Menu Close
నన్ను క్షమించు! (కథ)
-- అన్నపూర్ణ.ఏ. --

అప్పుడే సింగపూర్ ఫ్లైట్ దిగి బయటకు వచ్చిన సాగరి భరత్ కి కాల్ చేసింది.

''ఇంటి దగ్గిర వున్నావా? అని.

''సారీ, లేను. మీటింగులో వున్నాను. సాధ్యమైనంత త్వరగా వస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో...'' అన్నాడు భరత్.

ఇంటికి వచ్చి షవర్ చేసి అలసటగా నిద్రపోయింది సాగరి.

రాత్రి భరత్ ఎప్పుడు వచ్చాడో తెలీదు. ఉదయం వరకూ వొళ్ళు తెలియని నిద్ర ముంచుకు వచ్చింది ఆమెకు. నిద్ర లేచి వచ్చి రెడీగా వున్న కాఫీ తాగి అప్పుడు చూసింది ఇల్లు నీట్ గా సర్దివుంది. డైనింగ్ టేబుల్ సోఫాలు తళతళా మెరుస్తున్నాయి. వాజ్ లో పూలు ఫ్రెష్ గ ఆహ్లాదంగా కనిపించాయి.

''వావ్ ఇదేమిటీ ఇది మన ఇల్లే? నేను వెళ్ళినపుడు చిందర వందరగా వదిలేసి వెళ్ళాను. నీకు ఇల్లు పట్టించుకునే శ్రద్ధ ఎప్పుడూలేదు. చమేలీ పేరుకే మెయిడ్. ఏదో పని ఐనది అనిపించి పరుగులు పెడుతుంది.'' అంటూ ఆశ్చర్యంగా అడిగింది.

''అవును. మనింటికి ఒక కొత్త బంధువు వచ్చారు. అప్పటినుంచి ఇంటికి ఈ కళాకాంతులు వచ్చాయి. ఈ కాఫీ కూడా నేను తయారు చేసింది కాదు. టేస్ట్ గమనించలేదూ? అన్నాడు భరత్.

''ఎవరా బంధువు? నాతో నువ్వు చెప్పనేలేదు.''

''నీకే తెలుస్తుంది వచ్చాక నిన్ను సర్ ప్రైస్ చేద్దామని కూడా... !” అన్నాడు భరత్.

''ఎవరా వచ్చింది? చెప్పు. ఎక్కడా కనిపించలేదు....అంటూ అటూ ఇటూ చూసింది సాగరి.

'ఒక్క క్షణం ఆగు. పిలుస్తాను....అంటూ ఫోను చేసి పిలిచాడు భరత్.

ఆమె ఇంటి వెనుక వున్న గదిలోనుంచి తలవంచుకుని మెల్లిగా నడచి వచ్చి వెలుగు లేని నీడలో నిలబడింది. ఆ నడక పరిచయం ఐనట్టే వుంది. ఏదో అయోమయంగా తోచింది సాగరికి.

''ఎందుకు చీకటిలో వున్నారు... ఇలా దగ్గిరకి రండి..” అంది.

ఆవిడ కొద్దిగా ముందుకు వచ్చింది......వెంటనే గుర్తు పట్టలేదు. ఆమె ఆమె తులసి.!

అంతే అంతవరకూ కుతూహలంగా చూసిన సాగరి కోపంతో గట్టిగా అరిచింది...

''నువ్వా ఎందుకు వచ్చావ్ నా ఇంటికి? నీకు నాకు ఏమిటి సంబంధం? పో వెంటనే ఇక్కడనుంచి వెళ్ళిపో....!”

ఆమె వచ్చి సాగరి కాళ్ళు పట్టుకుంది.

''నన్ను క్షమించు. నాకెవరున్నారు నువ్వుతప్ప. గతంలో నేను చాలా తప్పులు చేసాను. అందుకు సిగ్గుపడుతున్నాను. నీ పట్ల అమానుషంగా ప్రవర్తించాను. నిజమే. ఆ పరిహారంగా నీకు, పిల్లలకు
సేవ చేసే అవకాశం ఇవ్వు.'' అంది తులసి.

''నో.... నీ ముఖం చూస్తే నాకు అసహ్యం. మా నాన్నకు నాకు నువ్వు చేసిన ద్రోహం నేను ఎన్నటికీ మరచి పోలేను. వద్దు. ఒక్క క్షణం భరించలేను. వెళ్లలేదో నీ పీక నొక్కుతాను ...అంటూ కాళికలా ముందుకు వచ్చిన సాగరిని చూసి భరత్  అడ్డుకున్నాడు.

''ఆంటీ మీరు మీ గదిలోకి వెళ్ళండి...” అని తులసిని పంపివేసాడు.

''సాగరీ...ఏమిటీ ఈ కోపం! కూల్ డౌన్. ఇలా కూర్చో. అసలు జరిగింది ఏమిటో చెబుతాను విను.

నువ్వు సింగపూర్ వెళ్ళగానే నాకు సిటీ లోని ఒక హాస్పటల్ నుంచి ఫోను వచ్చింది. రోడ్ ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు ఒకరు మీ ఇంటి ఫోన్ నంబర్ ఇచ్చారు. మీరు రాగలరా అని. ఆవిడ ఎవరో నాకు అర్ధంకాలేదు. పోనీ వెళ్లి చూద్దాం అని వెళ్ళాను. తీరా చేస్తే ఆవిడ తులసి. గవర్నమెంట్ హాస్పటల్ కాబట్టి ఫ్రీగా ట్రీట్ చేశారు. డిశ్చార్జ్ చేసే ముందు ఆవిడను అడిగారట.

మీ బంధువులు ఎవరైనా ఉన్నారా అని. ఆవిడ మన ఇంటి నెంబర్ ఇచ్చింది. ఆవిడను మన ఇంటికి తీసుకు రావడం నీకు నచ్చదు. నాకు తెలుసు. కానీ  ఆవిడను వృద్ధాశ్రమంలో చేర్చడం ఇష్టంలేక మన ఇంటికి తీసుకు వచ్చాను. ఆవిడ బాగానే కోలుకుంది. ఇంటిపని వంటపని నీటుగా చేస్తోంది. మరో విషయం, ఇప్పుడు నువ్వు నేను వర్క్ టూర్స్ వెళితే  పిల్లలను అమ్మ నాన్న చూస్తున్నారు. కొద్దిరోజుల్లో వాళ్ళు అన్నయ్య దగ్గిరకి అమెరికా వెడతారు. వాళ్లకి గ్రీన్ కార్డు ఉంది కనుక సిటిజన్ షిప్కి అప్లై చేస్తున్నారు. ఇప్పట్లో రారు. పిల్లలను ఎవరు చూస్తారు? ఈవిడ పని నీకు నచ్చితే మన ఇంట్లో వుంచుకుందాం. లేకుంటే పంపివేద్దాం. ఆలోచించు సాగరీ .'' అన్నాడు ఆమెకు నచ్చచెబుతూ.

సాగరి కోపం తాటాకు మంటలాంటిది. ఒక్కసారి ఉవ్వెత్తున లేచి అంతలోనే చల్లారి పోతుంది.

''కానీ భరత్, ఆవిడను పెళ్లి చేసుకోడానికి ముందు మా నాన్న నాకు రెండేళ్ల అమ్మాయి ఉందని దాన్ని బాగా చూసుకోవాలని చెప్పేరు. ఆయన నాన్నమ్మ బలవంతాన పెళ్ళికి అంగీకరించారు కానీ ఇష్టంగా చేసుకోలేదు.

ఆవిడ సరేనంది. తీరా ఇంటికి వచ్చాక ఆయాకి నన్ను అప్పగించి సినిమాలు ఫ్రెండ్స్ క్లబ్బులు అంటూ ఒక్క నిముషం ఇంట్లో ఉండేదికాదు. నాన్ననీ బాగా చూసేది కాదు. డబ్బు దుబారాచేసేది. నాన్న అడిగితె 'నిన్ను డబ్బుకోసమే రెండవ పెళ్లి చేసుకున్నాను....' అని పొగరుగా చెప్పేది.

నాన్న ఏమి చేయలేక కుమిలిపోయారు. నీకు ద్రోహం చేశాను తల్లి...ఈ పెళ్లి చేసుకుని అని బాధపడేవారు.

చివరికి నేను నాన్న ఆ ఇల్లు ఆవిడకు వదిలేసి వేరే ఇంటికి మారిపోయాము. ఆవిడకు నెలకు జీతంలో సగం పంపేవారు..... అప్పుడు ప్రశాంతంగా వున్నాము. నువ్వు పరిచయం అవడం మీ నాన్నగారు, మా నాన్నగారు చిన్ననాటి స్నేహితులే కావడం మనం పెళ్లి చేసుకోడం .....నాన్న చనిపోయేవరకూ మనదగ్గిరే ఉండడం, ఇవన్నీ నీకు తెలుసును. అయినా ఆవిడను చూసి జాలిపడి తీసుకువచ్చావు. అంటే.....నన్ను బాధపెట్టాలనేకదా....! అమ్మ అంటే తెలియదు. నేను పుట్టగానే  డెలివరీలో చనిపోయిందట.

''లేదు డియర్ ఎంతమాత్రమూ కాదు. ఆవిడ తగిన శిక్ష అనుభవించే ఉండాలి. ఇప్పుడు మంచిగా మారి మనకు సహాయంగా ఉంటే సరే! లేదంటే పంపివేద్దాం. కొన్ని రోజులు చూడు. నీ ఇష్టాన్ని ఎప్పుడు కాదనను. ఆంటీకి చివరి అవకాశం ఇచ్చి చూద్దాం.'' అన్నాడు భరత్.

భరత్ చెప్పేది కూడా నిజమే. ఇంటిని, పిల్లలను చూసుకోడం కష్టంగా వుంది. పనివాళ్ళకి ప్రేమ, అభిమానం ఎందుకు ఉంటాయి?

తులసి అప్పుడు వయసులోవుంది. నాన్నకి ఆవిడకు వయసు తేడా ఎక్కువ. ఆయన నన్ను ప్రేమగా చూడటం సహించలేక పోయినది. నేను కూడా ఒక తోటి స్త్రీగా ఆలోచిస్తే , ఆవయసుకి ఆవిడకు ఎవరో పరాయి బిడ్డ మీద ఇష్టం లేకపోవడం సహజమేనెమో!

''అయినా ఎందుకో తులసిని క్షమించలేను! ఆవిడ పెళ్ళికి ఒప్పుకోకుండా ఉంటే ఇద్దరి జీవితాలు బాగుపడేవి. పదిహేను ఏళ్ళు నాకు నరకం చూపించింది. ఇప్పుడేమో ఆవిడకు ఒక నీడ కావాలి. జబ్బుచేస్తే ఆదుకునే మనిషి కావాలి. అందుకే నేను గుర్తువచ్చాను.'' చెప్పింది భరత్ కి.

''నీ ఇష్టం వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే ఇంతకంటే నమ్మకం వున్నవారు దొరకరు.'' అంటూ లేచి కంపెనీకి వెళ్ళిపోయాడు భరత్.

సాగరి అత్తగారి ఇంటికి వెళ్లి పిల్లలను తెచ్చుకుంది. వాళ్లకి అలవాటే. తల్లి ట్రిప్ కి వెళ్ళినపుడు గ్రాండ్ పేరెంట్స్ దగ్గిర ఉండటం. వాళ్ళు గారం చేస్తూ చదువు గురించి పట్టించుకోరు. సినిమాలు మాల్ కి తీసుకెళ్లడం అక్కడే జంక్ ఫుడ్ తిని రావడం. అడిగినవన్నీ కొని పెట్టి డబ్బు వృధా చేయడం సాగరి కి నచ్చదు. కానీ వుద్యోగం వదులుకోలేదు. ఈ ఉద్యోగానికి ట్రావెల్ తప్పదు. ఏడాదికి రెండు సార్లు కొన్ని నెలలు వెళ్లి ఉండాల్సి ఉంటుంది.

ఉదయం లేచేసరికి అన్ని రెడీగా ఉంటున్నాయి. ఇల్లు కడిగిన ముత్యంలా మెరిసిపోతోంది. ఇంటిపని లేదేమో సాగరికి భరత్ కీ తెరిపిగా వుంది. వాళ్ళుకూడా లైఫ్ ఎంజాయ్ చేయ గలుగుతున్నారు. గార్డెన్లో మొక్కలు కళకళ లాడుతూ చిగుళ్లు వేసాయి. పూలు విరగ బూస్తున్నాయి. తులసి పిల్లలకు బాగా చేరిక అయినది. ఆవిడ కీ సంతోషంగా వుంది.

పని దాటవేయడం పట్టించుకునే వాళ్ళు లేకపోడం జీతం ఎక్కువ పని తక్కువ అలవాటు పడిన చమేలీకి తులసి నిఘావేయడం వలన భయభక్తులు వచ్చాయి. వొళ్ళు వంచి పనిచేస్తోంది. పిల్లలు చదువులో శ్రద్ధ చూపిస్తున్నారు. టీచర్ మెచ్చుకున్నారు. వాళ్లకి బయటి జంక్ ఫుడ్ లేదు. ఇంటి భోజనం బలమైన పౌష్టికాహారం లభించి ఆరోగ్యంగా వున్నారు.

తులసి సాగరి కంట పడకుండా అన్ని అమర్చి అవుట్ హౌస్ కి వెళ్ళిపోతుంది.

నెల రోజులు గడిచేసరికి తులసి పని బాధ్యత తీసుకోడం వలన వచ్చిన ఆనందం, ఆవిడ అవసరం తెలిసివచ్చాయి సాగరికి. ఒకరోజు భరత్ అడిగాడు.

''మనం తులసి ఆంటీ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. సీనియర్ సిటిజెన్ హోంకి పంపేద్దామా?'' అని.

''ఉద్యోగ బాధ్యతలు పిల్లలు ఇంటిపని వీటితో మనం మన దాంపత్య జీవితాన్ని కూడా సరిగా ఎంజాయ్ చేయలేక బాధ పడేవాళ్ళం. ఇప్పుడు నాకు చాల సంతోషంగా వుంది తులసీ ఆంటీ వలన'' అని మాత్రం
చెప్పింది సాగరి ఇండైరెక్ట్ గా తన నిర్ణయాన్ని తెలియ చేస్తూ.

భరత్ కి తెలుసు......సాగరిలో మార్పు వచ్చిందని. ఆమె తులసిని క్షమించేసిందని!

********

Posted in March 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!