Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

నేటి సమాజ పరిస్థితులు అంత బాగాలేవు అని అనుకుంటూ అప్పుడప్పుడు కొంచెం నిరాశకు లోనౌతుంటాం. మంచి, చెడ్డ అనేవి మనిషి నిర్దేశించుకొనిన రెండు సాపేక్ష పదాలు మాత్రమే. వాటి స్థాన విలువ, ప్రదేశాన్ని బట్టి, సామాజిక, భౌగోళిక స్థితిగతులను అనుసరించి ఉంటుంది.

హింసా ప్రవృత్తి ఖచ్చితంగా గర్హనీయం. అయితే అందుకు గల కారణాలను విశ్లేషిస్తే వ్యవస్థలోని లోపాలే అని ఒక విధంగా చెప్పవచ్చు. మనిషిలో ఆ విధమైన ఆలోచనలు కలగడానికి కారణం వారికి సమాజం మీద, వ్యక్తుల మీద కలుగుతున్న ఏహ్యభావం. ప్రతి మనిషి పుట్టుకతోనే చెడ్డవాడు, మంచివాడు అని నిర్ణయించడం జరగదు. పెరిగే వాతావరణం ఆ చిన్ని మనసుకు సభ్యసమాజం చేస్తున్న గాయాలు, చుట్టుపక్కల జరుగుతున్న సన్నివేశాలు ప్రేరేపిస్తాయి. తదనుగుణంగా వారి ఆలోచనలలో అటువంటి కార్యాలకు ప్రేరణ లభిస్తుంది. ఏవో చట్టాలు చేసి చేతులు దులుపుకున్నంత మాత్రాన పరిస్థితి సమసిపోదు. అందుకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవ జీవి తమవంతు బాధ్యతను గుర్తెరిగి తదనుగుణంగా కార్యాచరణ ఉండాలి. అప్పుడే నవ సమాజ నిర్మాణ రూపకల్పనలో మానవతా విలువలు పెరిగి స్వార్థ చింతన, క్రూర మనస్తత్వ ధోరిణి, అసూయ ద్వేషాలు తరిగి మనోల్లాస జీవన శైలికి మనిషి అలవాటు పడతారు.

ఈ ప్రక్రియను ఆచరించాలంటే మనందరిలో ముందుగా ఆశల ఆరాటానికి పరిమితి విధించాలి. ఎందుకంటే సమాజ పోకడలకు అనుగుణంగా మనమూ అందరి దృష్టిలో గొప్ప అనిపించుకోవాలనే తపనలో కొన్నిసార్లు మన పరిమితిని మించి గొప్పలు చూపించుకుంటూ లేనిపోని ఇబ్బందులకు గురౌతాము. కొత్త ఒక వింత పాత ఒక రోత అన్న చందాన మనకు ఏమి లేదో దానిని గురించి ఆలోచిస్తూ ముందు మనకు నచ్చి మెచ్చి సాధించిన మరో సౌలభ్యాన్ని మరిచిపోయి ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే వేరే వ్యాపకం లేదా కొత్త వస్తువు కోసం వెంపర్లాడటం జరుగుతుంది. కారణం మన జీవన వ్యవస్థలో అభివృద్ధి ని సాధించి ఆర్థికంగా స్థిరమైన స్థానం ఏర్పడినప్పుడు మన హోదా పెంచుకోవాలనే తపన మొదలవుతుంది. అందుకు తగిన వనరులు సులభంగా లభ్యమైనప్పుడు ఈ సరికొత్త జీవన విధానానికి అలవాటుపడి మన ఆశల ప్రవాహం వేగవంతమౌతుంది. చేస్తున్న ప్రక్రియలో నిజంగా మానసిక సంతృప్తి కలిగి మనోల్లాసానికి హేతువైతే బాగుంటుంది. కానీ అందరూ చేస్తున్నారు కనుక మనమూ చేసి అందరిలో మన ఉనికిని ఎల్లప్పుడూ చూపించుకోవాలనే తపన వుంటే అది అన్ని విషయాలలో సాధ్యంకాదు కారణం అటువంటి ఆలోచనే మిగిలిన వారికి కూడా ఉండవచ్చు. అప్పుడు ఒక విధమైన పోటీ విధానం మొదలై చివరకు ఎటువంటి సంతృప్తిని కలిగించదు. మనకు అనుకున్న సుఖానుభూతి కలగదు.

ఏ కుటుంబంలోనైనా బాంధవ్యాలు స్థిరంగా, పారదర్శకంగా ఉంటె ఆ కుటుంబ సభ్యుల మధ్యన ఆనందం సదా వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అర్థం చేసుకునే అవగాహన జనించి, అహంకారానికి తావియ్యకుండా, అవసరమైన చోట పరిస్థితులకనుగుణంగా సర్దుకుపోయే మనస్తత్వం కలిగిఉంటే, అపుడు అంతా సవ్యంగానే ఉంటుంది. ఆ ధర్మాలే వారి పిల్లలకు కూడా అలవడి ఆ కుటుంబం హాయిగా సాగిపోతుంది.  Do your best, leave the rest అన్న రీతిలో మన విధివిధానాలు ఉన్నప్పుడు సారాంశం ఏవిధంగా ఉన్ననూ ఇబ్బంది లేదు.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in July 2022, ఆరోగ్యం

2 Comments

  1. V s murthy

    బాహ్య ప్రపంచం తాను అనుకున్నట్లు లేక పోవడమే అన్ని సమస్యలకూ మూలం. కానీ మన ఆలోచనల మేరకు ఏది వుండదు. అది అర్ధం చేసుకోవాలి . జీవితమనే ప్రవాహాన్ని ఏ విధంగానూ ఎదిరించ ప్రయత్నం వృధా అని ఎరగాలి. దైవత్వం మన సహజ లక్షణం. దాన్ని కప్పి వుంచే నమ్మకాలు , భయాలు , పాత అనుభవాలు కొద్ది కొద్ది గా పార దోలితే ఆ స్థితి లో ఇతరుల లోని దైవాన్ని చూడగలుగుతారు. అప్పుడు ద్వేషం వుండదు. హింస వుండదు. మనము శరీరాలు , మనసులు వేరు కానీ విశ్వం లో అన్ని జీవాలతో connected. ఆ భావన దిశగా అందరూ పయనించడం తప్ప వేరే అన్ని ప్రయత్నాలు కేవలం అతుకుల బొంత కు కుట్లు వేయడమే

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!