Menu Close
SirikonaKavithalu_pagetitle
రిస్క్.... రిస్క్... రిస్క్ -- ఆచార్య రాణి సదాశివ మూర్తి

రిస్క్.... రిస్క్... రిస్క్
రకరకాల రిస్క్
ఏ రిస్కు లేదనుకుంటే
అది చెప్పలేని రిస్కు
                               ।। రిస్క్।।

తల్లిదండ్రులను ఎదిరిస్తుంటే
పిల్లలకే రిస్కు
భార్యాభర్తలు కలహిస్తుంటే
ఇంటికంత రిస్కు
పెద్దలు పిల్లల మన్నించనిచో
పెద్దరికం రిస్కు
పొదుపూ అదుపూ లేకుంటే
భవితవ్యం రిస్కు
                             ।। రిస్క్।।

విద్యార్థులు మరి చదువకున్న
పొట్ట కూటి కే రిస్కు
అధ్యాపకులకు ఆర్జనదృష్టి
విద్యలకే రిస్కు
విద్యా ప్రణాళి అక్రమమైతే
అందరికీ రిస్కు
అర్హతలేక ఉద్యోగైతే
సమాజానికే రిస్కు
                            ।। రిస్కు।।

రైతు ను వదిలి పంటను కోరితే
రేపటి తిండికి రిస్కు
శ్రమను వదిలి పరిశ్రమనుకోరితే
ఆర్థిక వ్యవస్థ కే రిస్కు
వ్యక్తి ని వదిలి సమాజమంటే
వికాసమే రిస్కు
దేశభక్తిమనకొద్దనుకుంటే
దేశానికి రిస్కు
                          ।। రిస్కు।।

పనులను వదిలి ఫలితం కోరితే
ఆర్జనకే రిస్కు
స్వార్థబుద్ధితో వ్యవహరించితే
ఆత్మీయతకే రిస్కు
నా అనువారే లేకుంటే
పలకరింపు కే రిస్కు
మానవత్వపు విలువలు పోతే
మనుగడకే రిస్కు
                                ।। రిస్కు।।

నువ్వంటే నాకిష్టం -- పి. లక్ష్మణ్ రావ్

ప్రశాంత మనస్సుతో
నీ విశాల తీరంపై
నా కవితాక్షరాలు
రాస్తూ వుంటాను
నువ్వు ఒక్కోసారి
చిల్లర అలలతోనూ
మరోసారి కల్లోలిత కెరటాలతోనూ
చెరిపేస్తూ వుంటావు
అయినా
నేను రాస్తూనే వుంటాను.

విశ్రాంత చిత్తుడనై
నీ సామ్రాజ్యపు ఒడ్డుకు
చేరుకొని
నీ గాంభీర్యపు అందాలను
ఆస్వాదిస్తూ వుంటాను
ఒక్కోసారి ప్రేమ అలలతో
నా పాదాలను ముద్దాడుతుంటావు
మరోసారి రాకాసి కెరటాలతో
విరుచుకు పడతావు
అయినా
నిన్ను ఆస్వాదిస్తూనే వుంటాను.

కుళ్ళు, కుతంత్రాలు
నీలో వుంచుకోకుండా
ఒడ్డుకు విసిరేస్తుంటావు కదా!
బడబాగ్నులెన్ని దాచుకున్నా
నిర్మల మనస్సుతో
సాగుతుంటావు కదా !
లవణ విషాన్నెంత
భరిస్తున్నా
అసంఖ్యాక జీవరాశులకు
ఆశ్రయం కల్పిస్తుంటావు కదా!

అందుకే సంద్రమా
నువ్వంటే నాకిష్టం
కుళ్ళుతో నిండిపోయిన
మనుషులు కన్నా
నువ్వు గొప్పదానివి కదా !

ఆక్కూరాయమ్మ ... -- కైలాస్ నాథ్

నసుకుండగానే
బయలుదేరుతుందేమో
తెల్లగా తెల్లరే సరికి
టౌనులోని సందుల్లోకి వస్తుంది ...

కట్టుకున్న పాత ముతక చీరనే
ఉండగా చుట్టి నెత్తిన పెట్టుకొని
గంప పైన పెట్టుకొని
గబగబా అడుగులేస్తూ వస్తుంది
పాతూరంతా తిరగడానికి ...

కొయ్యిగూర, పలకలాకు
గంజిరాకు, సింతాకు
ఎర్రబద్ద్యాకు, బచ్చలాకు
గోలేకూర, గోగాకమ్మోవ్
అంటూ ఒక అలావాటైన స్వరంతో
అరుచుకొంటూ వస్తుంది..
ఎన్నేళ్ళ సాధనో
తీగసాగినట్లుగావుంటుంది గొంతు ...

వోమ్మోవ్ అని వినబడితే సాలు
ఎవరమ్మయ్యా పిలిసిందంటూ
వీధిలోని ఇండ్లన్నీ కలియజూస్తుంది
రామ్మోవ్ అంటే
బరువైన గంపను ఆశగాదింపుతుంది
ఏంగావాలమ్మయ్యా అంటూ ....

పెట్టిన నాలుగు పిడికిల్ల నూకలు
గంప లోని చీర పొరలో
ప్రాణంలా దాచుకొంటుంది
అమ్మా ఆక్కూర పలుచగా వుందంటే
యాడమ్మయ్యా వానొత్తాంటేగదా అంటూ
గుప్పెళ్ళతో పెడుతుంది
ఆక్కూర చేటలోకి; ...

కొసురు మూడుసార్లు తీసుకొంటే
సాల్లేమ్మయ్యా అంటూ
ఆక్కూర వెనక్కి లాక్కుంటుంది వొడుపుగా
ఆ పట్టు పట్టకోకపోతే
ఆపూటకు తిండి గింజలు రాలవుమరి...

ఆకూరలమ్మే ఆమెను చూస్తే
చిన్నప్పటి నుంచి ఎదలో ఒక తడి
ఇప్పడనిపిస్తూంది
ఆమె నిజంగా శాఖాంబరీదేవి అని...

అల లేని కొలను -- శేషగిరిరావు

అల లేని కొలనిలో
తెలి దామరల నవ్వు
దరహాసమో – లేక పరిహాసమో

కొదమగాలికి వెదురు
గుబురుతో గుసగుసలు
తొలిపలుకులో – కాక మలిపలుకులో

పోక కన్నెకు కొప్పు
ముడి విడిన వడి స్నేహ
సంరంభమో – శోక సంకేతమో

అల లేని కొలనిలో
తెలి దామరల నవ్వు
నిర్వేదమో – నిశ్చలానందమో

ఇసుక సంగీతం‬‬ -- అరుణ నారదభట్ల

మనిద్దరమూ ఇక్కడే కలుసుకున్నాం కదూ
అడుగులకు మెత్తని తివాచీ పరుస్తూ
లయబద్ధసంగీతం వినిపించింది నువ్వేకదూ
తరలితరలిపొంగే నీటిఅలలపై
అతనింకో వేకువ గీతం పరచి
సముద్రంపై బంగరు దుప్పటి కప్పినపుడు
నీ గుసగుస పదనిసలు
ఈ చీరచింగులను హత్తుకున్నది ఇక్కడే కదా...

ఒక్కోపాదం
ముందుకు
నేనెంత కటువుగావేసినా
మరో సమాంతర ఛాయలా
అలలవైపు ఆహ్వానించింది
నీ నవ్వులే కదా

మసకచీకటిని ఆవలికి విసిరేస్తూ
అతనిరాక
ఈరోజుదికాదు
ఐనా ఈ నురగల భాష ఇప్పటికీ అంతుపట్టదు
వాటికసలు మౌనమే తెలియదు
నిన్నెప్పుడూ
పరితపిస్తూ
అల్లుకుంటూనే ఉంటాయి
నీ సుతిమెత్తని యెదపై
పసిపాపలా పారాడుతునే ఉంటాయ్

నిన్ను ప్రియుడనుకోవాలా? దాసుడనుకోవాలా?
స్నేహితుడివనుకోవాలనుకుంటా...

నీ అనిర్వచనీయ హృదయస్పందనలో
నీపై ఎన్ని పాదాలుమోపినా అదే మెత్తదనం
ఇంత ఓర్పు ఓదార్పు
ఆ కడలి సహవాసివనా?
ఎన్ని అడుగులు వేసానో...
తీరంవెంట!

ఒక్కసారైనా అంతుచిక్కవెందుకో
తునాతునకలైన రాతివైనా
ఆ మెరుపెందుకనో?
వెన్నెలరాత్రులనూ
ఉదయపుకాంతులనూ
నువ్వే పోతపోసుకుంటావెందుకో!

నీతో కలిసి నడవడం
ఒక ఆత్రుత నాకు
ఒక్కోఅలా మనవైపు పరుగెత్తిరావడం
తడవొద్దనుకుని తప్పించుకోవడం
ఇంకా గురుతే నాకు!!

Posted in November 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!