ఈ నెల పద్యం గజేంద్ర మోక్షంలో పోతనది. గజేంద్ర మోక్షం అంటే, “ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపలనుండు లీనమై…” అనేదీ తెలియని తెలుగువాడు ఉండడు సాథారణంగా; ఇది చిన్నప్పుడే పాఠ్యపుస్తకాలలో చదువుకుంటాం కనక. ఈ కథలో కరి మకరిలు రెండూ చాలాకాలం పోరాడుకున్నాక చివరికి ఏనుగుకి పూర్తిగా నీరసం వచ్చేసి ‘పరమేశ్వరా నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను రక్షించలేరు, కావవే రక్షింపు భద్రాత్మకా’ అని వేడుకున్నప్పుడు వెంఠనే బయల్దేరి వచ్చి తన చక్రంతో మొసలిని చంపుతాడు. ఆ తర్వాత ఈ విజయం వల్ల పాంచజన్యం అనే శంఖం తీసి ఊదుతాడు. ఈ శంఖం ఊదడం విజయాన్ని తెలియజేయడానికి. పాంచజన్యం ఎలా ఊదాడనేది ఈ శార్దూల వృత్తమైన పద్యంలో చెప్తున్నాడు పోతన.
శా.
ము, న్భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్
సారోదార సిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్
దూరీభూత విపన్నదైన్యమునునిర్థూతద్విషత్సైన్యమున్ (గజేంద్ర మోక్షం – 8.116)
శ్రీ హరి పూరించిన పాంచజన్యం ఎటువంటిది? కృపాంభోరాశి సౌజన్యము – దయాసముద్రమంత మంచితనం కలది. ఒక్కోచోట ఈ పద్యంలో “సుధాంభోరాశి సౌజన్యము” అనడం కూడా చూడవచ్చు - పాలకడలిలో పుట్టినది. భూరిధ్వాన – భూరి అంటే అతి పెద్దదైన (లక్ష అంటే 1 తర్వాత 5 సున్నాలు అనుకుంటే, భూరి అంటే 1 తర్వాత 35 సున్నాలు) ధ్వని చేసేది. మహాభూత – పంచ మహాభూతాలని, చలాచలీకృత – చలింపచేయగల, ప్రచైతన్యమున్ – చేయగలిగేది. సార+ఉదార+సిత – గొప్ప సామర్ధ్యంతో తెల్లని, ప్రభాచకిత – కాంతులతో చకితులని చేసేది. ఎవరిని అలా చేసేది? పర్జన్యాది – మేఘాలకి రాజు, ఇంద్రుడులాంటి రాజులని. దూరీభూత విపన్న దైన్యమున్ – దీనుల దైన్యాన్ని దూరం చేసేది, నిర్ధూత ద్విషత్సైన్యమున్ – శత్రువులని పారదోలేది. ఈ పూరించడం ఎందుకని చూస్తే మనకి తెలిసేదేమిటంటే, విజయం వరించాక బాగా నీరసపడిపోయిన తన భక్తుణ్ణి ఉత్సాహపరచడానికి అని అర్థం చేసుకోవచ్చు.
పోతన మరోచోట వామనవతారంలో దానం పూర్తయ్యాక విష్ణువు త్రివిక్రముడిగా విజృంభించడం వర్ణిస్తూ, ఈ శంఖం ఎటువంటిదో చెప్పడానికి “జలధరనినద శంఖ” అంటాడు. జలానికి ఆథారమైనది మేఘం. ఆ మేఘం చేసే నినాదం ఉరుము కనక శంఖం చేసే శబ్దం ఉరుము చేసే శబ్దంలా ఉంటుందని భావం. పంచజనుడనే రాక్షసుడు ఈ శంఖంలో ఉంటూ ప్రజలని ఏడిపిస్తుంటే వాణ్ణి చంపినప్పుడు ఈ శంఖాన్ని విశ్వకర్మ విష్ణువుకి ఇచ్చాడని కథ. ఈ శంఖంలో అనేక రకాలుగా ధ్వని వచ్చేటట్టు ఊదుతారనీ, ఆ ధ్వని బట్టి విన్నవాళ్లకి ఎందుకలా ఊదుతారో తెలుస్తుందనీ చెప్తారు. మహాభారతంలో కూడా కృష్ణుడు తన రథాన్ని తోలే దారుకుడితో అంటాడు – సైంధవుణ్ణి చంపడానికి ఒక రోజు ముందు – “రేపు మన రథాన్ని గుర్రాలతో సిథ్థంచేసి, నేను పాంచజన్యం ఊదగానే రంగంలోకి రావాలి. యోధులందరూ మన ప్రతాపం చూడబోతున్నారు.” ఏ రకంగా ఈ శంఖం ఊదితే ఏం చేయాలో వీళ్ళకి తెలుస్తుందన్నమాట. మరో విషయం ఏమిటంటే వేదాలు ఈ శంఖంలో దాగి ఉంటాయనీ వాటిని విష్ణువు సర్వవేళలా కాపాడుతూ, కావాల్సినప్పుడు బ్రహ్మదేవుడికి ఇస్తాడనీ మనకి తెలుస్తుంది భాగవతంలో.
ధ్రువుడు చిన్ననాడే పినతల్లి చేత వెక్కిరింపబడి, పట్టుదలతో వెళ్ళి విష్ణువుకోసం తపస్సు చేస్తాడు. చివరకి ఈ తపస్సుకు మెచ్చి విష్ణువు కనిపిస్తే నోటమ్మట మాటరాదు. మనసులో మాత్రం “నేను ఏమీ చదువుకోలేదు, నేర్చుకోలేదు. నిన్ని స్తుతించడానికి నా నోటికి ఏమీ పదాలు కానీ శ్లోకాలు కానీ రావు. నిన్ను కీర్తించాలని ఉంది” అనుకుంటాడు. ఇది తెలిసిన విష్ణువు అప్పుడు తనచేతిలో శంఖాన్ని థ్రువుడి దవడకి ఆనిస్తే సామవేదంతో ధ్రువుడు విష్ణువుని కీర్తిస్తాడు. అసలు తపస్సు ఎందుకు మొదలుపెట్టాడో మర్చిపోయి, ఏం కావాలో కోరుకో అన్నప్పుడు, “అన్ని మాయావిశేషాలకీ కారణమైన నీ మోము అలా చూస్తూ ఉండడం తప్ప మరే కోరికా లేదు” అంటాడు. గమనించారా, కోరికలన్నీ పోయినప్పుడే భగవద్దర్శనం అయ్యేది. అప్పుడు ఇంకా ఏముంది కోరుకోవడానికి? అదీగాక తన మనసులో కలిగే ప్రతీ ఆలోచనా తెలిసిన భగవంతుణ్ణి ఏమిటి కోరుకునేది? ఇవన్నీ చిన్నతనంలోనే తెలుసుకున్నాడు కనక అత్యున్నతమైన ధ్రువపదానికి చేరగలిగాడు.
గజేంద్ర మోక్షంలో ఒక చోట “ఇలా కరి, మకరిలు వేల ఏళ్ళు పోరాడుకున్నాక …” అనే వచనం వస్తుంది. మహా అయితే కరీ మకరీ ఓ మూడు నాలుగు వందల సంవత్సరాలు బతకవచ్చేమో – కలియుగంలో కాకపోయినా ఏ త్రేతా, ద్వాపరయుగాల్లో. మరి వేల ఏళ్ళు ఎలాగయ్యా అంటే, ఈ కరి మనమే. మకరి ఈ సంసారం. ఈ సంసారంలో పడి “నేను” ఏదైనా చేయగలను అనుకుంటూ అందులోంచి బయటకి రావడానికి ప్రయత్నం చేస్తూ విఫలం అవుతూ అలాగే కొట్టుకుంటున్నాం. చాలా వేల ఏళ్ళూ, జీవితాలూ గడిచాక “అబ్బే ఇది కాదు పధ్ధతి, వేరే ఏదో ఉంది. ‘నేను’ కాదు వేరే ఎవరో సహాయం చేస్తే తప్ప ఈ సంసారమనే మకరి నన్ను వదలదు. దీన్ని తప్పించుకోవడానికి ఆ వేరే వాణ్ణి శరణువేడాలి తప్ప మరో మార్గంలేదు” అనే ఆలోచన రావడం మొదలౌతుంది. ఎవరు ఆ వేరేవారు? అప్పుడొచ్చే ఆలోచనే “ఎవ్వనిచే జనించు…. మూలకారణంబెవ్వడనాది మథ్యలయుడెవ్వడు..” అనేది. ఎప్పుడైతే “నేను” కాదు అనే ఆలోచన రావడం మొదలైందో అది మన అహంకారం అంతమవడానికి నాంది. అది అంతమవగానే భగవద్దర్శనం కలుగుతుంది. అప్పుడు మనకి వినిపించే విజయ శంఖారవమే కృపాంభోరాశి సౌజన్యము, సారోదార సిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యము, అన్నీను. మన విజయం ఏమిటంటే భగవంతుణ్ణి దర్శించడం.
పద్యంలో పోతన వాడిన వృత్తం శార్దూలం. శంఖారావం ఉరుము గర్జించినట్టూ, వీరరసంతో ఉండటానికి పోతన సరైన వృత్తమే ఎంచుకున్నాడని తెలుస్తోంది కదా? అసలు ఇటువంటి పద్యాలు “పలికించెడువాడు రామభధ్రుడుట” అనే భగవత్కృప లేకపోతే రాయగలగడం అసంభవం.
Ayya mahaubhaava, tamaku tamare saati. Enjoyed reading this. Please keep writing such articles.