Menu Close
మంచి మాటలెపుడు మధురము గావుగా
- రాఘవ మాష్టారు -

ఆట వెలది.

మంచి మాటలెపుడు మధురముగావుగా
సొల్లు మాటలెపుడు సొంపుగుండు
రాఘవుండు జెప్పు లాఘవంబుగ విను
విశ్వరీతి యిదియె వినుడు జీవ

మాతృభాషలిపుడు మనకు నచ్చవు జూడ
బానిస బతుకులకు బాట మనము
ఆంగ్లమనిన మనకు హాయిగలుగుచుండె
మమ్మి యనిన శవము మనకు హాయి

కళలు నుడులు పండుగలు మన సంస్కృతి
వాటినెపుడును మరువకుము జాతి
జాగృతి ప్రగతులను జగతికి తెలుపును
అవినెపుడు కనుమరుగవక జూడు

ప్రభుత యువత జనత భవిత యనుచు నేడు
అమ్మ భాష, అమ్మ, అమ్మ నేల
మరచి డాలరనెడి మాయలో బడుచుండె
మంచి చెడుల కథలు మనకు వలదు

మాతృభాష వదల మన సంస్కృతులు బోవు
పరుల భాష కోర పరుల తీరు
వచ్చి జేరు వారి భాష భావనలెల్ల
కట్టుబొట్టులెల్ల కలిసి పోవు

ఆడవారి తీరు నసలు జూడర నేడు
కట్టు పైట లేదు బొట్టు లేదు
పొట్టి బట్టలాయె పొలుపులారగబోయ
విశ్వరీతి యిదియె వినుడు జీవ

తల్లి పిల్ల జూడ తంతు యొకటె నేడు
ఎదను జూపి మదుల నదర గొట్టు
పాచ్య దుస్తులాయె పాడు సంస్కృతి జూడు
విశ్వరీతి యిదియె వినుడు జీవ

చేతి గాజులేవి చెలువ పూలేవిర
వెనుక ముందు జూడ వెర్రి గాని
ఆడ మగయొ తెల్వదాయె వింత జనము
విశ్వరీతి యిదియె వినుడు జీవ

వరలు చీరలేవి పట్టు లంగాలేవి
జిలుగు వాలు జడల కులుకులేవి
ఆంటి అంకులనుచు అన్నను బ్రోయను
మాటలాయె నాంగ్ల మాయ జూడు

ఇక మగాడి తీరు యెరుకేమియు లేదు
చెట్టులాగ జుట్టు కట్టు చుంద్రు
కురులు మునుల వలెను కోరి కులుకు చుంద్రు
విశ్వరీతి యిదియె వినుడు జీవ

చింపి చిరుగు వలువ చీదరింపక హాయి
గాను చింపి బిక్ష గాళ్ళ వలెను
సిగ్గు లేక నచ్చి చిందులేయు యువత
విశ్వరీతి యిదియె వినుడు జీవ

తల్లిదండ్రి గూడ దండింపరెందుకో
దడుచు చుండె వారు ధర్మమేది
కోప పడిన మనకు గోల గోలగ రచ్చ
విశ్వరీతి యిదియె వినుడు జీవ

టీవి సీనిమాలు జీవితాలను మార్చె
సెల్లు సొల్లు చిల్లు జేసె మదిని
సభ్య సంస్కృతులిట సమసిపోవుట జూడు
విశ్వరీతి యిదియె వినుడు జీవ

మాత గీత సీత మనము మరచి దేశ
సంస్కృతులను మరువ సాక్ష్యమేది
నీదు జాతి నీతి నియమాలకిపుడు
విశ్వరీతి యిదియె వినుడు జీవ

Posted in March 2023, తేనెలొలుకు

1 Comment

  1. Anupama

    రాఘవ మాష్టారు గారు,చాలా బాగా చెప్పారు. ప్రపంచంలో జరిగేధి కళ్ళకు కట్టినట్టు చెప్పారు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!