Menu Close
ఘాలి లలిత ప్రవల్లిక
మర్మదేశం (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

మొహం మీద నీళ్ళు పడేసరికి తొలి పడి లేచాడు చరణ్.

శర్వాణి గ్లాస్ పుచ్చుకొని నుంచొని ఉంది. చరణ్ కి ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది.

"నిద్రపోతున్న వాళ్లని లేపకూడదు అని నీకు తెలియదా? అయినా ఇదేం పద్ధతి? నీళ్లు మొహం మీద పోసి ఎవరైనా లేపుతారా?" కోపంగా అరుస్తున్న చరణ్ మాటలకు బ్రేక్ వేస్తూ ...

"నేనే లేపమన్నాను. అయినా ఏమిటా మొద్దు నిద్ర. బారెడు పొద్దెక్కినా ఇంకా నిద్ర లేవలేదు. ఇదేనా నువ్వు పట్టణంలో నేర్చుకున్నది? ఇంతసేపు పడుకుంటే ఊరి పీడ అంతా చుట్టుకుంటుంది. లే లే" అంటూ బామ్మ అరుస్తూ ఉంది.

"అబ్బా మంచి కల బామ్మా .....పాడు చేసారు." బాధగా అన్నాడు చరణ్.

"కలలకేం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు .... ఎలా కావాలంటే అలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం మనసులో దేనిని గురించి ఆలోచిస్తూ ఉంటామో అదే కలల రూపంలో వస్తుంది. ముందు గబగబా తయారవు మనమందరం భోగేశ్వరం వెళుతున్నాము." చెప్పింది బామ్మ.

చరణ్ లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. అందరూ తయారయ్యారు. దొడ్లో ఉన్న గిత్తలు విప్పారు పెదనాన్న. అవి మన దొడ్లో పుట్టినవేటా. చాలా ముచ్చటగా ఉన్నాయి. రాముడు అని పిలవగానే తెల్ల గిత్త పరిగెత్తుకు వచ్చి బండికాడి మెడ మీదకు వేసుకుంది. భీముడు అని పిలవగానే కర్రిగిత్త కాడి ఎత్తి మెడ మీద వేసుకుంది. పెదనాన్న వాటి మెడలో గంటలు కట్టి వాటిని దువ్వి కాడికి కట్టేసి చిడతలు తగిలించారు. ఊర్లో నుంచి కూడా రెండు బండ్లు వచ్చి ఆగాయి. తాతయ్యకి తగ్గితే అక్కడికి వస్తామని మొక్కుకున్నారుట. పిల్లలందరూ రావటంతో ప్రయాణం కట్టారు. అందరూఎడ్ల బండ్లల్లో ప్రయాణమయ్యారు. పిల్లలందరూ ఒక బండి లోకి ఎక్కారు.

భోగేశ్వరం లో శివుడు వెలిశాడని, ఆ ఊర్లో ఉన్న ఒక భక్తుని కలలో కనిపించి నేను ఫలానా దగ్గర ఉన్నానని, రోకలి శబ్దము, చేట చెరుగుడు, తిరగలి శబ్దము వినిపించని చోటులో నాకు గుడి కట్టండని చెప్పాడంట.

ఆ వ్యక్తి నిద్రలేచి కలలో శివుడు చెప్పిన ప్లేస్ కి వెళ్లి చూస్తే నిజంగానే అక్కడ శివలింగం కనిపించిందట. వెంటనే ఈ విషయం గ్రామస్తులు అందరికీ తెలియజేశాడు. గ్రామస్తులందరూ మేళతాళాలతో శివుడుని పుచ్చుకుని బయలుదేరారు. ఆ శివలింగం ఊరి చివర ఉన్న పొలాల్లో కొచ్చేసరికి బరువెక్కి పోయిందంట. శివుడు ఈ ప్లేస్ లోనే కోరుకుంటున్నాడని తలచి వారు ఊరి చివరన పొలాలలో గుడి కట్టించారు. అక్కడున్న మరో వింత ఏంటంటే అక్కడ ఉన్న చెరువులో హర హర అంటూమునిగితే బుడబుడ అంటూ ఐదు బుడగలు పైకి వస్తాయి అంట. చెప్పింది శర్వాణి.

ఆశ్చర్యంగా విన్నారు చరణ్ కౌశిక్. చరణ్ కూడా తన కల గురించి స్నేహితులకు చెప్పాడు. ఎన్నో దివ్యలోకాలు చూసాను అంటూ అంతా వివరించాడు.

అంతా విన్న పిల్లలు, ఓ మంచి ఇంగ్లీష్ సినిమా స్టోరీ లాగా త్రిల్లింగ్ గా ఉంది అన్నారు.

"నీ కల మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. మనం సమాజంలో పెరిగిపోతున్న అవినీతిని అరికట్టే దిశగా పయనించాలి. మంచి మానవత్వం స్నేహశీలత పెంపొందించాలి. శంబాల లో ప్రజలు ఎలా ఉంటున్నారు అలా మన జనరేషన్ తయారవ్వాలి. అంటే మన స్నేహితులను మనమే తీర్చిదిద్దాలి. ఒక్కొక్కళ్ళు ఒక ముగ్గురుని బాగా చేసుకుంటూ వెళితే.... వాళ్లు ముగ్గుర్ని.... వాళ్ళు ముగ్గురిని అలా అలా మంచి వాళ్లను పెంపొందిస్తే ..... మంచి శాతం పెరిగిపోతుంది. తప్పుడు ఏ కల్కి దిగి రానక్కరలేదు." అన్నాడు కౌషిక్.

"అవును కౌషిక్ చెప్పింది నిజం. పిల్లలు పెద్దల మాట వినకపోయినా స్నేహితుల మాట చక్కగా వింటారు." చెప్పింది శర్వాణి.

"అవును చరణ్ మనము ఈరోజు నుంచి మన తోటి వారిని మంచి వారిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేద్దాం. రేపటి తరానికి కొత్త వెలుగులు చూపిద్దాం. చెడును తరిమేద్దాం సమాజంలో భూతం లా పెరిగిపోయిన చెడుని తరిమేద్దాం." అన్నాడు దినేష్.

చరణ్ కూడా అదే మంచి ఆలోచన అని అనిపించింది. అందుకనే కొత్త ఆలోచనలతో నవ లోకానికి స్వాగతం పలికాడు చరణ్.

***సమాప్తం***

Posted in July 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!