Menu Close
PrakriyalaParimalaalu_pagetitle
ప్రక్రియ పేరు: ఇష్ట పదులు

కవితా ప్రక్రియ ఏదైనప్పటికీ కవులు పరిపుష్టంగా పదసంపదను కలిగి ఉండి కవిత్వాన్ని వెలయించగలిగినపుడే ఆ ప్రక్రియ కాలానికి నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇటీవలి కాలంలో పద్యకవులూ,వచన కవులూ కూడా అమితంగా ఆసక్తి చూపించి ఇష్టపడి రాస్తున్న ప్రక్రియ ఇష్టపది. ఇది కూడా మాత్రా ప్రాస నియమాలను కలిగియున్న లయాత్మక చందోబద్ద ప్రక్రియ.

ఎనిమిది పాదాలను కలిగి ఉండడం వలన ఇది బాహ్యరూపంలో గోదాదేవి పాశురాలను పోలినట్లుగా కనిపిస్తుంది. చివరపాదంలో కవినామ ముద్ర మరియు స్వామినామం సాధ్యమైన వరకు ఉండాలని కోరుతూ ఆదిప్రాస పొందుపరచబడిన ఈ ప్రక్రియ జయదేవుని ఇష్టపదులను పోలి ఉందా? అనిపిస్తుంది. పదాలు కొద్దిగా అటూ ఇటూ సర్దుబాటు చేస్తే చక్కని సీసపద్యంగా మారిపోయే సీసపద్య లక్షణాలను కలిగి ఉండడం ఇష్టపదుల మరో ప్రత్యేకత. అలా అని గణాలతో పని లేకుండా సరళంగా మాత్రల లెక్కతో రాయగలిగి వచన కవులకూ సులభసాధ్యమౌతుంది.

ఇష్టపదులు ప్రక్రియ రూపకర్త డా.అడిగొప్పుల సదయ్య. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసి. వీరు గణిత ఉపాధ్యాయులు కావడం విశేషం. ప్రక్రియ ప్రారంభింపబడిన అనతికాలంలోనే ఇష్టపది సంకలనాలను నెలల వ్యవధిలో రెండిటిని వెలువరించారు సదయ్య గారు. వాట్స ఆప్ గ్రూప్ ద్వారా ఔత్సాహిక కవులచే ఇష్టపదులు రచించుటకు సూచనలిస్తూ ప్రోత్సహిస్తున్నారు. వెయ్యి పైగా ఇష్టపదులు సృజించినవారికి రూ1116 బహుమతి ప్రకటించారు. ఇంకా ఇష్టపది 100, 200, 500,1000 రాసినవారికి ఇష్టపది శ్రేష్ఠ, ఇష్టపది స్రష్ట, ఇష్టపది వశిష్ట, విశిష్ట ఇష్టపది చక్రవర్తి బిరుదు పురస్కారాలను ప్రకటించి వారిని ఉత్సాహపరుస్తున్నారు. కొంతకాలం వారం వారం ఒక అంశం ఇస్తూ పోటీ నిర్వహించగా సరస్వతి, దేశభక్తి,  ప్రకృతి, ప్రభుత్వ బడులు వంటి అంశాలపై వారానికి పదుల సంఖ్యలో రాసిన కవులున్నారు.

గోదాదేవి పాశురాలు, అష్టపదులు భక్తి ముక్తిదాయకాలుగా నడిస్తే నూతన కవితా ప్రక్రియ ఇష్టపదులు చక్కని ఆధ్యాత్మిక భక్తి పరిమళాలను వెదజల్లడంతో పాటు అన్ని సమకాలీన సామాజికాంశాలనూ వెలయింపగల వీలును కలిగి ఉండడం విశేషం. ఈనాడు దాదాపుగా 100పైగా కవులు చక్కని చిక్కని అంశాలపై ఇష్టపదులు సృజిస్తూ తమ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు.

ప్రస్తుతం కవులు వారం వారం రచిస్తున్న ఇష్టపదులతో ఇష్టపది వారపత్రిక ను ఆవిష్కరిస్తున్నారు సదయ్య గారు. దీనికి గీతా శైలజ గారు, దోమల జనార్ధన్ గారు సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం అత్యధికంగా ఇష్టపదులు రాసినవారిలో ఎం.వి.ఉమాదేవి గారు ఉన్నారు. నేను, గుడిపూడి రాధికారాణి ప్రస్తుతం 312 రచించి వాటిలో తొలి 100 ఇష్టపదులతో "వాగ్దేవీ! వందనం!!" పుస్తకం వెలువరించడం జరిగింది. అనేక ఇష్టపదులు తరచుగా పత్రికలలో ప్రచురితమవుతూ ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తున్నవి.

డా.అడిగొప్పుల సదయ్య గారు రూపొందించిన ఇష్టపదులు కవితాప్రక్రియ నియమాలను ఒకసారి పరిశీలిద్దాం.

ఇష్టపదులు నియమాలు:

  1. ఎనిమిది పాదాలు ఉంటాయి.
  2. ప్రతిపాదం రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది.
  3. ఒకో భాగంలో పది మాత్రలు ఉంటాయి.(గురువు రెండు మాత్రలు,లఘువు ఒక మాత్ర.)
  4. పాదంలోని మొదటిభాగంలోని మొదటి అక్షరానికి రెండవ భాగంలోని మొదటి అక్షరానికి యతి/ప్రాసయతి పాటింపబడుతుంది.
  5. చివరిపాదం / చివరి రెండు పాదాలలో శ్రీకృష్ణ నామం లేదా కవినామ ముద్ర లేదా రెండూ ఉండాలి.

నియమాలు కొంత అర్ధం కానట్లుగా అనిపించినప్పటికీ నా రచనలు రెండు ఉదాహరణగా చూస్తే తేలికగా అవగాహన కలుగుతుంది. లయ బాగుండాలంటే పది మాత్రలను 5 5 గా గానీ లేదా 3 4 3 గా గానీ ఉండేలా పదాలు అమర్చుకుంటే బాగుంటుంది.

నా వాగ్దేవీ! వందనం!! సంపుటి నుండి కొన్ని ఇష్టపదులు మీకోసం.

ఇష్టపది-1 "రైతు"

రతనాలు పండించు రారాజుకద రైతు
కర్ణుడిని సరిపోవు కరుణామయుడు రైతు
పొలము చూడాలంటు పొరుగువారొస్తేను
నష్టాలు ఉన్ననూ నవ్వుతూ పళ్ళిచ్చి
తొలకరిన నడుమొంచి తొలిపంట పండించి
దేశాన్ని బతికించు దేవుడేరా రైతు
మట్టినే దేవుడని మనసార నమ్ముతూ
ఆకలిని తీర్చేటి అన్నదాతా నమో!

ఇష్టపది-2 "ఎంకి-నాయుడుబావ"

ఎంకి నా తోడుంటె ఏడేడు జన్మలకు
వెలుగుపూరేకల్లె వికసించి పోతాను
రైతుకూలీనైన రాజోలె ఉంటాను
తమలపాకుల చిలక తాజాగ చుట్టేసి
నాజూకు వేళ్ళతో నా నోటికందించి
చిలకలా నవ్వింది చిత్రాల నా ఎంకి
ఒళ్ళోన కూకుంది ఒయ్యారి నా ఎంకి
రాధికకు చెపుతాను రంజైన మా కథను

ఇష్టపది-3 "రాత్రి"

భాస్కరుని కిరణాలు తస్కరించును రేయి
నల్లరేకుల కలువ చల్లగా వికసించి
హాయైన స్వప్నాల హాసమొసగిన రీతి
నీ కనులు మెల్లగా నిదురనే వరియించి
మోముపై శాంతమను మోహమంత్రము వేసి
నేటి అలసట బాపి కోటి ఆశలు మోసి
రేపటికి స్వాగతము మాపటికి సాంత్వనము
ఇచ్చు చీకటి తెరలు మెచ్చు రాధిక నేడు

ఇష్టపది-4 "కృష్ణ"

అష్టభార్యలగూడి అలరారుచున్నావు
వేలగోపికల నడుమ వెలిగిపోతున్నావు
రాధ మనసును గెలిచి రారాజువైనావు
తులసిదళమున నీవు తూగ భక్తిదె గెలుపు
సతిసత్య కినుకలను సహనమున బాపితివి
పారిజాతము తెచ్చి పత్నిమది గెలిచావు
నిను తలచు ద్రౌపదికి నీ మహిమ చూపావు
రాధికా మాధవుడ రమణీయుడవు కృష్ణ.

ఇష్టపది-5 "నా దేశం"

వేదవేదాంగాలు వెలయించెనీ భూమి
పుణ్యమూర్తులు పుట్ట పులకించెనీ భూమి
జీవనదులను కలిగి జీవమొసగెడు భూమి
ఉన్నతపు హిమగిరుల ఉప్పొంగెనీ భూమి
బాపూజి నడయాడ భాసించెనీ భూమి
ముప్పేట జలసిరుల ముచ్చటగుయాకృతి
నాదేశమిదియంటు నాభాగ్యమిదియంటు
ఉల్లాస దేశమున ఉప్పొంగు రాధికని.

ఈ విధంగా ఆధ్యాత్మిక ప్రణయ విరహ సామాజిక భక్తి భావాలను వ్యక్తిత్వ వికాస అంశాలనూ కూడా అందమైన పదబంధాలతో బంధించి సొగసుగా చూపగల అద్భుతమైన ప్రక్రియ ఇష్టపదులు. అందుకే ఇష్టపదులను నేను ఇష్టపడి రాస్తుంటాను.

***సశేషం***

Posted in November 2020, సాహిత్యం

11 Comments

  1. మద్ది. పుల్లారావు

    ఇష్టపదులు ప్రక్రియ తెలుగు ను వెలిగించేది గా ఉంది. వచనాల తో వ్యాకరణాన్ని అనుసంధానం చేయడానికి అవకాశం మున్న ప్రక్రియ. మావంటి వారిని ప్రోత్సాహిస్తున్న సదయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
    జై తెలుగు బాష

  2. మద్ది. పుల్లారావు

    ఇష్టపదులు ప్రక్రియ తెలుగు ను వెలిగించేదిగ యుందనుట అతిశయోక్తికాదు. వచనాలోనూ వ్యాకరణాన్ని జోడించడానికి అవకాశమున్న ప్రక్రియ.మావంటివారినిప్రోత్సాహిస్తున్నారు. మన తెలుగు కు మంచి రోజులు రావాలని కోరుతూ సదయ్య గారికి వేలవందనాలు తెలియజేస్తున్నాను. వారి సేవాబావానికి అభినందనలు తెలియజేస్తున్నాను.

  3. దాసరి చంద్రమౌళి

    అడిగొప్పుల సదయ్య గారు చేస్తున్న సాహితీ సేవ. అభినందనీయం..ఇష్టపదులు సాహిత్య ప్రియులకు ఒక చక్కటి కానుక. తెలుగు సాహితీ వనంలో ఇష్టపదులు కలకాలం నిలిచి అందరి మన్ననలు పొందుతూనే ఉంటుందని నా అభిప్రాయం. గణిత ఉపాధ్యాయుడు అయి ఉండి.. తెలుగు భాష, సాహిత్యం పట్ల సదయ్య గారు చూపిస్తున్న అభిమానం,వారు ఎంతో మంది కవులను తీర్చు దిద్దుతున్న తీరు ప్రశంసనీయం మరియు ఆదర్శనీయం

  4. కామవరం ఇల్లూరు వేంకటేష్

    పూర్తి వచన కవిత్వం కాకుండా, పద్య ప్రక్రియలా ఉంటుంది, సుళువుగా ఉంటుంది
    గణ, ప్రాస నియమాలు లేవు.
    యతి నియమం మొదటి మాత్రకు పదకొండవ మాత్రకు ఉంటుంది

    సదయ్య గారు రూపొందించిన ఇష్టపది అందరికి ఇష్టంగా ఉంటుంది

  5. అడిగొప్పుల సదయ్య

    గుడిపూడి రాధికారాణి గారికి హృదయపూర్వక నమోవాకములు.సృష్టికర్తను నేనైనప్పటికి ప్రక్రియకు ఎప్పటికప్పుడు జవసత్త్వాలు అందిస్తూ,ప్రాచుర్యత కల్పిస్తున్నది మీరే.మీరు,ఎం వి ఉమాదేవిగారు,ఆకుండి శైలజ గారు,శ్రీహరికోటి గారు,ముక్కా సత్యనారాయణ గారు,బి అనంతయ్య గారు,ఇంకా చాలా మంది కవులు ఈ ప్రక్రియను ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నారు..అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.మీరు ఇష్టపది ప్రక్రియలో మరిన్ని సంపుటులు వెలయించాలని కోరుకుంటూ

    అడిగొప్పుల సదయ్య
    ఇష్టపది రూపకర్త
    జమ్మికుంట,కరీంనగర్

  6. శాడ వీరారెడ్డి (యస్వీరెడ్డి)

    “ప్రక్రియల పరిమళాలు” పేరుతో, చక్కని ఉదాహరణలతో మీరందించిన ఇష్టపదుల పరిచయం చాలా బాగుంది.
    సృష్టికర్తలకు,అభిమానించి ఆదరిస్తున్నవారికి,సమీక్షకులకు మరియు మీడియా మిత్రులకు అభినందనలు

  7. శిష్టు సత్య రాజేష్

    చక్కటి విశ్లేషణ, ఇదొక సరికొత్త ప్రయోగం….అన్ని ప్రక్రియలు అందరికి సులువుగా చేరుతాయి, కొత్తవారికి కూడా అవకాశంతో ప్రాసీబుర్యం8పొందుతాయి

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!