అనగనగా -- పద్మావతి రాంభక్త
అనగనగా
ఒక అమ్మాయి
వంటకాలను పొదుగుతూ
నేలను తడిబట్టతో
అరగదీస్తూ
ఇంటిని నిత్యం పహరా కాస్తూ
వెలుగు వైపు కన్నెత్తి చూడకూడదని
చిన్నప్పుడే
ఆమెకు నేర్పారు
అనగనగా ఒక అమ్మాయి
బయటకు వచ్చింది
చుట్టూ చూస్తూ
కలాన్ని చేతబట్టి
పచ్చకాగితాలు లెక్కబెట్టింది
గర్వంగా చూపులను
సారించేలోగా
కళ్ళకెవరో గంతలు కట్టేసారు
అనగనగా
ఒక అమ్మాయి
చంద్రమండలంపై
జెండా అయింది
సాధించానన్న ఆనందంతో
పకపకా నవ్వబోయింది
ఎవరో
ఆమె నవ్వును కత్తిరించి
చేతులను చేతలను బంధించారు
అనగనగా
ఒకమ్మాయి
అక్షరాలను కన్నీటిలో ముంచి
పాత కొత్త కథలన్నీ
ధైర్యంగా లోకానికి
చెప్పడం మొదలుపెట్టింది
ఇప్పుడిప్పుడే
వెలుతురును ఐమూలగా
చూస్తోంది
గుండెల నిండా
కాస్త కాస్తగా గాలి పీల్చడానికి
ప్రయత్నిస్తోంది
తలెత్తి నడవడానికి
తన మనసుకు తర్ఫీదును
ఇచ్చుకుంటోంది
ఆకాశం అమాంతం
కిందకు వంగి
తనకు తాను
ఆమెకు బహూకరించుకుంది
కావ్య గీతి -- డా. రవూఫ్
లోయలు పలుకుతున్నాయి
కోయిలా పలుకుతోంది
ప్రసరిస్తోన్న గాలి అలల డోలలపై
జీవన పరిమళమేదో పాటై
యావత్ ప్రకృతిని అల్లుకుపోతోంటే .....
పూల గుంపులు తలలూపుతూ
తన్మయంలో తలమునకలౌతున్నాయి.
మేఘం మాటల చినుకై
కురుస్తోంటే .....
ఆకాశం కవిత్వాక్షరాల నక్షత్ర సముచ్ఛయమౌతోంది.
సముద్రం అలల పుటలు తెరిచి
చదువుతావా నా హోరుని అంటూ
ఉప్పొంగి నిన్ను ముంచెత్తుతుంది.
సృష్టి కృతి నొక్క మారు
తిప్పి చూడు .....
ప్రకృతిని మించిన కావ్యమే లేదు
కవిత్వమూ లేదు.
సాక్ష్యం -- పి.లక్ష్మణ్ రావ్
మౌనం స్పృశిస్తున్న
గత గాయాల శబ్దాలు
ఊపిరి లయలో
ఎగిసిపడుతుంటే
అసంకల్పిత చర్యగా
సడిచేయని దుఃఖం
అశ్రుపాతమై ప్రవహిస్తుంది!
శూన్యం తెరమీద
ఒక్కొక్కటిగా కనుమరుగైపోతున్న
వాస్తవ దృశ్యాలు
మలకువగానే అచేతనుడ్ని చేస్తున్నప్పుడు
కలల వాకిటపై దిగులు మబ్బు
మౌనంగానే రోదిస్తుంది!
గిర్రున తిరుగుతున్న
అనుభవాల గోళం
జీవిత పయనంలో
కుదుపుతో ఆగినప్పుడల్లా
ప్రతీ శబ్దం ఒక హెచ్చరికే అవుతుంది!
ఏదేమైనప్పటికీ
గమనం ఒక చరిత్రకు
సాక్ష్యం!