కుటుంబ వ్యవస్థ నాడు-నేడు
నాడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మానసిక ధైర్యాన్ని ఇచ్చే కుటుంబ సభ్యులు తోడుగా ఉండి, పెద్దవారు భూత వర్తమాన పరిస్థితుల అనుభవంతో ఇచ్చే కొన్ని సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ‘పెద్దల మాట చద్దన్నం మూట’ అనే సామెత చక్కగా అమరుతుంది. భౌతికమైన అలసటను కూడా మానసిక బలం ఎంతో సునాయాసంగా అధికమిస్తుంది. నేటి తరంలో అది కొరవడుతున్నది. కనీసం మనుషులతో మాట్లాడటం మరిచిపోతున్నాము. కేవలం యంత్రాలతో సహజీవనం చేసే పరిస్థితులలో ఆ యంత్రాలు ఇచ్చే సలహాలనే పాటించడం జరుగుతున్నది. అందుకు స్వీయ అనుభవాల సూత్రాలు జతచేయడం లేదు. ఎందుకంటే అవి లేవు. అక్కడ ఇబ్బంది ఎదురౌతున్నది. మానవ సంబంధాలలో ఉన్న మాధుర్య పరమైన భావోద్వేగాల అనుభవాలను కృత్రిమ సాంకేతిక సాధనాలు అందించలేవు కదా. మారుతున్న కాలంతో మనిషి ఆలోచనా విధానం కూడా మారిపోతున్నది కనుక ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసి ఏది మంచి, ఏది చెడు అని చెప్పగలిగే అవకాశం ఇక్కడ దొరకదు. మనకు మంచి అనుకొన్నది మరొకరికి చెడుగా కనిపించవచ్చు. కనుక ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం.
మన పూర్వీకులు నిర్దేశించిన శాస్త్రీయ విశ్లేషణ కలిగిన అసలైన సంస్కృతులు, ఆచారాలు మనం నిబద్ధతతో పాటిస్తే ప్రశాంత జీవన యానానికి మార్గ దర్శకాలు అవుతాయి. ప్రతి సూత్రమూ ఒక నిర్దిష్టమైన శాస్త్రీయ విశ్లేషణతో ముడిపడి ఉంటుంది. అయితే మనలోని భయాలను, అభద్రతా భావాన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది స్వార్థపరులు, సంప్రదాయాల మరుగున అనేక మూఢనమ్మకాలను కూడా సృష్టించారు. ఆ విధంగా సమాజంలో భయాన్ని సృష్టిస్తూ, సంప్రదాయాలను పాటించే విధానంలో పారదర్శకంగా వ్యవహరించనందున తరువాతి తరంలో సంప్రదాయ పద్దతుల మీద సరైన అవగాహన లోపించి వారి ఆలోచనలలో ఒకవిధమైన గందరగోళం ఏర్పడుతున్నది. మన పెద్దలు పెట్టిన పద్ధతులను పాటించేటప్పుడు కొంచెం సావధానంగా ఆలోచించి విచక్షణతో మనం పాటిస్తూ మన తరువాతి తరం కూడా అర్థం చేసుకునే విధంగా మనమే ప్రోత్సహించాలి. అంతేకానీ, మేము పాటిస్తున్నాం కనుక మీరు కూడా పాటించాలి అని గుడ్డిగా వాదించడం సబబు కాదు. అలాగే మేము చెప్పినట్లే మీరు నడుచుకోవాలి అని నిర్బంధించడం కూడా మంచిది కాదు.
ఇక మన సంప్రదాయాల ఆచరణలో ఉన్న సదుద్దేశం ఏమిటో తెలుసుకొని ఆచరించడం అనేది జరగాలి. అప్పుడే మనకు మనం పాటిస్తున్న విధివిధానాల మీద సరైన నమ్మకం, అవగాహన కలుగుతుంది. ఇక్కడ ఒక చిన్న ఆచారాన్ని ప్రస్తావిస్తాను.
కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబం దహన సంస్కారాలు అయిన పిదప ‘మునగడం’ చేస్తారు. ఇంటిని మొత్తం కడిగి శుభ్రం చేసుకుని, శరీరాన్ని కూడా శుభ్రం చేసుకోవడం అంటే ఏవైనా క్రిమి కణాలు మన శరీరానికి అంటుకొని ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. ఆ తరువాత పది రోజులు ‘అంటు’ అని చెప్పి దూరంగా ఉండడం, ఉంచడం జరుగుతుంది. పూజా కార్యక్రమాలు, ఇతర ఆధ్యాత్మిక వ్యవహారాలూ కూడా ఉండవు. దేవుడికి దూరంగా ఉండటం అంటే అంటువ్యాధులు ప్రబలకుండా అరికట్టడం వంటిదే. నాడు దేవాలయాలు ప్రతి వూరిలో ఉండి ఇంట్లో పూజాది కార్యక్రమాలు తక్కువగా ఉండేవి. జనం ఎక్కువగా గుమికూడి ఉన్న చోట జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. కనుకనే అలా ఒక ఆచారాన్ని నిర్దేశించారు. కరోనా మహమ్మారి పుణ్యమా అని మనందరం ఆ అంటు (isolation) ను అనుభవించి రెండు మూడు వారాలపాటు అందరికీ దూరంగా ఉన్నప్పుడు ఆ విషయం అవగతమైనది.
నాటి సామాజిక పరిస్థితుల కనుగుణంగా శాస్త్రీయ విశ్లేషణ అంతగా విడమరిచి చెప్పకున్ననూ అందరూ నమ్మకంతో పాటించేవారు. నేడు శాస్త్రీయ పరిజ్ఞానం మెండుగా పెరిగి అంటువ్యాధుల మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఎక్కువైంది. దానితో పాటే కొంత నిర్లక్ష్య ధోరణి కూడా కనపడుతున్నది.
నేటి సామాజిక అనుబంధాల మార్పులో పాత పద్దతులను యధావిధిగా పాటించడం అనేది అంతా ఏదో మొక్కుబడి అవుతున్నది. కారణం ఇటువంటి కార్యక్రమాలను చేసే అంతటి తీరుబడి లేదని నేటి జనవాక్కు. ఎంతోమంది శాస్త్రవేత్తల ఆవిష్కరణల ఫలితంగా నేడు లభిస్తున్న వైద్య విజ్ఞాన సాంకేతిక సమాచారం నాడు లేదు. అయినను నాడు ఒక సంప్రదాయం ఉంటె దానిని ప్రశ్నించకుండా పెద్దవారి మీద నమ్మకంతో, కుటుంబ సభ్యుల మధ్యన గల అనుబంధాలను గుర్తెరిగి పాటించేవారు. ఇంత విశ్లేషణతో కూడిన పరిజ్ఞానం అందరికీ లభిస్తున్నందున నేడు సంప్రదాయాన్ని పాటించడం అనేది ఒక పెద్ద ప్రహసనం అవుతున్నది. అంతేకాదు సొంత కుటుంబసభ్యుల మన్నన పొందటం కన్నా బయటి ప్రపంచంలో గుర్తింపు కొరకు ప్రయత్నించడం ఎక్కువైంది. కాలం మారే కొద్దీ మనుషుల ఆలోచనా విధానం మారుతుంది. దానిని ఎవరూ ఆపలేరు. కనుకనే తరాల మధ్యన అంతరాలు ఏర్పడుతున్నాయి. నేను పైన చెప్పినట్లు మంచి, చెడు అనేవి రెండు సాపేక్ష పదాలుగా మిగిలిపోతున్నాయి. ఏ సంప్రదాయాన్ని పాటించినా, ఈ జీవన సూత్రాలను ఆచరించినా తద్వారా మనిషికి లభించే మానసిక ఆత్మసంతృప్తి, ఆనందం తద్వారా లభించే ఆరోగ్యకర ఆలోచనా విధానం మనలను సదా కాపాడుతుంది. పదిమందితో కలిసి జీవన యానాన్ని కొనసాగించడం అనేది ముఖ్యం. అదే మన రోగనిరోధక సాధనం.
‘సర్వే జనః సుఖినోభవంతు’