"నీ సాటి లేరెవ్వరూ"
కలువపూచి అలిగింది
నీ కన్నుల చూచి.
తన అందమే తరిగిందని
మూతి ముడిచి తాను ముకుళించింది.
నెత్తావులు మెత్తగా
జారుకున్నాయయ్య
నీ గాత్రపు నవ పరిమళమే రారాజని
గుస గుస లాడికొని..
జాబిల్లిని చూడవోయి
ప్రభువై ఉండికూడా
గుబులు గుబులుగా నిన్ను చూచే గుండే
బరువు లందుకొనియే.
చెట్టుకో కొమ్మ వచ్చే
కొమ్మకో రెమ్మ వచ్చే
రెమ్మకో మొగ్గ వచ్చే
మొగ్గ పూవై విచ్చే.
పూబాలకు జోలపాడ
పక్షి పిన్నులత్తలు వచ్చే
వనమంతా నవ వసంత శోభ దాల్చే.
ఇటు చూడు.
కన్నయ్యా! అయ్యా!
నీ రాక మా అందరి
డెందముల ప్రేమ మధురిమ
నింపెనయ్య! రాధకే కాదు
సకల రాజివాక్షులకెల్ల హృదయాధి పతివీవు.
అదయ మాని మమ్ము దయజూడుమో స్వామి.