Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

తరాలు – అంతరాలు

శాస్త్ర సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణల ఆధారంగా ఏర్పడిన ఆధునిక పరిజ్ఞాన పోకడల మూలంగా, మనిషి సామాజిక స్థితిగతులలో అనూహ్యమైన మార్పులు గత వంద సంవత్సరాల లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా digital technology ఆధారిత సౌలభ్యాలు మరింత మెండుగా నేడు చూస్తున్నాము. మనిషి జీవనశైలి మారినప్పుడు తన యొక్క ఆలోచనా విధానాలు కూడా మారిపోతాయి. దైనందిన సౌఖ్యాలతో పాటు అనుకోని అనర్ధాలు కూడా జరుగుతున్నాయి. అమృతం పొందాలనే ఆతృత కలిగిన దేవతలకు ముందుగా హాలాహలమే లభించింది. అలాగే మనిషి జీవిత పథంలో సుఖదుఃఖాలు, ఆటుపోట్లు, లాభనష్టాలు అన్నీ కలిసే వస్తాయి.

మన ఆలోచనలు మనకు సరైనవి, ముఖ్యమైనవి అనిపిస్తాయి. కానీ ఎదుటివారికి అవి వారి అభిప్రాయాలకు అనుగుణంగా వేరే అర్థాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా తరాల మధ్యన, కాలంతో పాటు మారుతున్న సామాజిక స్థితిగతుల ఆధారంగా మనకు సరైనవి అనిపించిన విధానాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ఎందుకంటే మన తరం చవిచూసిన బాల్యం, నేటి తరం అంటే మన తరువాతి తరం నేడు అనుభవిస్తున్న బాల్యం పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. మనకు పెద్ద దెబ్బ తగిలినా కాలంతో పాటు ఆ బాధను భరిస్తూ తగిన జాగ్రత్తలు సూచనలు పాటిస్తూ సహనంతో వేచి చూసేవాళ్ళం. నేడు చిన్న దెబ్బ తగిలిన వెంటనే వైద్యశాలకు వెళ్లి శల్య పరీక్షలు చేయించుకుని ఆ వెంటనే నొప్పి మాయమయ్యే మాత్రలు, స్ప్రే లు వాడటం జరుగుతున్నది. ఆ తరువాత ఏమీ ఇబ్బంది లేదని అది చిన్న దెబ్బని తెలుస్తుంది. అది ముఖ్యంగా ఆధునిక వైద్య విధానాల అవతరణ వలన జరుగుతున్నది. అది ఒక విధంగా మంచిదే అయినా దానివలన వేచి చూసే సహనం, మనో నిబ్బరం నేటి యువతలో తగ్గిపోతున్నది. అలాగే ఏ చిన్న అవాంతరం ఎదురైనా ఎంతో ఒత్తిడికి గురి అవడం జరుగుతున్నది. అలాగే పాత తరం లోని పక్కవాడిని గురించిన ధ్యాస అస్సలు కనపడదు. ఒకవిధంగా అది మంచి లక్షణమే.

మన తరం, మన ముందు తరం మధ్యన కూడా ఎన్నో సామాజిక వ్యత్యాసాలు ప్రత్యక్షంగా వీక్షించాము. పెద్దవారి దృష్టిలో కట్టుబాటు అన్న విషయం మనకు రుచించలేదు. కొన్ని సందర్భాలలో ఒక విధమైన విప్లవాత్మక మైన మార్పులకు మన తరం శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. అందుకు కారణం సామాజిక స్థితిగతుల మార్పులు మరియు జీవనశైలి లో వచ్చిన, వస్తున్న మార్పుల కారణంగా మన ముందు తరాలకు మన తరానికి మధ్యన ఎన్నో బేధాభిప్రాయాలు వచ్చాయి. తద్వారా ఆలోచనల విధానంలో ఎన్నో మార్పులు, అంతరాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా కుటుంబ వ్యవస్థ రూపురేఖలు మారిపోవడం కూడా మొదలైంది. మరి ఎప్పుడు మన తరానికి మన తరువాతి తరానికి అవే అంతరాలు, భిన్నాభిప్రాయాలు కలుగుతుంటే వాటిని అనుభవిస్తున్న మనకు మన పెద్దలు (ముందుతరం) అనుభవించిన మానసిక సంఘర్షణ అవగతం అవుతున్నది.

మార్పులు నిజంగా సమాజానికి మంచిని చేస్తే సంతోషించాలి. మంచి జరగాలనే ఆశించాలి. తరాల మధ్యన వస్తున్న జీవిత పధం లోని మార్పులను తద్వారా కుటుంబంలో ఏర్పడుతున్న అంతరాలను వేరే వారు అవకాశంగా తీసుకొని తమ స్వార్ధానికి వాడుకొనే పరిస్థితి ని మాత్రం మనం కల్పించకూడదు. కాలగమనంలో జరిగే మార్పులను సానుకూలతతో అర్థం చేసుకొని సర్దుకుపోతే మనమే హాయిగా ఉండవచ్చునేమో. అంతేగాని కొన్ని చాదస్తాలను అలాగే మనతో మోస్తూ అందరూ పాటించడం లేదని నిలదీస్తే ప్రశాంతత కోల్పోవడమే కాక ఎదుటివారితో లేనిపోని గొడవలు, అనర్ధాలు. అట్లని అన్ని విషయాలలో సర్దుకుపోవడం కూడా సమర్ధనీయం కాదు. ఇటువంటి విషయాలలో మన అనుభవానికి విచక్షణను జోడించి తదనుగుణంగా మన మాటలలో, చేతలలో మార్పు కనపడాలి.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in March 2023, ఆరోగ్యం

2 Comments

  1. దేవకి ,నందన్

    Super

    చాలా బాగున్నాయి మీ సిరిమల్లె లోని ప్రతి పదం
    మేము కాకినాడలో వున్న రేడియో అల 90.8 FM వింటాము. ఇలాంటివి రేడియో లో వస్తే ఎక్కువ మంది ప్రజలు కు చేరవేయవచ్చుగా.

    • Sirimalle

      మీ స్పందనకు మరియు ప్రోత్సాహానికి మనఃపూర్వక కృతజ్ఞతలు. మీరన్నట్లు ఆకాశవాణిలో తదితర మాధ్యమాల ద్వారా ఎక్కువమంది పాఠకులకు మా ఆలోచనలను అందించవచ్చు. అయితే అందుకు తగిన వారధి మరియు ఆహ్వానాలు ఉండాలి. చూద్దాం. ఆ అవకాశం లభిస్తే తప్పక చేస్తాము.
      – మధు బుడమగుంట

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!