తెలుగు దోహాలు
- పెట్టే చేతిని విడిస్తే, పిడికెడు భిక్ష దొరకదు,
కన్నవారిని వదిలేస్తే, దైవమైన క్షమించదు. - మనసు నిజమని నమ్మినపుడు, ఆచరింపను వెరువకు
నీది కానిది ఏదైనా, దక్కలేదని వగచకు - తలచిన పని జరగవలెనా, క్షమతను కలిగియుండుము
గమ్యము చేరే వరకూ, పయనము ఎచటా ఆపకుము - శ్రమ జీవుల చెమటయే, సొమ్మౌ ధనికుల యింట!
ఇతరుల స్వ విషయాలలో, జోక్యము అనవసరమట! - అవకాశము తలుపుతడితే, మొండి చెయ్యి చూపకుము
ధారుడ్యము లేని పునాదిపై, నిలువబోదు హర్మ్యము - కడలి నీరెంత త్రాగినా, తీర్చలేదు దాహాన్ని!
ఆకాశమును జయించినా, మరువరాదు ఇహాన్ని! - మగువను అణచ చూచెదవా, తిరగబడును కాళికగా
అన్యాయాన్ని సహించుటే, అన్యాయమౌ నిజముగా! - రాజకీయ బాసలన్నీ, గాలిలోని భవనములు!
నోటుకు ఓటు వేసేవా, మూర్ఖులపాలు పదవులు! - మాటలు దొరకని తరుణములో, మౌనము సంభాషించు
దండన పని చేయకుంటే, ప్రేమ లాఠి ఝుళిపించు! - మనసు సంతులత తప్పితే, బ్రతుకు గతి దారి తప్పు,
కుటిల యోచన కలిగినచో, సత్యాచరణకు ముప్పు!