కనకాంబరం పూలు
కనక + అంబరము = అంటే పట్టువస్త్రం అని అర్ధం. అంటే ఈ పూలు పట్టువస్త్రాల్లా పవిత్రమైనవి అని చెప్పుకోవచ్చు. కనీసం 4,5 రోజులవరకూ వాడవు. వాసన లేకున్నా మాలలుకట్టి వేసుకోను, ముచ్చట ముడుల మీద ముడుచుకోను చాలా బావుంటాయి. బరువులేని భలేపూలు, మిగతాపూలన్నీ జడలో పెట్టుకోను బరువుగా ఉంటాయి. ఇవి తేలికైనపూలు కావటాన, ఐదు మూరల పూలు పెట్టుకున్నా బరువే ఉండవు.
వీటిలో చాలా రంగులే ఉన్నాయి. కనకాంబరం పువ్వులు నారింజ, నేరేడు, ఎరుపు, పసుపు, లేత గులాబీ రంగువీ, కాషాయ వర్ణానివీ కూడా ఉన్నాయి. ఐతే ప్రస్తుతం వీటి వెల ఆకాశాన్నంటుతున్నదని అంటున్నారు. కనకం అంటే బంగారం కదా! అంబరం అంటే ఆకాశం అంటే కనకాంబరం వెల ఆకాశానికి వెళ్ళిందన్నమాట.
కనకాంబరాలు సున్నితమైన పూలు. పూల మొక్క చాలా చిన్నదిగానే ఉంటుంది. పూలు గెలలుకు పూస్తాయి. కనకాంబరం పూలు శ్రీలంక, దక్షిణ భారత దేశానికి చెందినవి. ప్లాంటే జాతికి చెందిన పుష్పించే మొక్క అకాంథేసి కుటుంబానికి చెందినవి ఈ కనకాంబరాలు.
కనకాంబరం పూల మొక్కలను ఇంట్లో సులువుగా పెంచుకోవచ్చు. ఎక్కువ స్థలం ఆక్రమించవు. కుదురుగా ఒదిగి ఉంటాయి. సాధారణంగా కనకాంబరం మొక్క ఏడు నెలల్లో పుష్పిస్తుంది. కనకాంబరం మొక్క 1 నుండి 3 అడుగుల పొడవు, 1 నుండి 2 అడుగు ల వెడల్పు లో ఉంటుంది. పూలు ఏప్రిల్, మే నుంచి అక్టోబర్ వరకు పూస్తాయి. మంచి వ్యాపారపంట. పూలవ్యాపారులు సులువుగా పెరిగి పుష్పించే ఈ మొక్కల తోటలు పెంచుకుంటారు. పెరుగుదలకు 30 - 35 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. కొంతవరకు నీడను తట్టుకోగలదు. ఇది ఇంటి తోటలోపెంచుకునే మొక్క. వివాహాలకు, పండుగల్లోనూ ఎక్కువగ జడలు, కొప్పులూ పెట్టుకునే వనితలు ఈ పూలమాలలను ధరిస్తారు.
కనకాంబరం మొక్కలను ఆయుర్వేద మందులలో, హెర్బల్ వైద్యం లో దగ్గు, అల్సర్ వంటి చికిత్సలకు వాడతారు.