Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 118 వ సమావేశం
-- వరూధిని --
vikshanam-118

జూన్ 5, 2022 న వీక్షణం-118వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశంలో ముందుగా "మా మామయ్య- మిథునం శ్రీరమణ" అంటూ శ్రీరమణ గారి మేనల్లుడైన శ్రీ కొప్పర్తి రాంబాబు గారు ప్రసంగించారు.

రాంబాబు గారి పూర్తి పేరు కొప్పర్తి రాంబాబు. పుట్టింది గుంటూరు జిల్లా తెనాలి తాలూకా దుగ్గిరాల గ్రామంలో. పెరిగింది చదువుకున్నది ఆంధ్రా ప్యారిస్ తెనాలి. విద్యాభ్యాసం తెనాలి, కొల్లూరు గ్రామాల్లో. తెనాలిలో చలం, కొడవటి గంటి వంటి ప్రముఖ రచయితలు తిరుగాడిన వీథుల్లో తిరుగుతూ పెరిగారు. సాహిత్య సాంస్కృతిక కేంద్రమైన తెనాలిలోని వారి ఇంట్లో వారి నాన్నగారి ప్రోత్సాహం వల్ల, ఆయనకు గల సాహిత్య నేపథ్యం వల్ల రాంబాబు గారికి సాహిత్యం పట్ల ఆసక్తి మరింత పెరిగింది. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. నాలుగు దశాబ్దాల పాటు ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ పుస్తక పఠనం వదిలిపెట్టలేదు. "కొప్పర్తి కథావాహిని" వీరి ఆడియో కథల ఛానెల్. యూ ట్యూబ్ లో వీరి ప్రసంగాలు వినవచ్చు.

తన ఉపన్యాసంలో భాగంగా రాంబాబు గారు శ్రీరమణ గారి విశేషాలు, ఆయనతో తనకు గల అనుబంధాన్ని హాస్యస్ఫోరకంగా సభకు వివరించారు. శ్రీరమణ గారి అసలుపేరు వంకమామిడి రాధాకృష్ణ. వారి తాతగారు పెట్టినపేరు రామరాజు. రాంబాబు గారు బాబు మావయ్య అని పిలుస్తారు. శ్రీరమణ గారు మొదట్లో పేరడీలు రాసేవారు. ఆయన రాసిన "రైలుబండిలో వైతాళికులు" అద్భుతమైన పేరడీ. ఆయన రాసిన ఫీచర్లలో అక్షరతూణీరం, రంగులరాట్నం, న్యూనుడి మొ.నవి ముఖ్యమైనవి. న్యూనుడి లో ఆయన రాసిన "మోహన ప్రసాద్ వేగుంట- తెలుగువారికి వినిపించని జేగంట", "సీరియల్ చూసే అమ్మ శ్రీవారి ఆకలెరుగదు" వంటివెన్నో పేర్కొనదగినవి.

శ్రీరమణ గారు చిన్నతనంలోనే  రామాయణం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఎంతో ప్రభావితులయ్యేరు. బాపు రమణలతో ఆయనకున్న అనుబంధానికి రామాయణం కారణమయ్యింది అన్నారు. వారి సినిమాలకు దాదాపు 35 సంవత్సరాల పాటు పెళ్లిపుస్తకం నించి శ్రీరామరాజ్యం వరకు సంభాషణలు రాయడమే కాకుండా అనేక సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పనిచేసారు.

ఆయన రాసిన ఏకైక నవల "ప్రేమపల్లకి". అందులో ప్రధానపాత్ర రాంపండుకి, మిథునం కథలోని మేనల్లుడి పాత్రకి రాంబాబుగారే ప్రేరణ. ఆయన రాసిన కథల్లో మిథునం, బంగారుమురుగుతో బాటూ, నాలుగో ఎకరం, ధనలక్ష్మి, సోడానాయుడు, తేనెలో చీమ, అరటిపువ్వు సాములోరు లాంటి ప్రముఖమైన కథలతోబాటు అంతగా పాపులర్ కాని "చివ్వరి చరణం" కూడా తనకి ఇష్టమైన కథలుగా పేర్కొన్నారు రాంబాబు గారు. తనని తాను పత్రికా రచయితగా మాత్రమే ఐడెంటిఫై చేసుకునే శ్రీరమణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. "ఉపమా రాచకొండస్య" లాంటి ఎన్నో అద్భుతమైన నిర్వచనాలు. వారి మేనల్లుడు కావడం తన అదృష్టమని పేర్కొంటూ ముగించేరు. దాదాపు గంట పాటు సాగిన రాంబాబు గారి ఉపన్యాసం ఛలోక్తులతో సభలోని వారందరినీ విశేషంగా అలరించింది.

ఆ తర్వాత జరిగిన చర్చా కార్యక్రమంలో డా కే.వీ. రమణారావు, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ శేషారెడ్డి, శ్రీ శ్రీధర్ రెడ్డి , డా||కె.గీత, శ్రీ దాలిరాజు వైశ్యరాజు, శ్రీ తిరుమలాచార్యులు మొ.న వారు పాల్గొన్నారు.

ఆ తర్వాత జరిగిన కవిసమ్మేళనంలో శ్రీ శ్రీధర్ రెడ్డి "ఎందుకోయ్" కవితని వినిపించగా, డా||కె.గీత దుఃఖపు మిన్నాగు" కవితని వినిపించగా, శ్రీ దాలిరాజు వైశ్యరాజు "నీటి నైతికశాస్త్రం" అనే చిన్నకథని వినిపించారు. శ్రీ తిరుమలాచార్యులు గారు ప్రత్యేకించి సుభాషితాలు దాగివున్న పూర్తి శ్లోకాలను విశదీకరించారు.

చివరిగా గీత గారు తాను మాతృదినోత్సవ సందర్భంగా రాసి, శృతి చేసిన "అమృతవాహిని అమ్మేకదా" అనే లలిత గీతాన్ని పాడి వినిపించి సభని అలరించారు. స్థానిక సాహిత్యాభిలాషులు అత్యంత ఆసక్తిగా పాల్గొన్న ఈ సభ జయప్రదంగా ముగిసింది. విజయవంతంగా జరిగిన వీక్షణం-118వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడచూడవచ్చు.

Posted in July 2022, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!