Menu Close
GSS-Kalyani
జ్ఞానానందమయం
శ్రీ శేష కళ్యాణి గుండమరాజు

ప్రసూనాంబ చెప్పిన రహస్యం!

ఒక రోజు కృష్ణానంద బుంగమూతి పెట్టుకుని, ఒక మూలగా కూర్చుని ఉండటం గమనించింది ప్రసూనాంబ. ఎప్పుడూ హుషారుగా, చలాకీగా ఉండే తన మనవడు అలా ఉండటం ప్రసూనాంబకు అస్సలు నచ్చలేదు!

"ఏమిట్రా? ఏమైందీ??", అంటూ కృష్ణానందని దగ్గరకు తీసింది ప్రసూనాంబ.

"వాడితో మాట్లాడకండి అత్తయ్యగారూ! ఇవాళ స్కూల్లో వాడి రిపోర్ట్ కార్డు ఇచ్చారు. అన్ని సబ్జెక్టుల్లోనూ తక్కువ మార్కులే! శ్రద్ధగా చదవరా అని వాడికెన్నిసార్లు చెప్పినా ఆ విషయం వాడి బుర్రకెక్కట్లేదు!", కోపంగా అంది మీనాక్షి.

గట్టిగా ఏడుపందుకున్నాడు కృష్ణానంద. ప్రసూనాంబ కృష్ణానందని ఊరుకోపెడుతూ, "నువ్వు ఒక్క క్షణం ఉండమ్మా మీనాక్షీ! పెద్ద పరీక్షలకు వాడు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాడులే!", అంది.

"పెద్ద పరీక్షలకు ఇంకా మూడు నెలలే సమయముంది అత్తయ్యగారూ! మొన్నటి పరీక్షలకు వాడు రోజంతా ఆటలూ, పాటలూ మానేసి మరీ చదివాడు. ఫలితం శూన్యం! మరి ఈసారి ఏం చేస్తాడో నాకైతే తెలియట్లేదు!", అంది మీనాక్షి కంగారుపడుతూ.

"ఊరికే కంగారు పడకు మీనాక్షీ! నేనున్నానుగా! వాడి సంగతి నాకు వదిలిపెట్టు. నువ్వెళ్ళి ప్రశాంతంగా ఏదైనా పని ఉంటే చూసుకో!", అంది ప్రసూనాంబ మీనాక్షితో.

తనకు ప్రసూనాంబ పై ఉన్న నమ్మకంతో పని చేసుకోవడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది మీనాక్షి.

రోజులు గడుస్తున్నాయి. కృష్ణానంద రోజంతా పుస్తకాలు ముందేసుకుని తెగ చదువుతున్నాడు. కానీ అప్పుడప్పుడూ క్లాసులో జరిగే పరీక్షల్లో మార్కులు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. అత్తగారు వాడి చదువు విషయం చూసుకుంటానన్నారన్న ధీమాతో ఉంది మీనాక్షి.

ఒకనాటి సాయంత్రం ప్రసూనాంబ కృష్ణానందని పిలిచి, "ఒరేయ్ ఆనందూ! నీ వయసు పిల్లలకు వచ్చే వారం పాటల పోటీ ఉందటరా! నీకు పాటలంటే ఇష్టం కదా?! నేనొక పాట నేర్పిస్తాను. పోటీలో పాడతావా?", అని అడిగింది.

కృష్ణానంద ఎగిరి గంతేసి,"ఓ! పాడతాను బామ్మా!", అన్నాడు.

"మరో రెండు నెలల్లో పెద్ద పరీక్షలు పెట్టుకుని ఇప్పుడు పోటీ అంటారేమిటి అత్తయ్యగారూ? అసలే వాడికి పదిసార్లు చదివితే తప్ప చదివినది గుర్తుండదు! మీకు ఆ విషయం తెలుసుకదా?", అంది మీనాక్షి.

"అవును మీనాక్షీ! నువ్వంటున్నది నిజమే. పెద్ద పరీక్షలయ్యే వరకూ మనకు ప్రతి నిమిషం అమూల్యమైనదే! నాకు ఆ మాత్రం తెలియదనుకున్నావా? ఈ పోటీ వచ్చే వారం అయిపోతుందిగా! ఆ తర్వాత ఆనందు పూర్తి సమయం చదువుకే కేటాయిస్తాడు. సరేనా?", అంది ప్రసూనాంబ.

"ఏమో అత్తయ్యగారూ! మీరు అన్నీ తెలిసినవారు. మీ ఇష్టం! కానీ వాడికి వారంలోపు పోటీ స్థాయిలో పాట నేర్పడం కష్టమేమో!", అంది మీనాక్షి.

"ప్రయత్నం చేసి చూద్దాం!", అంది ప్రసూనాంబ.

ఆ మరుసటి రోజునుండీ మొదలుపెట్టి, ప్రతిరోజూ ఒక పావుగంట సేపు కృష్ణానంద చేత ఒక పాటను సాధన చేయించింది ప్రసూనాంబ. మిగతా సమయమంతా కృష్ణానంద చదువుకునేవాడు. వారం తర్వాత పాటల పోటీలు జరిగాయి. కృష్ణానంద ప్రసూనాంబ నేర్పిన పాటను రాగయుక్తంగా పాడి, పోటీలో మొదటి బహుమతి సాధించి, ఇంటికొచ్చి తనకిచ్చిన బహుమతిని ప్రసూనాంబకు ఉత్సాహంగా చూపించాడు.

బహుమతిని చూసి చాలా సంతోషించింది ప్రసూనాంబ.

"అత్తయ్యగారూ! వాడికి పోటీలో బహుమతి వచ్చిందంటే ఆ గొప్పతనమంతా మీదే! అతి తక్కువ సమయంలో పాటను అంత బాగా నేర్పించగలిగారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది!", అంది మీనాక్షి.

అందుకు ప్రసూనాంబ చిరునవ్వు నవ్వి, "నేను నేర్పితే మాత్రం? వాడు శ్రద్ధగా నేర్చుకోవాలి కదా?! అయినా ఈ విజయం వెనుక ఒక రహస్యం ఉందిలే! అది నీకు తర్వాత చెబుతా!", అంది.

అంతలో వీధిలో ఎవరో మీనాక్షిని పిలవడంతో వాకిట్లోకి వెళ్ళింది మీనాక్షి.

ప్రసూనాంబ మాటలు విన్న కృష్ణానంద తన ఆత్రాన్ని ఆపుకోలేక, "బామ్మా…బామ్మా! ఆ రహస్యమేమిటో నాకు చెప్పవా?", అని ప్రసూనాంబను బతిమలాడుతున్నట్లుగా అడిగాడు.

"ఆమ్మో! ఆ రహస్యం తెలుసుకున్నవాళ్ళు దేన్నైనా సాధించగలరు! మరి నీకదేమిటో చెప్పెయ్యనా?", కృష్ణానందని ఊరించింది ప్రసూనాంబ.

"చెప్పు బామ్మా! చెప్పు! చెప్పు! అప్పుడు నేను మా క్లాసులో ఫస్ట్ మార్కులు తెచ్చుకుని అమ్మను ఆశ్చర్యపరుస్తా!", అన్నాడు కృష్ణానంద.

"అయితే విను! నీకు పాటలంటే సహజంగా ఇష్టం కాబట్టి నేను పోటీకోసం నీకు నేర్పిన పాటను నువ్వు మనసుపెట్టి నేర్చుకున్నావు. అందుకే నీకు ఆ పాట చాలా తక్కువ సమయంలో వచ్చేసింది. ప్రతి రోజూ సాధన కోసం ఎక్కువ సమయం కేటాయించకుండానే నువ్వు ఇవాళ్టి పోటీలో విజయాన్ని సాధించగలిగావు! దీని అర్ధం ఏమిటీ?? నువ్వు చేసే పనిని మనసు పెట్టి ఇష్టంతో చేస్తే, ఆ పనిలో గెలుపు నీదే అవుతుంది! అదే ఆ రహస్యం!", చెప్పింది ప్రసూనాంబ.

విజయం వెనుకనున్న అసలు విషయం తెలుసుకున్నాడు కృష్ణానంద. సాధారణంగా కృష్ణానంద చదివేటప్పుడు అతడి మనసులో ఏవేవో అక్కర్లేని ఆలోచనలు బోలెడు వస్తూ ఉంటాయి. అందుకే తను చదివిన పాఠాలు గుర్తుండట్లేదని గ్రహించిన కృష్ణానంద మెల్లిగా ఏకాగ్రతతో చదవటం అలవాటు చేసుకున్నాడు. ఆ ఏడు జరిగిన పరీక్షల్లో, వాళ్ళ స్కూల్లో అందరికన్నా ఎక్కువ మార్కులు సంపాదించి మీనాక్షిని నిజంగానే ఆశ్చర్యపరిచాడు కృష్ణానంద!

 

****సశేషం****

Posted in March 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!