Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

చాణక్య

క్రీ.పూ. 321లో నంద సామ్రాజ్యాన్ని కూలద్రోసి ధనా నందను వధించి చంద్రగుప్తను సింహాసనాధీశుడిని చేసి పాటలీ పుత్రలో మౌర్య సామ్రాజ్య స్థాపనకు చాణక్య చేసిన కృషి గురించి గత సంచికలో తెలుసుకున్నాము.

చంద్రగుప్తకు ప్రధాన మంత్రి, ముఖ్య సలహాదారుగా సుమారు 23 ఏళ్ళు ఉండి మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరించటంలో ముఖ్యపాత్ర వహించాడు. ధనా నందను సంహరించిన వెంటనే చాణక్య మగధ రాజ్యంలో అన్ని ప్రాంతాలను ఏకీకృతంచేసి స్థిరీకరించే ప్రయత్నంలో నంద రాజు విధేయులను, ప్రజలను వేధించే అధికారులను వధించాడు. బొద్ధింకలను ఇంట్లోకి ప్రవేశపెట్టి ఆ ఇంటిని కాల్చి బూడిద చేసే నైపుణ్యం ఉన్న ఒక చేనేత వ్యక్తిని పిలిచి తన విద్యను శత్రువులు, తిరుగుబాటుదార్లు ఇళ్లలో ప్రవేశ పెట్టమని ఆజ్ఞాపించాడు. ఈవిధంగా వారినందరిని మట్టుబెట్టాడు. అతిత్వరలోనే రాజ్యంలో తిరుగు బాటుదార్లనందరిని నిర్ములించాడు. ఒకప్పుడు తనకు ఆహారం ఇవ్వటానికి నిరాకరించిన ఒక గ్రామాన్ని నిప్పు అంటించి కాల్చివేశాడు.

చాణక్య ధనిక వర్తకులను తన ఇంటికి పిలిపించి మద్యం త్రాగించి వారితో జూదం ఆడించి వారి సంపదను స్వాధీనం చేసుకుని మౌర్య కోశాగారానికి తరలించాడు. పాటలీపుత్రను రాజధానిగా చేసుకుని మౌర్య సామ్రాజ్యాన్ని ఒక శక్తిమంతమైన ప్రభుత్వంగా మార్చే దిశలో చంద్రగుప్తకు చాణక్య చాలా తోడ్పడ్డాడు.

అత్యంత మేధావి అయిన చాణక్య శాస్త్ర, కళ, ఆర్ధిక, విజ్ఞాన, తదితర ఇతర విభాగాలను ఔపాస పట్టిన వ్యక్తి.  ఈయనకు ‘కౌటిల్య’, ‘విష్ణుగుప్త’ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇవి తాను పెట్టుకున్న పేర్లు గాని మరు పేర్లు గాని అయిఉండవచ్చు. చాణక్య సమర్ధత, ప్రతిభ గురించి ఆనాటి ప్రజలందరు ఆశ్చర్యపడేవారు. అయన తన జీవితాన్ని భారతావని సుఖ సంతోషాలకు, పటిష్టతకు, శ్రేయస్సుకు ధార పోశాడు.

తక్షశిల విద్యాలయంలో పూర్వ ఆచార్యుడయిన చాణక్య ఉరఫ్ కౌటిల్య చంద్రగుప్త రాజుగా పాలన సాగించే కాలంలో అనేక గ్రంధాలు వ్రాయటం జరిగింది. వీటిల్లో ముఖ్యమైనవి ‘అర్ధ శాస్త్రం’ మరియు ‘నీతి శాస్త్రం’.

అర్ధ శాస్త్రం

అద్భుతమైన, అసమానమైన అర్ధ శాస్త్రం గ్రంధాన్ని కౌటిల్య క్రీ.పూ. 312-296 మధ్య రచించటం జరిగింది.

ఈ గ్రంథంలో ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి. బ్రహ్మ లిపిలో వ్రాయబడిన ఈ మూల గ్రంథంలో మొత్తం 562 సూత్రాలు ఉన్నాయి. “సుఖస్య మూలం ధర్మః ధర్మం” (సుఖానికి మూలం ధర్మం అనే సూత్రం) నుంచి “తస్మాత్‌ సర్వేషాం సర్వ కార్య సిద్ధిర్భవతి” (తపస్సు వల్ల అందరికి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి) అనే సూత్రంతో ఈ గ్రంథం ముగుస్తుంది. దేశంలో ప్రతి పౌరుని యోగక్షేమాలకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన రాజ్యపాలనా సంవిధానం చాణక్యుని అర్ధశాస్రంలో మనకు కన్పిస్తుంది.

కౌటిల్యుడు/చాణక్యుడు రాజనీతి ‘సూత్రాణి’ అనే పేరుతో చెప్పిన అంశాలలో కనీసం నూటికి ఎనభై అంశాలు పరిపాలకులకు, ఈనాటికీ వర్తిస్తాయి, ఉపకరిస్తాయి.

శామశాస్త్రి అనువాద అర్ధ శాస్త్రం గ్రంధం

ఈ అర్ధ శాస్త్రం గ్రంధం క్రీ.శ. 12 వ శతాబ్దం వరకు భారత రాజ్య, రాజరిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపింది. ఆ తరువాత 8 శతాబ్దాల పాటు అంతరార్ధానమైపోయింది. అసలు ఈ గ్రంధం ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియదు. కాని 1905లో తాళ పత్రాల మీద వ్రాయబడిన గ్రంధాన్ని మైసూరులోని ఓరియంటల్ గ్రంధాలయం అధికారి (Librarian) ‘రుద్రపట్నం శామశాస్త్రి’ కనుగొని తంజావూరులో 1909 లో ప్రచురించి తన అధికారి Benzamin Lewis Rice కు సమర్పించాడు. దీని ఆంగ్ల తర్జుమా 1915 లో ముద్రించటం జరిగింది. ఆ తరువాత శామశాస్త్రి ఈ గ్రంధంలో ముఖ్య విషయాలను ధారావాహికగా 1905-1909 మధ్య Indian Antiquary మరియు Mysore Review లో ప్రచురించాడు.

కాలక్రమంలో అనువాద క్రమంలో ఈ గ్రంధంలో కొన్ని మార్పులు, చేర్పులు జరిగినా చాణక్య (కౌటిల్య) రచించిన మూల, ముఖ్య విషయాలలో మాత్రం తేడాలు లేవని ఘంటాపధంగా చెప్పవచ్చు.

శామశాస్త్రి ఆంగ్లీకరించిన అర్ధ శాస్త్ర గ్రంధంలో 15 ఖండాలు, 150 అధ్యాయాలు ఉన్నాయి (ఈ క్రింద పట్టిక చూడవచ్చు). మొదటి 5 ఖండాలలో చాణక్య అంతర్జాతీయ పరిపాలన వ్రాయటం జరిగింది. తరవాత 8 ఖండాలు రాజకుమారులను ఎలా పెంచాలి అనే విషయంతో పాటు వారి విద్య ఎలా ఉండాలో అనే విషయంతో మొదలవుతుంది. తరువాత రాయబారులను ఎలా ఎంచుకోవాలి, గూఢ చారులను ఎలా వినియోగించుకోవాలి అనే విషయాల మీద సలహాలు ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్తే అపాయాలనుంచి, గండాల నుంచి రాజును ఎలా రక్షించుకోవాలి అనే విషయం మీద వివరిస్తుంది.

ఈ గ్రంధంలో ప్రభుత్వ స్వభావం, న్యాయ స్థానం, న్యాయ సూత్రాలు, నీతిశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, వ్యాపార, వాణిజ్య సంబంధిత విషయాలు, ఉత్తమ మంత్రులను నియమించుకునే పద్ధతులు, విదేశాలతో సంబంధాలు, యుద్ధ వ్యూహ పద్ధతులు, శాంతి స్వభావం, రాజ ధర్మం, విధులు, కర్తవ్యాలు, తదితర విషయాలగురించి విపులంగా వ్రాసి ఉన్నాయి.  వీటితో పాటు సనాతన ధర్మ తత్త్వం, ప్రాచీన కాలంలో భారత దేశపు ఆర్ధిక, సాంస్కృతిక వివరాలు, ఖనిజాలు, లోహాలు, ఖనిజ శాస్త్రం, ఖనిజాలు, పశుశాస్త్రం, విద్య శాస్త్రం, వైద్య శాస్త్రం, అడవులు, ప్రాణికోటి గురించి కూడా ఉన్నాయి.

పట్టిక: కౌటిల్యుడు రచించిన ‘అర్థశాస్త్రం’ గ్రంధానికి రుద్రపట్నం శామశాస్త్రి 1915 లో ఆంగ్లీకరించిన గ్రంధపు 15 కాండాలు, వాటి పేర్లు.

కాండ (Kanda) కాండ పేరు అధ్యాయాలు
1 Concerning Discipline 21
2 The Duties Concerning Superintendents 36
3 Concerning Law 20
4 The Removal of Thorns 13
5 The Conduct of Courtiers 6
6 The Source of Sovereign States 2
7 The End of Six-fold Policy 18
8 Concerning Vices and Calamities 5
9 The Work of an Invader 7
10 Relating to War 6
11 The Conduct of Corporations  1
12 Concerning a Powerful Enemy 5
13 Strategic Means to Capture a Fort 5
14 Secret Means 4
15 The Plan of a Treatise 1

శాంతి భద్రతలు; రక్షక భటుల విధులు, బాధ్యతలు; ధనవంతుల ధర్మం, దాతృత్వం; యుద్ధాల నిరోధ పద్ధతులు, వాటి నివారణ; జ్యోతిష్కులు, శత్రు రాజులను ఓడించటానికి అవసరమైన జిత్తులు;

పూజారుల బాధ్యతలు; మానవులు, మానవ ప్రవృత్తులు, మానవత్వం; జంతువులలో నిద్ర ప్రేరేపించే పద్ధతులు; తదితర అనేక విభిన్న విషయాల మీద కౌటిల్యుడు తన గ్రంధంలో వివరించటం జరిగింది.

అలాగే రహస్య హత్యలు, కుటుంబ సభ్యులను నిరోధించటం, నిర్మూలించటం, వేగులు, రహస్య భటులను ఉపయోగించుకునే పద్ధతులు, ఒడంబడికలను ఉల్లంఘించటం, మంత్రుల పైన రహస్య నిఘా మొదలగు విషయాలమీద చాణక్య తన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అభ్యాస సిద్ధమైన పద్ధతిలో సూటిగా వెలిబుచ్చాడు.

అనాది కాలం నుండి భారతీయులకు వజ్ర ఖనిజాలు, ముడి ఖనిజాలు, లోహాలు, మిశ్రమ లోహాలు, వీటినుంచి వస్తువులు, ఆభరణాలు తయారు చేసే నైపుణ్యం, శాస్త్ర విజ్ఞానం, తదితర రంగాలలో దక్షత గురించి చాణక్య అర్థశాస్త్రంలో వివరించాడు.

రాజ ధర్మం; రాజ్య వ్యవస్థ, రాజ (రాజులకు ఉన్న) విధులు, ధర్మాలు

పౌరుల సంతోషమే రాజు సంతోషం; తన ఆనందం కంటే ప్రజల ఆనందమే మిన్న; ఒక రోజును సూర్యో

దయం మొదలు పగలు 8 నాళికలుగా, రాత్రి 8 నాళికలుగా (ఒక నాళిక: 90 నిమిషాలు) విభజించి తన

రోజువారీ బాధ్యతలను క్రింది పట్టికలో చూపించిన విధంగా ఏర్పాటు చేసుకోవాలి.

పగలు 8 నాళికలు రాజు కార్యక్రమం, విధులు
మొదటి 90 నిమిషాలు తల్వారు (కావలి వాళ్ళు) లను నియమించి, వారి పనులను తెలుసు కోవాలి; రాజ్యం రాబడి-ఆదాయ వివరాలు రాబట్టాలి; సైన్యం పరిస్థితి, ఇతర రోజువారీ విషయాలమీద నివేదికలను పరిశీలించాలి.
రెండవ 90 నిమిషాలు ప్రజలను కలుసుకుని వారు నివేదించే కష్ట సుఖాలు విని, వాటికి తగిన పరిష్కారం కనుగొనాలి, పరిశీలించాలి, అమలుపరచాలి.
మూడవ 90 నిమిషాలు ఉపాహారం భుజించటానికి వినియోగించాలి.
నాలుగవ 90 నిమిషాలు మంత్రులతో సమావేశానికి వియోగించాలి.
అయిదవ 90 నిమిషాలు ఉత్తర ప్రత్యుత్తరాలకు కేటాయించాలి
ఆరవ 90 నిమిషాలు మధ్యాన్న భోజనం. ఆ తరువాత తనకు ఇష్టమైన ఉల్లాస వినోద కార్య క్రమాలలో నిమగ్నమవవచ్చు లేక ఆత్మావలోకనం చేసుకోవచ్చు.
ఏడవ 90 నిమిషాలు గజ, అశ్వ, రధ, పదాతి దళాలను పర్యవేక్షించటం.
ఎనిమిదవ 90 నిమిషాలు సైన్యాధక్షుడితో సైన్య సంబంధిత విషయాలను, యుద్ధ సంసిద్ధత విష యాల గురించి చర్చించాలి. చివరికి సూర్యాస్తమయ సమయంలో సాయం సమయ ప్రార్ధన చేయాలి.
రాత్రి 8 నాళికలు
మొదటి 90 నిమిషాలు రహస్య దూతలను కలుసుకుని వారి నుంచి వివరాలు తెలుసుకోవాలి.
రెండవ 90 నిమిషాలు స్నానానికి, భోజనానికి వినియోగించాలి
మూడవ 90 నిమిషాలు తాళాలు, తప్పెట్లతో శయనాగారంలో ప్రవేశించి నిద్రకు ఉపక్రమించి, నిద్ర పోవాలి.
నాలుగవ 90 నిమిషాలు నిద్ర.
అయిదవ 90 నిమిషాలు నిద్ర.
ఆరవ 90 నిమిషాలు బాకా ధ్వనులతో నిద్రనుంచి లేచి, ఆరోజు పగలు కార్యక్రమాల గురించి ఆలోచించాలి.
ఏడవ 90 నిమిషాలు పరిపాలనా కార్యాల గురించి ఆలోచిస్తూ గూఢచారులతో మాట్లాడి వారిని విధులకు పంపించాలి.
ఎనిమిదవ 90 నిమిషాలు యజ్ఞాలు నిర్వహించే పురోహితులు, ప్రధాన గురువు, ఇతర గురువుల వద్ద నుండి దీవెనలు పొందాలి; వైద్యుడితో తన ఆరోగ్యం గురించి సంప్రదించి అయన సూచనలు తీసుకోవాలి; ప్రధాన పాక నిపుణుడిని, జ్యోతిష్కుడిని చూడాలి; గోవుకు, గోదూడకు నమస్కరించి మూడు సార్లు ప్రదక్షణం చేసి, ఆ తరువాత రాజ సభకు వెళ్ళాలి.

ఇటువంటి విస్తృత, సమగ్ర దైనందిన కార్యక్రమంలో రాజుకు కేవలం 4.5 గంటలు మాత్రమే నిద్రకు మిగులుతుంది. మిగతా సమయమంతా రాజ్యాన్ని నిర్వహించటానికే సరిపోతుంది. ప్రస్తుత కాలంలో దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులు కౌటిల్యుడు సూచించిన కార్యక్రమం నిర్వహిస్తూ ఉండవచ్చు.

అర్ధ శాస్త్రం లో కౌటిల్యుడు వెలిబుచ్చిన సిద్ధాంతాలు, అభిప్రాయాలు, ఆలోచనలు, సందేశాలు భావ గర్భితమైనవి, ఆచరించదగినవి. ఈయన రహస్య హత్యలు, ఎప్పుడు కుటుంబ సభ్యులను హత్య చేయాలి, వేగులను, గూఢచారులను నిభాయించటం, ఒడంబడికలను ఉల్లంఘించటం, మంత్రుల మీద గూఢచారులను నియమిచటం, తదితర సంబంధిత విషయాలమీద కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు.

రాజ్య వ్యవస్థలో ఏడు భాగాలున్నాయని అర్ధ శాస్త్రం నుడివింది. ఇవి: 1. రాజు; 2. మంత్రులు; 3. రాజ్యం (అందులోని ప్రజలు, భూపరిమితులు, సహజ వనరులు, వగైరా); 4. కోట-ప్రాకారం బలపరచటం; 5. కోశా గారం; 6. సైన్యం; 7. మిత్ర రాజ్యాలు. కౌటిల్యుడు ఈ భాగాలన్నిటిని వివరిస్తూ, వీటిని బలోపేతం చేయవలసిన ఆవశ్యకతను విపులంగా వివరించటం జరిగింది. శత్రురాజ్యాలలో వీటిని బలహీన పరచటానికి గూఢచారులు, రహస్య భటులు, వేగులను వినియోగించటం చాలా అవసరం.

తన శత్రువుల మిత్రులు రాజుకు మిత్రులు

కౌటిల్యుడు తన గ్రంధంలో రాజుకు ఒక ఆసక్తికరమైన సిద్ధాంతాన్ని సూచించాడు. అది “Mandala Theory of Interstate Relations”. ఈ సిద్ధాంతంలో “రాజ్యం ఒక వృత్తం మధ్యలో ఉంటే దాని చుట్టూ ఉన్న రాజ్యాలను మన శత్రువులుగా పరిగణించాలి. ఈ శత్రురాజ్యం వృత్తం చుట్టూ ఉన్న రాజ్యాలు మనకు మిత్రులు. దీనిని బట్టి మన శత్రువుల శత్రువులను మనకు మిత్రులుగా పరిగణించాలి. అలాగే మన శతృవుల శతృవుల వృత్తం బయట ఉన్న మన మిత్రుల శత్రువులు మనకు కూడా శత్రువులే!” ఇలా 12 వృత్తాల లోపల ఉన్న రాజ్యాలను విశ్లేషిస్తూ ప్రతి రాజ్యంతోనూ మన ఎలా ప్రవర్తించాలి, సంబంధాలను ఏర్పరచుకోవాలి అనే విషయం గురించి కౌటిల్య విపులంగా వివరించాడు తన గ్రంధంలో. ఈ కౌటిల్య సిద్ధాంతం ప్రస్తుత కాలంలో వివిధ దేశాలు ఆచరిస్తున్నాయి!

విదేశీ వ్యవహారాల గురించి అర్థశాస్త్రంలో అనేక విభాగాల గురించి విపులంగా వివరించింది.  అవి: శాంతి; యుద్ధాలు, తటస్థత, యుద్ధ విషయంలో సంసిద్ధత, రక్షణ, కపట ప్రవర్తన, శత్రురాజులతో ఒకే సమయంలో యుద్ధం; మరొక సమయంలో శాంతిని ప్రతిపాదించటం, అనుసరించటం, మొదలగు నవి.

మను సిద్ధాంతం ప్రకారం రాజు నిర్వహించే సభలో 12 మంది మంత్రులు ఉండాలి. బృహస్పతి మాత్రం 16 మంది మంత్రులు ఉండాలని సూచించాడు. కాని కౌటిల్యుడు మాత్రం రాజ్యం అవసరాన్ని బట్టి ఎంత మంది మంత్రులు అవసరమో అంతమంది సభలో ఉండాలి అని అర్థశాస్త్రంలో నిర్దేశించటం జరిగింది.

రాజకీయంలో, విదేశీ వ్యవహారాలలో, పరిపాలన విషయాలలో కౌటిల్యుడు ఒక మార్గదర్శి.

అయన రాజకీయ చతురత, దృష్టి, ముందుచూపు భారతావనిని ఒక త్రాటిమీద మొట్టమొదటసారి నిలిపిన చంద్రగుప్త మౌర్య మీద అత్యధిక ప్రభావం పడింది. అది ఈరోజుకూ కొనసాగుతూనే వుంది.

ఈ అసమాన గ్రంధం ఆనాటి భారతీయులలో జాతీయతను నాటింది, ఉద్భోదించింది, ప్రేరేపించింది. తద్వారా వీరినందరిని మౌర్య సామ్రాజ్యం ఒక త్రాటికిందకు తెచ్చింది. 2,300 ఏళ్ల క్రితం రచిం చబడిన ఈ చాణక్య గ్రంధం కొందరు ప్రస్తుత కాలపు పాలకులకు కూడా ఉపయుక్తమవుతుంది.

కౌటిల్యుడు మొత్తం అర్ధ శాస్త్రం అంతటిని 32 అంశాల రూపంలో విశదీకరించాడు. అవి: అధి 1. కరణ; 2. విధాన; 3. యోగ; 4. పదార్థ; 5. హేతువర్త; 6. ఉద్దేశ; 7. నిర్దేశ; 8. ఉపదేశ; 9. అపదేశ (ఉదాహరణ); 10. అతిదేశ (అనువర్తన); 11. ప్రదేశ, ఉపమాన; 12. అర్థాపత్తి (implication); 13. సమస్య; 14. ప్రెసంగ (పధ్ధతి); 15. విపర్యాయ (contrariety); 16. విరుద్ధం, (వ్యతిరేకం); 17. వ్యాఖ్యశేష (ellipsis); 18. అనుమతి; 19. వ్యాఖ్యాన; 20. నిర్వచన; 21. నిదర్శన; 22. అపవర్గ (మినహాయింపు); 23. స్వసంజ (రచయిత నిర్దేశించిన వైఖరి); 24. పూర్వ పక్ష (prima facie view); 25. ఉత్తర పక్ష (ప్రత్యుత్తరం); 26. ఏకాంత (conclusion); 27. అనాగతావేక్షణ (reference to a subsequent portion); 28. అతి క్రాంత వేక్షణ (reference to a previous portion); 29. నియోగ (command: ఆజ్ఞ); 30. వికల్ప (alterna- tive); 31. సముచ్చాయ (compounding together); 32. ఉహ్య (determinal fact).

ఇప్పటి కాలానికి తగిన మచ్చుకు కొన్ని కౌటిల్యుడి చెణుకులు:

  1. మనిషి పతనానికి, దేశం అధోగతికి నాలుగు కారణాలు ఏవి?
    అవినీతి, అనైతికత, అనైక్యత, వ్యభిచారం.
  2. ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడు లంచం తీసుకుంటాడు?
    చేప ఎప్పుడు నీళ్లు తాగుతుందో ఎవరు చెప్పగలరు?
  3. మంచి ప్రభుత్వం ఎలా ఉండాలి?
    స్వప్రయోజనాలు, స్వార్థపరత్వం లేని మంత్రులున్న ప్రభుత్వం మంచిగా ఉంటుంది.
  4. ప్రభుత్వ కర్తవ్యం ఏది?
    దేశరక్షణ, సుపరిపాలన, ప్రజల యోగక్షేమాలు.
  5. న్యాయం, ధర్మం, చట్టం ఎలా ఉండాలి?
    చట్టానికి చుట్టాలు ఉండకూడదు; చట్టం తనపని తను చేసుకోగలగాలి. అప్పుడే ధర్మం గీత దాటదు, నీతి నిలబడుతుంది.

కౌటిల్యుడు తన అర్ధ శాస్త్రం అర్ధం ఈ వివిధంగా వివరించాడు:

మానవాళి జీవనాధారం ‘అర్ధ’ (అర్ధం): అంటే ధనం. మానవాళిని భరించే భూమిని కూడా ‘అర్ధ’ అంటారు. అందువల్ల ఈ భూమిని పోషించటానికి కావలసిన, అవసరమయిన ధనం శాస్త్ర విద్యతోనే సాధ్యమవుతుంది. అదే అర్ధ శాస్త్రం!

****సశేషం****

వచ్చే సంచికలో తదితర విషయాల గురించి తెలుసుకుందాము.

Posted in March 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!