎలా ఉండాలనేదానికి ఉదాహరణ చెప్తున్నారు చూడండి. నీళ్ళలో మునిగిపోతే ఊపిరి కోసం ఎంత తాపత్రయ పడతామో అంత తాపత్రయం పడాలి అడిగేటపుడూ, ఆ బ్రహ్మ విద్య కావాలని సాధన చేసేటపుడూను. ఇదే బుద్ధుడి విషయంలో, శ్రీరామకృష్ణుల విషయంలో చూదవచ్చు. “ఈ శరీరం మాంసం ఎముకలతో సహా ఊడి పడిపోయి నాశనం అయిపోయినా సరే ఈ సారి అనేక కల్పాలు గడిచినా కనిపించని బోధి అనేది దర్శనం కాకుండా ఇక్కడనుంచి లేచేది లేదు” అనుకున్నాట్ట బుద్ధుడు సుజాత ఇచ్చిన పాయసం తిని కాస్త ఓపిక రాగానే. అలా బుద్ధుడికి జ్ఞానోదయం అయింది. ఈ పద్యంలో చెప్పినట్టూ, బుద్ధుడు కూడా అనేక జన్మలు ఎత్తాక సిద్ధార్ధ గౌతముడిగా పుట్టాడని జాతక కధలలో మనం చదువుతాం. దీనినే “అనేక మంది దర్శించేది ఒకటే; దారులు వేరుకావొచ్చు, చూసిన దానిని వేరుగా వర్ణించవచ్చు,” అంటారు – ఏకం సత్ విప్రా బహుధావదంతి. సత్యం, పరబ్రహ్మం, ఎప్పుడూ మారకుండా ఉండేది ఒకటే. బ్రహ్మ జ్ఞానులు అనేక విధాలుగా దాన్ని చెప్పినా.
దాశరధీ శతకం లో భద్రాచల రాముణ్ణి మన కంచెర్ల గోపన్న దాశరధీ కరుణాపయోనిధీ అనడం ఇంతకు ముందు పద్యాలలో చూసినట్టే వెంగమాంబ శతకంలో కూడా మకుటం అదే విధంగా ఉంటుంది - తరిగొండ నృసింహ దయాపయోనిధీ – అంటూ.