Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

ఆంధ్ర భీష్మ "న్యాపతి సుబ్బారావు పంతులు గారు"

Nyapathi-Subbarao

‘ఆంధ్ర భీష్మ’గా పేరొందిన న్యాపతి సుబ్బారావు పంతులు గారి పేరు నేటి యువతకు అంతగా పరిచయము లేదు. అయన స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు, రాజకీయ నాయకునిగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశీలి. ఈయన 1856వ సంవత్సరం జనవరి 14 వ తేదీ మకర సంక్రాంతి రోజున నెల్లూరు లో దేశస్థ మధ్వ కుటుంబానికి చెందిన రాఘవరావు, రంగమ్మ దంపతులకు జన్మించాడు. బాల్యములోనే వీరి కుటుంబము రాజమండ్రికి మారింది. తండ్రి రాఘవ రావు గారు మద్రాసు కస్టమ్స్ లో పనిచేసేవారు. చిన్నప్పటి నుండి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి మరియు జిజ్ఞాస ఉండటం వల్ల పేదరికములో ఉన్నప్పటికీ వీధి లాంతర్ల మసక వెలుతురులో చదువు కొనసాగించాడు. అలాగే మెట్రిక్ పరీక్ష పాస్ అయి మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో స్కాలర్షిప్ సహాయముతో 1876 లో బిఎ డిగ్రీ పొందాడు. ఆ తరువాత అధ్యాపకునిగా చేరి భోధనావృత్తిలో కొనసాగుతూనే న్యాయవాద విద్యను అభ్యసించి 1879 నాటికి లాపట్టాను పొందాడు. ఆ విధముగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ లా డిగ్రీని పొందిన అతి కొద్దిమందిలో ఒకడిగా ఖ్యాతి గడించాడు.

సుబ్బారావు గారికి తెలుగు సాహిత్యము అన్న, జర్నలిజము అన్న బాగా ఆసక్తి ఉండేది. న్యాయవిద్యార్థిగా ఉండగానే 22 ఏళ్ళ ప్రాయంలో ఆయన ట్రిప్లికేన్‌ సిక్స్‌గా పిలువబడే నాటి సాహిత్య సంఘం సభ్యులు మరో ఐదుగురు సభ్యుల మిత్ర బృందంతో (జి.సుబ్రమణ్య అయ్యర్, ఎమ్ వీరరాఘవా చారి అయ్యర్, వంటి వారు) 1878లో కలసి, జాతీయోద్యమానికి సహకరించే ఉదాత్త లక్ష్యంతో, ‘ది హిందూ’ జాతీయ ఆంగ్ల దినపత్రికను స్థాపించాడు. అప్పట్లో భారతదేశంలో ప్రచుతరిమయ్యే ఆంగ్ల పత్రికలన్నీ బ్రిటీష్‌ ప్రభుత్వం కనుసన్నలలోనే ఉండేవి. ఆయన చింతామణి తెలుగులో, ఇండియన్ ప్రోగ్రెస్ అనే జర్నల్ ను ఇంగ్లిష్ లోను ప్రారంభించారు. చింతామణి జర్నల్, తెలుగులో నవలలను ప్రోత్సహించటానికి వార్షిక అవార్డులను ప్రవేశ పెట్టారు. లా డిగ్రీ పూర్తిచేసి ఉమ్మడి మద్రాసు రాష్టంలో సుబ్బారావు గౌరవ న్యాయమూర్తిగాను, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేశాడు. 1880లో న్యాపతి సుబ్బారావు మద్రాసు నుంచి రాజమండ్రి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. రాజమండ్రిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. ఆరోజుల్లోనే అయన మరో ప్రముఖ సంఘ సంస్కర్త అయినా కందుకూరి వీరేశలింగము గారితో పరిచయము అయి ఆయన కార్యకలాపాల పట్ల ఆకర్షితుడై, ఆయన కార్యకలాపాలలో పాల్గొనేవాడు. కందుకూరి వీరేశలింగం గారి తో సన్నిహితంగా మెలగుతు వితంతు పునర్వివాహాలు జరిపించడంలో వీరేశలింగానికి సుబ్బారావు పంతులు గారు ఎంతగానో సహకరించారు. 1881లో స్థాపితమైన హితకారిణి సమాజం యొక్క మొదటి కార్యదర్శిగా నియమించబడి నిర్వహణలో, కార్యకలాపాల విస్తరణలో విలువైన సేవలందించాడు. మరో 9 మంది న్యాయవాదులతో కలిసి రాజమండ్రి బార్ అసోషియేషన్ స్థాపించాడు. ఆనతి కాలములోనే రాజమండ్రి లో ప్రముఖ లాయర్ గా పేరు సంపాదించాడు.

పంతులు గారు రాజకీయాల్లో మొదటి నుంచి ఆసక్తిగా పాల్గొని 1885లో రాజమండ్రి పురపాలకసంఘానికి తొలి అనధికార ఛైర్మన్‌గా ఎన్నిక అయి 1888 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఈయన పదవికాలములోనే రాజమండ్రి పట్టణములోమొదటి సారిగా మంచి నీటి కుళాయిలు వచ్చినాయి. సుబ్బారావు పంతులు రాజమండ్రి ఎలక్ట్రిక్‌ సప్లై కార్పొరేషన్‌ను స్థాపించి, విద్యుదుత్పాదన చేయడమే కాక తొలిసారిగా రాజమండ్రికి ఆ విద్యుత్‌ను సరఫరా చేసి వెలుగులు నింపాడు. 1885లో బొంబాయి లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశానికి పంతులు గారు హాజరు అయి జాతీయోద్యములో కూడా పాలు పంచుకున్నారు. 1892లోమద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక అయినారు. 1893లో ఆయన మద్రాసు ఇంపీరియల్‌ లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌కు సభ్యునిగా ఎన్నికై సర్కారు జిల్లాలకు
ప్రాతినిధ్యం వహించాడు. ఈ పదవిలో ఆయన వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికై 1899 వరకు కొనసాగాడు.

1893లో ఆయన రాజమండ్రిలో చింతామణి పత్రికను పునరుద్ధరించి ప్రజలకు ఆందుబాటులోకి తెచ్చాడు. ఈ పత్రికకు కందుకూరి వీరేశలింగము గారు ఎడిటర్ గా వ్యవరించారు. అంతేకాకుండా చిలకమర్తి లక్ష్మి నరసింహము గారి రచనా వ్యాసంగాన్ని ఆర్ధికంగా నైతికంగా సహకరించేవారు. అదే విధముగా హరికథ పితామహుడు ఆదిభోట్ల నారాయణ దాసు గారిని రాజమండ్రి పరిసర ప్రాంతాలకు పరిచయము చేసింది కూడా సుబ్బారావు పంతులు గారే. 1894 లో కృష్ణ డిస్ట్రిక్ట్ అసోషియేషన్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ తరువాతి సంవత్సరము గోదావరి జిల్లా అసోషియేషన్ ను ఏర్పాటు చేశారు. 1896లో ఆయన రాజమండ్రిలోని టౌన్‌ హాల్‌ ట్రస్టుబోర్డు కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కలకత్తాలోని టౌన్‌ హాలు తర్వాత దేశంలో అంతటి ప్రాముఖ్యత రాజమండ్రి టౌన్‌ హాల్‌కు ఉంది. దీనిని కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించటం వెనుక న్యాపతి వారి సహకారం ఎంతో ఉంది.

1897, ఫిబ్రవరి11న స్వామి వివేకానంద అంతర్జాతీయ మతాల సమావేశంలో ప్రసంగించి భారతదేశం తిరిగివస్తున్న సందర్భంలో ట్రిప్లికేన్ సిక్స్ మిత్రబృందం ఆయన్ను ఆహ్వానించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి నిర్వహించటానికి ఆహ్వాన సంఘానికి పెద్ద ఎత్తున పురజనులు హాజరైన ఆ సమావేశంలో వివేకానందుని ఆహ్వాన సంఘానికి న్యాపతి సుబ్బారావును అధ్యక్షునిగా నియమించారు. ఆ సందర్భములో వివేకానందుడికి మొదటగా పూల మాల వేసింది కూడా సుబ్బారావు గారే. మెరీనా బీచ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వివేకానందుడితో పాటు సుబ్బారావు పంతులుగారు కూడా వేదికను అలంకరించారు. ఆ విధముగా మొదలైన వీరి స్నేహము సుబ్బారావు గారి పై గాఢమైన ప్రభావాన్ని చూపి రాజమండ్రిలో భగవద్గీత, సనాతన హిందూధర్మ ప్రచారానికై, హిందూ సమాజం అనే సంస్థ స్థాపనకు దారి తీసింది. స్వయముగా సంగ్రహ రామాయణాన్ని రచించారు. భగవద్గీత ను ఆరాధించే వారు భగవద్గీత ప్రతులను విద్యార్థులకు ఉచితముగా పంచి పఠించవలసినదిగా విజ్ఞప్తి చేసేవారు.

1898 నుంచి 1917 వరకూ భారత జాతీయ కాంగ్రెస్‌లో ఆయన కీలకమైన పాత్ర పోషించాడు. 1907లో జరిగిన వందేమాతర ఉద్యమ సందర్భంగా బిపిన్ చంద్రపాల్‌ను రాజమండ్రి ఆహ్వానించి అక్కడ ఉపన్యాసాలు ఇప్పించాడు. సుబ్బారావు 1907 లో విశాఖపట్టణము జరిగిన మద్రాసు ప్రొవిన్షియల్ వార్షిక సమావేశానికి అధ్యక్షతవహించాడు. ఆ విధముగా జాతీయోద్యములో చురుకుగా పాల్గొనేవారు. సి వై చింతామణి గారితో పాటు ఆంధ్ర కోస్తా జిల్లాలో పర్యటించి స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారము చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు జనరల్ సెక్రెటరీగా ఎన్నుకోబడి ఆ పదవిలో 1914 నుండి 1917 వరకు ఉన్నారు విజయవాడలో 1914 ఏప్రిల్‌ 11వ తేదీన జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షత వహిస్తూ, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన కోసం చారిత్రాత్మకమైన పిలుపునిచ్చాడు.

1918 జనవరి 1వ తేదీన సుబ్బారావు పంతులు డిమాండ్‌ మేరకు ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్రాంతీయ కాంగ్రెస్‌ కౌన్సిల్‌ను అధిష్టానం ఏర్పాటు చేసింది. ఈ మండలికి న్యాపతి సుబ్బారావు పంతులు అధ్యక్షుడు, కొండా వెంకటప్ప గారు కార్యదర్శి గా వ్యవహరించారు. అంతేగాక ఆయన అఖిలభారత కాంగ్రేసు కమిటీ ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు ఎన్నికై సేవలందించాడు. 1922 ప్రాంతంలో రాజమండ్రిలో ఆంధ్ర చారిత్రక పరిశోధనా సంస్థ (ఇప్పుడు రాళ్ళబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలగా ఉన్నది) ఏర్పాటును న్యాపతి సుబ్బారావు పంతులు ఎంతగానో ప్రోత్సహించాడు గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్ గా అంటే ‘ఆంధ్ర భీష్మ’ గా పేరు పొందిన సుబ్బారావు పంతులు గారు 84 ఏళ్ల వయస్సులో, 1941, జనవరి 15వ తేదీన మరణించారు.

********

Posted in March 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!